నమస్తే,
ఇది వివేకచూడామణి తెలుగు అనువాదం, వ్యాఖ్య కలిగిన ఒక పుస్తకానికి పీఠిక. ఈ పుస్తకం, పీఠికల రచయిత శ్రీ సామవేదుల సీతారామశాస్త్రిగారు (శ్రీశైలజ పబ్లికేషన్స్ విజయవాడ, 1991)
అద్వైతవేదాంత పరిచయంగా, సాధారణ సాధకులకు ఉపయోగకరంగా ఉంటుందని దీనిని టంకితం చేసి పంచుకోవడమైనది.
దీని పీడీఎఫ్ ఇక్కడ ఉపలబ్ధం.
----------------
వివేకచూడామణి పీఠిక
శ్రీ ఆదిశంకరులు, ఈ వివేకచూడామణిలో
దృశ్యప్రపంచ మిథ్యాతత్త్వం గురించి, బ్రహ్మ నిజతత్త్వం గురించి, జీవ బ్రహ్మైక్య
భావం గురించి, బ్రహ్మతత్వాన్ని స్వానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల
గురించి వివరంగా చెప్పారు. ‘జగన్మిథ్య-బ్రహ్మసత్యం’ అనే వారి సిద్ధాంతాన్ని నిరూపించటానికి
అవసరమైన వాదాలు, ఉపమానాలు ఎన్నో ఇచ్చారు.
1.
దృశ్యప్రపంచం :
మనకందరకి
పుట్టినప్పటినుంచి చనిపోయేవరకు – అన్ని వేళలలో, ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులపై ఒక
నిర్దిష్ట జ్ఞానం ఉంటుంది. కనబడే ప్రతి వస్తువునకు ఒక రూపం, ఒక పేరు ఉంటుంది. పేరు
తెలిస్తే రూపం ఊహించవచ్చు. రూపం చూసినప్పుడు పేరు జ్ఞాపకం వస్తుంది. ఏ రూపానికైనా
పేరు లేకపోతే, ఏదో ఒక పేరు పెట్టి, ఆ పేరుతో దాని గురించి చెప్తాం. ఈ సూత్రం, కనిపించే వస్తువులేకే కాక, వినిపించే శబ్దాలకు, నాలుకకు తెలిసే రుచులకు,
ముక్కుకు తెలిసే వాసనలకు, శరీరానికి తగిలే స్పర్శలకు వర్తిస్తుంది. పంచేంద్రియాలకు
అనుభవమయ్యే వివిధ గుణాలకు (స్పర్శలకు) ఆ గుణాలు గల వస్తువులకు వేరు వేరు పేర్లు
పెట్టి వ్యవహరిస్తుంటాం. ఆ పేరుతో ఆ గుణాలుగల వస్తువును నిర్దేశించగలుగుతాం.
‘కుర్చీ కుడి పక్కన ఉన్న బల్ల మీద ఉన్న
ఎర్రని పుస్తకం తీసుకురా’, అని చెప్పినప్పుడు, ఆ గదిలో ఎన్ని వస్తువులు ఉన్నా,
ఎంతటి చిన్నపిల్లవాడైనా ఆ పుస్తకాన్ని తెచ్చి ఇవ్వగలుగుతాడు. కుర్చీ వేరు, బల్ల
వేరు, కుడి వేరు, ఎడమ వేరు, ఎరుపు వేరు, పుస్తకం వేరు, తేవటం వేరు, ఇవ్వటం వేరు-
కాని ఈ పేర్లేవీ వస్తువుల మీద వ్రాసి లేవు. అవి చిన్నప్పటి నుంచి, పెద్దవారి నుంచి
వినటంవల్ల, ఆ వస్తువుకు, ఆ పేరుకు ఒక అవినాభావ సంబంధం మన మనసులో ఏర్పడింది.
పే. 16
అందువల్ల ఒకరి
మనసులో ఏర్పరచుకున్న రూపాలను నామాలద్వారా వేరొకరికి చెప్పటం జరుగుతున్నది. అప్పుడు
ఈ రెండవవాడు, తన మనసులో ఏర్పరచుకున్న రూప, నామ, సమన్వయాన్ని బట్టి ఒక భావం ఏర్పరచుకుంటాడు.
ఆ భావానికి అనుగుణంగా తాను ప్రవర్తిస్తాడు.
ఈ వివిధత్వాలన్నింటినీ సమన్వయపరచి, ఒకే
వాక్యంలో ఇమిడ్చి, మన మనసులోగల భావాన్ని పరులకు వ్యక్తపరచటానికి ఒక భాషను
వాడుతున్నాము, మాటలను వాడుతున్నాం. మాట – వాక్కు అంటే
ఏంటి? ఒక శబ్దమో, కొన్ని శబ్దాల కలయికో ఒక మాట అవుతున్నది. ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది.
ఆ అర్థం వెనక ఒక భావం ఉంటుంది. ఆ భాషకు ఒక ‘లిపి’ ని కూడా జోడిస్తే, ఆ మాటను చూడగలం, వినగలం. ‘పుస్తకం’ అని వ్రాస్తే, దానిని వాచకంగా,
‘పుస్తకం’ అని అంటాం. దాని అర్థం అందరు చదువుకోవటానికి ఉపయోగపడి కాగితాలతో కుట్టి,
అచ్చు వేయబడ్డ వస్తువు అని అర్థం చేసుకోగలం. ఆ అర్థం ద్వారా ఎదుటి మనిషి మనసులో
ఉన్న ‘పుస్తకం’ అనే భావాన్ని మనసులో ఏర్పరచుకోగలం. ఒక భావాన్ని ఒక మనసు నుంచి
మరొకరి మనసులోకి ప్రవేశించేటట్లు చేయటానికి ఈ ప్రక్రియలన్నీ అవసరం. వ్రాయటంలో లోపమున్నా,
ఉచ్చరించటంలో లోపమున్నా, వినటంలో లోపమున్నా, అర్థం చేసుకోవటంలో లోపమున్నా, భావ
ప్రసారం దెబ్బతింటుంది. ఒకరి మనసులో ఉన్న రూపం ఒకటి, ఇంకొకరు తన మనసులో
ఏర్పరచుకున్న చిత్రం వేరొకటి కావచ్చు.
ఇది ఒకరి భావాలను ఇంకొకరు అర్థం చేసుకోవటంలో
లోపమే కాక, తనంతట తాను స్వయంగా చూసిన వాటిలో కూడా వేరు వేరు వ్యక్తులు వేరు వేరు
భావాలను ఏర్పరచుకోవచ్చు. ఒక పోలీసు అధికారి దొంగలకు భయంకరమైన వ్యక్తిగా, కన్నకొడుకుకు
ఆదర్శవంతమైన మహాపురుషుడిగా, భార్యకు కొరకరాని కొయ్యగా, తల్లికి పనిలో సతమమవుతూ
భోజనం కూడా మరచిపోతున్న చిన్న పిల్లవాడిలాగా, క్రింది అధికారులకు కఠోరమైనవాడిగా,
పై అధికారులకు అత్యాశకు పోయే డాంభికుడిగా కనపడవచ్చు. వారి వారి మనసులోని భావాలను అనుసరించి,
అతని రూపం కూడా వారికి ఆ విధంగా కనపడుతుంది.
పే. 17
ఈ దృశ్య ప్రపంచాన్ని ఎవరూ యథా తథంగా చూడటంలేదు.
ఇంద్రియాలు అందజేసే వార్తలను మనసు, తన మనోభావాలకు అనుగుణంగా, (ఈ దృశ్యప్రపంచం) తనలో ఒక భావనాప్రపంచంగా ఏర్పరచుకుంటుంది. ప్రతి వ్యక్తి
తన మనసులో ఏర్పడిన ఈ భావనాప్రపంచాన్నే చూస్తుంటాడు. తాను మనసులో ఏర్పరచుకున్న
భావనాప్రపంచమే నిజమైన ప్రపంచమని అనుకుంటుంటాడు.
మనం ఈ దృశ్యప్రపంచాన్ని చూడటమే కాక,
ఇందులో ప్రవర్తిస్తూ ఉంటాం. కాళ్ళతో నడవటం, చేతులతో పనులు చేయటం, నోటితో మాట్లాడటం, ఇవన్నీ బాహ్యప్రపంచంలో మనం చేసే
పనులు. మనసుతో ఆలోచించటం, బుద్ధితో విమర్శించటం ఇవి
అంతఃప్రపంచంలో చేసే పనులు. ఈ పనులన్నీ మనం ఇష్టపూర్వకంగా చేస్తుంటాం. కొన్ని పనులు
మన ఇష్టం లేకుండానే జరుగుతుంటాయి. ఊపిరి పీల్చటం, గుండె కొట్టుకోవటం, రక్తప్రసారం, అన్నం జీర్ణమవ్వటం మొదలైనవి. మనం ఇష్టపూర్వకంగా
చేయగలిగే పనులకు ఉపయోగపడే అవయవాలనే కర్మేంద్రియాలు అంటారు. అవి కాలు, చేయి, నోరు
మొదలైనవి. అదే విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు – కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
మనకు బాహ్య ప్రపంచంతో సంబంధం కలుగ చేసేవి ఈ పది ఇంద్రియాలు మాత్రమే. ఈ దశేంద్రియాల
వెనుక (శరీర, మనోబుద్ధుల వెనుక కూడా) ఒక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి వల్లనే ఈ
ఇంద్రియాలన్నీ పని చేస్తుంటాయి. మన శరీరంలో జరిగే మిగిలిన అయిష్ట పూర్వకమైన పనులు
కూడా ప్రాణశక్తి వల్లనే జరుగుతాయి. ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఈ జగత్తులో
సృష్టి జరుగుతున్నది.
ప్రకృతిలో మరి కొన్ని శక్తులు ఉన్నాయి.
గాలి వీచటం, వర్షం కురవటం, నదులు ప్రవహించటం, తుఫానులు, భూకంపాలు ఇటువంటివన్నీ ప్రకృతి శక్తులు. (ఈ జగత్తంతా విరాట్
స్వరూపుడైన ఈశ్వరుడి శరీరమే అనే భావంలో, ఈ శక్తులు కూడా ప్రాణశక్తులని కొందరు
అంటారు).
ఈ దృశ్య ప్రపంచాన్ని రెండు భాగాలుగా చెప్పవచ్చు
– 1. బాహ్యం : బయటకు కనపడేది, 2. అంతరం : బయటకు కనపడనిది.
పే. 18
1.
బాహ్యప్రపంచం :
పంచేంద్రియాలకు కనిపించేది, పంచకర్మేంద్రియాలతో పనులు చేయటానికి అనువైనది. పంచభూతాలతో
కూడుకున్న ఈ ప్రకృతి, అందులోని వస్తు సంచయనం, శరీరాలు, బాహ్యసంఘటనలు, బాహ్యకర్మలు ఇవన్నీ బాహ్యప్రపంచం అవుతాయి. (Objective
World).
2.
అంతరం : తనలో జరిగేవి
– భావనలు, ఆలోచనలు, వాంఛలు, భయాలు, ఆందోళనలు, కోపతాపాలు మొదలైనవి
(Subjective World). ఇవి బయటకు కనిపించవు. తనకుతాను
చెప్పినప్పుడు మాత్రమే బయటవారు గ్రహించగలరు.
2. కాలం, దేశం, కారణం :
ఈ రెండు రకాలైన ప్రపంచాలకు కాల,
దేశ, కారణ నియమాలు ఉన్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలు సదా
పుడుతుంటాయి. ఈ మూడుప్రశ్నలు కాల, దేశ, కారణాలకు సంబంధించినవి. బాహ్యాంతర
ప్రపంచమంతా, ఈ మూడిటి సంయోగ ఫలితమే అని చెప్పవచ్చు.
ఉదయం
తూర్పున ఉన్న సూర్యుడు, సాయంత్రం పడమరలో ఉంటాడు. ప్రొద్దు, సాయంత్రం కాలాన్ని తెలియచేస్తాయి;
తూర్పు, పడమర దేశాన్ని తెలియచేస్తాయి. ఈ ఉదయాస్తమయాలను స్వాభావికమని మనసు
ఒప్పుకోదు. దాని వెనకాల ఉన్న కారణం తెలుసుకోవాలనుకుంటుంది. ఎందువల్ల అనే ప్రశ్న
పుడుతుంది. దానికి సమాధానం దొరికే వరకు మనసుకు శాంతి ఉండదు - ఎందువల్ల - ‘మనం భూమిమీద
ఉన్నాం కాబట్టి, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నది కాబట్టి, సూర్యుడు తానున్న
చోటనే కదలకుండా ఉన్నందువల్ల, (ఈ మూడు ప్రశ్నలే కాక ‘ఎవరు’ ఏమిటి?’ అనే ప్రశ్న
సాధారణంగా ఎదురవుతుంటుంది. అది నామ, రూపాలకు సంబంధించిన ప్రశ్న. ‘రాముడు ఎవరు?’
అని అడిగినప్పుడు పేరు తెలుసుకాని రూపం తెలియదని అర్థం; ‘అతను ఎవరు?’ అన్నప్పుడు
రూపం తెలుసుకాని, పేరు తెలియదని అర్థం. ‘అది ఏమిటి?’ అన్నప్పుడు రూపం, పేరు కూడా స్పష్టంగా తెలియలేదని అర్థం).
‘రాముడు
ఉన్నాడు’ అని మనం చెప్తే సరిపోదు. ‘ఎప్పుడు ఉన్నాడు?’ ‘ఎక్కడ ఉన్నాడు?’ ‘ఎందుకు
ఉన్నాడు?’ అనే ప్రశ్నలు వెంటనే పుడతాయి. ఉదయం
పే. 19
భార్య మీద కోపంతో ఉడికిపోతున్న మనసు, రాత్రికి
ప్రశాంతంగా అనురాగంతో నిండిపోతుంది. ఎందుకు? (ఆ ప్రశ్నకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు).
దేశ నియమం, కాల నియమం, కారణ నియమం ఈ మూడు ఈ దృశ్య
ప్రపంచానికి ప్రధాన లక్షణాలు. (Basic Qualities).
