Monday, 12 September 2016

ప్రార్థన - నవగ్రహ ప్రార్థన

మనమంతా ఏదో విధంగా ఏవో రకాల బాధలు ఎప్పుడూ పడుతూనే ఉంటాము. తెలిసీ తెలియక చేసుకొన్న ఏవో ఒక పుణ్యపాపాల ప్రభావాలను మనం నిత్యం అనుభవిస్తూ ఉంటాము. జ్యోతిషంలో నవగ్రహాలు వాటి ప్రభావాల గురించి విపులంగా చర్చించబడింది. చాలామంది సామాన్యంగా అనుకొన్నట్లు నవగ్రహాలు మనను వారికై వారు బాధించరు. వారు కేవలం మనం చేసిన కర్మల ఫలితాలను మనకు వేళకు అందిస్తుంటారు. అంతే.
      నిత్యం దైనందిన జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధలు చిన్న చిన్న ఉపాయాల వల్ల, ప్రార్థనల వల్ల హాయిగా పోగొట్టుకోవచ్చు. అటువంటి రెండు పద్యాలు- దాదాపు ఒకే అర్థం కలవి- ఇక్కడ ఇవ్వటమైనది. వీటిలో ఏదో ఒకటో లేక రెండూనో- రోజుకు ఒక్కసారి, ఉదయం పూజ వేళలో భక్తిగా చదివితే చాలు. తప్పక మనస్సులో, శరీరంలో, ఇంట్లో మంచి మార్పు వస్తుంది. ఇది స్వానుభవంతో చెప్తున్నమాట. శుభం భూయాత్.

॥ నవగ్రహప్రార్థన ॥
సూర్యః శౌర్యమథేందురింద్రపదవీం సన్మంగలం మంగలః
సద్బుద్ధిం చ బుధో గురుశ్చ గురుతాం శుక్రః శుభం శం శనిః ।
రాహుర్బాహుర్బలం కరోతు విజయం కేతుః కులస్యోన్నతిం
నిత్యం భూతికరా భవన్తు భవతాం సర్వేఽనుకూలా గ్రహాః ॥
      సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రపదవిని, మంగళుడు సన్మంగళాన్ని, బుధుడు సద్బుద్ధిని, గురువు గౌరవాన్ని, శుక్రుడు శుభాన్ని, శని మంచిని, రాహువు బాహుబలాన్ని, విజయాన్ని, కేతువు కుటుంబంలో ఉన్నతిని ఇచ్చుగాక. అందరు గ్రహాలు నిత్యం వైభవాన్ని ఇచ్చేవారై మీకు అనుకూలించుగాక.

ఆరోగ్యం ప్రదదాతు నో దినకరః చంద్రో యశో నిర్మలం
భూతిం భూమిసుతః సుధాంశు-తనయః ప్రజ్ఞాం గురుర్గౌరవం ।
కావ్యః కోమలవాగ్విలాసమతులం మందో ముదం సర్వదా
రాహుర్బాహు-బలం విరోధ-శమనం కేతుః కులస్యోన్నతిం ॥
      సూర్యుడు ఆరోగ్యాన్ని, చంద్రుడు నిర్మల యశస్సును, కుజుడు వైభవాన్ని, బుధుడు ప్రజ్ఞను, గురువు గౌరవాన్ని, శుక్రుడు మంచి వాక్పటిమను, శని ఆనందాన్ని, రాహువు బాహుబలాన్ని, విరోధుల నాశనాన్ని, కేతువు కుటుంబంలో ఉన్నతిని ఇచ్చుగాక.

Friday, 9 September 2016

ప్రార్థన - వాగీశాద్యాః సుమనసః



వాగీశాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే ।
యం నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననం ॥

వాగీశాద్యాః సుమనసః సర్వార్థానామ్ ఉపక్రమే యం నత్వా కృతకృత్యాః స్యుః తం గజాననం నమామి ॥

వాగీశాద్యాః = వాక్-దేవి కి భర్త బ్రహ్మదేవుడు
సుమనసః = దేవతలు
సర్వార్థానామ్ = అన్ని కార్యాలకు
ఉపక్రమే = ప్రారంభమందు
యం = ఎవరికైతే
నత్వా = నమస్కరించి
కృతకృత్యాః స్యుః = పనులు పూర్తి అయినవారుగా కాగలుగుతున్నారో
తం గజాననం = ఆ గజాననునికి
నమామి = నమస్కరిస్తున్నాను

బ్రహ్మాది దేవతలు అన్ని కార్యాలకు ప్రారంభంలో ఎవరికి నమస్కరించి పనులు పూర్తి చేసుకోగలుగుతున్నారో ఆ గజాననునికి నమస్కరిస్తున్నాను.

Tuesday, 6 September 2016

ప్రార్థన - ధ్యేయః సదా




ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ, నారాయణః సరసిజాసనసన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ, హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః ॥

సవితృ-మండల-మధ్యవర్తీ, నారాయణః సరసిజ-ఆసన-సన్నివిష్టః, కేయూరవాన్, మకర-కుండలవాన్, కిరీటీ, హారీ, హిరణ్మయ-వపుః, ధృత-శంఖ-చక్రః సదా ధ్యేయః ॥

సవితృ-మండల-మధ్యవర్తీ = సూర్యమండలమధ్యంలో ఉన్న
నారాయణః = నారాయణుడు
సరసిజ-ఆసన-సన్నివిష్టః = కమలాసనంలో కూర్చున్నవాడు
కేయూరవాన్ = కేయూరములు (భుజకీర్తులు) ధరించినవాడు
మకర-కుండలవాన్ = మొసలిఆకారం కల చెవుల దిద్దులు ధరించినవాడు
కిరీటీ = కిరీటం ధరించినవాడు
హారీ = అందమైనవాడు
హిరణ్మయ-వపుః = బంగారుమయమైన శరీరం కలవాడు
ధృత-శంఖ-చక్రః = శంఖచక్రాలు ధరించినవాడు
సదా ధ్యేయః = నిత్యం (మన చేత) ధ్యానించబడవలసినవాడు

సూర్యమండలమధ్యంలో ఉన్న, నారాయణుడు, కమలాసనంలో కూర్చున్నవాడు, కేయూరములు (భుజకీర్తులు) ధరించినవాడు, మొసలి ఆకారం కల చెవుల దిద్దులు ధరించినవాడు, కిరీటం ధరించినవాడు, అందమైనవాడు, బంగారుమయమైన శరీరం కలవాడు, శంఖచక్రాలు ధరించినవాడు (అయిన సూర్యుడు మనచేత) నిత్యం ధ్యానించబడవలసినవాడు.