పాత్రలు-2
రో.శో. = రోదన శోధకుడు
క.సా = కవి సహాయకుడు
-----------------------------
రో.శో.— అయ్యా, వందనం, అభివాదనం, నమస్కారం, ప్రణతులు
క.సా.— ఏదో ఒకటి చాల్లేవయ్యా- రా రా.. ఇంతకీ నువ్వేనా పరిశోధనలో సహాయం కావాలి అని ఫోన్ చేసింది?
రో.శో.— అవునండి.. వర్ణవర్ణాలా నేనే.
క.సా.— వర్ణవర్ణాల ఏమిటయ్యా?
రో.శో. — అదేనండి.. అక్షరాలా.. అక్కడ అక్షరాలు అని అనీ బోరేసింది.. అందుకు వర్ణాలు వాడాను.. అప్పుడు వర్ణాలనగానే అక్షరసంఖ్య తగ్గి బాలెంసు పోతుంది.. కనుక రెండుసార్లు చెప్పాను. కావ్యభావనలో పునరుక్తి దోషం కాదు కదండీ..
క.సా.— సరే, సరే. ఇంతకూ విషయం చెప్పావు కాదు.. మనకసలే సమయం తక్కువ..
రో.శో. — ప్రస్తుతం ఉన్న కవులు, పండితులు, పురాణాజ్ఞులలో మీరే అందరికంటే ఉన్నతులు అని సమాచారం తెలిసి మీకు ఫోన్ చేశాను..
క.సా.— అట్లాగే నయ్యా చాలా సంతోషము.. కానీ పురాణాజ్ఞుడు కాదయ్యా.. దీర్ఘం తీసేయి.. సరేలే.. విషయం చెప్పు.
రో.శో.— నేనో పరిశోశోధన చేస్తున్నాను. చాలా మటుకు పరిశోధన పూర్తయింది. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే ఇక వాటిని పెట్టి పరిశోధన వ్యాసం సమర్పణ చేయడమే మిగిలింది..
క.సా.— అవునా! అయితే ఇంకా ఆనందకర విషయం! అన్నట్టు- విషయాంశము ఏమిటన్నావోయ్..
రో.శో.— రోదన.. ఏడుపు
క.సా.— ఏ దన? ఏ డుపు?!!!
రో.శో.— ఏడుపేనండి..
క.సా.— అయ్యో దేవుడా! అదేం విషయమయ్యా.. శుభమా అని పరిశోధన చేస్తూ..
రో.శో.— అంటే కొత్త విషయాలు దొరకడం కష్టమైపోయింది. వెరైటీ ఉండాలి. ముందు వేరే ఎవరూ చేసి ఉండకూడదు. ఇన్ని ఉరితాళ్ళబంధాల మధ్య ఇంకేం విషయం దొరుకుతుందండి. అందుకే ఇట్లా ఎంచుకున్నానండి..
క.సా.— ఎంత కొత్త అయితే మాత్రం మరీ ఏడుపు ఏమిటయ్యా!
రో.శో.— ఏం చేయాలండి? మా అన్నయ్య కొడుకు పుట్టి వాడి మొదటి ఏడుపు వినగానే నాలో కూడా ఈ విషయంపై పరిశోధనలు చేయాలి కొత్త కొత్త ఉత్సాహం తలెత్తింది.. నా ఒరిజినాలిటీకి దిమ్మదిరి దెబ్బకు విశ్వవిద్యాలయం వారు వినంగానే ఏ పక్కకూ చూడకుండా ఠపీమని ఆమోదం కూడా చేసేసారు.. దానితో రోదన శోధకుడినైనాను.. అది కథ.
క.సా.— చేయక ఉరి పోసుకుని చావలేరు కదా..
రో.శో.— నా పూర్వ ప్రతిపాదన- అదే హైపోతీసిస్సు- విని దాదాపు అంత పనీ చేసేవారే.. కానీ కొత్తవారికి అవకాశం ఇవ్వాలి కనుక, ఎవరో కొత్త ప్రొఫెసరు తన కింద ఒకరు అన్నా ఉన్నారు అని చూపించుకోవాలి అనే ఆశతో నాకు పుటుక్కున చోటు ఇచ్చేసారు..
