Sunday, 3 August 2025

భాష

 

భాష

రచన-సంకా ఉషారాణీ 

          భాష ప్రాథమికంగ మనుషులు పరస్పరం భావవినిమయం చేసుకునేందుకు ఉపయోగపడే సాధనం. భాషలో ధ్వనులు శబ్దాలుగా, శబ్దాలు పదాలుగా, పదాలు వాక్యాలుగా ఏర్పడి వక్త ఆశయాన్ని శ్రోతకు తెలియ చేస్తాయి. ధ్వనుల సముదాయాలు భాషా వ్యవస్థను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఒక అర్థాన్ని ఇవ్వటానికి సమూహంగ ఏర్పడిన ఒక ధ్వని సముదాయాన్ని పదం లేక శబ్దం అంటాము. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సంకేతితార్థం ఉంటుంది. అంటే అది ఒకానొక వస్తువును లేదా అర్థాన్ని సూచిస్తుంది. ఒక్కొక్కసారి ఒకే పదం ఒకదానికన్నా ఎక్కువ అర్థాలను సూచించగలదు. ఒక అర్థాన్ని చెప్పటానికి ఒకటికన్నా ఎక్కువ పదాలూ ఉండవచ్చు. కానీ ఏదో ఒక ధ్వనుల సముదాయం పదం కానేరదు. అర్థవంతమైన ధ్వనులే శబ్దాలుగా ఏర్పడి ఉండి మన పనులకు తోడ్పడుతూ ఉంటాయి.

          పదం అర్థం పరస్పరం విడదీయలేనివి. వీటి మధ్య సంబంధం వంటిదే పార్వతీపరమేశ్వరుల మధ్య అనుబంధం అని కాళిదాసు "వాగర్థ ప్రతిపత్తయే వాగర్థావివ సంపృక్తౌ పార్వతీపరమేశ్వరౌ వందే-" అంటాడు.

          అయితే ఈ పదం ఈ అర్థాన్ని ఇవ్వాలి అనే వ్యవస్థ ఎవరు ఏర్పరిచారు అంటే దీనికి సమాధానంగా రకరకాల సిద్ధాంతాలు బయలుదేరాయి. కానీ భారతీయులు ఇది అనాదిగా ఏర్పడిన వ్యవస్థగా గుర్తించారు. పదమూ -అర్థమూ- ఈ రెండిటి మధ్య ఉన్న ఒక సంబంధము, దీనినే శక్తి అంటారు- ఈ మూడూ అనాదిగా ఏర్పడినవే. కనక మనిషి ఎప్పటినుండి ఉన్నాడో భాషా అంతే పాతది. అంతే కొత్తది కూడా.

          వాక్కును వేదం వాగ్దేవతగా కొలిచింది. భాషను స్త్రీమూర్తి అయిన సరస్వతిగా భావిస్తారు మనవారు. పరా, పశ్యన్తీ, మధ్యమా, వైఖరీ అని వాక్కుకు నాలుగు రూపాలు చెప్పారు. అందులో పరారూపాన్ని ఋషులు మునులు మాత్రం దర్శించగలరని, పశ్యన్తీ రూపం ఎంతో ప్రయత్నిస్తే మనకు అంతర్గోచరం అవుతుందని, మనలో భావంగ కదలే భాష మధ్యమా రూపమనీ, మనం ప్రయోగించే ధ్వని రూపమైన భాషే వైఖరీ అనీ చెప్తారు. ‘నీ వైఖరి నాకేం నచ్చలేదయ్యా..’ అనే మాట తెలుగునాట వినిపిస్తుంది. అది మనిషి స్వభావమో, వ్యవహారమేమో అని అనుకుంటాం కానీ కాదు. అది భాషను తెలియ చెప్పే పదమే.

 

భాష- బోధ

 

          పుట్టిన ప్రతి శిశువు పెరుగుతున్నకొద్దీ, చిన్నచిన్న పదాలతో మొదలు పెట్టి వినికిడి మీద నెమ్మదిగా భాషను నేర్చుకుంటుంది. ప్రయోగం భాష నేర్చుకునేందుకు కావాల్సిన అతి ముఖ్యమైన ఆవశ్యకత. మనిషికి భాష ఎట్ల వస్తుందో చెప్తూ శాస్త్రంలో ప్రయోజక వృద్ధ ప్రయోజ్య వృద్ధ సన్నివేశం వివరింపబడింది. ఒక పెద్దమనిషి ఇంకొకనితో "ఒరే, కుండ తీసుకురా" అంటాడు. అది విన్న వ్యక్తి వెంటనే వెళ్ళి ఒక కుండ తెస్తాడు. అది చూసిన పిల్లవాడు అతడు తెచ్చిన వస్తువును కుండ అంటారని తెలుసుకుంటాడు. తరువాత ఆ వ్యక్తి మళ్ళీ "ఒరే, కుండ పెట్టేసి గుర్రాన్ని తీసుకురా" అంటే అదే చేస్తాడు ఆ ఆదేశం పొందిన వాడు. ఇక్కడ ఆదేశం ఇచ్చినవాడు ప్రయోజక వృద్ధుడు. దానిని అమలు చేసినవాడు ప్రయోజ్య వృద్ధుడు. ఈ వ్యవహారం అంతా చూస్తూన్న పిల్లవాడు ఆ తెచ్చిన వస్తువిశేషాన్ని గుర్రం అంటారని, ‘తీసుకురావటం’ అంటే ‘ఇక్కడకు తేవటం’ అనే చర్యకు మాటరూపమని, తత్సంబంధిత తదితర జ్ఞానాన్ని పొందుతున్నాడు. అటువంటి ఎన్నో వాక్యాలు, వాటి తాలూకు చర్యలను చూసి చూసి క్రమంగ పిల్లవాడు భాషను నేర్చుకుంటాడు. అది భాషాబోధకు సంబంధించిన భారతీయ సిద్ధాంతం.

