(సంభాషణ-మూలక నాటకం) -సంకా ఉషారాణి
పాత్రద్వయం-
అవధీః-- తాను చెప్పేవాడినని, మిగితావారంతా వినేవారని సింసియర్ గా అనుకనే ఓ పండితంమన్యుడు
స్వధీః-- ఎవరు భా.. వ్యా.. అనగానే వారిని భాషా పండితులు, వ్యాకరణవేత్తలని భ్రమపడే ఓ సగటు సంస్కృతార్థి
------------------------
స్వధీః-- (ప్రవేశించి, వినయంగా) నమస్కారమయ్యా.
అవధీః-- పనిలో వ్యస్తంగా ఉన్నాను.
స్వధీః-- (తనలో తాను) నిజమే.. చేతిలో ఉన్న తాటాకుపత్రాలు తిరగేసి పట్టుకుని కూడా ఏదో పరిశోధన చేస్తున్నట్టున్నాడు.. ఆహా, నా భాగ్యం కొద్దీ దొరికి ఉంటాడీయన.)
అవధీః-- ఏమీ పలకవు? త్వమేవ వా, తెలుగు శిక్షకోసం వచ్చింది?
స్వధీః-- (సభక్తి చెంపలేసుకుని) శిక్ష కాదయ్యా.. సంస్కృతంద్వారా తెలుగు నేర్చుకోవటానికి..
అవధీః-- అదే నేర్వటం సంస్కృతంలో శిక్షధాతువు లేవోయ్.. సరే, దగ్గరగా ప్రవేశించు.
స్వధీః-- అర్థం కాలేదండి..
అవధీః-- ఉప అంటే ఏంటి?
స్వధీః-- దగ్గరగా!
అవధీః-- విశ అంటే?
స్వధీః-- ప్రవేశించు-
అవధీః-- కలిపి?
స్వధీః-- అబ్బో.. అదరగొట్టేసారయ్యా.. (కూర్చుంటూ) ఒకటండి.. నాకసలు వీర విచిత్ర విప్రకృష్ట విధ్వంసంగా సందేహాలెక్కువ..!
అవదీః-- ఎవరో నాబోటి మహాత్ముడే అన్నట్టు- కాయం ఉన్నంతవరకూ సంకాయం తప్పదోయ్..
స్వధీః-- (క్షణం ఆలోచించి) దేహం ఉన్నంతవరకు సందేహం తప్పదోయ్.. అంటున్నారు కామోసు.. సరే అయ్యా.. మీరు నా ప్రతీ అడ్డదిడ్డమైన సందేహం తీరుస్తానంటేనే నేను మీ వద్ద కూర్చుని చదువుకుంటాను.. తమరు అందుకు సమర్థులు కనుకనే మీవద్దకేతెంచాను..
అవధీః-- (సంతోషిస్తూ) సరే- అట్లాగే.. అందరూ అంతేనయ్యా- నా వద్దకే తెస్తుంటారు ఏ సందేహమైనా..
స్వధీః-- కానీ- నేనన్నది ఏతెంచటమండి.. ఏతెంచు ధాతువు.. మీ వద్దకు ఏతెంచాను అని..
అవధీః-- అదేలేవో- నేనూ అదే అంటున్నాను. అంతా నా దగ్గర‘కే’ తెస్తారని.. నీవు తెస్తే, నేను తెంచేస్తాను..
స్వధీః-- (తల విదిలిస్తూ) సరే- సంతోషమయ్యా.. మనకు ఓ సందేహమయ్యా.. అడగవచ్చా? తెంచెదరా?
అవధీః-- అబ్బో, ఆదిలోనే హంసాలవాలమా?
స్వధీః-- (ఆలోచిస్తూ ఏదో తట్టి) హంసాలవాలమా? హంసపాదు మాటకా?కానీ హంసపాదు అంటే “వ్రాతయందు తప్పు గల చోట నుంచెడు హంసపాదాకారమైన గుర్తు.” అని శ్రీహరి నిఘంటువు. అది పాదమే కానీ, ఆలవాలార్థకమని..
