Thursday, 31 March 2016

మరణం ముందు దుశ్శకునాలు



ప్రతి జీవికి తాను చనిపోయే ముందు ఆ విషయం కొన్ని శకునాలవల్ల తెలుస్తుందిట. అవి విపులంగా శాస్త్రగ్రంథాలలో చెప్పబడినాయి. 
ఆ లక్షణాలు భాగవతంలో దశమస్కంధం ప్రథమార్ధంలో 42వ అధ్యాయములో -కంసుడు కృష్ణుడి రాకతో భయపడే సందర్భంలో చెప్పబడినాయి-
ఆ దుశ్శకునాలు ఇట్లా ఉన్నాయి
అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి
అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తథా ॥28
ఛిద్రప్రతీతిశ్ఛాయాయాం ప్రాణఘోషానుపశ్రుతిః
స్వర్ణప్రతీతిర్వృక్షేషు స్వపదానామదర్శనం ॥29
స్వప్నే ప్రేతపరిష్వంగః ఖరయానం విషాదనం
యాయాన్నలదమాల్యేకస్తైలాభ్యక్తో దిగంబరః ॥30
అద్దంలో తన ప్రతిరూపం శిరస్సులేకుండా కనిపించడం, ఒకే వస్తువు రెండుగా కనిపించే కారణాలు లేనప్పటికీ చంద్రాది గ్రహనక్షత్రాలు రెండుగా కనిపించడం, తన శరీరపు నీడలో మధ్య మధ్య కన్నాలు కనిపించడం, చెవులు మూసుకున్నా తన ఉచ్ఛ్వాసనిశ్వాసల శబ్దాన్ని వినలేకపోవడం, చెట్టుపై బంగారం కనిపించడం, దుమ్ము, బురద ప్రదేశాల్లో తన పాదాలు తనకు కనిపించకపోవడం, కలలో శవాన్ని కౌగిలించుకోవడం, గాడిదనెక్కటం, విషాన్ని తినడం, జపాకుసుమమాలను ధరించి, ఒడలంతా నూనె పూసుకొని, దిగంబరునిగా సంచరించు వ్యక్తిని చూడడంమొదలైన దుశ్శకునాలను చూచాడు.

పరిచయం


నమస్కారం
రామాయణం చదువుతూ, భారతం అధ్యయనం చేస్తూ, భాగవతం ఆస్వాదిస్తూ, ఏదో పురాణం అట్లా పరికిస్తూ, నేను చదివిన మంచి పద్యాలు, ఈ బ్లాగులో పొందుపరచదలచాను. వాటి ఆధారంగా నాకు కలిగిన ఆలోచనలను, భావాలను లోకంతో పంచుకోవాలని కోరికతో ఇది మొదలు పెట్టటమైనది.
కొన్ని స్వీయాలు, కొన్ని అనూదిత లేఖలు, కొన్ని చింతనలు, కొన్ని వివరణలు, కొన్ని టంకిత పుస్తకాలు.. వెరసి ఈ సత్యభారతి వైవిధ్య భరితమైన లేఖల సంకలనం.  ఇక్కడ మా వాట్సాప్ సదస్సు సంస్కృతసంస్కృతీ కోసం వ్రాసినవి, అనువదించినవి, పొందుపరుస్తున్నాను. సాధ్యమైనంత వరకు అనువాద లేఖలతో పాటు మూలం కూడా జత చేర్చటమైనది. సలహాలు, సూచనలు, విమర్శలకు స్వాగతం.