విగ్రహారాధన
గురించి ఓ చిన్న మాట. నేరుగా ప్రమాణాలను ప్రస్తుతించే ముందర విరుద్ధ దిశగా ఓ
ప్రశ్న.
ఆర్య సినిమాలో అల్లు అర్జున్
ఒక మాటంటాడు. తను వ్రాసిన ప్రేమలేఖను హీరోయిన్ స్నేహితురాళ్ళంతా తప్పు పట్టి
నిలదీసే సన్నివేశంలో ప్రశ్నలు అడుగుతంటే 3,4 జవాబులు చెప్పి, తరువాతి ప్రశ్న
వేసిన పిల్లను "నువ్వు ఎవరినైనా ప్రేమించావా, లేదంటే
నీకు ప్రశ్న అడిగే హక్కు లేదు. మొదలు వెళ్ళి ప్రేమించి రా, తరువాత
నీకసలు ప్రేశ్నలే రావు, సందేహాలే ఉండవు." అంటాడు.
దాన్ని నేను నిజంగా వందశాతం భగవత్పరంగా అన్వయించి చూశాను. నా ప్రశ్నలన్నీ పోయాయి.
ఆచారప్రభవో ధర్మః అని ఒక మాట అంటారు విష్ణుసహస్రం చివరలో. దాని అర్థం ఇదేనని కూడా
స్ఫురించింది.
అన్నట్టు మరో ప్రశ్న. లోకంలో
ఇన్నేళ్ళలో ఎవరైనా ప్రేమించటం గురించి ప్రమాణాలు వెతికారా? అసలు
మొట్టమొదటి ప్రేమ జంట ఎవరు, వారెందుకు ఎట్ల ఎప్పుడు ఎక్కడ ఏ
పరిమాణంలో ప్రేమించారని పరిశోధన చేశారా? పోనీ తమలో పరస్పరం
ప్రేమ కలిగిన తరువాత, అవతలివారితో ముడి పెట్టుకునే అవకాశం
ఉన్నదని తెలిశాక, ఇది ఎందుకు, ఎట్ల అని
ఆలోచించారా? లేదు కదా. ప్రేమ గురించి ప్రశ్నించకుండా పెళ్ళి
చేసుకునే విధానం గురించి యోచించి, విధి నిర్వహించారు. కదా??
సరే, ప్రేమించిన
తరువాత మొదటి పని ఏం చేస్తారు? వివరాలు సంపాదిస్తారు. ఫోటోలు
సంపాదిస్తారు. పొందాక ఆ ఫోటోనే చూస్తూంటారు. దాంతోనే మాట్లాడతారు. తమ భావాలు
చెప్పుకుంటారు. పగలు రాత్రి ఆ ఫోటో రూపంలో వ్యక్తి తమతో ఉన్నాడని అనుకుంటారు. వేరే
పని మీద దృష్టి నిలవదు. ఆ వ్యక్తితో ఇంకా దగ్గర కావాలి, ఇంకా
మాట్లాడాలి, సమయం గడపాలి అనిపిస్తుంది. వారికి దగ్గర కావాలని,
మంచిని నటించైనా సరే, మచ్చిక చేసుకోవటం
ఇత్యాదులు చేస్తారు.
అవతలివారు ఒప్పుకోకపోతే తమ భావనను మాటిమాటికీ అర్థమయ్యేలా వివరిస్తారు.
ఒప్పించే ప్రయత్నాలు శతవిధాలా చేస్తారు. వారితో తమ సుఖం, ఆనందం ముడి పడి
ఉన్నది అని ముమ్మాటికీ నమ్ముతారు. తమ సర్వస్వం అర్పించటానికి స్వకీయమైన
స్వతంత్రతతో - అంటే వేరెవ్వరి ప్రోద్బలం లేకుండా ముందుకు వస్తారు. తమ భావన యొక్క
లోతునుబట్టి "నీవు లేకపోతే చచ్చిపోతాను" అంటారు. అదే చేయటానికి విషం
చేతులో పెట్టుకుని తిరగటానికి కూడా వెనకాడరు. సినిమాలలో అంతా చూస్తున్నాము. లోకంలో
ఆ భావనను పంచుకునే వ్యక్తులు, ప్రేమికులో, స్నేహితులో ఆ సమాచారాన్ని మనకు అందిస్తునే ఉంటారు.
అంతే కాదు, ప్రేమించనంత
వరకు హీరోనో, హీరోయినో ప్రేమను నమ్మను అంటారు. వారి
జతవ్యక్తి కనిపించగానే, పొందు లబించగానే, భావాలు పూర్తిగా విరుద్ధంగా మారిపోతాయి. ప్రేమను నమ్ముతారు, ఇంకా కావాలి అంటారు. ఔనా కాదా? తొలి యౌవనంలో
ప్రప్రథమంగా ప్రణయం తలుపు తట్టిన వేళ ఆ భావన మధురం మధురం అని ఎందరో కవులు
కావ్యాలలో అంటారు. దాన్ని మించిన అనుభూతి ఉండదని చెప్తారు ఆ మాధుర్యం చవి
చూసినవారు.
మరి, లోకంలో
విగ్రహారాధనను అదే విధంగా ఎందుకు తీసుకోరు? భగవంతుడు,
భక్తులు పరస్పరం ప్రేమికులు. ప్రేమికుల విషయంలో ఫోటో లాగే ఒక భక్తి
ఆలంబన ఆ విగ్రహం. దానితో తమ అస్తిత్వాన్ని ముడి పెట్టుకుంటారు. మాట్లాడతారు,
భావించుకుంటారు, తోడు కావాలని అల్లాడతారు.