అవధీః-- (భృకుటి ముడిచి) ఏకార్ధకాలైతే ప్రయోగాలలో ఏ చారూ ఉండదు.. అందుకే ఇట్లా..
స్వధీః-- (సాలోచనగా పైకి చూస్తూ) చారా? అంటే?
అవధీః-- అదేనయ్యా- రసం..
స్వధీః-- (అత్యాదరంగా చూస్తూ) అబ్బో.. అబ్బో.. ఏమి పాండిత్యం!
అవధీః-- (గర్వంగా నవ్వి) అందుకేగా నా వద్దకు గచ్ఛావు.
స్వధీః-- (ఉలికి పడి సర్దుకుంటూ) ఔనండి.. కానీ రావటం అంటే ఆగమనం కదా..(తనను తానే సరిచేసుకుంటూ) ఆఁ.. ఆగచ్ఛితిని అందుకే ఆవ్రజితిని..
అవధీః-- (ఆ మాత్రం పాండిత్యప్రదర్శను తిరస్కారంగా తల ఊపుతూ) అదంతా సరే సరే- నీవు ఏ సందేహం ఆపతినా పృచ్ఛవచ్చు..
స్వధీః-- (పక్కకు చూస్తూ) ఆపతినా?! అంటే భర్త ఉన్నంత వరకు -అతని చేత..?
అవధీః-- అబ్బే.. అంత దూరం పోకు.. ఆ ఉపసర్గ వేసావు గా.. దానితో ‘పత్’ ధాతువు -
స్వధీః-- (వెడల్పాటి కళ్లతో) ఓహోహో.. పత్ ధాతువా.. అబ్బబ్బ- అంటే- వచ్చిపడినా..! అబ్బా.. ధన్యుడనండి..
అవధీః-- (ఒక గొప్పతనసూచక హాసం (గొ.సూ.హా) చేస్తూ) అగ్గది! అట్లా ఉండాలి నేర్చుకునేవాడు.. నా వద్ద ‘సందేహవందమై’నా వృచ్ఛవచ్చు.
స్వధీః-- సందేహవందమా? అంటే?
అవధీః-- అంటే సందేహశతమన్నమాట! (తన గొప్ప ప్రయోగానికి తానే నవ్వుతూ) చూసావా.. నీకు తెలుగువ్యాకరణపూర్వకభాషతో పాటు సంస్కృతమూ నేర్పేస్తాను.. అహహహ
స్వధీః-- (నవ్వుతూ నమస్కరించి వినయంగా) అహహ.. అందుకే కదా మీ వద్దకు ఆగచ్ఛాను.
అవధీః-- సరే- నీ సందేహప్రథమంబు అధః..
స్వధీః-- అధః ఏమిటండి?
అవధీః-- (మరో గొ.సూ.హా చేస్తూ) అడుగు కదా.. అంటే కింద కదా.. అంటే సంస్కృతంలో అధః..
స్వధీః-- అబ్బబ్బా! ఏమి పాండిత్యమండి.. అడుగడుగునా అడుగే లేనంత పాండిత్యం..
అవధీః-- (కాస్త చిరాకుగా చూసి, తలూపి) అడుగులేని చోట అడుగులేస్తే పడిపోగలము. కవిత్వాల ప్రదర్శనలు మనముందు వలదు. సరే- నీ సమ్యక్ దేహమ్ వెంటనే అధః అధః
స్వధీః-- సమ్యక్ దేహమేమిటండి?
అవధీః-- అబ్బా- పృచ్ఛ పృచ్ఛలోనూ సందేహమేనా? అంటే అడుగడుగునా సందేహమేనా?
స్వధీః-- ఏం చేసేదండి.. అందుకే ఏ గురువులూ నాకు బోధించటం లేదు..
అవధీః-- సరే- మా బాధ, మా బాధ..
స్వధీః-- మీ బాధేమిటండి?