 

మాతృభాష

 

          ప్రతి మనిషికి తొలి గురువు తల్లి. తల్లి ఒడిని మొదటి బడి అన్నారు. ఏ పనులనైనా, పద్ధతులనైనా తల్లి వద్దే శిక్షణ పొందుతుంది శిశువు. అట్లగే భాష కూడా. తల్లికి బాగా దగ్గరగా ఉండటం వల్ల ఆమె ఏ భాష మాట్లాడితే పిల్లవాడు అదే భాషను పట్టుకుంటాడు. అందుకే మాతృభాష అన్నారు కానీ పితృ భాష అనలేదు. అట్లని తండ్రి ప్రభావం పడదని కాదు. కానీ ప్రాథమికంగ ఎక్కువగా పడేది తల్లి ప్రభావమే. తల్లి మీద ఉండే అభిమానమే తల్లి చేసే ప్రతీ పని మీద, మాట్లాడే ప్రతీ పలుకు మీదా పిల్లవాడి దృష్టి వెళ్ళేటట్టు చేస్తుంది.

          మాతృభాషా ప్రాతిపదికనే మనము ఇతర భాషలను నేర్చుకుంటాము. కనక ఒకటి గట్టిగ పట్టుబడితే తరువాత వాటికి పునాది ఏర్పడుతుంది. మాతృభాష అంటే మనకు చాలా అభిమానం ఉంటుంది. ఒక్కొక్కసారి అది కొందరిలో దురభిమానంగ మారుతుంది కూడా. కానీ ఇతర భాషలను చులకన చేసేంతగా మాతృభాషాభిమానం అవతలవారికి బాధాకరమౌతుంది.

 

భాషా వైవిధ్యానికి ప్రాతిపదికలు-

 

          అన్ని సమాజాలకూ భాష అనేది అనివార్యంగా ఒకటి ఉన్నా, అది సార్వత్రికంగ ఒక్కటే ఉండదు. అందులో ఎన్నో వైవిధ్యాలు ఉంటాయి. ఉదాహరణకు లోకంలోని వేనవేల భాషలలో తెలుగు భాష ఒకటి. నిజంగా ఒకటేనా? ప్రాంతాన్ని బట్టి మళ్ళీ అందులో ఎన్నో యాసలు ఉన్నాయి. ఒకే మాండలికంలో కూడా వక్తను బట్టి మార్పులున్నాయి. మాట్లాడే భాషవేరు, వ్రాసే భాషవేరు. అట్లగే వ్యక్తి విద్యాస్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి, దేశకాలాలను బట్టి, వృత్తిని బట్టి, ఉద్దేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వేర్వేరుగా భాష పరిణమిస్తుంది.

          ఒక మనిషి తన దుస్తులతో, వేషంతో, నడవడితో కూడా మోసం చేయగలడు కానీ నోటివెంట మాట వెలువడిన మరుక్షణం మనం వీరు ఫలానా ప్రాంతం వారు, లేదా ఫలానా ఆర్థిక లేదా విద్యాస్థాయి కలిగినవారు అని చెప్పగలుగుతాము. సామాజిక స్థాయి కూడా భాషను నిర్దేశిస్తుంది. సాంస్కృతికంగ ఉన్నతస్థాయి వారి అంత భాషా పాటవం పదసౌష్టవం, వ్యంగ్యం నిమ్నస్థాయి వారి తీరులో కనిపించదు. విద్యాహీనులలో ఉండే మాండలీక నుడికార సంపద, పద వైవిధ్యం విద్యాధికులలో కానరాదు.

 

భావాన్ని బట్టి భాష-

 

          భావాన్ని తెలియపరిచేందుకే భాష ఉన్నా ఒక్కొక్కసారి అది వక్త ఆశయాన్ని పూర్తిగా తేట పరిచేందుకు సరిపోదు. చాలా తక్కువ పడుతుంది. ఒకానొక భావాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని, ఆశ్చర్యాన్ని, వ్యక్తపరచాలని ప్రయత్నించి వక్త విఫలుడవుతుండటం తరుచు మన అనుభవానికి వస్తుంటుంది. కోపం ఎక్కువైనా, బాధ పెరిగినా ‘ముందు నాకసలు నోట మాటే రాలేదు’ అంటూండటం వింటాం. లేదా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తి గొప్పకోసం గొప్పతనం చాటుకోవటం కోసం, ఇతరుల ముందు తను గొప్ప సంస్కారవంతంగా ప్రవర్తించినా ఆవేశం, కోపంతో ఉన్నప్పుడు మటుకు తన సహజమైన భాష బయటకు వస్తుంది.

          తెనాలి రామకృష్ణుని కథలో కూడా ఇదే విధంగా సమస్య వస్తుంది. బహుభాషా కోవిదుడైన ఒకతను తన మాతృభాష ఏదో చెప్పమని సభలో సవాలు చేస్తాడు. అతను ఏ భాషకు చెందినవాడో ఎవ్వరూ ఎంత పరీక్షించినా తెలుసుకోలేకపోతారు. అది తెలుసుకోటనికి రామలింగడు అతని కాలు తొక్కినప్పుడు వెంటనే తన మాతృభాషలో అప్రయత్నంగా అతడిని తిడుతాడు. మనిషి బాధలో, దుఃఖంలో తన మాతృభాషను మరిచిపోడు అని దీనివల్ల నిరూపించబడింది. ఆ విధంగ భావస్థాయిని బట్టి భాష ఉంటుంది.