క.సా.— సరే.. అతని సంచిత కర్మ, నీ ప్రారబ్ధకర్మ! ఏం చేద్దాము..! ఇంతకీ నీ హైపోథిసిస్ ఏమిటి..?
రో.శో.— ఎంతవాడైనా ఏడుస్తూనే పుడతాడు- అనేది ముఖ్య ప్రతిపాదన. ఆనుషంగికంగా ఇహి మిగితావి మామూలేగా.. ఓ ఐదధ్యాయాలు ప్లాన్ చేసాను.. విషయం ఇట్లా నింపాను- ఏడుపు నిర్వచనము- సంస్కృతంలో తెలుగులో సైంసులో సైకాలజీలో; ఇహ వివిధ శాస్త్రాల పరంగా కారణాలూ, వైయక్తిక-సామాజికాది సందర్భాలూ, రోదనలో రకాలు, విభాగాలు, సమస్యలు-సమాధానాలు.. ఇక పరిశోధనకై పనికొస్తాయీ అనుకునే అన్ని అంశాలూ జోడించానండి..
క.సా.— ఏడ్చినట్టు ఉంది!
రో.శో.— అబ్బ! అయితే అఛ్చంగా బాగుందనే కదండీ! విషయానికి తగినట్టు ఉందనే కదా! హమ్మయ్య- ఓ తీట తీరింది.
క.సా.— (దిక్కులు చూస్తూ) ఆ సంగతి వింటే కానీ తెలియదు. సరే, మొట్టమొదలు అసలు ఏడుపు నిర్వచనం ఏం వ్రాసావో మచ్చుకు చెప్పు..
రో.శో.— అబ్బ! అది అసలు విజ్ఞుల లక్షణం! అబ్బ.. వినండి.. “ఏ లేదా యా అనే అనునాసిక రహిత శబ్దాలతో వాఁ లేదా య్యాఁ అనే దిత్వాక్షరపు అనునాసిక యుక్త శబ్దాలతో ఎక్కువ ప్లుత ఉచ్చారణతో వ్యక్తమయ్యే బాధ సంతోషాది శబ్ద యుక్త లేదా శబ్ద రహిత శబ్ద విషయమే ఏడుపు. ప్రశాంతంగా లేదా శబ్ద యుక్తమై ఉండవచ్చు. ఆ సౌండ్ కు కన్నులనుండి ఉప్పునీరు ఫ్రీ..
క.సా.— (పైకప్పు వంక చూస్తూ) అదిరింది!! ఆహా!! వర్ణవర్ణాలా సరిపోయింది.. మరి దానికి కారణాలు?
రో.శో.— అనేకమండి! సృష్టి ఎంత విపులమైనదో ఏడుపు కూడా అంత విపులమైనది అని తెలుసుకున్నాను.. అన్ని వయసులవారు, అనేక సందర్భాలలో, అనేక కారణాలుగా, చిన్నగా పెద్దగా, లేదా మధ్యమ రీతిగా, సమయ సందర్భాలను బట్టి, తమకున్న శక్తిసామర్థ్యాలను బట్టి, సమయావధిని బట్టి ఏడుస్తూనే ఉంటారు.. అసలు ఏడుపులో ఉన్న అన్ని వెరైటీలు నవ్వులో కూడా లేవు అంటే అతిశయోక్తి కాదు..
క.సా.— (తల పట్టుకుంటూ) ఆహా! సరే! ఇంతకు నీకు నాతో తేలవలసిన ప్రశ్నలు చెప్పు..
రో.శో.— అట్లాగేనండి తప్పకుండా.. ఇప్పుడు... పిల్లలు, పెద్దలు ఏడిస్తే సౌండ్ లో తేడా ఎందుకు ఉంటుంది? దానికి కారణం ఏమిటి?
క.సా.— ఏముంటుందయ్యా? పెద్దవాళ్ళయ్యాక నానారకాల పనుల వల్ల అంత స్వతంత్రంగా ఏడిచేందుకు టైం లేక కావచ్చు..