అవధీః-- నా బాధా నీ బాధా కాదయ్యా.. బాధపెట్టకు అంటున్నా- మా నిషేధార్థకావ్యయం. లోట్ మధ్యమం.
స్వధీః-- (తుళ్లిపడుతూ) అబ్బో.. గొప్పగా మాట్లాడేస్తున్నారండి.. కానీ ‘మా’ సరే- మరి ‘బాధ’ ధాతువు ఆత్మనేపదం కదయ్యా.. నాకు తెలిసీ క్రియాఫలం కర్త అభిప్రాయమైతే ఆత్మనే- కాకపోతే పరస్మై కదండి..
అవధీః-- కానీ ఇక్కడ నువ్వు నన్ను బాధపెడుతున్నావు కదోయ్.. పరస్మైయే కదా..
స్వధీః-- (భయం నటించి) అయ్య దేవుడోయ్.. క్షమించేయండయ్యా..
అవధీః-- సరే సరే- మొత్తం శరీరం- అదే నీ- సమగ్రం దేహం చెప్పు..
స్వధీః-- (చేతులు జోడించి) నేను వచ్చీరాగానే ప్రారంభంలో ‘త్వమేవ వా’ అని మీరు నుడివి ఉన్నారు.. వా అనేది ‘ఇదా అదా’ అనే సందేహం లో కదా నిశ్చయార్థంకోసం అడిగేది?
అవధీః- నువ్వు మాకు శిక్షిస్తున్నావా, నేను నీకు శిక్షిస్తున్నానా?
స్వధీః-- అయ్యో. ఎంత మాట! మీరే నన్ను శిక్షిస్తున్నారు!
అవధీః-- ‘నన్ను’ ఏమిటి? నన్ను అంటే దండనార్థకమవుతుంది.. ‘నాకు’ అనాలి..
స్వధీః-- కానీ సంస్కృతంలో ‘శిక్ష్’ ధాతువుతో కర్మకదా- అంటే ‘కర్మణి ద్వితీయా’ కదా.. అంటే మాం శిక్షయ.. నన్ను శిక్షించు- అచ్చుతప్పేం లేదండి..
అవధీః-- అచ్చు ఒక్కటే తప్పు కాదయ్యా- అది హల్లుబహుళ తప్పు.. అంటే- నన్ను లో కనీసం.......
స్వధీః-- (మధ్యలోనే తుంచుతూ) సరే- వదిలేయండయ్యా..
అవధీః-- వదిలేయండయ్యా అంటే? అంటే ఏంటి నీ ఉద్దేశ్యం?
స్వధీః-- అంటే.. అది.. చెప్పకపోయినా ఫరవాలేదని అయ్యా..
అవధీః-- ఫరవాలేదంటే? నీవడిగింది చెప్పటానికి మాకేం హస్తే కాదు- అనా?
స్వధీః-- (తల గోక్కుంటూ..) హస్తే? అదేంటండి..?
అవధీః-- అదే- చేత చేత! చేత వెన్నముద్ద- ఎట్లా అనువదిస్తావోయ్..?
స్వధీః-- అబ్బా- నిజమేనయ్యా- హస్తే అనే!
అవధీః-- (మరో గొ.సూ.హా చేస్తూ) ఇంతకాలం నీవు చేత అంటే సప్తమీ ఉందని గమనించలేదు కదా! అందుకే నాబోటి వారి వద్దకు వచ్చి ఏం చేతకానివారని మాట్లాడకూడదు..
స్వధీః-- మీకేం చేత కాకపోతే నేనిక్కడేం చేస్తుండానయ్యా? చంపేసారయ్యా..
అవధీః-- (గొప్పగా) అదే కదా నా పేరు అర్ధం..!
స్వధీః-- అంటే మీరందరినీ చంపేస్తుంటారా అయ్యా? మీకు అది మరో వ్యాపారమా?
అవధీః- జనాలను చంపితే ఏమొస్తుందోయ్, బూడిద! నేను జనులలోని అజ్ఞానాన్ని చంపేస్తుంటాను.. చాలామందిలోని అజ్ఞానాలను చంపేసాను కూడా.. అందుకే నా పేరు అవధీః..