 

శిక్షణను బట్టి- శిష్ట-గ్రామ్య భాష -

 

          భాష వక్త చదువును బట్టి కూడా మారుతుంది. చదువుకున్న వారి భాషకు నిరక్షరాస్యుల భాషకు తేడా ఉంటుంది. పండితుల భాష పామరుల భాషలో ఎంతో అంతరం ఉంటుంది. పండితులు ప్రయోగించే భాషలో పదసంపద, భావాల సొగసు ఉంటే, పామరుల భాషలో నుడికారం సజీవంగ ఉంటుంది. జానపదుల భాషలో యాస ఉంటుంది. శిష్టుల వ్యవహారం, గ్రామ్య వ్యవహారం అని వారి నడవళ్ళలో ఎంత తేడా ఉంటుందో భాషలో అంతే తేడా ఉంటుంది. స్త్రీపురుషుల భాషలో కూడా తేడా కనిపిస్తుంది.

          ఏ వర్గం వారైనా, ఏ సామాజికస్థాయి వారైనా మంచి శిక్షణ పొందితే భాష తప్పక మారుతుంది. ’మైఫేయిర్ లేడీ’ అనే ఆంగ్ల చిత్రంలో జార్జ్ బెర్నార్డ్ షా ఈ విషయం మీదే చేసిన ప్రయోగాన్ని సమర్థవంతంగా చూపుతాడు. ఒక పూల వ్యాపారి అయిన అనాగరిక అమ్మాయిని ఆరు నెలలపాటు చక్కని నేర్పుతో శిక్షణను ఇచ్చి పెద్ద రాజ్యానికి రాజకుమారి అని సమాజ పెద్దలందరినీ నమ్మేటట్టు చేస్తాడు ఒక భాషావేత్త.

          దూషణ భూషణలకు వేర్వేరు భాష ఉంటుంది. సత్కార పత్రాలు, సన్మానపత్రాల భాష వ్యక్తి గురించిన పొగడ్తలతో, దీర్ఘ సమాసాలతో, కొంత క్లిష్టత సంతరించుకుని ఉంటుంది. ఎవరినైనా తిట్టేటప్పుడు మాత్రం ఎక్కువగా గ్రామ్య లేదా అశిష్ట పదాలు సమాస రహితంగ ప్రయోగిస్తారు. వాక్యాలు కూడా చిన్నవిగా ఉంటాయి.

 

సందర్భాన్ని బట్టి-

 

          పెద్దల వద్ద మాట్లాడే భాష, స్నేహితులతో మాట్లాడేభాష, పనివారితో ప్రయోగించే పదాలలో చాలా తేడా ఉంటుంది. కార్యాలయంలో తోటి వారితో స్నేహితులలా ఉంటే, పై అధికారితో, విశ్వవిద్యాలయం ఆచార్యులతో మాట్లాడేటప్పుడు ఎంతో అణకువగా ఎంచి తూచి జాగ్రత్తగ భాష వస్తుంది. అదే పేరంటాలలో, నలుగురు కలిసి సంబరం చేసుకునే వేళలలో వ్యక్తి సంబంధాన్ని బట్టి, వ్యక్తి చనువును బట్టి హాస్య ప్రధానంగా, వ్యంగంగా, చిలిపిగా, వక్ర రీతిగా ఉంటుంది. ఆయా విషయాలలో ఉన్న తేడా వల్ల పదజాలం కూడా మారుతుంది. ఎత్తిపొడవటాలు, హేళనలు వంటి సందర్భాలలో, అందులోనూ చిన్నాపెద్ద, ధనాధిక-ధనహీన తారతమ్యాలతో భాషాపటిమ గమనించతగినదై ఉంటుంది.

          ఒక ప్రఖ్యాత మంత్రి అన్న వాక్యం ’బాయిలో తేల్ పడ్డది’ అని వినంగనే ఏమీ అర్థంకాదు. వారు ఆ సందర్భంలో నూనె భావుల గురించి మాట్లాడుతున్నారని, తేల్ అనేది నూనెకు హిందీవారి పదం అనీ, ఆ భావిలో అంతవరకు కనిపించని నూనె అప్పుడే కనిపించిందనీ తెలిస్తే తప్ప ఆయన ఏమన్నాడో ఎవ్వరికీ అర్థం అయ్యే అవకాశం లేదు.

 

దేశ-కాలాలను బట్టి-

 

          పాతకాలం నాటి భాష ఆధునిక భాషకన్నా ఎంతో వేరుగా ఉండేది. కొన్ని పదాల వాడకం కొన్ని నుడికారాల సొబగు ఈనాడు పూర్తిగా పోవటం, ఆ స్థానే కొత్త పదాలు, ఇతర భాషాపదాలు వచ్చి చేరటం గమనిస్తుంటాము. కూర్పు, పటిష్టతలలో మార్పు కనిపిస్తుంది. పదాలను కలిపి పలికే తీరు, సంధి నియమాలు పాటించినందువల్ల విస్తారత, ఈనాటి విడిపదాలు, పొడి అక్షరాలతో పోలిస్తే చాలా క్లిష్టంగ అనిపిస్తుంది. క్రియారూపాలు మారాయి. గ్రాంథికం, శాసన భాష పోయి వ్యావహారికం వచ్చింది.

