Monday, 27 March 2017

పార్వతి ధీరత్వం (కుమారసంభవం పంచమసర్గ ఆధారంగా) (స్వీయలేఖ)

                               ప్రత్యర్థి భూతామపి తాం సమాధే   
                              శుశ్రూషమాణాం గిరిశోనుమేనే |
                              వికార హేతౌ సతి విక్రియంతే
                              యేషాం న చేతాంసి త ఏవ ధీరాః ||
          ఇది కాళిదాసు కుమారసంభవ మహాకావ్యంలో శివుని గురించి చెప్పిన మాట. కానీ చూస్తే ఇది పార్వతిదేవికి కూడా వర్తిస్తుందని తెలుస్తుంది. ముందు శివుడు ఎందుకు ధీరుడైనాడో మనం చూద్దాము. దానికన్నా ముందు మనకు కలిగే సందేహం- అసలు ధీరత్వం అంటే ఏంటి.
          ఎంతటి గొప్పవారికైనా లక్ష్యసిద్ధికై చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అది మానవజీవితంలో సహజం. కానీ ఇది ఆటంకము, ఇప్పుడు ఏర్పడింది అని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. తెలుసుకుని వదిలివేయక, అందుకు కారణం అన్వేషించాడు శివుడు. అసహజమైనంది ఏది జరిగినా నిద్రాణంగా ఉండకుండా జాగరూకుడై ఉండాలి సాధకుడు.
          సతీదేవి వియోగానంతరం హిమవత్పర్వతం పై శంకరుడు తపస్సు చేసుకునే వేళ పూజకై ఏర్పాట్లు చేసే పార్వతి మీద ఆయనకు అనురాగం కలిగించాలని మన్మథుడు ప్రయత్నించాడు. శివుడు క్షణంపాటు చలించినప్పటికీ దానికి లోబడకుండ అందుకు కారణం ఎక్కడ అని చుట్టూ వెతికాడు. హేతువు లభించింది. దానిని తొలగించి వేశాడు. ఇదీ కాళిదాసు శివుని ధీరుడుఅనటానికి వెనక ఉన్న కారణం.
          కానీ వికారహేతువులంటే ఏం ఉంటాయి? లక్ష్యసాధనలో వచ్చే అడ్డంకులే వికార హేతువులు. అవి మనలను దారి మళ్ళించే ప్రయత్నం చేస్తాయి. కనక వాటిని చూసి బెదిరిపోయి ప్రయత్నం విరమించటమే ఒక రకమైన వికార హేతువు. ఆ విధంగా పార్వతి దేవి కూడా ధీరయే. ఎందుకంటే ఎన్ని అవాంతరాలు, అంతరాయాలు వచ్చినా ఆమె తనకు ఫలసిద్ధి కలిగే వరకూ యత్నం నుంచి ఇవతలకు తొలగలేదు.
          అయితే అంతటి శివుణ్ణి కూడా- తన కళ్ళ ఎదుటే కాముణ్ణి క్షణం ఆలోచించకుండా భస్మం చేసిన వాడిని, ప్రత్యక్షంగా చూసి కూడా- పార్వతి భర్తగా కోరింది. శివుడు ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకుని నిర్వికారుడై ఉన్నాడు. దరిదాపుల్లో ఎక్కడా ఆయన వివాహం గురించిన తలపు సైతం చేసే అవకాశాలు లేవు. పార్వతికి ఆ సంగతి తెలుసు. ఆయినా ఆయనను పొందాలని కోరుకుంది అంటే దాదాపుగా అసంభవమనిపించే లక్ష్యమన్నమాట. అయినా దానిని సంకల్పించింది, సాధించింది. కనక ఆమె కూడా ధీరయే.
          పార్వతి హిమవంతుని కుమార్తెగా జన్మించిన సతీదేవియే. ఆమె పుట్టుకకు లక్ష్యమే శివుని చేరటం, ఆయనకు అర్ధాంగి కావటం. ఈ మాట ఆమెకు యుక్తవయస్సు వచ్చినప్పుడే నారదమహర్షి చెప్పి ఉన్నాడు. అక్కడ ఆమె మనసులో ఈ కోరిక మొదటిసారిగా కలిగింది శంకరుని భర్తగా పొందాలని. కానీ ఆయన తపోనిష్ఠుడై సంసారానికి దూరంగ ఉండటం ఆమెకు మొదటి ఆటంకం.
          కానీ ఆయన తపస్సుకై హిమవత్ శిఖరాలమీద ఉండటం వల్ల తండ్రి అనుజ్ఞద్వారా ఆయనను సమీపించటం సాధ్యపడి ఆమెకు ఆ ఆటంకం దూరమైంది. సఖురాళ్లతో కలిసి ప్రతి రోజూ ఆయనను సేవించుకోగలిగే సౌభాగ్యాన్ని ఆమె పొంది ఉప్పొంగిపోయింది. దానిని భక్తితో చేపట్టింది. తపస్సు చేసుకునే స్థలాన్ని శుభ్రం చేయటం పూవులు తెచ్చిపెట్టటం, నీరు, దర్భలు తపస్సు కోసం సిద్ధం చేయటం ఆమె దినచర్య. ఆమెకు ఆ పని వల్ల కలిగిన శ్రమ అంతా ఆయన శిఖలోని చంద్రుని కాంతి వల్ల తీరిపోయేదట.