స్వధీః-- అబ్బా.. ఆహా.. నిజమేనయ్యా.. కానీ వ్యాకరణపరంగా ఎట్టాగో తెలియటం లేదండయ్యా..
అవధీః-- అదేనోయ్- ఆదికావ్యంలో చూడలేదా? క్రౌంచమిధునాదేకమ్ అవధీః అని..
స్వధీః-- (ఆరాధనగా) ఓహ్! అటునుంచి వచ్చారా! ఆహాహా, అబ్బబ్బా! అసలు.......
అవధీః-- అక్కడే ఆగిపో.. క్రౌంచమ్-ఇధున-అదేకాన్ని వ్యాధుడు చంపినట్టు నేనూ....
స్వధీః-- క్రౌంచమ్ ఇధునమేంటయ్యా? కుదర్లేదు.. క్రౌంచమిథునం కదండయ్యా?
అవధీః-- వట్టి అమాయక చక్రవర్తిలా ఉన్నావు.. అందరూ విభజించినట్టు మనమూ విభజిస్తే మన గొప్పేం ఉంది? పార్వతీప-రమేశ్వరౌ అని ఇదివరలో వారు చేసేసారే- అది కుదిరిందా?
స్వధీః-- అదీ నిజమేనయ్యా.. కానీ ఒకటండయ్యా.. ఏకమ్ మాత్రమే ఆ వ్యాధుడు చంపాడయ్యా.. మీరు అనేకమవధీః ఉండాలి..
అవధీః-- ఎందుకులేవో?! ఏకకాన్ని చంపినా శతకాన్ని చంపినా చంపటం సమానం కనుక ఏకశేషం చేసేసుకుందాంలే..
స్వధీః-- ఏకకమేంటయ్యా?
అవధీః-- శతకం పక్కన క ఉంది కదా. అందుకే ఏకను కూడా ఓ కేకేసా.. అంతే! నా పేరు సంగతి ఒంటబట్టిందా? అది చెప్పు.. అందులో స్పష్టత చాలా అవసరం.!
స్వధీః-- ఇదీ బాగానే ఉందయ్యా.. అదే నేననుకున్నాను- అసలు మీపేరు చూసి, ‘అవ’ధీః ఏంటి? ‘కింద’బుద్ధి అని..? మీ పేరు అధిధీః ఉండాలీ అని.. దాని వెనక రహస్యం ఇప్పుడు అర్థమయిందయ్యా..
అవధీః-- రామాయణంలో ఉన్న పేరే కావాలని మా నాన్నగారి పట్టు.. అయితే ఇదివరకెవరకీ ఎక్కడా ఈ భూనభోంతరాళలో భూర్భువాది ఊర్ధ్వలోకాలలో అతలవితలసుతలాది అధోలోకాలలో ఆ పేరు ఉండకూడదని మా అమ్మగారి పట్టు.. దాంతో అంతా వెతికి ఈ పదంతో అయితే ఎవ్వరికీ ఎక్కడా ఇంతవరకు పేరు లేదని అట్లా పెట్టేసారన్నమాట..
స్వధీః-- క్రియాపదాలతో పేర్లు పెట్టేసుకోవటం కూడా మంచి పద్దతే.. కనీసం అర్థం పర్థం లేని పేర్లకంటే నయం కదయ్యా. మీ పెద్దోళ్ళు చేసింది సత్యంగా బాగుందయ్యా.. ఎంతైనా గొప్ప పండితుల కుటుంబం!.
అవధీః-- (తబ్బిబ్బౌతూ) అసలు.. అసలు.. నా నోటితో నేను చెప్పుకోకూడదు కానీ.. ఇంత పాండిత్యం అసలు నేనెట్లా భరిస్తానని ఆ భగవంతుడు నాకు ఇది ప్రసాదించాడో కానీ..
స్వధీః-- నిజమేనండయ్యా.. దేవుడు భలేగా అన్యాయాలు చేసేస్తుంటాడండయ్యా..