ఈ
రోజు మన ఇంట్లో ఉన్న బల్ల, మంచం పది సంవత్సరాల క్రిందట అడవిలో ఒక చెట్టు. 100 ఏళ్ళ
క్రిందట అది మరొక చెట్టు విత్తనం. మనకు ఇప్పుడు మహాసముద్రంగా కనపడే నీరు, ఒకప్పుడు
నదీ ప్రవాహం. అంతకు ముందు అది వర్షం. అంతకు ముందు అది మేఘం. అంతకు ముందు అది వేరొక
సముద్రం. ఈ విధంగా మనం ఆలోచిస్తూ పోతే, ఈ దృశ్యప్రపంచం సదా మార్పులు చెందుతూ,
ఇప్పుడు మనకు కనిపించే విధంగా పూర్వం లేదని, ఇక ముందు కూడా ఈ విధంగా ఉండదని మనం చెప్పగలం.
మార్పు,
మార్పు, మార్పు – ఇది ఈ దృశ్యప్రపంచ ప్రధాన లక్షణం. ఈ మార్పు ఒక బాహ్య ప్రపంచానికే
కాక, అంతఃప్రపంచంలో కూడా ఉంటుంది. ఒకప్పుడు కోపం, ఒకప్పుడు శాంతం, ఒక చోట ద్వేషం, ఒక చోట రాగం,
విజయం సాధించటం వల్ల ఆనందం, ఓడిపోవటం వల్ల దుఃఖం, ఇవన్నీ మనకు అనుభవమే. ఈ దేశ, కాల, కారణాలతో నిమిత్తం లేని, ఈ మార్పులేని
ప్రపంచాన్ని మనం ఊహించటం కూడా కష్టం.
3.
మార్పు – ఆధారం :
మార్పును తెలుసుకోవటానికి ఒక
మారని వస్తువు ఆధారంగా, ప్రమాణంగా ఉండాలి. నిన్న ఒక చోట చూసిన
చెట్టు, నేడు అక్కడ లేకపోతే ఆ మార్పును గ్రహించగలం. ‘నిన్న అక్కడ చెట్టు ఉండేది,
ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నిస్తే, ‘ఎక్కడ?’ అనే ప్రశ్న పుడుతుంది. ‘ఇక్కడే ఆ
పెద్ద భవనం ముందు, ఈ దారికి ఇటువైపు’ అని చెప్తాం. అట్లా చెప్పటంలో మనం మనకు
తెలియకుండానే, కొన్ని మారని వస్తువులను ఆధారంగా తీసుకుని, మారిన పరిస్థితిని
గ్రహించాము. ‘ఇక్కడ’ అనే స్థలనిర్ణయానికు, నిన్న, ఈ రోజు మారకుండ ఉన్న ఆ భవనం, ఆ దారి ఆధారంగా చేసుకున్నాం అన్నమాట.
పే. 20
ఇట్లా కాక, తెల్లవారిన తరువాత, ఆ భవనం, ఆ దారి కూడా లేకపోతే? అప్పుడు ‘ఇక్కడ’ అని నిర్దేశించటానికి ఏమి ఉంటుంది?
దేనితో పోల్చి ఏది మారిందని నిర్ణయిస్తాం?
ప్రత్యేకమైన
స్థలాన్ని నిర్ణయించటానికి, ఏదో ఒక ఆధారరేఖ, స్థిరంగా ఉండేది – (Fixed Base Line) ఉండాలి. ఈ విధంగానే, ఒక
ప్రత్యేక సమయాన్ని నిర్ణయించటానికి, ఒక నిర్దిష్టమైన సన్నివేశం ఆధారంగా తీసుకోవాలి.
మనం తీసుకునే ఆధారాలు ఎప్పటికీ మారనివిగా ఉండాలి.
స్థలానికి
(Space) అది ఎక్కడ?
కాలానికి
(Time) అది ఎక్కడ?
కారణానికి
– మూలకారణమేది?
ఒక
వస్తువుకు మరొక వస్తువుకు మధ్య అంతరం స్థలం (దేశం) కాని, వస్తువులే లేని చోట
స్థలనిర్ణయం ఎట్లా చేయగలం? ఎట్లాంటి సంకేతాలు (Distinguishable
points) లేని మహా ఎడారిలో మనం దూరాన్ని ఎలా కొలవగలం? ఒక చోట
బయలుదేరి 100 అడుగులు వేసి ‘నేను 100 అడుగుల దూరంలో ఉన్నాను’ అని మనం అనవచ్చు.
కాని ‘ఎక్కడ నుంచి’ అని ప్రశ్నించేసరికి, మనం బయలుదేరిన బిందువు ఎక్కడున్నదో
చెప్పలేం. మనం ఎక్కడున్నా చుట్టూ కనుచూపు మేర వరకు ఎడారే – ఎంత దూరం నడిచినా
ఎడారిలోనే ఉంటాం. ఆకాశం మేఘావృతమై, సూర్యుడుగాని, చంద్రుడుగాని నక్షత్రాలుగాని
కనిపించనప్పుడు మనం దిక్కులు కూడా మరచిపోతాం. తూర్పుకు పోవటానికి బదులు ఉత్తరానికి
వెళ్తాం. (ఈ విధంగా దారి మరచిపోటానికి ఎడారులే అక్కరలేదు. పెద్ద పెద్ద పట్టణాలలో
కూడా, ఒకేరకమైన భవనాలున్న ప్రాంతాలలో కూడా మనం స్థలనిర్ణయం చేయలేం). ఎందుకంటే అంతా
ఒకే వస్తువు. విభిన్నత్వం లేని ఒకే వస్తువు. విభిన్నత్వం లేని చోట ‘స్థలం’ అన్న
మాటకు అర్థం లేదు.
ఇక
కాలం – రెండు సంఘటనల మధ్య అంతరాన్ని కాలం అంటున్నాం. ఈ రోజు సూర్యోదయం మొదలుకుని,
మరునాడు సూర్యోదయం వరకు మధ్య గల అంతరాన్ని ‘ఒక రోజు’ అంటున్నాం. దానినే గంటలలో,
పే. 21
నిముషాలలో, సెకనులలో భాగించాం. ఆ రోజును ఆధారంగా చేసుకునే
నెలలు, సంవత్సరాలు, యుగాలు మొదలైనవి నిర్ణయిస్తున్నాం. కాని
సంఘటనలతో ప్రమేయంలేని ‘శుద్ధకాలము’ (Independent
Absolute Time) అన్నది ఉన్నదా? అని ప్రశ్నిస్తే, అలాంటి కాలం లేదనే
చెప్పాలి. సంఘటనలు ఈ దృశ్యప్రపంచంలోనే వీలవుతాయి. దీనికి వేరైన, విభిన్నత్వం లేని,
సంఘటనలు లేని చోట కాలం ఉంటుందా? గాఢనిద్రలో విభిన్నత్వం లేదు, సంఘటనలు లేవు, కాలం లేదు.
ఎదో ఒక దాన్ని గురించి దీర్ఘంగా ఏకాగ్రతతో ఆలోచించే వారికి కూడ, భిన్నత్వం లేకుండటం
వల్ల కాలగతి తెలియదు. అంటే కాలం నిలిచిపోతుంది. మనం కాలాన్ని గంటలు, నిమిషాలు అని
విభజించాం కాని, కాలపరిమితి అందరికీ ఒక్కలాగ ఉండదు. ఎన్నో రోజుల తరువాత కలుసుకున్న
ప్రేమికులకు గంటలు నిమిషాలలాగా గడిచిపోతాయి. ప్రియుడిని బాసిన ప్రేయసికి, ప్రతి
నిముషం ఒక యుగంగా అనిపిస్తంది. చలన చిత్రాన్ని చూసేటప్పుడు కాలానికి ఉన్న వేగం పాఠ్య
పుస్తకాలు చదివేటప్పుడు ఉండదు. ఏకాగ్రతలో, ఆనందానుభవంలో గడియారాలు చూపించే కాలం పరుగెత్తినట్లు
అనిపిస్తుంది, నిరీక్షణలో, దుఃఖానుభవంలో గడియారాలు చూపించే కాలం కదలనట్లు అనిపిస్తుంది.
కాలం ఊహ మాత్రం, మనోకల్పితం. దానికి స్థిరత్వంగాని,
అస్థిరత్వంగాని లేదు.
మార్పులు
జరుగుతున్నా ఈ ప్రపంచంలో ఆ మార్పులను గ్రహించి, నిర్దేశించగల మారని ఆధారం ఒకటి
ఉండాలని చెప్పుకున్నాం. అట్లా కాక మారుతున్న ఆధారం మీద ఉండి, మరొక మారుతున్న
వస్తువును చూస్తుంటే కలిగే జ్ఞానం నిజమైనది కాదు – అది మిథ్యా జ్ఞానం.
మనం
కదులుతున్న ఒక రైలుబండిలో కూర్చుని, అదే వేగంతో మన పక్క లైనుమీద మనం వెళ్తున్నవైపే
వెళ్తున్న మరొక రైలుబండిని చూస్తే, అది కదులుతున్నట్లే ఉండదు. అందులోని ప్రయాణీకులతో
మాట్లాడవచ్చు, చేతులు కలపవచ్చు. ఒక బండినుంచి మరొక బండిలోకి మారవచ్చు. ఏ కారణం వల్లనైనా
మన బండి ఒకేసారి ఆగిపోతే, మన పక్కనున్న బండి మహావేగంతో ముందుకు వెళ్తున్నట్లు
కనబడుతుంది, లేదా మనం కూర్చున్న బండి మహావేగంతో వెనకకు పోతున్నట్లు కనబడవచ్చు.
పే. 23
మన
బండి వేగంగా ముందుకు వెళ్తున్నా, మన పక్క లైనుమీద ఉన్న బండి మనకన్నా వేగంగా మనం వెళ్తున్న
వైపుకు వెళ్తుంటే, ఆ బండినే చూస్తున్న మనకు, మన బండి వేగంగా ముందుకు పోయే బదులు
నెమ్మదిగా వెనుకకు పోతున్నట్లు అనిపిస్తుంది. ఈ అనుభూతి ఎంత సహజంగా ఉంటుందంటే, మన
బండిలోని ప్రయాణీకులందరూ, ముందుకు పోవలసిన బండి వెనుకకు ఎందుకు పోతున్నదని భ్రాంతి
చెందుతారు. ఇంతలో మన ప్రక్కన ఉన్న బండి మన బండిని దాటుకుంటూ ముందుకు పోయి ఆఖరి
పెట్టె కూడా మనని దాటిపోయి, లైను పక్కన ఉన్న చెట్లు కనిపించగానే, అప్పటి వరకు
వెనుకకు పోతున్నట్లు అనుభూతి కలిగించిన బండి ఒక్క కుదుపుతో ముందుకు మహావేగంగా పోతున్నట్లు
తెలుస్తుంది. మన మనసులో ఆ ‘కుదుపు’ కూడా అనుభవానికి వస్తుంది.
రెండు
లైన్ల పక్కన భూమి మీద కదలకుండా నిలబడి రెండు బండ్లను చూస్తున్న వ్యక్తికి, ఈ రెండు
షరా వేగంతో ఒక దానిని ఒకటి దాటుకుంటూ వెళ్ళిపోవటం కనిపిస్తుంది. ఇందులో ఏది సత్యం?
ఎవరి అబుభవం నిజమైనది? భూమిమీద కదలకుండా నిలబడి రెండు బండ్లను చూసినవాడి అనుభవమే నిజమని
మనం చెప్పగలం. కాని, బండిలోనే కూర్చుని, మన కళ్ళతో మనం చూసి, ఏర్పరచుకున్న అనుభవం?
అది అసత్యమా!
తాము
చూసినదే నిజమని నమ్మేవారికి, అది నిజంగానే తోచుతుంది. వారి అనుభవానికి వేరైన నిజం ఇంకొకటి
ఉన్నదని చెప్పినా వారు గ్రహించలేరు, గ్రహించటానికి ప్రయత్నించరు. కాని ఆ విధంగా ప్రయత్నించి,
ఏది నిజమో తెలుసుకునేవారికి, తార్కికంగా ఆలోచించటం వల్ల అందులోని నిజానిజాలు తెలుసుకోగలరు.
నిజం తెలిసిన తరువాత తన అనుభూతి వెనుకకు పోతున్నట్లు చెప్తున్నా, తన విచక్షణా
జ్ఞానం తాను ముందుకే వేగంగా పోతున్న సత్యం చెప్తుంటుంది. అందువల్ల నిజం తెలుసుకోలేని
మిగిలిన ప్రయాణీకులు ఆందోళనపడినట్లు, తాను ఆందోళన చెందక నిశ్చితంగా ఉంటారు.
మిగిలినవారి అజ్ఞానానికి తనలో తానే నవ్వుకుంటారు.
4.
ఆధారం – వస్తుతత్త్వం :
ఈ మారుతున్న జగత్తు వెనుక,
మారని ఆధారం, మారని సత్యం మనం గ్రహించగలిగితే, అప్పుడే మనం నిజాన్ని గ్రహించామని
చెప్పవచ్చు.
పే. 23
ఆ సత్యం తెలుసుకోనంతవరకు, మన జ్ఞానం నిజమైనది
కాదని, భ్రమకు లోనైనదని చెప్పవచ్చు. అందువల్ల, ఈ మార్పుల వెనుక ఉన్న సత్యం ఎటువంటిది
అన్నది తెలుసుకోవాలి.
ఒక
వస్తువు ఒక చోట, ఒక కాలంలో ఒక రూపంలో ఒక పేరుతో ఉండి, వేరొక చోట మరొక కాలంలో ఇంకొక
రూపంలో వేరొక పేరుతో ఉంటే అందులో మార్పు జరిగిందన్నమాట. కాని వస్తుతత్త్వంలో మార్పు
లేదు. కేవలం నామ, రూపంలోనే మార్పు వచ్చింది. ఆ మార్పు దేశ, కాలాల పరిధిలో
జరిగింది.
ఒక
ఇల్లాలు తన పెళ్ళికి ముందు తన పుట్టింటివారు పెట్టిన రెండు జతల బంగారపు గాజులును
పెళ్ళి అయిన రెండు సంవత్సరాల తరువాత, వాటిని చేరిపించి, పుస్తెల నానుగా
చేయించుకుంది. ఆమె తిరిగి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి ‘నీ బంగారపు గాజులు
ఏవి?’ అని అడిగినప్పుడు పుస్తెలనాను చూపించి ‘ఇవిగో, అవే ఇది’ అని చెప్తుంది. ‘అవి’
బహువచనం. ‘ఇది’ ఏకవచనం. గాజుల రూపం వేరు, పేరు వేరు. పుస్తెల నామరూపం వేరు, పేరు
వేరు. అట్లాంటి సందర్భంలో ‘అవే ఇది’ అనటంలో ఔచిత్యం ఏమున్నది? ‘అవే ఇది’ అనే మాటలో
గాజులలో ఉన్న వస్తుతత్వమే, వాటిలోని బంగారమే పుస్తెల నానులో కూడ ఉన్నదని భావం.