          ఏదో తన పద్ధతిలో సేవ చేసుకుంటున్న ఆమె ఆరాధన మధ్యలో వచ్చాడు మన్మథుడు. అది రెండవ ఆటంకం. లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంటుందో అతడు ఈయన ఒక్క చూపుకు అంతమైపోయాడు. ఆమె శ్రద్ధ, సేవ ఏవీ పరమ శివుని సంతోషపరచలేక పోయాయి.
                                      "ప్రియేషు సౌభాగ్యఫలా హి చారుతా!"
          పార్వతి తన ప్రియవ్యక్తి అనుగ్రహాన్ని అందించలేని సౌందర్యాన్ని నిందించుకున్నది. ఇక తపస్సే ఒక్కగానొక్క మార్గంగా భావించుకున్నది. అటువంటి భర్తను పొందాలంటే ఇంకేమి మార్గం ఉంటుంది కనక? ప్రేమగా దగ్గరకు వెళ్ళితే ప్రేమకు దేవుడైన వాణ్ణే కాల్చేసిన మహాత్ముడిని తాను ప్రేమించింది.
          రెండవ ఆటంకానికి ఉపాయంగ ఆమె వేరొక ఆలోచన లేకుండ తపస్సు చేసుకునేందుకు ఉపక్రమించింది. ఆ నిర్ణయం ఏ తల్లి హర్షించగలుగుతుంది? మేనాదేవి పలువిధాల ఆమెను ఆ నిర్ణయం నుంచి తప్పించాలని విఫల ప్రయత్నం చేసింది. నీ సుకుమారమైన శరీరమెక్కడ, తపస్సెక్కడ! చిన్న శిరీష పుష్పం భ్రమరం బరువు మోయగలుగుతుంది కానీ పక్షి వచ్చి కూర్చుంటానంటే దాని శక్తి చాలుతుందా?’ అని అడిగింది.
          కానీ అప్పటికే పార్వతీ దేవి మనస్సు అన్ని యుక్తులకూ అతీతంగ శివుని సన్నిధికి వెళిపోయింది. పార్వతీదేవి శంకరుని భర్తగా పొందగోరటం దోషం కాదు. కానీ అందుకు తపోవనానికి వెళ్ళి దీక్ష బూనుతాననటం మాత్రం ఆమె తల్లిని ఎంతో బాధించింది. అందుకే వారించింది. తపోమార్గం సామాన్యమైనది కాదు. ఆ దీక్షనియమాలకు కూతురు తట్టుకోలేక పోతుందేమోనని ఆమె భయం.
                                      "క్వ ఈప్సితారాథిర నిశ్చయం మనః|
                                      ఏయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్?|| \
          కానీ నీరు పల్లానికి జారుతుంది. మనస్సు కోరినదాని వెంటే వెళ్తుంది. కష్టనష్టాలు ఆలోచించదు. ఈప్సితం పొందటంలో వచ్చే ఆటంకాలతో దానికి నిమ్మత్తం లేదు. పల్లానికి జారే నీటిని కోరిక వైపు తిరిగిన మనోనిశ్చయాన్ని ఎవరు వెనక్కు తిప్పగలరు?
          పార్వతీదేవికి ఇది మూడవ ఆటంకం. దీనిని ఆమె తండ్రి అనుజ్ఞ చేత అధిగమించింది. ఆమె మనోవేదన ఎరిగిన హిమవంతుడు తపోవనాన్ని ఇల్లుగా చేసుకుంటానుఅని అడిగితే కాదనలేకపోయాడు. ఆమెను ఆపినా ఆమె మనస్సును దేనిచేతా తిరిగి ఆనందపరచలేడని ఆయన గ్రహించాడు.
          పార్వతిదేవి గౌరీ శిఖరానికి వెళ్ళింది. ఒకే ఒక్క సఖి ఆమెకు తోడుగా ఉంది. ఆమె తనకు ఏమాత్రం అలవాటు లేనివి, తపస్సుకు అనుకూలమైనవి అయిన వల్కలాలను ఏ జంకూ లేకుండ ధరించింది. అలంకారాలు తీసివేసింది. జటలు ధరించింది. మౌంజిని కట్టుకుంది. అక్షమాలలు ధరించింది. మెత్తని హంసతూలికా తల్పం వదిలి నేలమీద పరుండేది. తన అరచేతినే దిండుగా పెట్టుకునేది. చెట్టు చేమలవలె ప్రాణాలను నిలుపుకుంటూ అయాచితంగా వచ్చిన జలాన్ని మాత్రం స్వీకరించేది. ఉదయాన్నే దీక్షాస్నానం చేసి వల్కలాలు ధరించి, అగ్నిని ఆరాధించి స్తోత్రాదులు చదివే ఆమెను దర్శించాలని సాధువులు, తపస్వులు వస్తుండేవారు. వారికి ఫలాదులు ఇచ్చి ఆతిథ్యం నిర్వహించేదామె.