రో.శో.— అబ్బా! అదిరిందండి చక్కగా చెప్పారు.. ఆగండి వ్రాసుకుంటాను.. (అని వ్రాసుకున్నాక) తర్వాతి ప్రశ్న- జంతువులు కూడా ఏడుస్తాయా? పక్షుల ఏడుపు శబ్దం ఎట్లా ఉంటుంది? కూత లాగే ఉంటుందా వేరుగా ఉంటుందా? పురుగులు చీమలు కూడా ఏడుస్తాయా? అప్పుడు వాటికి కన్నీరు వస్తుందా? అది ఉప్పగా ఉంటుందా? వీటిని మన జంతుపక్షిశాస్త్రాలలో ఎక్కడైనా చెప్పారా?
క.సా.— ఓహో ఏమి దృష్టికోణం..! తెలియదయ్యా.. చూడాలి..
రో.శో.— ధన్యవాదాలండీ. మా సైన్స్ విద్యార్థులకు పెద్దగా శాస్త్రాలు కావ్యాలపై అవగాహన ఉండదు కదా.. అందుకనే మీ సహాయాన్ని అర్థిస్తున్నాను..
క.సా.— సరే.. అట్లాగే నీ ప్రశ్నలన్నీ అడుగు.. ఇంకా ఏమేమి ఉన్నాయో.. విని అన్నింటికీ కలిపి ఆలోచించి వరుసగా సమాధానం చెప్తానేమో..
రో.శో.— అట్లాగేనండి.. ఇంకోటి- ఏడుస్తున్నప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది? అది తుడుచుకుంటూ చేతితో ఏడవటం గురించి కావ్యాలలో ఏమైనా వర్ణనలు ఉన్నాయా?
క.సా.— అసలు ఏమి ప్రశ్న అయ్యా బాబూ!! ఇది.. అసలు.. మాటలు రావట్లే.. అబ్బా జోహార్లు!
రో.శో.— ఇంకా ఇటువంటివి, ఇంతకు మించినవీ చాలా ఉన్నాయి అండి.. అసలు ఎన్ని ప్రశ్నలు అనుకున్నారు నాకు.. వ్రాసుకుని తెచ్చా..!
క.సా.— అయితే నేను చచ్ఛా!!
రో.శో.— ఏమిటండి అంటున్నారు?
క.సా.— అ.. అది.. ఏదో స్వాగతం లేవయ్యా! నువ్వు చెప్పు ఇంక మిగతావి కూడా..
రో.శో.— ఇంకా ఏమన్నా అంటే... (ఆలోచించి గుర్తుకు వచ్చి) ఆఁ, అది! ఏడుస్తున్నప్పుడు ఎక్కిళ్ళు వస్తే ముందు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా లేక ఎక్కిళ్ళకు పరిష్కారం చూపినవి ఉన్నాయా..?
క.సా.— వెతకాలయ్యా.. చూద్దాము.. తర్వాత ప్రశ్న చెప్పు.. అన్ని కలిపి వెతికి పారేద్దాము
రో.శో.— మీరు చాలా ప్రోత్సహిస్తున్నారు.. ధన్యవాదాలు. దీపావళి టపాకాయల లాగా నా మనసులో అట్లా సందేహాలు పేలుతూనే ఉంటాయండి.. అదేంటో..
క.సా.— మా తల నరాలు తెంపడానికి..
రో.శో.— ఏంటండి అంటున్నారు? తలంబ్రాలా? ఆఁ!! మంచి సన్నివేశం. అమ్మాయి తలంబ్రాలు పోసేదాకా నవ్వుతూనే ఉండి సడన్గా వీడ్కోలు దగ్గర ఏడుస్తుంది. తలంబ్రాలు పసుపు మొదలైనవన్నీ కళ్ళల్లో పడి ఏడుస్తుంది అని నా అంచనా..! ప్రమాణంగా చెప్పటానికి కావ్యంలో ఒక పద్యం ఏదైనా ప్రమాణంగా చూపగలరా..?
క.సా.— ఆహా అసలెంత బాగుంది ప్రశ్న!!
రో.శో.— కదండీ..? ధన్యవాదాలు..! అట్లాగే- సన్నివేశం ఏదైనా సరే- ఒకరు ఏడుస్తుంటే మరొకరికి ఆ ఏడుపు అనటం ఒక అంటు వ్యాధి వంటిది అని ప్రమాణం కూడా కావాలి అండి..