          ఇతర ప్రాంతాలలో ఎక్కువ కాలం నివసించినప్పుడు ఆ ప్రాంతాన్ని బట్టి భాషలో మార్పు వస్తుంది. ఉత్తర భారతీయుల మధ్య ఎక్కువగా గడిపిన ఒక చిన్న పాప -"నాన్నా, నువ్వెందుకు పడుతున్నావు..?" అని అడిగింది. నేనెక్కడ పడుతున్నానమ్మా- చక్కగా చదువుకుంటుంటే? అని అన్నాడా తండ్రి. ’అదే! దేనికి పడుతున్నావు? పరీక్ష ఉందా?" అంది ఆ పాప. ఇక్కడ పడటం అంటే హీందీ భాషలోని "పఢ్నా" అనే క్రియాపదం అని వేరే చెప్పనక్కర లేదేమో.

 

వృత్తిని బట్టి-

 

          మనిషి అవసరాలను బట్టి ఆయా వృత్తులు ఏర్పడ్డాయి. కళాకారుల భాష, న్యాయవాదుల భాష, వైద్యుల భాష, వైజ్ఞానికుల భాష, సాహితీవేత్తల మాట పరస్పరం ఎంతో అంతరం కలిగినవి. అవి ఇతరులకు అర్థం కాని పారిభాషిక పదాలై ఉంటాయి. దీనిని ఆంగ్లంలో "రెజిస్టర్" అంటారు. ఒక్కో వృత్తికి పనిముట్లు, పనిపద్ధతిలో తేడా ఉన్నట్టే వడ్రంగి, నేత పనివారి పదజాలం, రైతుల పదవాడకం, వ్యాపారస్తుల భాష, వాహన చాలకుల భాష అన్నిట్లో భిన్నత సుస్పష్టంగ కనిపిస్తుంది. వ్యాపారస్తుల భాష ఏదో ఒకటి ఉంటుందట. మనం కొనుగోలు కోసం దుకాణానికి పోయినప్పుడు పనివారు మన ఎదుటే వారి యజమానితో ఆ భాషలో మాట్లాడి మనతో జరిగే బేరం కుదుర్చాలా వదిలేయాలా నిర్ణయించుకుంటుంటారని నా అనుభవంలో విషయం. వారిని అడిగితే అది గుజరాతీనో మరాఠీనో కాదు, వ్యాపార భాష అని చెప్పారు కూడా. నేర్పమనంటే నేర్పరు - అది వేరే మాట.

 

దూరాన్ని బట్టి-

 

          మాట్లాడే సమయంలో శ్రోత-వక్త ఒకేచోట ప్రత్యక్షంలో ఉన్నప్పుడు కొన్ని సహాయకారులైన చర్యలుంటాయి. ముఖకవళికలు, చేతులు తిప్పటం, శరీర కదలికలు వంటివి. అవి వక్తభావాన్ని శ్రోతకు వివిధ స్థాయుల్లో అందించటానికి సహాయపడతాయి. టెలీఫోనులో ఈ సౌకర్యం ఉండదు. కనక వక్త గొంతులో మార్పులు స్వరస్థాయి, ఆవేశం బట్టి, వేగాన్ని బట్టి శ్రోత ఊహించుకుంటూ సంభాషణ సాగించాలి. కెమేరాల ముందు మాట్లాడేవారూ, రేడియోలలో చెప్పేవారూ ఊహిత శ్రోతలతో మాట్లాడాల్సి ఉంటుంది. లిఖితభాషలో రచయిత, పఠితలు దేశకాలాల భూమికలో దూరాన్ని కలిగి ఉంటారు. ఒకరికొకరు తెలియరు- ముఖ్యంగా పుస్తకాలు వ్రాసేటప్పుడు. అదే ఉత్తరాలు వ్రాసుకొనేటప్పుడు మాత్రం ఒకానొక పఠితను ఉద్దేశించి రాయటం సాగుతుంది. కనక వారి అవగాహన స్థాయిని బట్టి వ్రాసే వ్యక్తి భాష ఉంటుంది.

 

కావ్యభాష, సాధారణ భాష-

 

          వ్యవహార భాషకన్నా కావ్యభాష ఎంతో వేరు. కావ్యంలో ఉన్న అలంకారాలు, సుందరమైన పదాలు, సమాసాలు వ్యవహారంలో కనిపించవు. సాధారణ భాషలో లేని గుబాళింపు, అందం, కావ్యబాషలో ఉంటాయి. రసనిష్పత్తికి అవసరమైన విధంగా అయా కవుల కల్పనకు అనుగుణంగా పదాలు పడతాయి. పద్యభాషలో లయకు కూడా పెద్ద పీట ఉంది. అనుప్రాసాదికాలు విరివిగా వాడతారు. ఎంత వ్యంగ్యంగ, పరోక్షంగ అర్థాన్ని స్ఫురింపచేస్తే భావంలో అంత అందం వస్తుంది. నర్మగర్భంగ, ఆయా సందర్భానికి సంబద్ధమైన పదం ఏదీ సూటిగా వాడకుండా పఠితకు మాత్రం స్ఫురించే విధంగా కావ్యభాష ఉంటుంది.