          సుకుమారమైన తన దేహం ఎంత బాధకు గురవుతున్నా ఆమె చలించలేదు. కేవలం తన లక్ష్యం గురించే ఆలోచించింది. ఎంత చేసినా కోరిక ఫలించకపోయేసరికి ఆమె నిరాశ చెంది తపస్సు మానక ఇంకా తీవ్రమైన తపస్సు ప్రారంభించింది. తన శరీరానికి కలిగే కష్టాన్ని గణించలేదు. ఎండాకాలంలో నాలుగు అగ్నుల మధ్య కూర్చుని ఐదవ అగ్ని అయిన సుర్యుని వంక చూస్తూ తపస్సు సాగిస్తూ ఎండలలో ఎండింది. వానలలో తడిసింది. ఉరుములు మెరుపుల రాత్రులలో, ఏ నిలువూ నీడా లేని ఆకాశం కింద, వాన పడినా గాలులు వీచినా రాతిమీద చలించక పడుకునేది. చలికాలం పుష్య మాసపు రాత్రుల్లో చెట్ల నుండి రాలిన ఆకులను మాత్రం తింటూ ఉండి క్రమంగా అది కూడా మానేసి అపర్ణగా మిగిలిపోయింది. ఈ విధంగా తపస్సు చేస్తూ గొప్ప ఋషులను మనులను కూడా ఆమె జయించి నిలిచింది.
          ఈవిధంగ తపస్వులకే ఆదర్శప్రాయమైన తపస్సు చేస్తున్న ఆమెకు నాలుగవ ఆటంకం ఎదురు పడింది. అది ఒక బ్రహ్మచారి తపస్వి రూపంలో వచ్చిన పరీక్ష. ఇది అన్నింటికన్నా పెద్ద ఆటంకం. అతిథిలా వచ్చిన శంకరుడు ఆమెను, ఆమె సంకల్ప బలాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. పార్వతి ఆ సంగతి ఎరగదు. అందుకే ఆయనను తన పద్ధతి ప్రకారం ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చింది. ఆయన కూడా ఎంతో మర్యాదగా కుశల ప్రశ్నలు వేశాక,
                             యతః సతాం సంగతం మనీషిభిః సాప్త పదీన ముచ్యతే||
కనక రహస్యం కాకపోతే చెప్పగలవు. ఏమి ఆశించి తపస్సు చేస్తున్నావు? అని అడిగాడు.
          అందుకు ఆమె చెలికత్తె సమాధానంగా ఉన్నమాటే చెబుతుంది - చతుర్దిశలకు అధిపతులు అయిన ఇంద్రాదులను వదిలి, ఆ పినాకం పట్టుకుని తిరిగేవాణ్ణి ఈమె వరించింది. ఆయనేమో ఈమె సౌందర్యం చూసి కూడా వశుడు కాలేదు. కలుపుదామని వచ్చిన కామదేవుని కాల్చి బూడిద చేసిన వాడాయన. ఆ మన్మథుడు కాలిపోయి బూడిదైనాడు కానీ ఈమె కోరిక మాత్రం చావలేదు. అతడు వదిలిన ఆ బాణం శివుని చేరలేక ఈమెను చేరి బాధిస్తోంది. ఈమె ఆ విరహంలో శివుని గూర్చి పాడిన కీర్తనలు విని కిన్నరస్త్రీలు ఎన్నోసార్లు కంటతడి పెట్టారు. కానీ ఆయనగారి మనస్సు మాత్రం రాయిగానే ఉంది. ఈమె నాటిన మొక్కలకు ఫలాలు వచ్చినాయి కానీ ఇంతవరకు ఈమె కోరిక మాత్రం కనీసం చిగురించలేదు.అని ఎంతో బాధపడుతూ చెబుతుంది.
          అది విన్న బ్రహ్మచారి నమ్మలేక ఏంటి ఇదంతా నిజమా?’ అన్నాడు.
          పార్వతీదేవి- తపః కిలేదం తదవాప్తిసాధనం, మనోగతానామగతిర్న విద్యతే|| ఔను! ఇది ఆతని కోరి చేస్తున్న తపస్సే. గట్టిగా కోరితే దొరకనిది ఏమి ఉంటుంది? అంటుంది. ఈ మాటల్లో ఆమె నమ్మకం ఎంతో దృఢంగా ధ్వనిస్తుంది.
          నిజానికి తలపెట్టిన లక్ష్యం దాదాపు అసంభవం. ఎక్కడా దరిదాపులో అది ఫలించే సూచనలు లేవు. ఆవేదన ఉంది. ఆతురత ఉంది. ఆరాటమూ ఉంది. తపనా ఉద్వేగమూ అన్నీ ఉన్నాయి. కానీ సందేహం లేదు. భయంలేదు. అపనమ్మకం లేదు. సఖి అంత నిష్ఠూరంగ మాట్లాడినా, నేను చేస్తున్నది సరైనదేనన్న గట్టి నమ్మకం పార్వతి మాటల్లో ఉన్నది. ఎందుకంటే ఆమె ప్రయత్నిస్తోంది కనక తప్పక ఆశయం పొంది తీరతానన్నది ఆమె భావన. ఏ సాధనా చేయకుండా శుష్కంగ ఈ మాట అనలేదామె. మనోగతాలకు అగతి లేదుఅంటే సర్వదా సర్వథా కూడా ప్రయత్నం ఉన్నప్పుడే అని అంతర్లీనంగా ఉన్న తాత్పర్యం. మనోగతానికైనా గతి లభించేది యత్నించినందువల్ల మాత్రమే.