క.సా.— వ్వహ్వా!! ఇంక నాకు పిచ్చి పట్టటానికి ఎంతో దూరం లేదు..
రో.శో.— పిచ్చి!! ఆ నిజమే..! పిచ్చివాళ్ళు.. మరిచేపోయా.. వారిని కూడా జోడించాలి..! వారు అకారణంగా ఏడుస్తారు కదా.. దానిగురించి ఏదైనా నా నాటకంలో ప్రస్తావన ఉందా..? అంటే తిక్కనగారో పెద్దనగారో ఏమైనా నాటకాలలో వ్రాశారా?
క.సా.— నాయనా, వారు నాటకాలు వ్రాయలేదు.. దేవుడి దయ జగమెల్లా చల్లగా ఉండి అప్పట్లో పిచ్చివారెవరు పెద్దగా వుండేవారు కాదుట..
రో.శో.— ఎందుకంటే నాలాంటి పిచ్చెక్కించే వారు అందరికీ దొరకదు కదండీ..
క.సా.— బాగా చెప్పావు నాయనా.. వర్ణవర్ణాలా..
రో.శో.— ఇంకొకటండి.. అశలు భలే మండుతుంది ఈ వివక్షభావానికి.. ఏడవటంలో ఆడవారే ముందు అనేది ఒక అపప్రథ కావచ్చు కదండి.. మగవాళ్ళు ఏడ్చిన సన్నివేశాలు అన్నీ కూడా నాకు ఒక లిస్ట్ కావాలి అండి..
క.సా.— ఇది చాలా పెద్ద ప్రశ్నే..
రో.శో.— ఆఁ!! ‘పెద్ద’ అంటే తట్టిందండి. పిల్లలు పెద్దగా ఏడుస్తారు.. పెద్దవారు చిన్నగా ఎక్కిళ్ళు పెట్టి ఎవరికీ వ్యక్తం కాకుండా ఏడుస్తారు. మనిషి పెరిగిన కొద్దీ అన్ని పెరుగుతున్నప్పుడు, మరి ఈ అంసం పెరగకుండా తరుగుతున్నది ఎందుకు..? ఈ విరుద్ధ అంశం సృష్టిలో ఎందుకు ఉన్నది- అని ఎవరైనా ఇదివరకు పరిశోధన చేసిన దాఖలాలు ఉన్నాయా? పూర్వపరిశోధనల విభాగంలో వ్రాయాలండి..
క.సా.— (నుదురు రుద్దుకుంటూ) ఇది డాక్టరును లేదా సైకియాట్రిస్టు అడుగుతే సరిపోతుంది అన్ని సాహిత్యంలోనే ఉండవు కదా..
రో.శో.— అదీ నిజమేనండి.. ఇతర క్షేత్రాలను కూడా నేను చూడాలి.. ఎవరైనా సైకియాట్రిస్టులు కలుస్తాను.. వారి దగ్గర కొన్ని సమాధానాలు దొరకచ్చు..
క.సా.— నిజమేనయ్యా.. ఆ పని చెయ్యి. దేవుడి దయ నీమీద చల్లగా ఉండాలి..
రో.శో.— అన్నట్టు.. నిజమే! దేవుడంటే గుర్తుకొచ్చింది.. భక్తులు కూడా ఒకటే ఏడుస్తూ ఉంటారు.. దాని వెనక కారణం ఏమై యుంటుంది?
క.సా.— వారి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది.. ఒక్క చూపు చూశారూ అంటే నిలువునా భస్మం అయిపోతావు.. భద్రం..
రో.శో.— అవునవున్లేండి.. అదీ నిజమే. కొన్ని ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉండిపోతాయి.. ప్చ్.. అయితే తరువాత ప్రశ్న- “అల్లసాని పెద్దన అల్లిబిల్లిగా ఏడ్చాడు, ముక్కు తిమ్మన్న ముద్దుగా ఏడ్చాడు, భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు..” అని తెనాలి రామలింగడి ఏడుపు విమర్శలవంటివి నానుడులు సంస్కృత వాఙ్మయంలో ఉన్నాయా..? అట్లాగే నాయికలను ఏడిపించిన కవులు నాయకులను కూడా ఏడిపించారా..?
