ధర్మరాజు-- అర్జున, నీవెంత అదృష్టవంతుడివి.. గీతను భగవానుని నోట స్వయంగా విన్నావు..
అర్జునుడు-- నేను అందుకు తగినవాడినని భావించటం బావ గొప్పతనమే కదా అన్నా..
ధర్మరాజు-- ఎప్పుడూ ఆయన నామమే చేస్తుంటావని నీ మీద కూసింత ఎక్కువ ప్రేమ కదా ఆయనకు..
అర్జునుడు-- అదొక్కటే కాదన్నా- నాకు నిజంగా భయం వేసింది.. యుద్ధం చేయలేనేమోనని వదిలేసి ఎక్కడ పారిపోతానో అని నాకు ఉద్బోధ చేసాడంతే..
ధర్మరాజు-- ఎందుకురా అంత భయం..
అర్జునుడు-- ఏమో అన్నా, అసలెప్పుడూ అనిపించలేదట్లా.. అంత ఘనం ఎందుకు వేసిందో..
ధర్మరాజు-- బహుశ ఓ వంక అయి ఉండవచ్చు.. లేతే అంత బంధుప్రీతి ఉండేవిధంగా ధార్తరాష్ట్రులు ఎవరూ మనతో ఎన్నడూ ప్రవర్తించలేదే..
అర్జునుడు-- ఔను. కానీ బావ ఆ విషయంలో నన్ను రెచ్చ కొట్టలేదు. కేవలం కర్తవ్యం చేయమన్నాడంతే..
ధర్మరాజు-- అదే కదా ఆయన గొప్పతనం. ఎవరికి ఏది ఎట్లా చెప్పి పని చేయించాలో ఎరిగినవాడు..
అర్జునుడు-- చివ్నప్పుడు అల్లరి చేసాడని అందరూ బావనేవేవో మాటలంటుంటే బాధేసేది. అట్టి వారి నోర్లన్నీ మూత పడే విధంగా జగత్ ప్రసిద్ధమైన ఈ గీతావాక్యాలను పంచిపెట్టాడు చూడు..
ధర్మరాజు-- ఔను. ఎక్కడిదాకో ఎందుకు.. దుర్యోధనాదులు ఎంత అరాచకం చేసారు.. పోనీవలే అని మన పై ప్రేమతో రాయబారానికి పోతే..
అర్జునుడు-- (బాధగా) అన్ని ప్రయత్నాలూ చేసాము. ఫలితమే దక్కలేదు. యుద్ధం తప్పలేదు.
ధర్మరాజు-- అది ఆ ధృతరాష్ట్రుని దౌర్భాగ్యం. మనమేం చేయగలం. ధర్మపక్షంలో ఉండకపోవటం వారి నేరం.
అర్జునుడు-- ఔనన్నా. నిజమే. కానీ ఈ గీతాజయంతి శుభసమయంలో వారి ఊసులెందుకులే..
ధర్మరాజు-- వారివల్లేగా యుద్ధం అయింది.. నీవు రణరంగంలో వెన్నుచూపబోయావు.. అప్పుడే కదా ఆ గీతామాత ఉద్భవించింది..
అర్జునుడు-- నిజమే. ఈ జీవితమే ఓ రణరంగం. అందులో కర్తవ్యనిర్వహణే మన లక్ష్యం. అది కృష్టుని వంటి ప్రోత్సాహకుని వల్లే సాధ్యం.
ధర్మరాజు-- నీ మూలకంగా మేమూ ఆ సత్యాన్ని తెలుసుకున్నాములే. మాకు కూడా అది ఆచరణీయమే. నీవు నీ భయాన్ని బహిర్గతంగా చెప్పుకున్నావు. మాకు చేతకాలేదు. అందరి మనసులలో ఉన్న సందేహాలకు నీవే సమాధానాలు రప్పించావు.
అర్జునుడు-- అది నా భాగ్యమన్నా. వాల్మీకి శోకం రామాయణ శ్లోకమైనట్టు, నా విషాదం ఓ యోగమైంది.
ధర్మరాజు-- ఆ యోగాల సమన్వయమే ఉపనిషత్సారమే గీత పలుకులయ్యాయి.
అర్జునుడు-- అందుకే వాటిని నిత్యం స్మరించుకుంటూ ఉంటాను.
ధర్మరాజు-- నీకు అన్నింటికన్నా నచ్చినదేంటి అందులో..
అర్జునుడు-- (నవ్వి) పాయసంలో ఏ భాగం తీయగా ఉంది, అమృతంలో ఏ చుక్క బలాన్ని ఇచ్చింది అని అడిగినట్టు ఉంది,
ధర్మరాజు-- (తానూ నవ్వి) నిజమేలే.
అర్జునుడు-- రా అన్నా. ఈరోజు ఈ స్వర్గలోకం నిజంగా స్వర్గలోకమయ్యే వేళ. ఇంకా చెప్తే వైకుంఠమయ్యే వేళ. గీతాపఠనం చేసుకుందాం..
ధర్మరాజు-- అవునురా. భాగవతరూపంలోనే కాదు. మన కిట్టయ్య గీతారూపంలో కూడా మనతో ఉంటాడు.
అర్జునుడు-- అవును అన్నా. ఇవి స్మరించుకున్నంత సేపు బావ నాతో అవన్నీ చెప్పిన క్షణాలలోనే శ్వాస తీసుకున్నట్టు ఉంటుంది. రా, మన సోదరులంతా ఎదురు చూస్తున్నారు. పారాయణం చేసుకుందాం.
ధర్మరాజు-- క్రింద భూలోకంలో ఎవరికి తోచిన మాధ్యమాలలో వారు పారాయణలు, అధ్యయనాలు చేసుకుంటున్నారు. మన సంస్కృత సంస్కృతిలో కూడా అందరూ ఏదైనా చేయవచ్చని పిలుపు వచ్చింది. అక్కడకు ప్రభావం చేరేవిధంగా మనం పారాయణం చేద్దాం.
అర్జునుడు-- తప్పకుండా. వారూ అక్కడినుంచే మనతో మానసికంగా భావాత్మకంగా (ఆన్ లైన్ మాధ్యమం వలె) చేరతారు. లోకంలో అందరికీ మేలు జరగాలి గాక.
ధర్మరాజు-- శుభం. ఓం శ్రీ పరమాత్మనే నమః...
రచన
సంకా ఉషారాణీ
(11 డిసెంబర్ 2024)