          అప్పుడు ఆ బ్రహ్మచారి దాదాపుగా ఆమెను వెక్కిరించినట్టే మాట్లాడతాడు. వారిరువురి సంభాషణ ప్రశ్న-జవాబుగా గమనిస్తే ఈ విధంగ ఉన్నది-
          బ్రహ్మచారి - జగమెరిగిన బ్రాహ్మడు శివుడు. ఆయన గురించి తెలియనిది ఎవరికి? ఆయన మహా ఈశ్వరుడు! నిజమే! అటువంటి గొప్పవాణ్ణి పొందాలని కోరుకుంటున్న నిన్ను నేను ప్రోత్సహించలేను. నీ కోరిక ఎట్లా తీరుతుందో, ఎందుకు తీరాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అమంగళకర వస్తువులంటే ఆయనకు ఉన్న ఇష్టం లోకమంతటికీ తెలుసు!
          పార్వతి - ఐశ్వర్యం లేనివాడు అది కావాలని కోరుకుని దానివెనక పరిగెత్తినప్పుడు వాడికి మంగళాలు కావాలి. కోరికలున్నవాడు నిష్ఠగ మంగళాలను పాటిస్తాడు. నా శివుడు ఈ లోకాలకే రక్షకుడు. అందుకే ఆయనకంటూ ఏ కోరికలూ ఉండవు. ఆయన పేదవాడే అయినా ఐశ్వర్యవంతుడు. ఇంక మంగళాలతో ఆయనకేమి పని?
          బ్రహ్మచారి - ఆయన చేతులకు పాములు చుట్టుకుని ఉంటాడు. అటువంటి చేతిని ప్రాణిగ్రహణం కోసం మొదటిసారి తాకి పట్టుకున్నప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకో. సర్పాలంటే ఏ కన్యకైనా భయమే కదా!
          పైగా నువ్వేమో చక్కటి కలహంసల పట్టు చీర ధరించి ఉంటే అతనెమో నెత్తురు ఓడుతున్న గజచర్మాన్ని కప్పుకుని ఉంటాడు. ఎంత జుగుప్స రేకెత్తించే దృశ్యమో! ఊహించుకుంటేనే ఎంతో అసమంజసంగా అనిపిస్తుంది.
          పార్వతి - ఎవరు ఆకృతిగా ఈ లోకాన్ని కలిగి ఉన్నాడో అతని రూపం నిశ్చయించటం నీ తరం కాదు. అది అలంకరణలతో వెలిగిపోవచ్చు. సర్పాలతో నిండి ఉండచ్చు! ఆయన గజచర్మాన్ని ధరించినా పట్టు పీతాంబరాలు ధరించినా ఒకటే! అవి ఆయనకు ఏ విలువా చేయవు. నెత్తిన కపాలం ధరించినా చంద్రుని ధరించినా ఆయన విలువేమీ తరగదు పెరగదు! ఆయన స్వతహాగా ఉత్తముడు, ఉన్నతుడు. పైపై మెరుగులతో ఆయనకు సంబంధం లేదు.
          బ్రహ్మచారి - చక్కని అలక్తకంతో అందంగా ఎర్రగా అలంకరించిన నీ పాదాలు పూల తివాచీ మీద పెట్టటానికి యోగ్యంగా ఉన్నయి. నీవతన్ని పెళ్ళి చేసుకుంటే ఇవే పాదాలు తీసుకెళ్ళి స్మశానంలో శవాల వెంట్రుకలూ తదితరములూ అన్నీ పిచ్చిగా పడి ఉండేచోట పెట్టాల్సి వస్తుంది.
          పార్వతి - నా శివుడు స్మశానంలో తిరిగేవాడే అయినా ముల్లోకాలకు నాథుడు. రూపం ఎంత రోతగా ఉన్నా ఆయన శుభాలు కలిగించే సౌమ్యమనస్కుడు. ఈ లోకంలో ఆ త్రిశూల పాణి నిజతత్త్వం ఎరిగినవారు ఎవ్వడూ ఉండడు.
          బ్రహ్మచారి - మెత్తని చందనం పొడి రాచుకునే ఒంటికి ఇక ఆ శ్మసానపు బూడిద, చితాభస్మం అంతా వచ్చి అంటుతుంది. ఇంతకన్నా రోత మరేదైనా ఉంటుందా?