క.సా.— (కాళ్ళు చేతులు విదిలించి ఊపుతూ) అయ్యో.. అన్నీ వాళ్లే చెప్పరయ్యా.. కొన్ని నీలాంటి మేధావుల కోసం వదిలి పెడుతూ ఉంటారు.. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
రో.శో.— ఉన్నాయి.. కానీ అవి సైన్సుకు సంబంధించినవండి..
క.సా.— అట్లాగా.. నేను కూడా ఒకప్పుడు సైన్స్ స్టూడెంట్ నే.. ఏది మచ్చుకు చూద్దాము.. అడుగు..
రో.శో.— ఉదాహరణకు.. (ఆలోచించి) ఆఁ.. ఈ ప్రశ్న చెప్తాను. ఒక పిల్లవాడు ఏడిస్తే సగటున ఎంత నీరు రాలుతుంది..? వాడి సౌండ్ ఎన్ని డెసిబుల్స్ ఉంటుంది..? ఒక పెద్దవాడు ఏడిస్తే అతగాడికి ఎన్నిసార్లు ఎక్కిళ్లు వస్తాయి..? ఒక వ్వాఁ కి ఇంకో వ్వాఁ కి మధ్యలో ఎన్ని సెకెండ్లు ఆగగలతాడు? అది స్త్రీలలో పురుషులలో భిన్నం గా ఉంటుందా? కన్నీటిలో ఉండే ఉప్పును మనము హార్నెస్ చేసుకోవచ్చా?
క.సా.— (జుట్టు పీక్కుంటూ) అబ్బో అబ్బో! ఆహాహా! ఎంత సమాజోపయోగకరమైన టాపిక్..!!
రో.శో.— అంతే కాదండీ.. మన కన్నీరు ఉప్పగా ఉంటుంది.. అట్లాగే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది. అంటే సముద్రాల కూడా ఏడుపుతో ఏమైనా సంబంధం ఉంది- అని మనం నిష్కర్ష తీయవచ్చా..? అంటే ఎవరో ఏడిస్తే సముద్రాలన్నీ బయటికి వచ్చాయి అని చెప్పవచ్చా..??
క.సా.— వాటిని సృష్టించిన భగవంతుడు ఒప్పుకుంటాడో లేదో తెలియదయ్యా.. ఈసారి కనిపిస్తే ఆయనను ఒక మాట అడుగు..
రో.శో.— సరేనండి.. తర్వాతి ప్రశ్న.. యావరేజ్గా ఒక చంటి పిల్లవాడు సంవత్సరంలోపు రోజుకు సుమారుగా ఎన్నిసార్లు ఏడుస్తాడు నేను లెక్కపెట్టాను.. కానీ నీ ఆడపిల్లలు కూడా అట్లాగే ఏడుస్తారా..? ఈ డేటా మాత్రం నా దగ్గర లేదండి..
క.సా.— లెక్క పెట్టాను అంటే ఏం చేసావ్ ఏమిటి?
రో.శో.— మా అన్నయ్య కొడుకు పుట్టినరోజు నుంచి వాడికి సంవత్సరం పుట్టిన రోజు వరకు ప్రతిరోజు వాడు ఎన్నిసార్లు ఏడ్చాడు ఒక పుస్తకంలో వ్రాసుకుంటూ దానితోపాటు ఎక్సెల్ షీట్ ని చేశాను అండి.. వాడి ఏడుపు పాటర్న్స్ కి గ్రాఫ్ కూడా చేశానంఅండి..
క.సా.— అబ్బ.. ఏమి సింసియారిటీ..ఏమి నిబద్ధత! ఇంక.. అసలు వినే శక్తి లేదయ్యా!!
రో.శో.— అయ్యో ఇంకా ఇంతలోనే ఏమైందండీ..? ఇంకా ఉన్నాయి- ఉదాహరణకు- ఏడ్చి మొహం కడుక్కున్నట్టు అనే సామెత చేసినవాడు అద్దంలో తన మొహం తాను చూసుకుని చెప్పి ఉంటాడా?
క.సా.— నిజమేనయ్య మంచి సందేహం..