          కానీ అది ఎంతో కృత్రిమమైన భాష అని అంటారు. జనసామాన్యంలోని, మాండలికతలోని, నిత్య వ్యవహారంలోని సహజత్వం దానిలో ఉండవు. తెలుగు కవిత్వంలో ప్రాసకు పెద్దపీట ఉంది. హాస్యానికి చెప్పుకుంటే- ఒక జంధ్యాల సినిమాలో ఒక కవయిత్రి పాత్ర (శ్రీలక్ష్మి) పత్రికా సంపాదకునితో ఇట్లా అంటుంది- ‘నేను రచయిత్రిని కాదన్న వాణ్ణి రాయెత్తి కొడతాను.. నేను కవయిత్రిని కాదన్న వాణ్ణి కర్రెత్తి కొడతాను..’ ఈ మధ్య వ్యావహారిక భాషలో కవిత్వం రావటం వల్ల ఆ ప్రాసాలంకారాల గొడవ తప్పిందని చాలామంది సంతోషపడ్డారు. కానీ కవిత్వం అంటేనే అలంకారాలు. సౌందర్యమలంకారః అని సంప్రదాయికులు వాదిస్తారు. చాలా మంది పాత పద్యాలలో ఉండే సొగసు ఆధునిక కృతులలో కరువైందని వాపోతుంటారు. అర్థంకావటం మాట పక్కన పెడితే పరోక్షంగ విషయాన్ని చెప్పటంలోని సొగసు నేరుగ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలో లేదని దాదాపు అంతా ఒప్పుకుంటారు.

 

ఉద్దేశాన్ని బట్టి-

 

          ఆ విధంగ చూస్తే ఇది భాషలో మరొక కోణం అవుతుంది. సూటిగా విషయాన్ని చెప్పే సందర్భాలకూ, కాస్త తెరవేసి కనీకనపడకుండా అర్థాన్ని తెలియచెప్పే సందర్భాలలో భాషకూ కూడా తేడా కనిపిస్తుంది. వక్త కేవలం శ్రోతకు మాత్రం అసలు విషయం అర్థమయ్యే విధంగా అక్కడే ఉన్న ఇతరులకు మాత్రం మరో విధంగ తెలిసేటట్టు మాట్లాడేటప్పుడు కూడా పదాల వాడకం మారుతుంది. ఒక్కోసారి ఇటువంటి చోట్ల కోడ్ భాష వాడుతుంటారు.

          సీ.ఐ.డీ రహస్యాలు, డిటెక్టివ్ పరిశోధనలకు ఇది వృత్తిపరంగ అవసరమైన నేర్పు.

          చిన్నపిల్లలను ఉద్దేశించినప్పుడు భారీ పదాలను వాడలేము. పండితుల మధ్య కాస్తైనా ధ్వని, ఆలంకారికం లేని భాష మరీ పేలవంగ ఉంటుంది. ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు మాట్లాడే భాష కేవలం ఒక విషయాన్ని అంటిపెట్టుకుని దాని వివిధ కోణాలను స్పృశిస్తూ సాగుతుంది కనక నైశిత్యం అందులో అంతర్భాగంగా ఉంటుంది. అక్కడ ఎంత టూకీగా మన భావనను తెలియచేస్తే అవతలివారికి అంత సౌకర్యంగ ఉంటుంది. తీరుతెన్నుల్లో కొంత మార్పు సాధారణంగా గ్రహించ గలిగినదే.

 

ప్రతిభను బట్టి-

 

          కొందరు మాట్లాడుతుంటే ఎప్పటికీ వింటుండిపోవాలి అనిపిస్తుంది. కొందరు మాట్లాడుతుంటే ఎప్పుడు ఆపేస్తారా అని ఎదురుచూస్తాము. మాటల్లో పదాలు మాత్రమే ఉండవు, అర్థం కూడా ఉంటుంది. ఒకే అర్థాన్ని వేర్వేరు పదాలు వాడి చెప్పచ్చు. ఒకే పదం లేక వాక్యాన్ని వాడి వేర్వేరు అర్థాలు స్ఫురింపచేయవచ్చు. అది ఆయా వక్తల ప్రతిభను బట్టి ఉంటుంది. సందర్భానికి తగినట్టు శ్రోతలకు ఆనందం, ఆశ్చర్యం కలిగించే విధంగా మాట్లాడటం ఒక కళ. ఆ కళతో అవతలవారు మంత్ర ముగ్ధులవుతుంటారు. ఒక్కొక్కసారి అది కొందరు వక్తల సొత్తేమో అనిపిస్తుంది. మంచి వక్తల భాష అట్లా అనిపింపచేస్తుంది.

          కొన్ని సందర్భాలలో పెద్దల ముందు కొన్ని అనుచిత ప్రయోగాలు చేయలేము. కొందరు ఎంత వేదననైనా మనస్సులో దాచుకుని బయటకు ఆయా సందర్భాలకు తగినట్టు హుందాగా ప్రవర్తిస్తారు. ఇదంతా వారి భాషలో నేర్పరితనం వల్లే సాధ్యపడుతుంది.

 

విస్తరణ- సంక్షిప్తత-

 

          ఏదైనా విషయాన్ని వివరించేందుకు వాడే భాషలో పునశ్చరణ ఎక్కువగా కనిపిస్తుంది. అదే మామూలు సందర్భాలలో ఒక్కసారి చెప్పి ఊరుకుంటాము. ఉపాధ్యాయులు తరగతి గదులలో పాఠం చెప్పే భాషలో మళ్ళీ మళ్ళీ వేర్వేరు వాక్యాలలో ఒకే భావాన్ని విద్యార్థులకు చెప్పవలసి ఉంటుంది. కనక విషయం ఎరిగిన వారికి అది చిరాకును కలిగిస్తుంది. ఒక వేదిక మీద వక్త మాట్లాడే భాష ఆయా సందర్భపు శ్రోతలను బట్టి నిర్ణయింపబడుతుంది.