          పార్వతి - ఆ చితాభస్మం అవశేషాలే ఆయన శరీరాన్ని తాకి పవిత్రమవుతాయి. ఆయన ఒడలు మరిచి తాండవ నృత్యం ఆడే వేళ ఆ భస్మమే రాలి పడుతుంటే దాని కోసం, ‘అది నుదుట రాసుకుంటే చాలు తరించి పోతామని స్వర్గంలో దేవతలు కూడా కోరి పూసుకుంటుంటారు. అంటే అంతటి అదృష్టం ఉత్తపుణ్యానికి దొరుకుతుంటే ఎందుకు కాదనుకోవాలి?
          బ్రహ్మచారి - గొప్పఏనుగు అంబారీనెక్కి శోభిల్లే విధంగా వెళ్ళాల్సిన ఈ నీ అద్భుతమైన రూపం. పెళ్ళి అయిన తర్వాత శివుని ముసలి ఎద్దునెక్కి వెళ్తుంటె పురజనులు, పెద్దవారు నిన్ను చూసి నవ్వకుండా ఉంటారా?"
          పార్వతి - సరే అయితే, ఆ ముసలి ఎద్దునెక్కి వెళ్ళే పేదవాడి దగ్గరికే వచ్చి మదించే తూర్పు దిగ్గజమే వాహనంగా కలిగిన ఇంద్రుడు- ఆయన పాదాల వద్ద తల ఉంచినప్పుడు స్వర్గంలోని వికసించిన పూలతో అలంకరించిన అతని కిరీటలో నుంచి ఆ పుప్పొడి రాలి శంకరుని పాదాలను అలంకరిస్తుంది.
          బ్రహ్మచారి - ఆయన కళ్ళు విరూపాలు. కనీసం ఆయన ఎవరికి పుట్టాడో కూడా తెలియదు. ఒంటి మీద ధరించేందుకు దుస్తులైనా ఉండవు. దీనిని బట్టి ఆయన ఎంతటి ఐశ్వర్యవంటుడో తెలుస్తుంది. ఏం చూసి ఆయన మీద మనసు పడ్డావోయీ! వరుడికి ఉండాల్సిన ఒక్క లక్షణం, ఒక సరి అయిన గుణం ఆయనలో ఉందా చెప్పు.
          ఇది నిజానికి చాలా పెద్ద ఆరోపణ. పుట్టుక ఎటువంటిదో తెలియనివాడు లోకంలో నిందకు పాత్రుడు. కులగోత్రాలు లేనివారిని లోకులు గౌరవించరు. వారిని తమలో ఒకడుగా గణించరు. మానవసమాజంలో గౌరవంగ తల ఎత్తుకుని జీవించాలంటే తల్లిదండ్రులు, వంశం, కులగోత్రాలు తెలియటం ఎంతో అవసరం. ముఖ్యంగ అమ్మాయికి వరుడిగా నిర్ణయంచబడే వ్యక్తి కులీనుడు, సంపన్నుడు, రూపసి, ఉన్నత వ్యక్తిత్వం, వంశం కలవాడు కావాలని ఆశిస్తారు. శివుడికి ఈ లక్షణాలేవీ లేవు. ఊరూపేరూ లేనివారు, అందంచందం లేనివారు, అమ్మానాన్న ఎవరో తెలియని వారిని ఎవరైనా వరుడిగా ఎంచినా, ‘ఏం చూసి కట్టబెడుతున్నావు అమ్మాయిని?’ అని అవతలివారు నిలదీసి అడగుతారు. ఎంతటి నిర్ధనుడయినా కనీసం అనాథకు కూతురిని ఇవ్వాలనుకోడు. ఇక్కడ బ్రహ్మచారి ప్రశ్న వెనక ఇదే ఉద్దేశము.
          పార్వతి - నీకసలు ఆయన గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నావు? మూఢులకు మహాత్ముల చరితాలు ఎన్నడు అర్థమయినాయి కనక? కానీ ఎంత నేరాలు మోపినా ఒక్కమాట సరిగా చెప్పావు- ఆయన పుట్టుక గురించి! మన అందరినీ పుట్టించే వాడయిన ఆ బ్రహ్మ పుట్టుకకే కారకుడు అయిన ఈశ్వరుని జన్మ గురించి తెలుసుకోగలిగేంటంతటి మహాత్ముడు ఎవరున్నారు?
          ఈవిధంగ పార్వతి అంత నీచమైన ఆరోపణకు ఎంతో సముచితమైన సమున్నతమైన అర్థాన్ని చెబుతుంది. ఆయన పుట్టుక తెలియనివాడే! అని. ఇక్కడ పార్వతి మాటలో దృఢత్వం సాధకులు ఎవ్వరికైనా మార్గదర్శకంగా ఉంది. అంత కోపంలోనూ, అసహనంలోనూ ఆమె ఇంత సకారాత్మకంగ మాట్లాడగలగటం అంటే మాటలు కాదు. ముఖ్యంగ ఏదైనా వ్రతంలో, సాధనలో, తపస్సులో ఉన్నప్పుడు అసలు కోపతాపాలు తగవు.