అవధీః-- అన్యాయం కాదు కానీ బాధ్యత! అజ్ఞాననాశనభారభాద్యత..
స్వధీః-- బాధ్యత అనుకుంటానండయ్యా..
అవధీః-- అంటే- బ అని అల్పప్రాణం పెడితే భలో ఉన్న భారం తొంగిచూడదని...
స్వధీః-- అభ్భభ్భభ్భ!
అవధీః-- ఆ ధాయిత్వంతో శిరస్సు సూక్ష్మాలవుతోందీ అంటే నమ్ము..
స్వధీః-- (తల ఊపుతూ) సూక్ష్మాలేమిటయ్యా?
అవధీః-- (తనలో తాను) హమ్మయ్య- ధాయిత్వం గురించి అడిగాడు కాదు.. (బయటకు) అదే అదే, బద్దలవుతోంది అని.. ‘బద్ద’కు ఆంధ్ర-సంస్కృత కోశము (పుల్లెల, కప్పగంతుల ఆం.ప్ర.సా.అ.) అనే ఉపకోశంలో సూక్ష్మః అని ఉండటం నీవు చూడలేదా? ఇప్పుడు మనం వేసిన ‘బద్దలు’ అంటే ‘బద్ద’కు బహువచనం కదా.
స్వధీః-- అసలు- ఏం తర్కమండి! ఆహా.. నిజమేలే అయ్యా.. అక్షరాలా..!
అవధీః-- మాకు పొగడ్తలస్సలు పడవు. ‘పొగడ్తలు అనే ఆగడ్తలలో పడరాద’ని మా జనకమాత చెప్పేవారు..
స్వధీః-- భలే చెప్పారండి.. జనకమాత ఎవరండి? సీతమ్మవారి నాన్నమ్మగారా? శ్రీమద్రామాయణంలో ఎన్నో శ్లోకమండి?
అవధీః-- రామాయణం కాదు నాయనా! మా జనకమాత చెప్పారు.... మా నాన్నమ్మ..
స్వధీః-- అబ్బా.. ఆహా.. తండ్రి తల్లి పితామహీ అనుకున్నానయ్యా ఇంతకాలం..
అవధీః-- ఇప్పుడూ అనుకో.. సరే- మొదలు సందేహం అడుగు.. మావి విశిష్టప్రయోగలు.. మా మాటలు టమాటాలకన్నా పుల్లనివి! ఎర్రనివి! చారు ఆస్వాదనం చేయాలి.. ప్రతీ పదానికీ ఆపతిస్తూంటే ఇంక అంతే..
స్వధీ-- సరేనండి.. మధ్యాపతించను.. అంటే- మధ్యలో పడను.. నా సందేహమేమిటంటే- మీరు ‘త్వమేవ వా’ అన్నారు.. కానీ ‘వా’ అవ్యయం “వా+కా । ౧ వికల్పే ౨ సాదృశ్యే ౩ అవధారణే ౪ సముచ్చయే అమరః”। అని వాచస్పత్యంలో ఉన్నది. అందులో ప్రశ్నార్థకం లేదు కదా..
అవధీః-- ఆమాత్రం తెలియకనే ప్రయోగించామనా?
స్వధీః-- (కంగారుగా) అయ్యో- అట్లా కాదండయ్యా.. సందేహం వస్తే చెప్పమన్నారు మరి..
అవధీః-- (ముఖమంతా చిట్లించి సూటిగా చూస్తూ) తల్లి గర్భంనుండే సంస్కృతంతో పుట్టినవారం.. మాకే చెబుతున్నావా భాష గురించి?
స్వధీః-- (ముక్కుమీద వేలేసుకుని) లేదయ్యా.. కానీ నాకేమో శిక్షించుకోవాలనే తాపత్రయంలో వెయ్యి సందేహాలండయ్యా..
అవధీః-- అయితే నీకు సమ్యక్-దేహ-దేహి అన్నమాట..