          సామెతలలో భాష అతి సంక్షిప్తతకు ఉదాహరణ. భావగీతాలలో భావప్రధానంగానూ, మానసిక ఉద్వేగాలను సూచించేదిగానూ, ఉపమానాలతో, రూపకాలతో నిండి ఆహ్లాదాన్ని కలిగించేదిగానూ ఉంటుంది. అందులో ఎంత వివరించినా అంతా ధ్వనింప చేయటమో, లేక పరోక్షంగ తెలియ చేయటమో ఉంటుందే కానీ నేరుగ చెప్తూ పోతే అది ఓ రిపోర్టులా పొడిగా ఉంటుంది. పొడుపుకథల భాష కూడ ఒకలాంటి కోడ్ భాషే. ఆ పదాలు భావాన్ని చక్కగా కప్పేసి ఉంచుతాయి. అందుకు రూపకాది ప్రక్రియలను వాడతారు. నాటకాలలో పాత్రోచితమైన భాష ఉంటుంది. అది సన్నివేశ ప్రధానంగ సాగేది కనక భాష కొంత సూటిగా సాగిపోతూ ఉంటుంది. పద్యాలలో భాష లయతో కూడినదయి అందంగ స్ఫురిస్తుంది. కథ చెప్పే భాషలో కథనం ప్రధానంగ కలిగి వర్ణనాదులకు తావుండదు. వడివడిగా సంఘటనలు సాగేందుకు అనుకూలంగ ఉండే భాష అక్కడ ఆ సందర్భంలో అందంగ ఉంటుంది.

 

భాషకు ఉండే శక్తి -

 

          ఇక భాషకు ఉండే శక్తిని పరిశీలిద్దాము. జీవనం, మనిషితో మనిషి వ్యవహారం భాష లేకుండా ఊహించుకుంటే దాని శక్తి తెలుస్తుంది. పొద్దున లేస్తే అవతలవాడితో మనకు పని లేకుండా గడవదు. ఏ పనీ భాష లేకుండా గడవదు. మనిషి ఎంత ప్రాచీనుడో భాష అంత ప్రాచీనమైనది.

          భాష ఎంత శక్తివంతమైందో బహుశ భారతీయులకన్నా గొప్పగా తెలిసిన వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. భాషలో ఉండే ధ్వనులు ఒక శక్తిని కలిగి ఉన్నాయని వారు గ్రహించారు. ఆ శక్తి వల్లే ఒక ప్రయోజనాన్ని కోరి ఒకానొక కూర్పు కలిగిన అక్షరాలతో మంత్రాన్ని పఠించారు. దాని నిరంతంర జపం, దానితో దేవతారాధనం, యజ్ఞం మొదలైన వివిధ ప్రయోగాలు చేశారు. వాటి విభిన్న కలయికలతో యాగాదులు డిజైన్ చేసి ఆచరించి సత్ఫలితాలు సాధించారు. ఇది మనకు సాంప్రదాయికంగా సిద్ధించిన జ్ఞానసంపద. సంస్కృతం ఉచ్చరించటం వల్ల మెదడులోని కొన్ని కణాలు ప్రేరణ చెంది ఆ శబ్దాలు జ్ఞాపక శక్తిని, ధారణశక్తినీ పెంపొందిస్తాయని పరిశోధనలలో తేలింది (ది సంస్కృత్ ఎఫెక్ట్). వేదంలోని మంత్రాలను స్వరపూర్వకంగ ఉచ్చరించటం వల్ల ఫలితాలు సిద్ధించటం వెనక కూడా ఈ ధ్వనులకు ఉండే అదృశ్య శక్తే కారణం.

 

భాష నుడికారం-

 

          భావాలను బట్టి భాష ఉన్నట్టే భాషను బట్టి భావాలూ ఉంటాయి. కొన్ని భావాలు కొన్ని భాషలలో వ్యక్తపరచటమే సాధ్యపడుతుంది. ముఖ్యంగ వివిధ భాషల సామెతలను గమనిస్తే తెలుస్తుంది. భాష కేవలం కొన్ని పదాల సమాహారం కాదు. ఆయా సంస్కృతుల సజీవ ప్రతిబింబిత రూపం.

          నుడికారము ఆయా భాషలకే ప్రత్యేకము. ఒక భావవ్యక్తీకరణం నుడికారమా కాదా తెలుసుకోవాలంటే దాన్ని అనువాదం చేసే ప్రయత్నం చేయాలి. అది అనువాదంలో ఇతర భాషలకు అంత సులువుగా యథాతథంగ చేర్చలేనిది అయినప్పుడు నుడికారమని తెలిసిపోతుంది. దానికి సమాంతరమైన ప్రయోగం ఆ భాషలో ఉంటే సరే! లేదంటే పదానికి పదంగ అనువదించటం వల్ల భాష కృత్రిమంగ తయారవుతుంది. ఉదాహరణకు -తెలుగులో ‘వాడు వచ్చీ రాంగానే సంతోషంతో కేకలు వేశాడు’ అంటాము. ‘ఆమె ఎంత వద్దన్నా ఆ మాట అననే అనింది’ అంటాము. ఈ ‘వచ్చీరాగానే’ ‘అననే అనింది’ వంటివి ఎట్లా అనువదించగలం? కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూశాను అనే మాట హిందీలో ఆంగ్లంలో ఎప్పటికీ యథాతథం అనువదించలేనిది.