రో.శో.— అట్లాగే ఈ లోకంలో మొట్టమొదటి సారి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏడ్చి ఉంటారు? బాధొస్తే ఏడవాలి- ఇట్లా ఏడవాలి- అనే ఈ విషయం మొదటిసారి ఎక్కడ ఏ భాషలో గ్రంథాల్లో చెప్పబడింది? ఏదైనా జరిగితే ఈ ఈ రీతిలో ఈ శబ్దాలు వాడి ఏడవాలి ఇట్లా వ్యక్తపరచాలి అనే విషయం కనిపెట్టింది ఎవరై ఉంటారు? స్త్రీలా, పురుషులా? ‘మనిషి కూడా ఒక జంతువులాగా’ అని చెప్పినప్పుడు కన్నీటిలో జంతువులు ఏడిచి ఉంటే చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడా?
క.సా.— భగవంతుడా దేవుడా పరమాత్మ ఆపద్బాంధవ..
రో.శో.— అసలు పుట్టుకతోనే ఏడుస్తూ జన్మ ప్రారంభమైనప్పుడు, జన్మకు ఆది గుర్తు ఏడుపు అయినప్పుడు, మరి నవ్వుతూ బ్రతకమని మనిషి ఎందుకు శాసించారు? ఏడుస్తూ బతకమని ఎందుకు చెప్పలేదు? నవ్వు నాలుగు విధాల చేటు అని తెలిసినా ఏడుపు చేటు అని ఎవరో చెప్పకపోయినా, ఎందుకో మన సమాజంలో తగిన స్థానం దొరకలేదు. అని అనిపిస్తుంది. ఉదాహరణకు స్టేజీలు ఎక్కి నవ్వించే వారు ఉన్నారు అది ఒక ప్రొఫెషనల్ కానీ ఏడుపుకు ఒక సంప్రదాయం తప్ప వేరే ఏ కులాలు మతాలు జాతులవారు పాటు పడలేదు..
క.సా.— దేవుడా ఏమిటి విషమ పరీక్ష!!
రో.శో.— ఆఁ!! దేవుడు అంటే గుర్తుకు వచ్చాడు- బ్రహ్మదేవుడు విష్ణువు నాభి నుండి పుట్టగానే కేరుమని ఏడ్చినట్లు ఏదైనా పురాణాలలో ఉంటే నా తీసిస్ కి చాలా అందం వస్తుంది.. అట్లాగే వినాయకుడు కుమారస్వామి కూడా జన్మించగానే రోధించి ఉంటారా? అప్పుడు మానవాళి కాదు దేవతలు కూడా ఏడ్చి మొత్తుకుంటూనే జన్మించారని సిద్ధాంతీకరించవచ్చు.
క.సా.— అబ్బా!!! ఇంకా చాలయ్యా.. ఇదంతా వింటుంటే ఇన్ని విషయాలు మనకు తెలియవే అని నాకు ఇక్కడ ఇప్పుడే ఏడుపొస్తోంది..
రో.శో.— అయితే ఏడ్చి పెట్టండి.. నాకు మరో శాంపుల్ దొరుకుతుంది. నా పరిశోధన కోసం ఎందరినో ఎన్ని ప్రయత్నాలు చేసి ఎందరిని ఏడిపించాలిసి వచ్చిందో మీరూహించలేరు. మీరు తొలిసారి- నా వైపునుండి ఎట్టి ప్రయత్నం లేకుండా ఏడుస్తాను- అంటున్నారు.. ప్రశ్నలతో కూడా ఏడిపించవచ్చు అనే కొత్త సిద్ధాంతాన్ని కారణాలలో వేసుకుంటాను..
క.సా.— ఏంటి??? నా ఏడుపు మీద పరిశోధన చేస్తావా..? ఆగరా ఆగు. చీపిరి ఏదీ కర్ర ఏది
రో.శో.— అమ్మో అయితే ఇంక నేను ఏడవాల్సి వచ్చేట్టుంది.. నామీద నేనే పరిషోధనాంశం వ్రాయాలి.. కుదరదు.. ఉంటానండి.. ధన్యవాదాలు.. దేవుడా.. ఇక పరుగో పరుగు..
(నీతి- ఇట్లాగే నవ్వుతూ ఉండండి)
రచన-
సంకా ఉషారాణి