నామరూపాలు మారినా వస్తుతత్త్వంలో మార్పు లేదు కాబట్టి విచారించ వలసిన పనిలేదు అని
తల్లికి ధైర్యం చెప్పిందని భావం.
నగలు
వేరువేరైనా బంగారం అంతా ఒకటే.
కుండలు,
గోళాలు, వేరువేరైనా వాటిలో వస్తుతత్త్వం అయిన మట్టి అంతా ఒక్కటే.
కర్ర
వస్తువులు (Furniture) వేరువేరైనా,
వాటి అన్నిటిలో ఉన్నది కలప మాత్రమే.
మనం
ప్రతి వస్తువులో దానికి నామ, రూపాలు సమకూర్చిన వస్తుతత్వాన్ని గురించి, తెలుసుకోవటం
మొదలుపెడితే అప్పుడు కనిపిస్తున్నంత వివిధత్వం కనిపించదు, ఆ వస్తువులలో మనం ఏర్పరచుకున్న
విలువలలో కొంత
పే. 24
మార్పు వస్తుంది. వాటిలో మనం ఏర్పరచుకున్న మమకారంలో
కొంత మార్పు వస్తుంది. మనం మన వస్తువులలో (అవి విలువైనవి కాకపోయినా) మనం ఏర్పరచుకున్న
గర్వం, పరులకున్న వస్తువులలో (అవి కూడ విలువలేనివే అయినా), మనం ఏర్పరచుకునే
ఈర్ష్యాభావంలో, చాలావరకు తరుగుదల కనిపిస్తుంది.
ఈ
మమకారాలు, ఈ గర్వాలు, ఈ ఈర్ష్యలు, ఈ వస్తువులు
సమకూర్చుకోవటంలోని తాపత్రయం ఇవే కదా జీవితం. ఇవి లేకపోతే జీవితంలో ఆనందం (Thrill) ఎలా ఉంటుంది? అని కొందరు
ప్రశ్నించవచ్చు. ఇదే ఆనందం అనుకోవటం ఒక భ్రమ. ఆ మిథ్యానందం కోసం నిజాన్ని కప్పిపుచ్చి
భ్రమలో పడిపోనక్కరలేదు. నిజం గ్రహిస్తూనే ఆనందం పొందవచ్చు. అసలు నిజం తెలుసుకోవటంలో
ఉన్న ఆనందం భ్రమలో ఉండదు. నిజాన్ని మరిచిపోనంతవరకు, భ్రమలో ఉన్నట్లు నటించినా
తప్పులేదు. కాని నిజాన్ని మరచిపోరాదు.
చిన్నపిల్లలు
గల ఇంట్లో, పెద్దవారు కూడ చిన్నపిల్లలతో కలిసి ఆడుకుంటూ చిన్నపిల్లలలాగనే పాలకోసం ఏడుస్తూ,
అన్నం పెట్టమని అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఆ దుఃఖములో, ఆ మారాం చేయటంలో వారికి
ఆనందమే కలుగుతుంది. ఎట్లా అంటే, అది వట్టి ఆట మాత్రమే అని, ఆ పెద్దవారికి తెలుసు,
పిల్లలకి కూడ తెలుసు. అది వట్టి భ్రమ. అందులోనే ఆనందం. కాని ఆ ఆనందం కోసం తమ నిజతత్త్వం
మరిచిపోనక్కరలేదు. అట్లాకాక, ఆట అయిపోయిన తరువాత కూడా, పెద్దవారు చిన్న పిల్లలుగా
ప్రవర్తిస్తే, వారికి మతి స్థిమితం పోయిందని మనం చెప్పవచ్చు.
5.
బాహ్యప్రపంచ వస్తుతత్త్వం :
ఈ బాహ్యప్రపంచపు వస్తుతత్త్వం ఏంటి?
ఈ విషయం ఆలోచించినప్పుడు, మన శరీరం కూడ ఈ బాహ్యప్రపంచానికి సంబంధించినదే అని
రెండిటిలో వస్తుతత్త్వం ఒక్కటే అని గ్రహించటం ముఖ్యం.
ఈ
దృశ్యప్రపంచాన్ని, మన శరీరాలతో సహా పదార్థం (Matter),
శక్తి (Energy), ఆకాశం (Space) అని మనం చెప్పవచ్చు.
పే. 25
కాలం (Time) ఈ
వస్తుతత్వానికి సంబంధించినది కాదు, కాని వస్తుతత్వమగల నామ రూప సంజ్ఞారూపకమైన
(పేరు, రూపం, ‘ఇది’ అని నిర్దేశించి చెప్పగలిగే గుర్తు) విభిన్న వస్తువులలో
కలిగే మార్పులను తెలుసుకోటానికి ఉపయోగపడుతుంది.
మన
పూర్వులు ఈ ప్రపంచాన్ని (వస్తుతత్త్వం) ఐదు భాగాలుగా నిర్ణయించి, వాటికి ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అని పేర్లు పెట్టారు. సృష్టిక్రమంలో ముందు
ఆకాశం, దాని నుంచి వాయువు, తరువాత అగ్ని, ఆ తరువాత నీరు,
ఆఖరిలో భూమి వచ్చిందని చెప్తారు. వీటిని పంచభూతాలు (Five Elements) అన్నారు. వీటిలో అన్నిటికన్నా
సూక్ష్మమైనది ఆకాశం. అన్నిటికన్నా స్థూలమైనది భూమి.
మన
శాస్త్రాల ప్రకారం, ఈ పంచభూతాలు తమ సూక్ష్మరూపంలో (తన్మాత్రలుగా)
ఉన్నప్పుడు వాటి నుంచి మన ఇంద్రియాలు కలిగాయని చెప్తారు. ఆకాశం నుంచి శ్రవణేంద్రియం, వాయువు నుంచి స్పర్శేంద్రియం, అగ్ని నుంచి
దృగింద్రియం, నీటి నుంచి జిహ్వేంద్రియం, భూమి నుంచి ఘ్రాణేంద్రియం పుట్టాయి. ఈ పంచజ్ఞానేంద్రియాల ద్వారా మనం ఈ
ప్రపంచంలోగల ఈ ఐదు గుణాలను తెలుసుకుని (చప్పుడు, స్పర్శ, కాంతి, రుచి, వాసన) ఇదే
మన ప్రపంచం అంటున్నాం.
ఈ
పంచభూతాలు తమ సూక్ష్మస్థితి నుంచి ఒక దానితో ఒకటి ఒక క్రమపద్ధతిలో కలిసి పంచమహాభూతాలు
అయ్యాయి. ఈ ప్రక్రియనే ‘పంచీకరణము’ అంటారు. ఈ పంచభూతాలు సూక్ష్మస్థితిలో
(తన్మాత్రలుగా) ఉన్నప్పుడు అవి అవ్యక్తమయ్యాయి. ఇంద్రియాలకు కనిపించనివి. అవి
పంచీకరణం చెందిన తరువాతనే దృశ్య ప్రపంచంగా మారాయి.
పంచీకరణం
అంటే ఐదు అంచెలలో ఈ ఐదు భూతాలు విడిపోయి, మళ్ళీ కలవటం. ముందుగా ఒక్కొక్క భూతం రెండు
భాగాలైంది. అందులోని ఒక సగం ఆ విధంగానే ఉండగా, మిగిలిన సగం నాలుగు భాగాలు అయి ఆ
ఒక్కొక్క భాగం మిగిలిన నాలుగు భూతాల అర్ధభాగంతో కలుస్తాయి.
పే. 26
6.
స్థూల శరీరం :
మన శరీరంలో ఉన్న పదార్థతత్త్వంకూడ
ఈ పంచమహాభూతాల నుంచి వచ్చినదే. వస్తుతత్త్వంలో మన శరీరాలకు, ఈ పాంచభౌతిక ప్రపంచానికి
భేదం లేదు. సప్తధాతువులతో (పై చర్మం, లోపలి చర్మం, మాంసం, కొవ్వు, రక్తం,
ఎముకలు, మూలుగ) కూడిన ఈ శరీరం నుంచి ప్రాణం పోయిన తరువాత ఇది ఈ పంచభూతాలలోనే
కలిసిపోతాయి. ఈ శరీరంలోనే, పంచ కర్మేంద్రియాలు అయిన కాళ్ళు, చేతులు, నోరు, గుదం, లింగం ఉన్నాయి. ఈ స్థూలశరీరంలోనే మన జ్ఞానేంద్రియాల పరికరాలైన కళ్ళు,
చెవులు,
పే. 27
ముక్కు, నాలుక, చర్మం ఉన్నాయి. ఈ దృశ్యప్రపంచంలో పనులు
చేయటానికి వీటితో సంబంధబాంధవ్యాలు పెట్టుకోవటంలో కూడ ఈ శరీరం ఉపయోగపడుతుంది. కాలవశంలో
ఈ స్థూలశరీరం నశించిపోతే, ఆ వ్యక్తి ఉండడు. అంటే నామరూపాలు, జాతి, వర్ణం, ఆశ్రమం ఇవన్నీ ఈ శరీరాన్నే
ఆశ్రయించుకుని ఉంటాయి. అందువల్ల అందరూ ఈ స్థూలశరీరాన్నే వ్యక్తిగా పరిగణిస్తారు.
కాని,
మనకు బయటకు కనిపిస్తున్న, నశించిపోయే స్వభావంగల ఈ స్థూలశరీరమే మన నిజతత్వమా? కాదని
చిన్నపిల్లవాడికి కూడ కొద్ది అనుభవంతో తెలిసిపోతుంది. అల్లరి చేస్తున్న
చిన్నపిల్లవాడిని తండ్రి గట్టిగా ‘కొడతాను’ అని బెదిరించి, చేయి ఎత్తి
కొట్టబోతున్నట్లు నటించేసరికి, ఆ పిల్లవాడు ముందుగా తండ్రి ముఖంలోకి చూస్తాడు. ఆ
ముఖంలో ఏ మాత్రం చిరునవ్వు కనిపించినా, ఆ కొట్టటం అంతా నటనే అని గ్రహించి, నవ్వుతూ
పరుగు పరుగున వెళ్ళి తండ్రి కాళ్ళకు చుట్టుకుంటాడు. తండ్రి ముఖంలో కోపంగాని కనిపిస్తే,
అతను కొట్టకుండానే భోరుమని ఏడవటం మొదలుపెడతాడు.
7.
సూక్ష్మ శరీరం :
మనకు కనపడే దేహంలో మనకు
కనిపించని మరొక వ్యక్తిత్వం ఉన్నదని కొద్ది విచక్షణాజ్ఞానంతో గ్రహించగలం. దానిని
సూక్ష్మశరీరం అంటారు. ఈ రెండు శరీరాలలో ఏది మన నిజతత్వమని ఆలోచిస్తే, బయటకు కనపడే
స్థూలశరీరం కంటే లోపల ఉన్న సూక్ష్మశరీరమే మన నిజతత్వమని గ్రహించగలం. మనం కట్టుకున్న
బట్టలు మన నిజతత్త్వం కానట్లు, ఈ బాహ్యశరీరం కూడ మన నిజతత్త్వం కాదు. ఈ లోపలి శరీరం
ఉండటానికి పనికివచ్చే ఒక గూడు ఆ లోపలి మనిషి వాడుకోటానికి పనికొచ్చే ఒక పనిముట్టు.
ఈ సూక్ష్మశరీర వస్తుతత్త్వం ఎటువంటిది?
అని ఆలోచిస్తే, అది స్పందనా రూపకమైనది, భావనా రూపకమైనది, ఆలోచనా రూపకమైనది,
అనుభూతి రూపకమైనది అని గ్రహించగలం. అంటే ఇవన్నీ ఒక రకమైన ‘వృత్తి’ (Waves, Vibrations) రూపకమైనవని చెప్పవచ్చు. వీటిని
‘మనోవృత్తులు’ అని కూడ అంటారు.
పే. 28
స్పందన
రూపకమైన మనోవృత్తులను – 1. స్పందన, 2. ప్రతిస్పందన, 3. క్రియ అనే మూడు విధాలుగా విభజించవచ్చు.
ఇంద్రియాలు బాహ్యప్రపంచం నుంచి తెచ్చే సంకేతాలను గ్రహించి, దానిని విశ్లేషించి,
వాటిని అన్వయించుకోవటం (తెలుసుకోవటం) ‘స్పందన’ (Perception)
అనవచ్చు. ఆ విధంగా తెలిసిన సమాచారానికి అనుగుణంగా మనసులో కలిగే భావతరంగాలను ‘ప్రతిస్పందన’
(Reaction) అనవచ్చు. ఆ ప్రతిస్పందనకు
అనుగుణంగా ప్రవర్తించటానికి కావలసిన సంకేతాలను ‘క్రియా రూపకమైనవి’ (Action oriented) అని చెప్పవచ్చు. ఈ విధంగా ‘స్పందన’
‘ప్రతిస్పందన’, ‘క్రియ’ ఒక క్రమపద్ధతిలో ఒక దాని వెనుక ఒకటి ప్రవాహరూపంలో జరిగిపోతుండటం
వల్ల సూక్ష్మ శరీరానికి ఒక ‘అస్తిత్వము’ (ఉన్నది అనే భావం) కలిగింది. సూక్ష్మశరీరం
లోపల ఉన్నా, బయటకు కనపడే స్థూలశరీరాన్ని ఆడిస్తుంటుంది. కాని బాహ్యప్రపంచానికి కనిపించేది
బాహ్యశరీరం కాబట్టి, మానావమానాలు, సత్కారతిరస్కారాలు, పాదాభివందనాలు, నామకరణ, ఉపనయనం, వివాహం అన్నీ బాహ్యశరీరానికే జరుగుతుంటాయి.