          అందుకే ఆమె ఇంక వాదన పొడిగించకుండ ముగింపుగ ఈ మాట అంటుంది- "నీకోసం శంకరుడు ఎటు వంటివాడో అటువంటి వాడే కానీ గాక. నీ ధారణలతో నాకు సంబంధం లేదు. ఆయన తీరు ఏదైనా నాకు సమ్మతమే. ఆయన ఎటువంటి వాడైనా నేను వివాహం చేసుకోవటానికి వెనకాడను.
                    "న కామవృత్తిర్వచనీయ మీక్షతే" -
          ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తించేవారు ఎదటివారి దుర్భాషలను పట్టించుకోరు. అంటే - ఇంక ఏమీ వినను అని నిక్కచ్చిగా చెబుతుందామె. అతిథి మర్యాదలేవైనా తన ఆరాధ్యుని విమర్శించనంత వరకే.
          బ్రహ్మచారి అంతలో ఏదో చెప్పబోతాడు - పార్వతికి ఇంకా ఏమైనా వినే స్థితి మీరిపోతుంది. ఎంతో దృఢంగ అతనిని మాట్లాడనీయకుండా తన సఖివంక చూసి- అదిగో, అతనేదో మళ్ళీ పెదవి కదుపుతున్నాడు. సఖీ! అతనిని ఆపు. మహాత్ముల గురించి చెడు మాట్లాడేవారికే కాదు, అది వినే వారికి కూడా పాపమే చుట్టుకుంటుంది.
                                      న కేవలం యో మహతోపభాషతే|
                                      శృణోతి తస్మాదపి యస్స పాపభాక్||
          అని "అయినా అతనిని నోరు మెదపవద్దని అనే బదులు నేనే ఇట నుండి వెళ్ళిపోతాను, అని అక్కడి నుండి కదులుతుంది.
          మరుక్షణం శంకరుడు తన నిజరూపాన్ని ధరించి ఆమెను ప్రసన్నం చేసుకుంటాడు.
పార్వతి ఆశ్చర్యానందాలతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. అప్పుడు శంకరుడు ఆమె కన్నులలోకి చూస్తూ - ఇదిగో, నీ తపస్సు చేత నీవు కొనుక్కున్న దాసుడు నీ ఎదుట నున్నాడు అంటాడు. పార్వతి ఆనందంతో పొంగిపోతుంది.
          ఈవిధంగా పార్వతి తపస్సు చేత విరమించని ప్రయత్నం చేత, అడుగడుగునా ధైర్యంతో అసాధ్యమనుకున్న దానిని సాధ్యం చేసుకుని శివ సాన్నిధ్యం పొందింది. కోరినది పొందాలని కష్టపడితే ఫలం లభిస్తుందన్న మాట నిజమని నిరూపించింది. తపస్సు చేసినంతకాలం ఫలమింకా ఎప్పుడు వస్తుంది, ఇంకెంత కాలం వేచి చూడాలిఅని శక్తి హీనంగా, నిసత్తువుగా వేలాడిపోయేవారే ఆ తపోఫలం లభించిన వెంటనే తమ కష్టాన్ని ఎదురుచూపులనూ, వాటి వెనక పడిన శ్రమనూ క్షణంలో మరచిపోతారు.
          పార్వతే కనక తపస్సులో ఉన్న శివుని నేనెక్కడ పొందగలనని ఊరుకుని ఉంటే.. ? కన్నుల ముందు భస్మమైన మన్మథుని చూసి వెనకంజ వేసి ఉంటే? మేనాదేవి మాటలకు లొంగి తపస్సు మానేసి ఉంటే? ఎంతకాలం కష్టపడినా ఫలం దొరకలేదని నిరాశతో వెనుదిరిగి ఉంటే? బ్రహ్మచారి మాటలతో ధైర్యం సడలి ప్రయత్నం విరమించి ఉంటే--? ఆ మహేశ్వర సన్నిధి ఆమెకు లభించేదా? ఆదిగురువు సరసన నిలిచేదా? ఆయన వామభాగాన్ని అలంకరించగలిగేదా?
          ఇటువంటి కథలు సాధకులకు గొప్పసందేశాన్ని ఇస్తాయి. ఆశతో స్ఫూర్తితో నింపుతాయి. మన పురాణాలలో కావ్యాలలో, ఉపనిషత్తులలో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. అవి చదివినందువల్ల తెలుసుకున్నందువల్ల ప్రయత్నంలోని శ్రమతో కష్టంతో క్లేశంతో నీరసపడిన మన హృదయాలకు భయం పోయి ధైర్యం వస్తుంది. అపనమ్మకం పోయి అనంతమైన విశ్వాసం వస్తుంది. మరింత ఓరిమితో మన ప్రయత్నాన్ని లక్ష్యసాధన వరకూ కొనసాగించే శక్తి వస్తుంది.
                                       ********

ప్రేమ-విగ్రహారాధన --ఒక అవగాహన (స్వీయలేఖ)


          విగ్రహారాధన గురించి ఓ చిన్న మాట. నేరుగా ప్రమాణాలను ప్రస్తుతించే ముందర విరుద్ధ దిశగా ఓ ప్రశ్న.
          ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ఒక మాటంటాడు. తను వ్రాసిన ప్రేమలేఖను హీరోయిన్ స్నేహితురాళ్ళంతా తప్పు పట్టి నిలదీసే సన్నివేశంలో ప్రశ్నలు అడుగుతంటే 3,4 జవాబులు చెప్పి, తరువాతి ప్రశ్న వేసిన పిల్లను "నువ్వు ఎవరినైనా ప్రేమించావా, లేదంటే నీకు ప్రశ్న అడిగే హక్కు లేదు. మొదలు వెళ్ళి ప్రేమించి రా, తరువాత నీకసలు ప్రేశ్నలే రావు, సందేహాలే ఉండవు." అంటాడు. దాన్ని నేను నిజంగా వందశాతం భగవత్పరంగా అన్వయించి చూశాను. నా ప్రశ్నలన్నీ పోయాయి. ఆచారప్రభవో ధర్మః అని ఒక మాట అంటారు విష్ణుసహస్రం చివరలో. దాని అర్థం ఇదేనని కూడా స్ఫురించింది.
          అన్నట్టు మరో ప్రశ్న. లోకంలో ఇన్నేళ్ళలో ఎవరైనా ప్రేమించటం గురించి ప్రమాణాలు వెతికారా? అసలు మొట్టమొదటి ప్రేమ జంట ఎవరు, వారెందుకు ఎట్ల ఎప్పుడు ఎక్కడ ఏ పరిమాణంలో ప్రేమించారని పరిశోధన చేశారా? పోనీ తమలో పరస్పరం ప్రేమ కలిగిన తరువాత, అవతలివారితో ముడి పెట్టుకునే అవకాశం ఉన్నదని తెలిశాక, ఇది ఎందుకు, ఎట్ల అని ఆలోచించారా? లేదు కదా. ప్రేమ గురించి ప్రశ్నించకుండా పెళ్ళి చేసుకునే విధానం గురించి యోచించి, విధి నిర్వహించారు. కదా??
          సరే, ప్రేమించిన తరువాత మొదటి పని ఏం చేస్తారు? వివరాలు సంపాదిస్తారు. ఫోటోలు సంపాదిస్తారు. పొందాక ఆ ఫోటోనే చూస్తూంటారు. దాంతోనే మాట్లాడతారు. తమ భావాలు చెప్పుకుంటారు. పగలు రాత్రి ఆ ఫోటో రూపంలో వ్యక్తి తమతో ఉన్నాడని అనుకుంటారు. వేరే పని మీద దృష్టి నిలవదు. ఆ వ్యక్తితో ఇంకా దగ్గర కావాలి, ఇంకా మాట్లాడాలి, సమయం గడపాలి అనిపిస్తుంది. వారికి దగ్గర కావాలని, మంచిని నటించైనా సరే, మచ్చిక చేసుకోవటం ఇత్యాదులు చేస్తారు.
       అవతలివారు ఒప్పుకోకపోతే తమ భావనను మాటిమాటికీ అర్థమయ్యేలా వివరిస్తారు. ఒప్పించే ప్రయత్నాలు శతవిధాలా చేస్తారు. వారితో తమ సుఖం, ఆనందం ముడి పడి ఉన్నది అని ముమ్మాటికీ నమ్ముతారు. తమ సర్వస్వం అర్పించటానికి స్వకీయమైన స్వతంత్రతతో - అంటే వేరెవ్వరి ప్రోద్బలం లేకుండా ముందుకు వస్తారు. తమ భావన యొక్క లోతునుబట్టి "నీవు లేకపోతే చచ్చిపోతాను" అంటారు. అదే చేయటానికి విషం చేతులో పెట్టుకుని తిరగటానికి కూడా వెనకాడరు. సినిమాలలో అంతా చూస్తున్నాము. లోకంలో ఆ భావనను పంచుకునే వ్యక్తులు, ప్రేమికులో, స్నేహితులో ఆ సమాచారాన్ని మనకు అందిస్తునే ఉంటారు.
          అంతే కాదు, ప్రేమించనంత వరకు హీరోనో, హీరోయినో ప్రేమను నమ్మను అంటారు. వారి జతవ్యక్తి కనిపించగానే, పొందు లబించగానే, భావాలు పూర్తిగా విరుద్ధంగా మారిపోతాయి. ప్రేమను నమ్ముతారు, ఇంకా కావాలి అంటారు. ఔనా కాదా? తొలి యౌవనంలో ప్రప్రథమంగా ప్రణయం తలుపు తట్టిన వేళ ఆ భావన మధురం మధురం అని ఎందరో కవులు కావ్యాలలో అంటారు. దాన్ని మించిన అనుభూతి ఉండదని చెప్తారు ఆ మాధుర్యం చవి చూసినవారు.