స్వధీః-- (మూతి కిందకు విచరిచి) అసలు బొత్తిగా ఏమీ ఎక్కలేదయ్యా..
అవధీః-- సందేహమన్నచో సమ్యక్ దేహం- అంటే మంచి శరీరమన్నమాట.. నీకు సమ్యక్ దేహంబులు వెయ్యి కదా..! వెయ్యి అంటే సంస్కృతంలో ఏమిటి? ‘దేహి’ అనే కదా..
స్వధీః-- అదెట్లా?
అవధీః-- ఇప్పుడూ, అన్నం తినే వేళ కూర వెయ్యి, పచ్చడి వెయ్యి అంటానికి ఏమంటావు?.....
స్వధీః-- (వెలిగే కళ్ళతో) ఆహా.. ఆహా.. ‘దేహి’ అనే కదా! అబ్బ.. అర్థమైందయ్యా..
అవధీః-- దేహి అనకుండా గేహికి గడవదయ్యా..
స్వధీః-- అబ్బో! అసలిదైతే- ఏం చెప్పాలి! ఏం మాట! గొప్ప సూక్తండయ్యా.. ఆగండి.. వ్రాసేసుకుంటాను..
అవధీః-- (గొప్పగా కనుబొమ్మలు తిప్పి) అది! చాలు. విరమిద్దామిక..
స్వధీః-- అంటే విశేషంగా రమిద్దామనా అయ్యా?
అవధీః-- అదీ సరైనదేననుకో! జ్ఞానంలో రమించటమే మాబోటి పండితుల పంచమం-నిషాదం...
స్వధీః-- పంచమం-నిషాదం ఏమిటయ్యా?
అవధీః-- సంగీతశాస్త్రం తియ్యవోయ్..
స్వధీః-- అబ్బో.. పంచమమంటే -ప; నిషాదం అంటే ని- కిందపడి దొర్లి దొర్లి పొర్లాలనే కోరికను నియంత్రించుకుంటూన్నానయ్యా.. అహో..అయ్య అమ్మోయ్..
అవధీః-- (మరింత వికృతంగా కనుబొమ్మలు తిప్పి) అయితే నీకు తెలుగు శిక్షించాలా?
స్వధీః-- అయ్యో.. తెలుగు శిక్షించవద్దయ్యా.. నేర్పాలి..
అవధీః-- అదేలోవో.. మా దగ్గర ఏం నేర్చినా శిక్ష జరిగిపోతుందంతే..
స్వధీః-- ఆయ్.. అది ఇక్కడ పాదం మోపగానే తెలిసిపోయిందయ్యా.
అవధీః-- అస్తు, అధునా వయం తెలుగు శిక్షామః.. అంటే ఇప్పుడు మనం తెలుగు నేరుద్దాం..
స్వధీః-- (ప్రశ్నార్థకంగా చూసి) అయ్యా,, శిక్షధాతువు ఆత్మనేపదం కదా..
అవధీః-- అంటే? నాకు ఆమాత్రం తెలియదనా?
స్వధీః-- (కంగారుగా) అయ్యో.. అట్లా కాదు..
అవధీః-- (వివరిస్తూ) నా ప్రతీ ప్రయోగంలో వెనక ఏదో అంతరా‘ర్ధం’ ఉంటుంది.. ఒప్పుకుంటావా?
స్వధీః-- అది తెలుసుకోవాలనే తాపత్రయం అయ్యా.. కానీ వచ్చిందగ్గరి నుంచీ చూస్తున్నాను. థ రావాల్సిన చోటల్లా మీరు ధ అంటున్నారు.. ఇప్పుడు అది అంతరా‘ర్థం’ అనుకుంటా.. అర్థంలో థకారం కదా..
అవధీః-- అదే అదే- అధికప్రసంగమంటే..
స్వధీః-- (తగ్గుతూ) మూసుకుంటానండి..
అవధీః-- (వినయానికి సంతోషిస్తూ) ఇప్పుడు నీకు నేర్పుతూ నేనూ నేరుస్తున్నాను కదా.. అంటే పరస్మైపదమే కదా..