ఇక,
భావనారూపకమైన మనోవృత్తులు ఎటువంటివంటే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, భయం, అనుమానం మొదలైన భావనలతో కూడుకున్నవి. రాగం, ద్వేషం కూడ మనో వృత్తులే – మనిషిలో కలిగే ఆవేదనలకు, దుఃఖానికి ఈ భావనలే
ప్రధానకారణాలు. మనిషి చేసే ప్రతి పని ఈ భావనల పరిధిలోనే జరుగుతుంటుంది. మనకు ఒకడిపై
ద్వేషం కలిగితే వాడిని సర్వనాశనం చేయటానికి పూనుకుంటాం. వాడు ఏ పని చేసినా మనకు
చెడ్డగానే కనిపిస్తుంటుంది. ఆ దృష్టితోనే అతనితో వ్యవహరిస్తాం. మనకు ఒకడిపై ప్రేమ
కలిగితే అతని తప్పులన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. అతను చేసే ఎంతటి స్వల్పకార్యాలైనా
మహత్కార్యంగా అనిపిస్తాయి.
ఇక
ఆలోచనారూపకమైన మనోవృత్తులను : 1. వాంఛా రూపకమైనవి, 2. విచక్షణా రూపకమైనవి, 3.
నిర్ణయాత్మకమైనవి, అని విభజించవచ్చు.
క్రొత్త
అనుభవాలను పొందటానికి, అంతకు ముందు అనుభవవించిన వాటిని తిరిగి పొందటానికి కలిగే మనోవృత్తిని
‘వాంఛ’ అనవచ్చు.
పే. 29
మనం తెలుసుకుంటున్న విషయాలను విశ్లేషించి, అందులోగల
నిజానిజాలు, మంచిచెడ్డలు తెలుసుకోవటం విచక్షణారూపకమైన ఆలోచనలు. మన దైనందిన వ్యవహారాలలో,
క్రొత్త వ్యవహారాలలో పూర్వాపరాలను విచారించి, నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేసే
ఆలోచనలు నిర్ణయాత్మకమైనవి.
ఇక
అనుభూతి పూర్వకమైన మనోవృత్తులు – మనం చూసే ప్రతీ దృశ్యంలో, చేసే ప్రతీ పనివల్ల,
ఆలోచించిన ప్రతీ ఆలోచనవల్ల అంతరంగంలో ఒక తృప్తిభావంగాని, అసంతృప్తభావంగాని
కలుగుతుంది. తృప్తభావం ఆనందం కలిగిస్తుంది. అసంతృప్తభావం దుఖాన్ని కలిగిస్తుంది.
ఈ స్థూల,
సూక్ష్మ శరీరాలను సంధానపరచి (ఒకదానితో ఒకటి చేర్చి), ఆ రెండిటిలో చైతన్యం కలిగించేది
‘ప్రాణశక్తి’. అది లేకపోతే రెండిటి మధ్యలోగల బంధం విడిపోతుంది.
8.
చిత్తం :
సూక్ష్మశరీరాన్ని చిత్తమని,
అంతరంగమని కూడ వ్యవహరిస్తారు. మన వేదాంతంలో ఈ ‘చిత్తా’నికి ముఖ్యమైన పాత్ర ఉన్నది.
ఈ
‘చిత్తా’న్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. 1. మనసు 2. బుద్ధి 3. అహంకారం 4.
చిత్తం.
మనసు
: దీనిగురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. స్పందనలు, ప్రతిస్పందనలు,
కామక్రోధాది భావాలు, సుఖదుఃఖాది అనుభూతులు, రాగద్వేషాది ద్వంద్వాలు
అన్ని కూడ ఈ మనసుకు సంబంధించినవే. ఆందోళనలు, అలజడులు, భయాలు ఇవి కూడ మనసుకు
సంబంధించినవే. ఇవన్నీ భావనారూపకమైన మనోవృత్తులు.
బుద్ధి
: దీనిగురించి కూడ ఇంతకు ముందే చెప్పుకున్నాం. వివేకం, విచక్షణాజ్ఞానం; క్రొత్త సంగతుల గురించి ఆలోచించటం ఇవన్నీ బుద్ధికి
సంబంధించినవే. ‘వాంఛలు’ కొందరు బుద్ధికి చెందినవిని, కొందరు మనసుకు చెందినవని
అంటారు. అసలు మనసుకు, బుద్ధికి మధ్యలో ఉన్న రేఖ చాల పలచనిది. అలజడులు, ఆందోళనలు
మనసులో, ఆలోచనలు బుద్ధిలో కూడ కలిగేవని చెప్పవచ్చు. ఈ రెండు కూడ మనోవృత్తులే.
పే. 30
అహంకారం
: బయట ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను గ్రహిస్తూ, వాటిలో ఎట్లాంటి
‘ప్రతిస్పందన’ లేకుండా, కేవలం ‘ద్రష్ట’ (చూసేవాడు)గా మాత్రమే ఉంటే, అప్పుడు చిత్తం
‘అహంకారం’గా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. అప్పుడు ‘నేను చూస్తున్నాను’, ‘నేను
వింటున్నాను’ అనే భావం మాత్రమే ఉంటుంది. ఆ ‘నేను’ అనే భావమే అహంకారం. మనకు సంబంధం లేని
సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు, మనసులో ఎటువంటి అలజడులు, ఆలోచనలు కలగకపోయినా ‘నేను
చూస్తున్నాను’ అనే అనుభవం మాత్రం నిరంతరం కలుగుతుంటుంది. అదే అహంకారం.
ఈ
‘అహంకారం’ బాహ్యప్రపంచంలోని సన్నివేశాలనే కాక, మన మనోబుద్ధులలో కలిగే భావాలను,
ఆలోచనలను కూడ తెలుసుకుంటుంటుంది. మనసు కోపంతో నిండి ఉన్నా, బుద్ధి ఆలోచనలతో
సతమతమవుతున్నా అహంకారం వాటిని గ్రహించి, ‘నేను కోపంతో ఉన్నాను’, ‘నేను
ఆలోచిస్తున్నాను’ అనే భావం కలిగి ఉంటుంది.
అందువల్ల
మనోబుద్ధులలో ఎటువంటి స్పందనలు, ప్రతిస్పందనలు, భావాలు, ఆలోచనలు కలిగినా ఈ ‘అహంకారం’ తెలుసుకుంటుంటుంది. అసలు బాహ్యప్రపంచంలో కనిపించే
దృశ్యాలన్నీ, స్పందన రూపంలో మన మనసులోనే ఉంటాయి. వాటినే ఈ అహంకారం చూస్తుంటుంది.
అహంకారం చూసేది మనోబుద్ధులలో కలిగే స్పందనలను, ప్రతిస్పందనలను, మనోవృత్తులనే కాని,
బాహ్య ప్రపంచాన్ని కాదని చెప్పవచ్చు. ఎవరైనా ‘నేను కొండను చూస్తున్నాను’ అంటే, ఆ
కొండ అతని మనోఫలకం మీద ఏర్పరచిన ప్రతిబింబాన్ని చూస్తున్నాడన్నమాట! Photographer తన Camera
వెనుక నల్ల గుడ్డ కప్పుకుని, Camera భూతద్దం వల్ల
లోపలి గాజు పలక మీద పడ్డ ప్రతిబింబాన్ని చూస్తూ, ఎదురుగా కూర్చున్న మనుషులను ఇటు అటు
జరుపుతాడు. ఆ విధంగనే, మనం (మన అహంకారం), మన మనసులో కలిగిన ప్రతిబింబాన్ని చూస్తూ,
మనం బాహ్యప్రపంచాన్నే చూస్తున్నామని భ్రాంతి చెందుతున్నాం.
ఆ
మనోఫలకం (మనసు అనే గాజుపలక), మలినంగా (అలజడులతో, ఆందోళనలతో కూడుకుని) ఉంటే మనకు
కనిపించే బింబం కూడ వికృతంగా ఉంటుంది. మనసు కోపవికారంతో కూడి ఉన్నప్పుడు, ఆ బింబం
పే. 31
కూడా వికారంగా కనిపిస్తుంది. మనసు నల్లగా ఉంటే
(అంటే నిద్రావస్థలో) బింబమే కనిపించదు. బాహ్యప్రపంచంలో మార్పులు లేకపోయినా మన
మనోవికారాలను బట్టి, బింబం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క తీరుగా కనిపిస్తుంది. మన మనోవృత్తులకు
అనుగుణంగా కనిపిస్తుంది. ఎట్లా అంటే, అహంకారం చూసేది బాహ్యప్రపంచం కాదు.
మనోబుద్ధులలో కలిగే మనోవృత్తులలో ఈ అహంకారం కూడ ఒక భావనే, ఒక మనోవృత్తే.
చిత్తం
: మనసు, బుద్ధి, అహంకారం అనేవి వృత్తి రూపకమైనవని చెప్పుకున్నాం. అవి సముద్ర
ఉపరితలం మీద కనపడే అలలవంటివి. అలలు ఎత్తుపల్లాలు కలిగి, నిరంతరం కదులుతుండటంవల్ల
అవి వాటి క్రింద ఉన్న, వాటికి ఆధారభూతమైన సముద్రాన్ని పూర్తిగా కప్పి, తామే సముద్రమనే
భ్రాంతిని కలుగచేస్తాయి. కాని ఆ అలల అస్తిత్వం, వాటి క్రింద ఉన్న
సముద్రమే. అలలు లేని నిశ్చలమైన సముద్రం ఉండగలదు కాని, సముద్రం లేని అలలు ఉండలేవు.
ఆ
విధంగానే ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేవి చిత్తం అనే సముద్రం మీద కదిలే అలలు. వీటి
అస్తిత్వాన్ని ‘చిత్తం’ అంటారు. ఈ మనోబుద్ధ్యహంకారాలు కలిగించే మనోవృత్తులు (అలలు)
పూర్తిగా ఆగిపోతే, మిగిలేది స్పందన, ప్రతిస్పందన, అలజడి, ఆందోళన, ఆలోచన, భావం, అనుభూతి లేని మనోపదార్థం ఒక్కటే అదే ‘చిత్తం’ అని తెలుసుకోవాలి.
గాఢనిద్రలో ఉన్నప్పుడు, మనకు బాహ్యప్రపంచంగాని, మన ఆలోచనలుగాని, ఆందోళనలుగాని, భావాలుగాని
చివరికి ‘నేను ఉన్నాను’ అనే భావం కూడ ఉండదు. అప్పుడు (వృత్తిరూపకాలైన) మనసు,
బుద్ధి, అహంకారం లేని ‘చిత్తం’ ఒక్కటే నిశ్చలంగా ఉంటుంది. వస్తుతత్త్వంలో మనోబుద్ధ్యహంకారాలు
చిత్తానికి భిన్నమైనవి కావు కాబట్టి, మనోవృత్తులను చిత్తవృత్తులు అని కూడ అంటారు.
(ఈ చిత్తం తన్మాత్రరూపం ఉన్న శుద్ధ ఆకాశతత్త్వంతో కలిగినదని చెప్తారు. అందువల్ల
దీనిని ‘చిత్తాకాశము’ అని కూడ అంటారు).
9.
ఆత్మ తత్త్వం :
స్థూలశరీరం అస్థిరమైనదని,
నాశవంతమైనదని చెప్పుకున్నాం. అలాగే సూక్ష్మశరీరమైన మనో బుద్ధులు కూడ చంచలమైనవి,
స్థిరత్వం లేనివి,
పే. 32
వృత్తిరూపకమైనవి. ఈ రెండు శరీరాలు కూడ అవస్థా భేదాలు
చెందుతుంటాయి. ఒకప్పుడు జాగ్రదవస్థలో, మరొకప్పుడు స్వప్నావస్థలో, వేరొకప్పుడు
సుషుప్తావస్థలో ఉంటాయి. గాఢనిద్రలో ఈ రెండు కూడ తమ అస్తిత్వాన్ని మరచిపోయి ఉంటాయి.
వాటికి నిత్యత్వం, నిర్వికల్పత్వం (మార్పులు లేకపోవటం) లేవు.
విశేషించి ఈ రెండు స్వయంప్రకాశమైనవి కావు. జడమైనవి, అవి స్వయంప్రతిపత్తి కలవి కావు
(తమంతట తాము నిలువగలిగేవి కావు). కాబట్టి ఈ రెండు కూడ మన నిజతత్త్వాన్ని చూడలేవు.
మార్పులు చెండుతుండేవి, మార్పులు లేని దానికిఆధారం
కారాదు.
ఈ
విధంగా ఆలోచించిన తరువాత, ఈ బాహ్యాంతర శరీరాల వెనుక, వాటికి ఆధారభూతమైన, నిర్వికల్పమైన,
నిత్యమైన, వేరొక తత్త్వం ఉన్నదని, అదే ‘నేను’, ‘నేను’ అనే భావం వెనుక ఉన్న నిజతత్త్వమని
నిర్ధారణకు వచ్చారు. అది జ్ఞానరూపమైనది. సూర్యుడికి కాంతి, వేడి స్వాభావిక
గుణమైనట్లు, జ్ఞానం (Consciousness) ఎరుక
ఈ ఆత్మకు స్వాభావికగుణం. సూర్యకాంతిలో ప్రపంచంలోని జీవరాసులన్నీ, సూర్యుడి ప్రమేయం
లేకుండానే, తమ తమ పనులలో నిమగ్నమై ఉంటాయి. సూర్యుడు సర్వకర్మసాక్షి. అతనికి తన
కాంతిలో జరిగే పనులలో అవి మంచివైనా, చెడ్డవైనా వాటితో ఎటువంటి ప్రమేయం లేదు. ఆ విధంగానే
ఈ ఆత్మజ్ఞానప్రకాశంలో ఈ శరీరమనోబుద్దులు తమతమ అన్ని పనులను చేసుకుంటుంటాయి. అలాంటి
పనులన్నిటికీ ‘ఆత్మ’ సాక్షి మాత్రమే. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తుంటాడు. భూమి తన
చుట్టూ తాను తిరుగుతూ, తన నీడలోకే తాను వచ్చినప్పుడు అంధకారంలో మునిగిపోతుంది. అంతమాత్రాన
సూర్యుడు లేడని కాదు. ఆ విధంగనే ‘ఆత్మ’ ప్రకాశంలో చిత్తం ఉన్నప్పుడు, అది
చైతన్యవంతమై, స్థూలశరీరాన్ని కూడ చైతన్యవంతం చేస్తుంది. వెంటనే స్థూల, సూక్ష్మ
శరీరాలు తమ తమ పనులు చేయటం మొదలుపెడతాయి. గాఢనిద్రలో ‘చిత్తం’ తమస్సులో ఉన్నప్పుడు
ఆత్మ తేజం మరుగున పడుతుంది. అప్పుడు స్థూల, సూక్ష్మశరీరాలు చైతన్యాన్ని కోల్పోయి
నిద్రావస్థలో ఉంటాయి. స్వప్నావస్థలో ‘చిత్తం’ రజోగుణ ప్రాధాన్యం కలిగి, ఆత్మప్రకాశం
కొద్దికొద్దిగా ఉన్నప్పుడు, మనోబుద్ధులలో, మిగిలిపోయిన మనోవృత్తులను, పాత సంఘటనల
స్మృతిరూపకమైన మనోవృత్తులను, కలిపి ప్రకాశింపచేయటం వల్ల పలురకాలైన స్వప్నాలు కలుగుతుంటాయి.