          ఆంగ్లంలో ఒక ఉదాహరణ- "పే ద ఫీస్" అంటాం. అంటే శుల్కం చెల్లించుట. దానినే తెలుగులో "ఫీస్ కట్టటం" అంటాం. హిందీలో "శుల్క్ భర్‍నా" అంటాం. అంటే మన భాషలో శుల్కాన్ని నింపటం అని. కానీ భర్‍నా అనే ధాతువును తెలుగులో తీసుకంటే భరించటం అనే అర్థంలో ఉంటుంది. ఇట్ల ఎన్నో వైవిధ్యాలు.

          ఇతర భాషలలో కొత్తగా వ్యవహరిస్తున్న వారిని చూసి ఈ ఇబ్బందులు కొన్ని మనం గమనించవచ్చు. తమిళులు తెలుగు మాట్లాడేటప్పుడు ఎక్కువగా "వచ్చి ఉన్నాము", "చేసి ఉన్నాడు" అంటూంటారు. వారి భాషలో ప్రతీ క్రియాపదం అంతే. దాని అసమాపక రూపానికి ఉండు అనే క్రియను జోడించి సందర్భాన్ని బట్టి ఉన్నాడు, ఉన్నారు వంటివి యోజిస్తే చాలు. అది వారి భాష నుడికారానికి దగ్గరగా ఉన్నా, తెలుగులో "వచ్చాడు" "చేశాడు" అంటేనే సరిపోతుంది.

          అందుకే కేవలం వాక్యాలు వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడినంత మాత్రాన మంచి భాష వచ్చేసిందని సంబరపడలేము. ఈ తేడాలన్నీ తెలుసుకుని ప్రయోగించాలి.

 

భాష సంస్కృతి-

 

          భాష సంస్కృతి పరస్పరం విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. భారతీయ భాషల్లో కనిపించేటన్ని బాంధవ్య సూచక పదాలు మనకు ఆంగ్ల భాషలో కనిపించవు. ఆయా సంస్కృతుల ప్రభావం భాష మీద చాలా ఉంటుంది. కచ్చితంగ చెప్పాలంటే భాష సంస్కృతికి అద్దం పడుతుంది. వారివారి ఆచారాలు అలవాట్లు, వ్యవహారం తీరు- ఇవన్నీ భాష ద్వారానే తెలుస్తాయి. ఆంగ్లంలో ‘యూ’ అంటే మీరు కావచ్చు, నువ్వు కావచ్చు. మరాఠీలో ‘తుమ్’ అంటే మీరు అని అర్థం. అందుకే వారు హిందీ మాట్లాడేటప్పుడు పాపం మీరు అంటున్నామనుకుని భ్రమ పడి ఆప్ అనకుండ తుమ్ అంటారు. అది హిందీవారికి చాలా అవమానకరంగ అమర్యాదాకరంగ అనిపిస్తుంది. ఉర్దూ భాషలో చిన్న పిల్లలను కూడా ‘ఆప్’ అంటారు. మనం నమస్కారం అని చేతులు జోడిస్తాం. ఆంగ్లేయులు ‘హాయ్ హలో’ అని చేతులు కలుపుతారు. ముసల్మానులు ’అదాబ్ అర్జ్‍హై’ అని కుడి చేతి అరచేతిని తనవైపు పెట్టుకుని నుదుటి వరకూ ఎత్తి దించుతారు.

          ఇవన్నీ ఒకే భావాన్ని వ్యక్తపరిచినా వ్యవహారంలో తేడా ఉంటుంది. ఆంగ్లేయులలో చిన్నపిల్లలు కూడా ఎంతో పెద్దవారినైనా మిస్టర హడ్సన్, మిసెస్ డికెన్స్ ఇట్లాగే పేర్లు పెట్టి సంబోధిస్తారు. మనకు అది చాలా తప్పు. పెద్దవారిని అంకుల్, ఆంటీ అనో అత్తయ్యగారు, పిన్నిగారు అనో పలకరిస్తాము. లేదా సార్, మేడమ్ అని అంటాం. సమవయస్కులో సమహాదా వారో అయితేనే పేరు పెట్టి ‘గారు’ తగిలించి పిలుస్తాము.

          సంస్కృతీ సంప్రదాయాలలాగే భాష మన పెద్దలు మనకు ఇచ్చిన అమూల్యసంపద. ఒక అన్నమయ్య పదాల రూపంలో ఈనాటికీ జనాల నోళ్ళళో నానినా, పోతన ఈనాటికి జీవించి ఉన్నాడంటే ఆ భాష ద్వారానే. ఒక విశ్వనాథ వేయిపడగలలో తన పూర్వీకుల సమాజాన్ని మన కళ్ళకు కట్టించాడంటే అది భాష వల్లనే. తన సుకుమార భావాలలో తెలుగువారిని దేవులపల్లి ఓలలాడించిందీ, నిద్రాణంగ ఉన్న జాతిని ‘పదండి ముందుకు’ అంటూ శ్రీశ్రీ జాగృతం చేసిందీ ఈ భాష ద్వారానే!

          మంచి కవులు పండితులు సభలలో ఎంతో చమత్కారంగ మాట్లాడుతుంటారు. సాహిత్య అధ్యయనం చేస్తే అన్నింటికన్నా ముందు అందంగ మాట్లాడటం వస్తుంది.

 

మాటలు లేని భాష -

 

          భావవినిమయానికి భాషే అక్కరలేదు. సైగలతో కూడా చక్కగా మాట్లాడుకోవచ్చు. మూగవారు ఎంతో లోతైన మనోభావాలను కూడా తమ చేష్టలద్వారా అవతలవారికి ఎరుకపరచగల శక్తి కలిగి ఉంటారు. వారు పరస్పరం మాట్లాడుకోవటానికి చేతి సంజ్ఞలు ఉపయోగిస్తారు. అదే వారికి భాష. వాహనాల నియంత్రిత రాకపోకల కోసం పెట్టే ట్రాఫిక్ సిగ్నళ్ళు కూడా ఒక భాషే. ఇక్కడ పదంలోని ధ్వని సంకేతమైతే అక్కడ రంగు సంకేతం.