స్వధీః-- (చేతులు జోడించి) అబ్బా.. పడేసారయ్యా.. అంతే.. కాళ్ళమీద పడిపోతున్నానంతే..
అవధీః-- (చేతులతో ఆపి) అదే అతివినయం- నాకు పతదు..
స్వధీః-- (ఆలోచిస్తూ) ఓహ్.. పడదా..! అర్థమైంది. ఇప్పుడు మీరింత గొప్ప ప్రయోగాలు మీపాటికి మీరు చేసుకుంటూ పోయి, నాకు అర్థమే కాలేదనుకోండయ్యా.. అప్పుడు మీరవి ఎంత గొప్పగా చేసీ ప్రయోజనమేముందయ్యా?
అవధీః-- (సంతోషంగా) సరైన తర్కం పట్టావోయ్.. అదీ నిజమేలే.. చెప్పేవాడికి ఓపికుండాలి..
స్వధీః-- ఇంకోటేంటంటే.. మీ విశిష్టప్రయోగాలు మీరే తప్ప మరొకరు విప్పే సాహసం చేయగలరా?
అవధీః-- (ఇంకా ఉబ్బిపోతూ) నిజమే నిజమే.. లెస్స పలికితివి.. సరే- ఇహ పఠ మొదలెడదామా?
స్వధీః-- పఠ ఏమిటయ్యా?
అవధీః-- తెలుగులోకి అనువదించవోయ్.. పఠ అంటే?
స్వధీః-- చదువు..!
అవధీః-- అదే కదా నేనన్నది..! సరిపోయిందా లేదా?
స్వధీః-- (ఆశ్చర్యంగా) అబ్బబ్బబ్బా.. ఇదైతే.. అసలు- అసలు కింద పడి కొట్టుకోవాలనిపిస్తోందండి..
అవధీః-- సరే- పఠ అయినాక ఆపణంకో..
స్వధీః-- ఆపణంకో?
అవధీః-- ఆపణాన్ని తెలుగులో ఏమంటారు?
స్వధీః-- (ఆలోచిస్తూ) దుకాణం.. కాదు.. కొట్టు..
అవధీః-- ఆఁ!! అదే.. కొట్టుకో అన్నాను..
స్వధీః-- అసలు, అసలు మీరూ.. అబ్బాబ్బా.. అబ్బా..
అవధీః-- పితః పితః అని తరువాత కొట్టుకుందూ..
స్వధీః-- పితః ఏమిటయ్యా..?
అవధీః-- అబ్బ అబ్బ అంటున్నావు కదా.. అమ్మా అబ్బా అంటే తల్లిదండ్రులే కదా..
స్వధీః-- అమ్మమ్మమ్మా...
అవధీః-- జననీమాతామాతా! అమ్మమ్మ వాళ్ళ అమ్మా?
స్వధీః-- ఇంకా నయం! ఇంకో నాలుగు తరాలు దింపారు కాదు... ఆహాహాహాహాహ.. అసలు.....
అవధీః-- (మరో గొ.సూ.హా చేస్తూ) సరే సరే- ఆగిపో.. అక్కడే!
స్వధీః-- సరేనయ్యా.. ‘వా’ గురించి నా సందేహానికి ఇంకా మీరు చెప్పలేదయ్యా..
అవధీః-- వా లో అసలు సందేహం ఏముంది? ఏమీలేదు. అది తెలుగు ‘వా’యే..! వికల్పార్థం. తెలుగులో- వస్తావా, రావా, పోతావా, ఉంటావా, లేస్తావా..- అదే కన్నడంలో- అల్వా, ఇల్వా- సంస్కృతంలోనూ అంతే- !
స్వధీః-- అబ్బో- నిజమేనయ్యా.. కానీ వాడు వస్తాడా, ఆమె వస్తుందా, వాళ్ళు వస్తారా, మీరు వస్తారా అన్నింటికీ వాడుతున్నారుగా..