పే. 33
కాని, ఆ అసంపూర్ణజ్ఞానంలో, స్వప్నరూపకమైన ఈ
మనోవృత్తులు బాహ్యప్రపంచంలో కలిగే యథార్థ సంఘటనలలాగ అనుభూతి కలిగిస్తాయి. చిత్తం ఈ
విధంగా కొన్ని అవస్థలలో కొన్ని విధాలుగా ఉన్నా, ఆత్మతత్త్వం మాత్రం సూర్యుడిలాగ,
ఒకే విధంగా, ఎటువంటి మార్పులు లేకుండా ప్రకాశిస్తుంటుంది.
ఈ
జ్ఞాన రూపకమైన ఆత్మతత్వమే మన నిజతత్త్వమని మన శాస్త్రాలన్నీ అంగీకరిస్తున్నాయి.
ఈ
సందర్భంలో ఒక ముఖ్యవిషయం గమనించవలసి ఉంటుంది. ‘ఆత్మ’ అనేది మన శరీర మనోబుద్ధులకు
వేరై వాటికి ఆధారభూతమైన తత్త్వాలను, మన వేదాంతగ్రంథాలలో, తదితర గ్రంథాలలో ‘ఆత్మ’
అనే పదాన్ని వేరువేరు సమయాలలో వేరువేరు అర్థాలలో వాడుతుంటారు. ‘ఆత్మ’ అనే పదం ‘నేను’
అనే అర్థంలో, ఒకప్పుడు దేహాన్ని సూచించేదిగా ఒకప్పుడు మనసును, వేరొకప్పుడు
బుద్ధిని, మరొకప్పుడు జీవాత్మను సూచిస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు శుద్ధ ఆత్మతత్త్వం
అనే భావంలో సర్వాత్మతత్త్వానికి కూడ వాడుతుంటారు. అందువల్ల సందర్భాన్ని బట్టి
‘ఆత్మ’ అనే పదం దేనిని సూచించటానికి వాడబడినదో చూసుకుంటుండాలి.
10.
జీవాత్మ లేక జీవుడు :
ప్రతి మానవుడు ఈ ప్రపంచంలో వ్యవహరించేటప్పుడు,
తనలోతాను ఆలోచించుకుంటున్నప్పుడు ‘నేను’, ‘నాది’ అనే మాటలను వాడుతుంటాడు. ‘నేను’
అనే పదం కర్తను, భోక్తను, ద్రష్టను అనే భావంలో వాడుతారు. ‘నాది’ అనే పదం ‘నేను’
అనే పదానికి భిన్నంగా వాడుతుంటాం.
‘నేను
సుబ్బారావును’ అనే చెప్పినప్పుడు సుబ్బారావు అన్న పేరే తాను అనే భావం కలుగుతుంది.
కాని ‘నుబ్బరావు అనే పేరు నాది’ అన్నప్పుడు ‘నేను’ వేరు, సుబ్బారావు అనే పేరు
వేరని చెప్పగలం. ఒకటి ఆత్మపరమైన (Subjective) పదం.
ఇంకొకటి అన్యపరమైన (Objective) పదం. ‘నాది’
అన్నప్పుడు ‘అది నేను కాను’ అని చెప్తున్నట్లే భావించవచ్చు.
‘ఈ
దేహాన్ని నేను’ అన్నప్పుడు ఆ వ్యక్తి దేహమే తానుగా వ్యవహరిస్తున్నాడన్న మాట, కాని,
‘ఈ దేహం నాది’ అన్నప్పుడు ‘నేను వేరు’ ‘ఈ దేహం వేరు’
పే. 34
అనే భావం కలుగుతుంది. ‘నేను’, ‘నాది’ అనే భావాలలో
‘నాది’ ‘నాది’ అని చెప్పుకోగలిగినవన్నీ ‘నేను’ కాదు అని చెప్పవచ్చు.
పైన
చెప్పిన వివరణ ఆధారాన్ని తీసుకుని, మనలో ‘నేను’ ‘నేను’
అనేది ఎవరు అనేది నిర్ధారించవచ్చు.
ఈ
శరీరం ‘నాది’ కాబట్టి నేను శరీరాన్ని కాను.
ఈ
మనసు ‘నాది’ కాబట్టి నేను మనసును కాను.
ఈ
బుద్ది ‘నాది’ కాబట్టి నేను బుద్ధిని కాదు.
ఈ
విధంగా ఒక్కొక్కదానిని తిరస్కరించుకుంటూ పొతే, ‘నేను’ అన్నది ఏమైనా చేతికి
అందుతుందా? లేక శూన్యమే మిగులుతుందా? మనం వేటిని ‘నేను’ ‘నేను’ అని భావించుకుంటూ
వచ్చామో, అవన్నీ ‘నావి’, ‘నావి’ అనే భావంలోకి పోతుంటాయి. అందువల్ల ఆ ‘నాది’ అనే
భావం ఎక్కడ ఏ విధంగా కలుగుతున్నదో ఆలోచిద్దాం.
ఇంతకు
ముందు మనం ‘అహంకారం’ గురించి చెప్పుకున్నాం. ‘నేను చూస్తున్నాను’, ‘నేను
చేస్తున్నాను’, ‘నేను అనుభవిస్తున్నాను’ (ద్రష్ట, కర్త, భోక్త) అనే భావన వెనుక
‘నేను’ అనేది ఏదో ఉన్నది. అదేమిటో ఆ భావానికి కూడ తెలియదు. అన్ని మనోవృత్తులలాగ
అది కూడ ఒక మనోవృత్తే. అప్పటి వరకు, స్థూలశరీరంతో సహా, సూక్ష్మశరీరంలో కలిగే అన్ని
మనోవృత్తులను, ‘నావి’, ‘నావి’ (ఈ శరీరం నాది, ఈ కోపం నాది, ఈ ఆలోచన నాది) అని
అంటున్న వ్యక్తి ‘అహంకారం’ వద్దకు వచ్చేసరికి ‘అది నాది’ అని అనలేకపోతున్నాడు.
అక్కడకు వచ్చేసరికి ‘ఇదే నేను’ అనే భావం స్ఫురిస్తుంటుంది. ఈ ‘అహంకార’ భావన కూడ ఒక
మనోవృత్తే అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే, గాఢనిద్రలో ఈ భావన కూడా ఉండదు. కాని ఈ
మనోవృత్తిని కలిగించే శక్తి ఎటువంటిదో ఎవ్వరూ చెప్పలేకపోవటంవల్ల, ఆ మనోవృత్తే, ఆ
భావనే, ‘నేను’గా వ్యవహరిస్తుంది. గాఢనిద్రలో లేని ఈ ‘నేను’ అనే భావన ఈ అహంకారం మెలుకువ
రాగానే, ఒక్కసారి, ‘నేను ఉన్నాను’ అనే భావంతో లేచి, జాగ్రత్ స్వప్నావస్థలలో తానే
కర్తగా, ద్రష్టగా, భోక్తగా వ్యవహరించటం మొదలుపెడుతుంది. కాని, ఈ ‘అహంకారం’, ఈ భావన
నిజమైన ‘నేను’ కాదు.
పే. 35
ప్రతీ
పెద్ద వ్యాపారసంస్థకు, ఒక ముఖ్యవ్యవహర్త – ప్రధానాధికారి (Managing Director) ఉంటాడు. అతను ఆ సంస్థ వ్యవహారాలను
సక్రమంగా నిర్వహించటానికి కావలసిన అధికారం (General
Power of Attorney) పొంది, అన్ని వ్యవహారాలు తానే చూస్తుంటాడు, కాని,
కొంత కాలానికి, తాను ఒక అధికారి మాత్రమే అన్న విషయం మరిచిపోయి, ‘నేను సంస్థను’
అన్నట్లు వ్యవహరించటం మొదలుపెడతాడు. ఆ విధంగానే ఈ ‘అహంకార భావన’ కూడా తన వెనుక
ఉన్న ‘శక్తి’ ని గ్రహించలేక, తానే ‘నేను’ గా వ్యవహరిస్తాడు. అందువల్ల ఆ ‘అహంకార’
భావనే ‘జీవుడు’, ‘జీవాత్మ’ అని పిలవటం మొదలుపెట్టారు.
ప్రధాన
కార్యకర్త వెనుక, అతనికి సర్వాధికారాలను ఇచ్చే ‘సంస్థ’ లేకపొతే ఆ ప్రధానాధికారికి
ఎటువంటి విలువలేదు. ఎట్లాంటి అస్తిత్వం లేదు. ఆ విధంగానే ‘నేను’గా వ్యవహరిస్తున్న
ఈ ‘అహంకార భావన’ వెనుక ఆధారభూతమైన ఒక నిత్యపదార్థం, సత్ పదార్థం లేకపోతే
ఆ ‘అహంకారా’నికి కూడ అస్తిత్వం ఉండదు. ఆ సత్ పదార్థమే ‘ఆత్మ’తత్త్వం.
జ్ఞానరూపకమైన
‘ఆత్మ’తత్త్వజ్ఞాన ప్రకాశం చిత్తంలో ప్రతిబింబితమై, ‘నేను’ అనే భావనను
కలుగచేస్తుంది.
సూర్యకాంతి
ప్రవేశించలేని గదిలో చీకటి నిండి ఉంటుంది. కాని గది బయట ఉన్న సూర్యకాంతిలో ఒక అద్దం
పెట్టి, ఆ కాంతిని గదిలోకి పంపించవచ్చు. అప్పుడు గది అంతా కాంతితో నిండిపోతుంది. ఆ
కాంతి సూర్యుడివల్ల కలిగినది అయినా, అదే శుద్ధమైన సూర్యరశ్మి కాదు. అద్దం ద్వారా
పరావర్తనం అయిన కాంతి. అద్దం ఎర్రరంగులో ఉంటే, గదిలోకి ప్రవేశించే కాంతి కూడ
ఎర్రగా ఉంటుంది. ఆ గదిలో వస్తువులు కూడ ఎర్రగా కనపడతాయి. అద్దం మలినంగా ఉంటే,
వస్తువులు కూడ అస్పష్టంగా కనపడతాయి.
ఆ విధంగనే
ఆత్మజ్ఞానప్రకాశం చిత్తం (బుద్ధి) అనే అద్దంలో ప్రతిబింబితమై, ఆ చిత్తాన్ని ప్రకాశవంతం
చేస్తుంది. ఆ పరావర్తిత జ్ఞానప్రకాశంలో, చిత్తంలో కలిగే మనోవృత్తులన్నీ
ప్రకాశితమవుతాయి. ‘అహంకారం’ అనే మనోవృత్తి కూడ ప్రకాశితమై (జ్ఞానవంతమై), ‘నేను’
అనే
పే. 36
భావంలో మెలుగుతుంది. కాని, ఈ ‘అహంకారం’, తాను
పరావర్తితకాంతితో తేజోవంతమైనదనే విషయాన్ని తెలుసుకోక, తానే స్వయం ప్రకాశుడినని
అనుకుని, తానే ద్రష్టగా, కర్తగా, భోక్తగా భావించి వ్యవహరిస్తుంటుంది. శరీర
మనోబుద్ధులలో జరిగే అన్ని పనులకు తానే బాధ్యుడనని భావిస్తుంది. మంచి జరిగితే
సంతోషిస్తుంది, చెడు జరిగితే దుఃఖిస్తుంది, కష్టాలు ఎదురైతే ఆందోళన చెందుతుంది,
సుఖాలను కావాలనుకుంటుంది, కష్టాలను ద్వేషిస్తుంది, ఆలోచిస్తుంది, విచారిస్తుంది,
కోపం తెచ్చుకుంటుంది, భయం చెందుతుంది.
తన
నిజతత్త్వమేమిటో తెలుసుకోలేక, ఈ ‘జీవుడు’ ఒక అసహాయస్థితిలో ఉంటాడు. తన స్థితి తనకు
అవగతం అవుతుంటుంది, దానిని అధిగమించటం ఎలానో తెలుసుకోడు. ఈ ప్రపంచం ఎందుకు ఉన్నదో
తెలియదు. అందులో తన కర్తవ్యమేమిటో తెలియదు, తన వాంఛల ప్రోద్బలంవల్ల ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూ,
వాటి వల్ల కలిగిన సుఖదుఃఖాలను అనుభవిస్తుంటాడు. కాని ఆ జీవభావం వెనుక ఉన్న ఆత్మతత్త్వానికి
మాత్రం ‘జీవుడు’ అనుభవించే సుఖదుఃఖాలలోగాని, అతను చేసే పనులతో గాని, ఎటువంటి సంబంధం
లేక నిర్వికారంగా, నిశ్చలంగా,
నిర్వికల్పంగా ఉంటుంది.
11.
నిరీశ్వర – ఈశ్వర వాదాలు :
కొందరు (చాలామంది), ఈ జీవుడే
నిజమైన వ్యక్తి తత్వమని ___, అంతకు మించి ఆశించవలసింది, తెలుసుకోవలసినది,
చేయవలసినది మరొకటి లేదని అనుకుని, జీవితం విభిన్న సంఘటనల పరంపర అని, దీనికి
మృత్యువే అంతమని, అంతకు మించింది మరొకటి లేదని, అందువల్ల, ఈ జీవితాన్ని సుఖవంతం చేసుకోటానికి
తగిన మార్గాలను చేపట్టాలని అనుకుని, మహాప్రవాహంలో కొట్టుకుపోయే కర్రముక్కలలాగ,
అస్వాధీనంగ కాల ప్రవాహంలో కొట్టుకునిపోతుంటారు.