మమేకం అనిపిస్తుంది. ఆయన లేక ఆమె నావారు, నాకు చెందినది
అనిపిస్తుంది. లోపల వెలుగు వ్యాపిస్తుంది. అయితే స్త్రీపురుష ప్రేమలో ఉండే
సంకోచభావాలు భగవత్పరంగా ఉండవు. పరమాత్మ ప్రేమలో పీక లోతు మునిగితే, విగ్రహారాధనం ద్వారా దాన్ని వ్యక్తపరిస్తే సులువుగా పరతత్త్వాన్ని
తెలుసుకనే మార్గం ఉన్నది. అందులో ఏదో రహస్యం ఉన్నది. చేస్తే తెలుస్తుంది. అంతేకానీ
ఏమీ ప్రయత్నం చేయకుండా, అనుభవజ్ఞులను చదవకుండా, వినకుండా నిష్కర్షలు చేసేసి భ్రమప్రమాదాలకు లోనవ్వటం ఎంత వరకు సమంజసం?
అట్లా ఆరాధనం చేసేవారిని చూసి
నవ్వటం, కించపరచటం చేసేవారికి, లేదా ఇది సరైనదా, అసలు దేవుడున్నాడా అని అడిగేవారందరికి ప్రతి అనుభవుజ్ఞులైన మహాత్ములు చెప్పేదొక్కటే.
చేసి చూడండి. పాలల్లో ఉన్న వెన్న పాలలో కనిపిస్తుందా? దానికి
ఒక పద్ధతి ఉన్నది. విధి ఉన్నది. అట్లాగే లోకంలో ఉన్న భగవంతుడు కూడా సర్వత్రా
వ్యాపించి ఉన్నాడు. పాలను తోడేసి, పెరుగు మీది మీగడ తీసి,
దాన్ని వెన్నగా చేసి, దాన్ని కాచి వడబోస్తే
కదా నెయ్య్ వచ్చేది!! అదంతా చేయకుండా పాలలో నెయ్యి లేదంటామా? అట్లాగే ఉదయం లేచి స్వామికి లేదా భగవతికి నమస్కరించి, పనులు చేస్తూ వారిని తలచుకుని, బాధొస్తే చెప్పుకుని,
నమస్కారం దగ్గరనుంచి చేతనైన సేవ చేసుకుని, వారి
అస్తిత్వాన్ని తనలో ఆవిష్కరించుకోవటం అంత 'సైంటిఫిక్'
విధానాన్ని, విజయవంతంగా పనిచేసే విధిని,
కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆవిష్కిరంచి, మన ఋషులు ఇస్తే, దాన్ని
ఇన్ని విధాలా పరీక్షించాలా? అదంతా ఏం లేదు అనాలా? అంత దూరం వరకూ కాదండి, శ్రీరామకర్ణామృతం ప్రవచనంలో
బ్ర.శ్రీ. సామవేదం వారు మొన్న మొన్నటి ఒక రామభక్తుడి అనుభవం గురించి వివరంగా
చెప్పారు. ఆయన ఏదో సమస్య వల్ల చేవలేక వైద్యాలయంలో ఉన్నప్పుడు, ఏ నర్సూ ఆయన పక్క మార్చక, సేవ చేయక ఇబ్బంది పడుతుంటే,
రామా, నిన్ను ఇంత నమ్ముకున్నాను, రావే తండ్రీ అంటే ఇద్దరు వార్డు బాయ్ ల రూపంలో శ్రీరాముడు, లక్ష్మణుడు వచ్చి ఆయనకు సేవ చేసి వెళ్ళారుట. తరువాత నర్సులు వచ్చి,
ఆశ్చర్యంగా ఇదంతా ఎవరు మార్చారని అడిగితే మీ వార్డుబాయ్ లు వచ్చారు
కదా అన్నాడట. వారు ఆశ్చర్యంగా, 'ఈ వైద్యాలయంలో అసలు
అబ్బాయిలు వార్డుబాయ్ లుగా స్టాఫే లేరు. అంతా ఆఢవారమే ఉన్నాము.' అన్నారట.
నమ్మేవారిని రక్షించేందుకు
ఆయనే స్వయానా వస్తుంటే ఇంకా విగ్రహాలు ఉన్నాయా నిజమా అని మనం కూర్చున్నాము. ఉడిపి
శ్రీకృష్ణుని మొన్న మొన్నటి లీలల గురించి ఫేస్ బుక్ లో ఒకరు వ్రాస్తుంటారు, ఆంగ్లంలో.
అందులోనుంచి ఎన్ని తార్కాణాలు చెప్పమంటారు, విగ్రహాలు
సత్యమని.. ఆ విధానం సత్యమని. నేను మరొకరు, రామాయణం, మహాభారతం, వేదం, పురాణాలు
అన్ని జల్లెడ పట్టి, ఎన్ని ఉదంతాలు చెప్తే మాత్రం, సాక్షాత్తు విష్ణువే శివుని ప్రార్థించాడని, శివుడే
విష్ణువును ధ్యానించాడని రకరకాల ప్రమాణాలిచ్చినంత మాత్రాన హృదయంలో భక్తి జాగృతం
కాదు కదా.. ఇతి శమ్.
No comments:
Post a Comment