అవధీః-- ఆప్టే తెరవవోయ్.. (d) possibility; అని ఉంటుంది చూడు..
స్వధీః-- మరి తెలుగన్నారు కదయ్యా- ఆప్టే తెలుగు కాదు కదా..
అవదీః-- (తల గోక్కుని) చెడ్డ చిక్కు తెస్తావోయ్.. సరే- ఆప్టేకోశం సంస్కృతమే.. వా కూడా
స్వధీః-- అది నిజమే కానీండయ్యా, మరి ప్రయోగాలు కదా మనకు శరణ్యం.. కోశంలో అర్థం ఉంటే ఉంది- అది మన ఇతిహాసపురాణాలలో అంత చేటు - అదే ఈనాడు మన వాడుతున్నంతగా ప్రయోగంలో ఎక్కడైనా ఉన్నదా?
అవధీః-- ఇప్పుడు ఉంటే ఎంతయ్యా? ఉండకపోతే ఎంత? మనకు కావాల్సింది కోశంలో ఉంది కదా.. అంతే.
స్వధీః-- సరేనండయ్యా- ఇహ తాము పాఠం చెప్పండి.
అవధీః-- అంటే ఇప్పటిదాకా నృత్యం చేసానా?
స్వధీః-- అట్లాగ కాదండయ్యా..
అవధీః-- ఇదీ పాఠమే. ఇంత సంశరీరనిఏనుగులో ఎన్ని పాఠాలు చెప్పేసానో-
స్వధీః-- సంశరీరనిఏనుగులోనా? సంశరీరమంటే సందేహమే.. కానీ ఏనుగేమిటయ్యా?
అవధీః-- ఏనుగు ముందు మరో అక్షరం వేసాను.. చూడు- ని-అని! అంటే ఏంటి? సంస్కృతంలో ఆలోచించేయటమే..
స్వధీః-- ఏనుగుపేర్లా? సంస్కృతంలోనా? (తనలో తనుగా) దన్తీ దన్తావలో హస్తీ ద్విరదోఽనేకపో ద్విపః,
మతఙ్గజో గజో నాగః కుఞ్జరో వారణః కరీ, ఇభః స్తమ్బేరభః పద్మీ యూథనాథస్తు యూథపః (ఆలోచిస్తూ) అమరకోశమంతా ఇవే పదాలే.. వీటిలో ఏదై ఉంటుందబ్బా.. నిఏనుగు.. అంటే.. నికరీ, నిహస్తీ.. ఉఁహుఁ.. నివారణ.. ఆ!! నివారణ.. అంటే- సందేహనివారణ అన్మాట..! అబ్బో.. అదిరిందండి.. ఆహా, ఓహో, ఏమి మేధావులండి మీరు..
అవధీః-- (కాస్త కుదుటపడి) సరే సరే- ఊరికే పనిలేనివాడిలా నీతో పొగిడించుకోవటానికి రప్పించుకోలేదు. కాస్త నువ్వూ సొంతంగా ఏదైనా ఆలోచిస్తూండు. ఎప్పుడైనా ఏదైనా ఆలోచనలొస్తే నాతో చెప్పు.. నేనో పరిశోధనపత్రం వ్రాసుకుంటాను.. సరేనా? వచ్చాక కలువు..
స్వధీః-- అట్లాగేనండయ్యా.. మీ మాటలే కాదు, మీ సలహా కూడా కంపేనయ్యా ..
అవధీః-- (ఉలికిపడి) కంపేమిటోయ్?
స్వధీః-- అదేనయ్యా- కంప్ ధాతువు- అదిరింది అని..
అవధీః-- (గొప్పగా) అయితే సరే- ప్రస్తుతానికి ఇదే నీ గురుదక్షిణగా భావిస్తాను.. శుభమస్తు..
స్వధీః-- నమస్కారమయ్యా..
అవధీః-- శుభం భూయాత్..
స్వధీః-- (నమస్కారాలు చెప్తూ ఆనందంగా వెళిపోయాడు)
No comments:
Post a Comment