కాని కొందరు ఇదే నిజమని
నమ్మలేక, దీని వెనుక ఏదో ఒక నిజం ఉండాలని, ఒక అజ్ఞాతశక్తి ఉండాలని, లేకపోతే ఈ
అనిత్య ప్రపంచములో, ఈ విధంగ దుఃఖాలను అనుభవిస్తూ జీవించటంలో పరమార్థం ఏమీ లేదని
ఊహించి, ఆ అజ్ఞాతశక్తి తత్త్వాన్ని తెలుసుకోటానికి ప్రయత్నించారు.
పే. 37
కొందరు
ఆ శక్తిని ఈశ్వరుడని, అతడు శాశ్వతుడని, సర్వజ్ఞుడని, సర్వవ్యాపకుడని, అతడే ఈ
ప్రకృతిని స్వాధీనపరచుకుని సృష్టి కార్యాన్ని చేస్తాడని, అతని కృప ఉంటే ‘జీవుడు’ ఈ
జనన మరణ చక్రం నుంచి ముక్తుడై, ఈశ్వరుడితో సాయుజ్యం పొందుతాడని, అందువల్ల ఆ
ఈశ్వరుడినే సర్వదా ఆరాధించాలని చెప్తారు.
వివిధ
మతానుసారంగా, ఆ ఈశ్వరుడు విష్ణువని, శివుడని, పరమాత్మ అని, శక్తి అని – ఈ
విధంగ కొన్ని నామాలతో వ్యవహరిస్తుంటారు. ఈ సృష్టి కార్యమంతా ఆయన వల్లనే జరిగింది,
ఈ జగత్తులో జరిగే ప్రతి పనీ అతని సాక్షిత్వంలోనే జరుగుతుంది. ఈ జగత్తు ఆయన ‘ఇష్టం’
ఉండేవరకు ఉంటుంది. ఆ తరువాత అది ఈశ్వరుడిలోనే కలిసిపోతుంది. లేక అవ్యక్తంగా మిగిలిపోతుంది,
ఈశ్వరుడు ఒక్కడే ప్రళయం తరువాత కూడ ఉంటాడు. మళ్ళీ అతనికి ‘ఇష్టం’ కలిగినప్పుడు ఈ
జగత్తును సృష్టిస్తాడు, ఈ సృష్టి, స్థితి, లయాలు ఆయనకు ఒక ‘లీల’వంటివని చెప్తారు.
అన్ని
ద్వైతమతాలకు మౌలికమైన సిద్ధాంతం ఇది. సృష్టిక్రమంలో సృష్టికి ముందు ఉండే ఈశ్వరుడు
ప్రధానలక్షణాలలో, అతనికి, జీవుడికి ఉన్న సంబంధంలో విభిన్న
మతాలు విభిన్న సర్వాధికారాలు గల ప్రభువు. జీవుడు ఎటువంటి అధికారాలు లేని,
పరాధీనుడైన భృత్యుడు.
12.అద్వైత
సిద్ధాంతాలు :
అద్వైతసిద్ధాంతాలు, ద్వైతసిద్ధాంతానికి భిన్నమైనవి. అద్వైతసిద్ధాంతం ప్రకారం ఈ జగత్తంతటికి
(జీవుడితో సహా), మూలపదార్థం ఒక్కటే. దానిని ‘శివ శక్తి’ అని తంత్రశాస్త్రం, ‘బ్రహ్మం’ అని వేదాంత శాస్త్రం అంటున్నాయి.
‘శివ శక్తి’ ప్రధానంగా బీజ రూపంలో
ఉన్న ‘సృజన శక్తి’. అది అర్ధనారీశ్వర తత్త్వంగా, శివుడి అంశ,
శక్తి అంశ కలసిన ఒక అవ్యక్త, అనావిర్భావస్థితి. సృష్టికి ముందు ఆ ‘శివశక్తి’ లో ఒక
(వాంఛా రూపకమైన) సంచలనం కలిగి ఆ శివశక్తి శివుడిగా, శక్తిగా విడిపోతాయి. శివుడు
ప్రధానంగా
పే. 38
జ్ఞానరూపుడు అయిన పురుషుడు, శక్తి ప్రధానంగా ఈ
పాంచభౌతిక ప్రపంచానికి చిత్తానికి కారణం. ఈ విశ్వంలోని సమస్తం (అందరు దేవతలతోకూడ),
ఈ రెండిటివల్లనే కలుగుతుంది. మళ్ళీ కల్పాంతంలో, శక్తి తిరిగి శివుడితో కలిసి ‘శివ
శక్తి’ గా అద్వైతభావంతో బీజరూపంలో ఉంటుంది.
కాని
వేదాంతశాస్త్రం ప్రకారం, అద్వైతమైన పరబ్రహ్మతత్త్వం ఎప్పుడూ అద్వైతంగనే
ఉంటుంది. అందులో మనకు కనపడే విభిన్నత్వం లేదు. దీని గురించి ముందు పరిశీలిద్దాం.
13.ప్రత్యగాత్మ
– సర్వాత్మ – పరమాత్మ :
క్రిందటి మాట జీవుడి వెనుక ఉన్న
ఆధారం ఆత్మతత్త్వమని, అది జ్ఞానస్వరూపమైనదని, ఆ ఆత్మజ్ఞానం చిత్తంలో ప్రతిబింబించటం
వల్లనే జీవభావం కలుగుతున్నదని చెప్పుకున్నాం. ప్రతి జీవిలో ఉన్న ఆత్మతత్త్వం ప్రత్యగాత్మ అని, జీవాత్మ అని అంటారు. ఈ ఆత్మతత్త్వం
ప్రత్యేకమైన శరీరంతో కూడి, ఆ శరీర మనోబుద్ధులను ప్రకాశింపచేస్తూ, వాటితో తాదాత్మ్యం
పొందటం వల్ల దానికి ప్రత్యగాత్మ అని పేరు వచ్చింది. ఆ ఆత్మతత్త్వం ఆ శరీర
మనోబుద్ధులవల్ల కప్పబడినదై తన నిజతత్వాన్ని మరిచిపోయి, మహాసముద్రంలో ఒక ప్రత్యేక
అలలా ‘తను వేరు’ అనే భావంతో ఉంటుంది. పరమాత్మ
సర్వవ్యాపకమై మహాసముద్రంలాగ ఉంటాడు. వస్తుతత్త్వంలో సముద్రానికి, దానిపై కదిలే
అలకు భేదం లేనట్లు, ప్రత్యగాత్మకు, పరమాత్మకు వస్తుతత్త్వంలో భేదంలేదు. ప్రత్యగాత్మ
ఒక ఉపాధితో (శరీరంతో) కూడుకున్నది. పరమాత్మ ఆ శరీరమైంది. అన్ని ఉపాధులలో (శరీరాలలో)
ఉండే ఆత్మతత్వాన్ని సర్వాత్మతత్త్వం అంటారు, వస్తుతత్త్వంలో మూడు ఒక్కటే.
అప్పుడప్పుడు పరమాత్మను, సర్వాత్మ అని కూడ అంటారు.
14.
బ్రహ్మతత్త్వం :
బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు,
అది అనాది అని, అంతం లేనిదని, సర్వవ్యాపకమైనదని, సర్వాత్మతత్త్వమని,
నిరాకారమైనదని, నిర్వికారమైనదని, నిర్వికల్పమైనదని, ఇంద్రియ మనోబుద్ధులకు
అతీతమైనదని, సత్-చిత్-ఆనంద స్వరూపమైనదని, ఆకాశంలాగ
పే. 39
అనంతమైనది, అవిచ్ఛిన్నమైనది, నిరంజనమైనది, అలలులేని
మహాసముద్రంలాగ నిశ్చలమైనది, చంద్రకాంతిలాగ మధురానుభూతి కలుగచేసేదని – ఈ విధంగా కొన్ని
విధాలుగా చెప్తుంటారు. అది అనిర్వచనీయమైనది, అనుభవ గ్రాహ్యమైనది. బ్రహ్మంలో నిలిచినవారికి
ఈ దృశ్యప్రపంచం కనిపించకనే కనిపించదని, కనిపించినా స్వప్నంలాగ కనిపిస్తుందని
చెప్తారు.
అంతా
బ్రహ్మమే అయినా, ఈ దృశ్య ప్రపంచమేమిటి? జీవుడు ఎవరు? నేను బ్రహ్మం అయితే, ఆ అనుభవం
నాకెందుకు కలగటం లేదు? అన్నీ అద్వయమైన బ్రహ్మతత్త్వమే. అందులో నువ్వు, నేను, వాడు
అనే విభేదం లేదు. ఈ దృశ్యప్రపంచం లేదు. ఈ వివిధతత్త్వం లేదు. ఈ విభిన్నత్వం లేదు.
కాని మన భ్రమ వల్ల ఈ వివిధత్వం, విభిన్నత్వం కనిపిస్తుంది. నువ్వు,
నేను, వాడు, అది అనే భేదభావం కలుగుతుంటుంది. ఆ భ్రమ తొలగిపోగానే నీ నిజతత్త్వమైన
అఖండ బ్రహ్మతత్త్వం అవగతమవుతుంది. ఇది అద్వైతవేదాంత సిద్ధాంత సారాంశం.
కాని
పైన చెప్పినంత సులభంగా దీనిని అర్థంచేసుకోలేం. దీనిని తెలుసుకోటానికి ఎంతో
విచక్షణాజ్ఞానం అవసరం.
ముందుగా
బ్రహ్మం గురించి చెప్తున్నప్పుడు అది సత్-చిత్-ఆనంద స్వరూపుడని చెప్తుంటారు.
మనకు
కనిపించే దృశ్యప్రపంచం వెనుక ఒక సత్పదార్థం, ఈ విశ్వానికంతా
ఆధారభూతమైనది ఉన్నది. అది నిత్యమైనది, శాశ్వతమైనది, మార్పులు చెందినది. దేశ, కాల,
కారణ నియమాలు లేనిది (ఈ మూడు మార్పులు చెందే వాటిలో మాత్రమే ఉంటుంది).
ఆ
విధమైన సత్పదార్థం ఉన్నదని ఎవరు తెలుసుకుంటున్నారు? ఆ సత్పదార్థం తననుతాను
తెలుసుకునే జ్ఞానం కూడ అందులోనే ఉన్నది. ‘నేను ఉన్నాను’ అనే భావంతో ఆ సత్-పదార్థం నిండి
ఉన్నది. ఆ ఉండటం, ఈ తెలుసుకోవటం ఎందుకు? ఆనందం అనుభవించటానికి.
ఆ సత్ పదార్థం ‘నేను ఉన్నాను’ అనే జ్ఞానంలో ఆనందం అనుభవిస్తూ ఉంటుంది.
ఆ
ఉనికికి, ఆ జ్ఞానానికి, ఆ ఆనందానికి దేశ, కాల, కారణ నిమిత్తం లేదు. అది సర్వదా ఆ
విధంగనే ఉంటుంది. అలాంటి సచ్చిదానంద స్వరూపమే నువ్వు, ఈ సమస్త జీవరాసులు కూడ
బ్రహ్మమే. ఈ చరాచరప్రపంచమంతా సత్-పదార్థమే. చైతన్యవంతాలైన జీవరాసులన్నిటిలో
చిత్-శక్తి ప్రకాశిస్తుంటుంది. అన్ని జీవరాసులలో ప్రధానమైన (ప్రగాఢమైన) వాంఛ
ఆనందమే.
15.మాయ :
అలా అయితే మన నిజతత్త్వమైన ఆ
బ్రహ్మాన్ని మనమెందుకు తెలుసుకోలేకపోతున్నాం? దానికి కారణం ‘మాయ’ అంటారు.
అప్పుడప్పుడు తనను తాను మరిచిపోయే శక్తి కూడ బ్రహ్మంలో ఉన్నది. అదే మాయాశక్తి.
దానిని ‘అవిద్య’ అని కూడ అంటారు.
ఆ
‘మాయ’ తామసం, రాజసం, సాత్వికం అనే మూడు గుణాలతో కూడుకుని
ఉన్నది. తామసానికి నిజాన్ని మరగుపరచే గుణం ఉన్నది. ఆ గుణంవల్ల మన నిజతత్త్వమేమిటో
మనం మరచిపోతాం. ఆ గుణాన్ని ‘ఆవరణ శక్తి’ అంటారు, మన నిజతత్త్వాన్ని మరిచిపోగానే రజోగుణంలోగల
‘విక్షేపశక్తి’ మన నిజతత్త్వం మరిచిపోయిన మనలో ‘నేను అనంతమైన బ్రహ్మతత్త్వాన్ని కాను,
పరిమితమైన జీవుడను’ అనే భావం ప్రతివారిలో కలుగచేస్తుంది. తాను పరిమితమైనవాడని, ఈ
ప్రపంచమంతా తనకు భిన్నమైనదని ఊహ ఎప్పుడు జన్మించిందో, అప్పుడే భయాలు, ఆందోళనలు, అలజడులతో కూడిన మనసు జన్మిస్తుంది. ఆ ‘మనసు’ ద్వారా బయటకు
చూసినప్పుడు ఏకరసంతో కూడుకున్న విశ్వమంతా, విభిన్నత్వంతో కనిపిస్తుంది. అప్పుడు
‘నేను వేరు’ అనే భావం స్థిరపడి కొన్నిటిలో ‘ఇవి నావి’ అనే భావం కూడ కలిగిస్తుంది.
ఈ అహంకార, మమకారాలు ఈ విశ్వాన్ని మరికొంత భిన్నం చేశాయి. మన నిజతత్త్వంలో లేని
వాంఛ, భయ, మోహాలను సృష్టించింది. ద్వంద్వ భావాలను కలుగచేసింది. కామ, క్రోధ, లోభ,
మోహ, మద, మాత్సర్యాలను మనోవృత్తులను కలుగచేసింది. ఇవన్నీ మనసు చేసిన సృష్టి. ఈ
మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ మాయ వల్ల కలిగినవే.
ఈ
మాయవల్ల కల్పించబడ్డ మూడుగుణాల ప్రోద్బలం వల్ల మనిషి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తుంటాడు.