       మరి, లోకంలో విగ్రహారాధనను అదే విధంగా ఎందుకు తీసుకోరు? భగవంతుడు, భక్తులు పరస్పరం ప్రేమికులు. ప్రేమికుల విషయంలో ఫోటో లాగే ఒక భక్తి ఆలంబన ఆ విగ్రహం. దానితో తమ అస్తిత్వాన్ని ముడి పెట్టుకుంటారు. మాట్లాడతారు, భావించుకుంటారు, తోడు కావాలని అల్లాడతారు. మమేకం అనిపిస్తుంది. ఆయన లేక ఆమె నావారు, నాకు చెందినది అనిపిస్తుంది. లోపల వెలుగు వ్యాపిస్తుంది. అయితే స్త్రీపురుష ప్రేమలో ఉండే సంకోచభావాలు భగవత్పరంగా ఉండవు. పరమాత్మ ప్రేమలో పీక లోతు మునిగితే, విగ్రహారాధనం ద్వారా దాన్ని వ్యక్తపరిస్తే సులువుగా పరతత్త్వాన్ని తెలుసుకనే మార్గం ఉన్నది. అందులో ఏదో రహస్యం ఉన్నది. చేస్తే తెలుస్తుంది. అంతేకానీ ఏమీ ప్రయత్నం చేయకుండా, అనుభవజ్ఞులను చదవకుండా, వినకుండా నిష్కర్షలు చేసేసి భ్రమప్రమాదాలకు లోనవ్వటం ఎంత వరకు సమంజసం?
          అట్లా ఆరాధనం చేసేవారిని చూసి నవ్వటం, కించపరచటం చేసేవారికి, లేదా ఇది సరైనదా, అసలు దేవుడున్నాడా అని అడిగేవారందరికి ప్రతి అనుభవుజ్ఞులైన మహాత్ములు చెప్పేదొక్కటే. చేసి చూడండి. పాలల్లో ఉన్న వెన్న పాలలో కనిపిస్తుందా? దానికి ఒక పద్ధతి ఉన్నది. విధి ఉన్నది. అట్లాగే లోకంలో ఉన్న భగవంతుడు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. పాలను తోడేసి, పెరుగు మీది మీగడ తీసి, దాన్ని వెన్నగా చేసి, దాన్ని కాచి వడబోస్తే కదా నెయ్య్ వచ్చేది!! అదంతా చేయకుండా పాలలో నెయ్యి లేదంటామా? అట్లాగే ఉదయం లేచి స్వామికి లేదా భగవతికి నమస్కరించి, పనులు చేస్తూ వారిని తలచుకుని, బాధొస్తే చెప్పుకుని, నమస్కారం దగ్గరనుంచి చేతనైన సేవ చేసుకుని, వారి అస్తిత్వాన్ని తనలో ఆవిష్కరించుకోవటం అంత 'సైంటిఫిక్' విధానాన్ని, విజయవంతంగా పనిచేసే విధిని, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆవిష్కిరంచి, మన ఋషులు ఇస్తే, దాన్ని ఇన్ని విధాలా పరీక్షించాలా? అదంతా ఏం లేదు అనాలా? అంత దూరం వరకూ కాదండి, శ్రీరామకర్ణామృతం ప్రవచనంలో బ్ర.శ్రీ. సామవేదం వారు మొన్న మొన్నటి ఒక రామభక్తుడి అనుభవం గురించి వివరంగా చెప్పారు. ఆయన ఏదో సమస్య వల్ల చేవలేక వైద్యాలయంలో ఉన్నప్పుడు, ఏ నర్సూ ఆయన పక్క మార్చక, సేవ చేయక ఇబ్బంది పడుతుంటే, రామా, నిన్ను ఇంత నమ్ముకున్నాను, రావే తండ్రీ అంటే ఇద్దరు వార్డు బాయ్ ల రూపంలో శ్రీరాముడు, లక్ష్మణుడు వచ్చి ఆయనకు సేవ చేసి వెళ్ళారుట. తరువాత నర్సులు వచ్చి, ఆశ్చర్యంగా ఇదంతా ఎవరు మార్చారని అడిగితే మీ వార్డుబాయ్ లు వచ్చారు కదా అన్నాడట. వారు ఆశ్చర్యంగా, 'ఈ వైద్యాలయంలో అసలు అబ్బాయిలు వార్డుబాయ్ లుగా స్టాఫే లేరు. అంతా ఆఢవారమే ఉన్నాము.' అన్నారట.
         నమ్మేవారిని రక్షించేందుకు ఆయనే స్వయానా వస్తుంటే ఇంకా విగ్రహాలు ఉన్నాయా నిజమా అని మనం కూర్చున్నాము. ఉడిపి శ్రీకృష్ణుని మొన్న మొన్నటి లీలల గురించి ఫేస్ బుక్ లో ఒకరు వ్రాస్తుంటారు, ఆంగ్లంలో. అందులోనుంచి ఎన్ని తార్కాణాలు చెప్పమంటారు, విగ్రహాలు సత్యమని.. ఆ విధానం సత్యమని. నేను మరొకరు, రామాయణం, మహాభారతం, వేదం, పురాణాలు అన్ని జల్లెడ పట్టి, ఎన్ని ఉదంతాలు చెప్తే మాత్రం, సాక్షాత్తు విష్ణువే శివుని ప్రార్థించాడని, శివుడే విష్ణువును ధ్యానించాడని రకరకాల ప్రమాణాలిచ్చినంత మాత్రాన హృదయంలో భక్తి జాగృతం కాదు కదా.. ఇతి శమ్.