          అందమైన దృశ్యాన్ని లేదా చిత్రాన్ని చూసినప్పుడు మనలో ఎన్నో భావాలు కలుగుతాయి. అవి ఆయా కళల ప్రభావంతో మనలో ఉదయిస్తాయి. అంటే అవి కూడా మనకు ఏవో సందేశాలను ఇస్తున్నట్టే కదా! చక్కని వాద్య సంగీతం భాషకు అతీతమైన ఒక భావోద్వేగాన్ని మనలో జనింపచేస్తుంది. సంగీతాన్ని అందుకే విశ్వజనీనమైన ఒక భాషగా తీసుకున్నారు. ఆయా గాయకుల భావాలు ఏ భాషలోనైనా ఉండనీ, ఆయా రాగాల ప్రభావంతో వారి విషాద-ఉల్లాసాదులు శ్రోతకు ఒకానొక సంస్కారంతో బోధపడతాయి.

          మనుషుల మధ్య సంపర్కంలో కూడా భావాలు బలవత్తరమైతే భాష చాలనే చాలదు. అనుబంధాలు పటిష్టంగ, సమీపంగ ఉంటే మాటలు అనవసరం అంటారు. పరస్పరం ఘనిష్ట సంబంధం కలిగిన ఇద్దరు వ్యక్తులు- తల్లీ బిడ్డలు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు, మంచి స్నేహితులు, లేదా బంధువులు కావచ్చు- వారికి మాటలతో పని ఉండదు. కన్నతల్లికి తన పారాడే పసిపాప ఏడ్చే విధానంతోనే దాని అవసరం తెలిసిపోతుంది. స్నేహితులు, ప్రేమికులు కళ్ళ భాషతో కూడా పరస్పరం ఎదటివారి బాధ, సంతోషాల తీరుతెన్నులు తెలుసుకోగలరు. సమర్థుడైన గురువు తన ఉత్తమోత్తమ శిష్యునికి అనుగ్రహ దృష్టి మాత్రం చేత మాటలకు అందని జ్ఞానాన్ని కలిగించగలడు. చివరకు భగవంతునికీ భక్తునికీ మధ్య కూడా నిశ్శబ్ద భాష ఒకటి ఉంటుంది.

          మాట వెండి అయితే మౌనం బంగారం అని ఆంగ్ల సూక్తి. నా మౌనాన్ని అర్థం చేసుకోలేనిది నా మాటను ఏం అర్థం చేసుకుంటావు అంటారు. ఈ విధంగ భాషా పరిధి ఎంతో విస్తృతమయినదీ, ఎంతో పరిమితమయినదీ కూడా.

 

ఉపసంహారం

 

          కనక- కేవలం మన సంపర్కం కోసం మాత్రమే భాష ఉద్దేశింపబడలేదు. భాష ఒక సంస్కృతికి ప్రతీక. భాష ఒక నిరంతర ప్రవాహం. చైతన్యశీలి. భావవినిమయం అనేది భాషను వర్ణించటానికి ఏమాత్రం చాలని పదం. ఏదో కొత్త దేశానికో ప్రాంతానికో వెళ్ళినప్పుడు మొట్టమొదట మనం ఆ స్థానికులకు చెప్పాలని ప్రయత్నించేది భావవినిమయం స్థాయి భాష కావచ్చు. కానీ భాషకు ఇంకా లోతైన అర్థాలు, అవసరాలు (ప్రయోజనాలు) ఉపయోగాలు చాలా ఉన్నాయి.

          ఒక తెలుగు సినిమా వ్యక్తంచేసిన భావం ఇట్ల ఉంది- “తెలుగుభాష తల్లి లాంటిది. ఇరవైసంవత్సరాలే అవసరం ఉంటుంది. అదే ఆంగ్లభాష అయితే భార్యలాంటిది. కలకాలం జీవితాంతం తోడుంటుంది.” భార్య వచ్చాక తల్లిని వదిలివేసేవాడు ఏ కోవకు చెందినవాడై ఉంటాడో ప్రతీ సంస్కారవంతుడికీ తెలుసు. ఆ తల్లి ఇచ్చిన ప్రేమ, సేవ, త్యాగం ఆధారం చేసుకుని పెరిగి, పెద్దై ఆమెకు చేయూతనివ్వాల్సినవేళ చేతిని విడిచిపెట్టటం కృతఘ్నతే కాదు మహాపాపం కూడా. మాతృభాషకంటే మించిన వరం లోకంలో లేదంటే అతిశయోక్తి కాదు. అటువంటి మన విలువైన భాషాసంపదను మనమే కాపాడుకోవాలి. ఇతర సంపదలలాగే వృద్ధి చేసుకోవాలి కానీ చులకన చేసి హ్రాసం కానివ్వరాదు. దానికోసం ఏ ఉద్యమాలు అక్కరలేదు, ఏ ఇతర భాషలను తిట్టిపోయనవసరమూ లేదు. మన భాషలో, మన నుడికారాలసొబగులతో మనందరం పరస్పరం హాయిగా ఆనందంగ పదికాలాలు మాట్లాడుకంటే చాలు, ఆ తల్లి తుదిశ్వాస విడవకుండా ఉంటుంది.

          -------

 

 

No comments:

Post a Comment