మంచిచెడ్డలను అనుభవిస్తుంటాడు.
పే. 41
సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. చనిపోయిన తరువాత,
కర్మఫలవశాన తిరిగి పుడుతుంటాడు.
‘వ్యక్తి’స్థాయిలో
ఈవిధంగ జరుగుతుండగా, జగత్తుస్థాయిలో కూడ మాయాప్రభావం వల్ల బ్రహ్మంలోని ఒక ‘అంశ’ (తన
నిజతత్త్వాన్ని మరిచిపోయి), ఈ జగత్తుకు కారణరూపుడైన ‘హిరణ్య గర్భుడి’గా
(విశ్వమనసుగా) తరువాత ‘విరాట్ స్వరూపుడిగా’ (దృశ్య జగత్తుకు) మారుతుంది. జీవుడికి,
శరీరం, మనసు, బుద్ధి ఎటువంటివో, ఈశ్వరుడికి విరాట్ స్వరూపం, తైజసం, ప్రాజ్ఞం అటువంటివి. ఆ మూడు కలిసిన
మహాపురుషుడు ఈశ్వరుడు.
ఈ
మాయాకల్పిత సృష్టికార్యం, బ్రహ్మతత్త్వం అంతా ఆక్రమించి ఉండనక్కరలేదు.
మహాసముద్రంలోని ఒక అలలాగ, ఎక్కడో ఒకచోట ఉండవచ్చు. మిగిలిన బ్రహ్మతత్త్వమంతా
నిర్వికారంగా ఉండవచ్చు. లేక, సముద్రంలోని కొన్ని అలలలాగ, ఇటువంటి జగత్తులు ఎన్నైనా
ఉండవచ్చు. ఎన్ని ఉన్నా బ్రహ్మతత్త్వం అనంతం, కాబట్టి దానిలో
ఎటువంటి మార్పు రాదు.
అంతకుముందు
చెప్పుకున్న ఆత్మతత్త్వానికి, బ్రహ్మతత్త్వానికి భేదం లేదు. మాయకు లోనై ఒక ఉపాధిని
(ఒక శరీరాన్ని) ఆశ్రయించుకుని ఉన్న (బ్రహ్మతత్త్వం) ఆత్మతత్త్వమే ప్రత్యగాత్మ. ఈ
విశ్వమే ఉపాధిగాగల ఈశ్వరుడు సర్వాత్మ, ఎటువంటి ఉపాధి లేనిది పరమాత్మ. పరమాత్మకు,
పరబ్రహ్మానికి భేదం లేదు.
దీనిని
బట్టి ఈ సృష్టి అంతా బ్రహ్మతత్త్వమే అయినా, మాయవల్ల నిజం మరుగుపడి, వేరే విధంగా కనపడుతున్నదని
చెప్పవచ్చు. అంతేకాక ఈశ్వరుడు, జీవుడు ఇద్దరు బ్రహ్మతత్త్వం కలవారే, ఇద్దరు కూడా
మాయకులోనై ఉన్నవారే అని, వారి వారి ఉపాధుల తరతమ భేదాల వల్ల అల్ప, అధిక రూపాలలో
కనిపిస్తున్నారని కూడా చెప్పవచ్చు.
16.సృష్టి
– మాయావాదం :
ఈ మాయావాదం వల్ల సృష్టి అనే పదానికి
నిర్వచనమే మారిపోయింది.
వివిధ
మతసిద్ధాంతాల ప్రకారం, సృష్టి భగవంతుడి ఇష్టపూర్వక కార్యం. ఈ లోకాలను
సృష్టిస్తానని అనుకుని, భగవంతుడు తనలో
పే. 42
నుంచే – సాలె పురుగు తననుంచి వచ్చే పదార్థంతోనే
సాలెపట్టును నిర్మిస్తున్నట్లు, ఈ సమస్త జగత్తును సృష్టించాడు. మళ్ళీ కల్పాంతరంలో ఈ
సర్వం తనలో లయపరచుకుంటాడు. ఈ మధ్యకాలంలో ఈ జగత్తంతటికి తానే అధిపతి, నియంత,
ప్రభువు. ఈ మతాలవారు మాయ ఉన్నదని ఒప్పుకున్నా, మాయ కూడ భగవత్కల్పితమే. దాని వల్ల
భగవంతుడు లోకాలనుంచి తన నిజతత్వాన్ని మరగుపరుస్తాడని, ఎవరు తనను అనన్యభక్తితో
సేవిస్తారో, వారిని మాత్రం ఈ మాయ నుంచి తరింపచేసి, తనవద్దకు చేర్చుకుంటాడని
భావిస్తారు.
మరొక
సిద్ధాంతం ప్రకారం సృష్టికి ముందుగల ఆదిశక్తి (శివ శక్తి) సృష్టికార్యం ఆరంభమవటానికి
ముందు ప్రకృతి (స్త్రీ శక్తి)గా, పురుషుడు (పురుష శక్తి)గా విడిపోయి, ఆ రెండిటి
సంయోగంవల్ల ఈ విశ్వమంతా, అందులోని జీవరాసులన్నీ, పుట్టాయని, తిరిగి కల్పాంతంలో ఇవన్నీ
ఆదిశక్తిగా మారిపోతాయని చెప్తారు.
కొందరు
నిరీశ్వరవాదులు, మూలప్రకృతి కొన్ని అంతర్గత శక్తులవల్ల విభిన్న రూపాలుగా మారినదని,
ఈ మార్పు ప్రకృతికి సహజమని, ఇందులో ఎప్పుడు ఏమి జరుగుతుంటుందో చెప్పటం కష్టమని, ఈ
నిరంతర పరిణామ స్థితికి ఆది, అంతం లేదని చెప్తుంటారు.
కాని
అద్వైతవేదాంత సిద్ధాంతం ప్రకారం, పూర్వం,
ఇప్పుడు, ఇక ముందు కూడ ఉండేది మార్పులేని అఖండమైన బ్రహ్మతత్త్వమే అని, సృష్టి అన్నది
జరగనే లేదని, ఈ బ్రహ్మతత్వమే అయిన మనం, మాయవల్ల కల్పించబడిన
ఒక భ్రాంతిలో పడి, మన నిజతత్త్వం మరచిపోయి, ‘నేను వేరు’ అనుభవంతో, ఆ బ్రహ్మతత్త్వాన్ని
చూస్తుండటం వల్ల, ఆ అఖండ బ్రహ్మతత్త్వమే, విభిన్నమైన బ్రహ్మాన్ని తెలుసుకున్నంతనే,
మాయవల్ల కలిగిన ప్రపంచమనే భ్రమ తొలగిపోయి, అంతటా అఖండ అద్వైత బ్రహ్మతత్వమే అనుభవానికి
పస్తుందని చెప్తారు.
ఇది
సంభవమని చెప్పటానికి దృష్టాంతంగా తాడును చూసి పామనుకోవటం, చెట్టు మొద్దును చూసి దయ్యమనుకోవటం, ఎండమావులను
నీరనుకోవటం, స్వప్నప్రపంచాన్ని యదార్థమనుకోవటం, ఈ విధంగా ఎన్నో భ్రాంతి జనిత సన్నివేశాలను (దృష్టాంతాలుగా) చూపిస్తారు.
పే. 43
పై
ఉదాహరణలన్నిటిలో, అసలు వస్తువు నిజతత్త్వం తెలియకపోవటంవల్ల, దానిని వేరొక
వస్తువుగా ఊహించి, అదే నిజమని భావించటం జరుగుతున్నది. ఈ ప్రక్రియను ‘అధ్యాసము’
అంటారు. ఒక వస్తువుపై ఇంకొక వస్తువు అనే భావాన్ని ఆరోపించటం ‘అధ్యాస’ అనబడుతుంది.
ఆ అధ్యాసభావం తొలగిపోగానే, వస్తువు నిజతత్త్వం తనంతటతానే మేఘాలు తొలగిపోయిన తరువాత
సూర్యుడిలాగ తెలుస్తుంది. ఆ విధంగనే, ‘నేను పరిమితమైన జీవుడను’ అనే భ్రమ
తొలగిపోగానే, తన నిజతత్త్వమైన బ్రహ్మభావం తనంతట తానే అనుభవానికి వస్తుంది. అ అనుభవంలో
జీవుడు లేడు. శరీర మనోబుద్దులు ఉండవు. ఈ బహుళ ప్రపంచం ఉండదు. అంతా అవిచ్ఛిన్న,
అఖండ, అద్వైత బ్రహ్మమే. ఆ అనుభవం పరమానందకరమైనది.
ఈ
సిద్ధాంతానికి ఎన్నో శ్రుతులను (ఉపనిషత్తులను) ప్రమాణంగా చూపిస్తారు. అంతేకాక,
గాఢనిద్రలో అందరి అనుభవం ఒక్కలాగే ఉంటుంది. ఆ అనుభవంలో జాతి, కుల, ధర్మ, ఆశ్రమ,
వయో భేదాలు లేవు. అది ఒక అనిర్వచనీయమైన దుఃఖరహితమైన పరిస్థితి. కాని ఆ సమయంలో మన
జ్ఞానం మరుగుపడి ఉండటమువల్ల, ఆ అనుభవాన్ని మనం చెప్పలేకపోతున్నాం. ఆ విధంగనే, ఏ మతంలోనైనా,
మహాత్ములు అనుభవించే సమాధిస్థితిలో అనుభవం ఒక్కలాగే ఉంటుందని, వారి మాటలవల్ల
తెలుసుకోగలం. ఆ స్థితిలో వివిధత్వం ఉండదని, అది ఒక పరమశాంతమైన, అనిర్వచనీయమైన
ఆనందానుభవమని, అక్కడ కాల, స్థల, కారణాలు లేవని కూడ చెప్తుంటారు.
17.బంధం –
మోక్షం :
జీవుడు స్వయంగా బ్రహమతత్త్వమే
అయినా, మాయకు లోబడి, తన నిజతత్వాన్ని మరచిపోయి, తన ఉపాధిమాత్రాలైన శరీర
మనోబుద్దులే తాను అనే భావంతో వాటికి కష్టం కలుగకుండా చూసుకోవటం తన కర్తవ్యమని
భావిస్తాడు. ఇంద్రియాలకు కనిపించే ఈ బాహ్యప్రపంచం తన కర్తవ్యం కోసమే ఉన్నదని
భావించి, అందులోనుంచి వీలైనంత సౌఖ్యాన్ని, సౌఖ్యాన్నిచ్చే వస్తువులను తన సొంతం చేసుకోవాలని
ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో సఫలీకృతుడైతే సంతోషిస్తూ, విఫలుడైతే
దుఃఖిస్తుంటాడు. తన ప్రయత్నానికి అడ్డుతగిలే వారిని ద్వేషిస్తుంటాడు. తన సౌఖ్యం కోసం
భార్యాపుత్రులను,
పే. 44
బంధుమిత్రులను సమకూర్చుకుని, వారి పోషణకు నిరంతరం శ్రమిస్తూ
ధనం కూడబెడుతుంటాడు. దానిని నిలబెట్టటం కోసం శ్రమ పడుతుంటాడు. అవి కారణాంతరంవల్ల పొతే అమితంగా దుఃఖిస్తాడు. తన దారాపుత్రులలో
ఎవరైనా చనిపోతే, మహాదుఃఖసముద్రంలో మునిగిపోతాడు. ఈ జన్మలో చేసిన కర్మఫలాలు వాసనారూపంలో
తన వెంట వస్తే, తిరిగి జన్మ పొంది, ఈ ప్రపంచంలో ప్రవర్తించటం మొదలుపెడతాడు. ఇదే
సంసారం. ఇదే జననమరణ చక్రం. ఇదే బంధం. దీని నుంచి బయటపడటం అంత సులభమైనది కాదు.
అసలు
ఈ బంధం ఎప్పుడు కలిగింది? ఎందుకు కలిగింది? ఇది ఎంతో కాలం క్రింద, జీవుడు తన
నిజస్వరూపాన్ని (తాను ఆనంద స్వరూపుడైన బ్రహ్మం అనే సత్యము), మరచి పోవటంవల్ల
కలిగింది.
దీనికొక
చక్కని ఉదాహరణ చెప్తారు, ఒక ఇల్లాలు, తన బంగారు కంఠాభరణం పోయిందని ఎంతో వ్యాకులత
చెంది, ఇల్లంతా వెతకటం మొదలుపెట్టింది. అందరినీ అడుగుతూ, వెతికిన చోటనే వెతుకుతూ,
తిరిగిన చోటనే తిరుగుతూ, బంగారు నగ పోయిందని తన భర్త, అత్తగారు ఏమని దూషిస్తారో
ఊహించుకుంటూ, వారికి ఏమని జవాబు చెప్పాలో ఆలోచిస్తూ, తన దౌర్భాగ్యానికి తననే
తిట్టుకుంటూ, నిద్రాహారాలు మాని, ఆ నగకోసం పరితపించసాగింది. ఇంతలో ఆమె ఎందుకో అద్దం
ముందు నిల్చుని, తన నిజరూపాన్ని చూసుకుంటున్నప్పుడు, ఆ బంగారు నగ తన కంఠానికే ఉండటం
చూసింది. ఆమె వెంటనే అమితానందభరితమై, ‘నా ఆభరణం దొరికింది, నా ఆభరణం దొరికింది’
అని ఆనందోత్సాహాలతో చిందులు వేస్తూ, అందరికి చెప్పసాగింది.
నిజంగా
ఆలోచిస్తే ఆమె నగ పోవటం అసత్యమే, అది దొరకటం అబద్ధమే. నగపోతే కదా దొరికే ప్రసక్తి
వచ్చేది? మరి నగ పోయిందని ఆమె పడిన ఆ వేదన, నగ దొరికిందని ఆమె అనుభవించిన ఆనందం, అవి కూడ అబద్ధమేనా? కాదు, అవి నిజమైన అనుభూతులే. కాని అవి నగ పోవటం వల్ల
గాని, తిరిగి దొరకటం వల్ల గాని కలిగిన అనుభూతులు కావు. ఆమె అనుభవించిన ఆవేదన అంతా,
‘నగ ఉన్నది’ అనే నిజం మరిచిపోయి, భ్రమవల్ల ‘నగ పోయింది’ అనే అసత్యభావన వల్ల గాని
కలిగింది. ఆ విధంగానే, ఆమె ఆనందమంతా భ్రమ తొలగిపోయి ‘నగ ఉన్నది’ అనే సత్యం గ్రహించటం
వల్ల కలిగింది.
పే. 45
సూక్ష్మంగా
చెప్పాలంటే, కంఠాభరణం మొదటినుంచి చివరివరకు యథాస్థానంలోనే ఉన్నా, పోయిందనే
భ్రమవల్ల దుఃఖం, ఉన్నదన్న నిజం తెలుసుకోవటం వల్ల ఆనందం కలిగాయి.
ఆ
విధంగనే జీవుడి వస్తుతత్త్వం – సత్-చిత్-ఆనందమైన బ్రహ్మతత్వమే అయినా, మాయ వల్ల తన
నిజతత్త్వం మరచిపోయి, ఆ ఆనందాన్ని తన ఉపాధుల ద్వారా, బాహ్యప్రపంచంలో వెదకటం మొదలువెడతాడు.
ఆ ఉపాధులు మాయాకల్పితాలే – ఈ ప్రపంచం కూడ మాయాకల్పితమే. మాయామోహితుడైన జీవుడు,
మాయవల్ల కల్పించబడ్డ శరీర మనోబుద్ధులతో, మాయాకల్పిత బాహ్యప్రపంచంలో, లేని ఆనందాన్ని
వెతకటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిజం తెలిస్తే, తానే ఆనందమయుడు. ఆ ఆనందం కోసం వేరే
చోట్ల వెతకనక్కరలేదు. తన నిజతత్త్వం తెలుసుకుంటే చాలు.
తన
నిజతత్త్వం మరిచిపోయి, జీవుడిగా ఈ సంసారంలో కొట్టుకుపోవటం బంధం. తన నిజతత్త్వం తెలుసుకుని,
ఈ సంసారం నుంచి బయటపడి, బ్రహ్మస్వరూపుడిగా (బ్రహ్మభూతుడిగా) జీవించటం మోక్షం.
ఈ
బంధం నుంచి బయటపడటానికి మార్గం ఏంటి? ఈ బంధం కలిగించే ప్రధానకారణం తొలగిస్తే బంధం పోతుంది.
అలాంటి ప్రధానకారణం ఏది? జీవుడి నిజతత్వమైన బ్రహ్మభావాన్ని మరగుపరచి, తాను ఈ దేహం, మనసు, బుద్ధి అనే భ్రమలో పడిపోవటం. ఆ భ్రమ నుంచి జీవుడు బయటపడ్డప్పుడే
బంధముక్తుడవుతున్నాడు.
ఈ
భ్రమ నుంచి బయటపడి, తన నిజతత్వాన్ని తెలుసుకోవటానికి ప్రగాఢమైన మోక్షేచ్ఛ
(ముముక్షుత్వం) ఉండాలి. ఎంతో విచక్షణాజ్ఞానం ఉండాలి. ‘నేను ఎవరు?’ (‘నా నిజతత్త్వం
ఏంటి?’) ఈ విధంగా తననుతాను ప్రశ్నించుకుంటూ, దేనిలోనైనా,
‘ఇది నేను కాదు’ అనే భావం కలిగిన వెంటనే, దానిని ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం, నిశ్చలత్వం,
శ్రద్ధ, ఎటువంటి కష్టాలు కలిగినా నిర్వికారంగా ఉండగలగటం,
గురువులపై, దేవుడిపై భక్తిభావం ఉండాలి. వీటన్నిటికి
తోడు, సకలశాస్త్ర పారంగతుడు, బ్రహ్మజ్ఞాని అయిన గురువుల ఆశ్రయం దొరకటం ఎంతో
శ్రేయస్కరం.
పే. 46
ఈ
విధంగా సాధన సంపత్తిని సమకూర్చుకుని, వేదాంత గ్రంథాలను (ఉపనిషత్తులు మొదలైన
వాటిని) చదవటం, వాటిలోని గూడార్థాలను గురువు చెప్పగా వినటం
(శ్రవణం), చదివిన వాటిలో, విన్నవాటిలో, అంతరార్థం మనసులో తార్కికంగా ఆలోచించి
అవగాహన చేసుకోవటం (మననం), తను గ్రహించిన సత్యాన్ని మనసులో నిలుపుకోవటం, అనన్యబుద్ధితో సంతత – ధ్యానం, అటు తరువాత
సమాధిస్థితిలో (బాహ్యాంతరాలను మరిచి), బాహ్యతత్వాన్ని స్వానుభవపూర్వకంగా తెలుసుకోవటం
– ఇవి మోక్షసాధనకు సాధకుడు అవలంబించవలసిన మార్గాలు. ఇందులో స్వప్రయత్నం ఎంతో ముఖ్యం.
ఇది అద్వైతవేదాంత సిద్ధాంతం ప్రకారం మోక్ష సాధనకు సూచించిన మార్గం. దీనిని జ్ఞాన
మార్గం అంటారు.
మిగిలిన
ద్వైతమతాలలో, ఈశ్వరుడే సృష్టికర్త, ప్రభువు, నియామకుడు. అతనికి మించినది ఏదీ
మరొకటి లేదు. జగత్తులో జరిగే అన్ని పనులు అతని ఆజ్ఞానుసారం జరుగుతుంటాయి. జీవుడు
అతనిని మరచి ఉన్నంతకాలం జననమరణ చక్రంలో తిరుగుతూ, ఈ సంసారంలో కొట్టుకుపోతుంటాడు.
ఇదే బంధం. జీవుడు తన తప్పును గ్రహించి, ఈశ్వరుడిలో ప్రగాఢమైన భక్తిభావంతో, అతని
కోసమే అన్ని పనులను చేస్తూ, అతనినే శరణుజొచ్చితే, ఈశ్వరుడు కరుణాసాగరుడు కావటం వల్ల,
ఆ భక్తుడిపై దయ చూపి, అతనిని తన వద్దకు చేర్చుకుంటాడు. అదే మోక్షం. ఇందులో భక్తి
ప్రధానం కాబట్టి, ఇది భక్తి మార్గం.
ఈ
రెండు మార్గాలలో, ఈ సంసారబంధం నుంచి విడిఅవటం మోక్షమని,
అందుకు వైరాగ్యం, వివేకం, భక్తి,
ముముక్షత్వం, శదమాది షట్సంపత్తి, ముఖ్యాంగాలుగా
అంగీకరించబడ్డాయి. రెండిటిలో స్వార్థరహిత సేవ సహాయకారిగా అంగీకరించబడింది. కాని
భక్తిమార్గంలో భక్తికి ప్రాధాన్యం ఇవ్వగా, జ్ఞానమార్గంలో వివేకానికి ప్రాధాన్యత
ఇవ్వబడింది.
పరమభక్తుడికి,
బ్రహ్మజ్ఞానికి, అంతిమ అనుభవం ఒక్కలాగనే ఉంటుంది. భక్తుడికి భక్త్యాతిరేకంలో అంతా
మధురాతి మధురమే – జ్ఞానికి బ్రహ్మజ్ఞాన రసానుభూతిలో అంతా ఆనందమే. ఒకరికి సర్వం భగవంతుడు
తప్ప వేరొక ప్రపంచం లేదు. వేరొకరికి అంతా బ్రహ్మే తప్ప వేరొకటి లేదు. ఇద్దరికీ ఈ ప్రపంచంతో
సంబంధం లేదు. ఈ ప్రపంచంలోని
పే. 47
కీచులాటలతో ప్రమేయం లేదు. భగవద్గీతలో పరమభక్తుడి
లక్షణాలు, బ్రహ్మజ్ఞాని లక్షణాలు ఒక్కవిధంగానే చెప్పబడ్డాయి. ఇద్దరు
చేరుకునే స్థానం కూడా ఒక్కటే అని చెప్పబడింది.
18.ముక్తి
స్థితి :
సమాధిస్థితిలో బ్రహ్మానుభవం పొందిన
మహాపురుషులు ఎందరో మళ్ళీ ఈ లోకానికి తిరిగి రావటానికి ఇష్టపడరు. అందువల్ల సాధారణంగా
ఆ సమాధిలోనే దేహత్యాగం చేస్తారు. దానిని విదేహముక్తి అంటారు.
కాని
కొందరు బ్రహ్మతత్త్వంలో నిలిచి, ఈ దేహాన్ని విడిచిపెట్టరు. అలాంటి వారిని
జీవన్ముక్తులు అంటారు. వారికి ఈ దేహం ఒక నీడలాగ, ఈ బాహ్యప్రపంచం ఒక స్వప్నంగా కనిపిస్తుంటుంది.
అలాంటివారు ఈ లోకంతో ఎటువంటి సంబంధంలేని సన్యాసులలాగ గాని, లేక లోకకల్యాణార్థం పాటుపడే
కర్మయోగులుగా గాని ప్రవర్తిస్తారు. వారు పనులు చేసినా, చేయకపోయినా, వారికి
కర్మఫలమేమీ అంటదు. వారు ఈ లోకంనుంచి కోరేది ఏమీ లేదు. వారు పనిచేయటానికి ఇష్టపడితే
అది లోకానికి మహోపకారం అవుతుంది.
19.జీవన్ముక్తుడి
లక్షణాలు :
వివేకచూడామణిలో జీవన్ముక్తుడైన
బ్రహ్మజ్ఞాని లక్షణాలు ఈ విధంగా చెప్పబడ్డాయి :
బ్రహ్మజ్ఞాని
సదా బ్రహ్మభావంలోనే నిలుస్తాడు. ప్రారబ్ధకర్మవశాన అతని దేహం ఇటు అటు చరిస్తున్నా,
ఆ దేహం వల్ల కలిగే శుభాశుభాలుగాని, మంచిచెడ్డలుగాని ఆ బ్రహ్మజ్ఞానికి అంటవు.
ఛాయామాత్రమైన అతని శరీరం ఏమైపోయినా అతనికి అవసరం లేదు. అతడు అన్ని భావాలకు అతీతుడు.
కర్మ చేస్తున్నా, చేయకపోయినా అతనిని కర్మఫలాలు బంధించవు. మంటలో దహింపబడ్డ
వస్తువులన్నీ బూడిదగా మిగిలినట్లు – జ్ఞానవహ్నిలో దహించవేయబడ్డ ఈ సమస్త ప్రపంచం బ్రహ్మంగానే
మిగులుతుంది. అతను బ్రహ్మం, ఉన్నది కూడ బ్రహ్మంలోనే కాబట్టి, అతడు
ఎప్పుడూ అద్వయానందంలో ఉంటాడు. సముద్రంలో పడిన పడగలిలాగ అతని జీవాత్మ
ఎప్పుడో పరమాత్మలో కలిసిపోయింది. ఆభాస మాత్రమైన దేహం,
పండుటాకులాగ ఎప్పుడు, ఎక్కడ రాలిపోయినా అతను లక్ష్యపెట్టడు. బహుశః గుర్తించక
పే. 48
పోవచ్చు కూడా. అతడు స్వతంత్రుడు, నిరంకుశుడు. అతని
ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. బాలుడిలాగ, పిచ్చివాడిలాగ, పిశాచంలాగ
తిరస్కరింపబడవచ్చు. లేక, మహాపండితుడిలాగ సన్మానింపబడవచ్చు, లేక మూర్ఖుడిలాగ
తిరస్కరింపబడవచ్చు. అజ్ఞానిలాగ నిర్లక్ష్యం చేయబడవచ్చు. మానాపమానాలు ఏవీ అతనిని
అంటవు. అతడు సదా బ్రహ్మానంద రసాస్వాదనమత్తుడు.
బ్రహ్మవేత్త
స్వయంగా బ్రహమే – దేహం కనిపిస్తున్నది కాబట్టి, అతనిని ఒక వ్యక్తిగా మనం భావిస్తున్నాం.
పాము విడిచిన పొరకు ఎటువంటి అస్థిత్వం ఉన్నదో, బ్రహ్మజ్ఞాని దేహానికి కూడ అంతటి అస్థిత్వమే
ఉన్నది. అందుకే ఆదిశంకరులు అటువంటివారిని కూడ (దేహంతో ఉన్నా) విదేహకైవల్యం పొందినవాడిగా
పరిగణించారు. అలాంటి జ్ఞాని బ్రహ్మమే కాబట్టి, అతనికి పునర్జన్మ ఉండదు. బాధ మోక్షాల
ప్రసక్తే ఉండదు.
20.స్వప్రయత్నం
:
ఈ దేహం అనిత్యమని తెలిసినా, ఈ
ప్రపంచంలోని ప్రలోభాలలో పసలేదని తెలిసినా, మృత్యుసమయంలో ‘నావి’ అనుకున్నవేవీ తనతో
రావని తెలిసినా, మోహజాలంలో చిక్కుకుని, నిరంతరం దుఃఖావేశాలతో పరితపిస్తుండటం ఎంతటి
దయనీయావస్థ! ఒక్కసారి, ఈ బాహ్య దృష్టిని లోపలికి మరల్చి, ‘నా నిజతత్త్వమేమిటి’ అని
ఆలోచిస్తే, ప్రతి మానవుడికి తన నిజతత్త్వం కొద్దిగనో, గొప్పగనో అర్థంకాక మానదు.
అప్పుడు అతను తన చుట్టుప్రక్కలగల ప్రపంచంలో ఏర్పరచుకున్న విలువలలో మార్పురాక
మానదు.
ప్రతి సాధనకు మోక్షం సిద్దించకపోవచ్చు.
కాని, ఆ సత్యాన్వేషణా ప్రయత్నంలో, ఎన్నో సూక్ష్మ విషయాలను తెలుసుకుని, మనసును,
బుద్ధిని వికసింపచేసుకుని, ఒక వినూత్న దృక్పథంతో ఈ ప్రపంచాన్ని చూడటం మొదలవుతుంది.
అదే అతని ఆధ్యాత్మ జీవితానికి ప్రారంభం. ఆ జీవితంలో ఉన్న మనశ్శాంతి, ఆనందం ఈ
ప్రాపంచిక జీవితంలో వెతికినా కనపడవు.
ఆధ్యాత్మ
జీవనపథాన్ని అనుసరించిన మనిషి తిరిగి మరలటం ఉండదు. అదే ముక్తిమార్గం. అందుకు
స్వప్రయత్నం అవసరం.
ఓం శాంతిః, శాంతిః, శాంతిః
No comments:
Post a Comment