Wednesday, 28 December 2016

మాట గురించి ఒక మాట (స్వీయలేఖ)



(నమస్సులు
మాట అనే మాట మీద నా అభిప్రాయాలను, భావాలను, ఆలోచనలను పంచుకున్న లేఖ.. )
మాట గురించి ఒక మాట


మాట మంచి

          మాటే మంత్రము అంటాడో కవి. ఆ సందర్భం వేరే అయినా సాధారణంగ చూసినా నిజంగ కూడా మాటే మనిషిని నడిపించే మంత్రము. ఎందుకంటే మంత్రమూ ఓ మాటే కదా! మాట లేని ప్రపంచ వ్యవహారాన్ని ఊహించటం అసంభవం. మనసులోని భావం మాటగా మారి ఊపిరి సహయంతో స్వరపేటిక కదలికల ద్వారా బయటకు వచ్చే ప్రక్రియ చాలా అద్భుతమైనది. ఎన్ని నరాల కదలికలు తిరిగితేనో ఒక మాట బయటకు రాదు. శ్వాస తీసుకుని దాన్ని చాలా నెమ్మదిగ స్వరపేటిక మధ్య గుండా వదులుతూ మనం భావాలను శబ్దాలుగా మారిస్తే అది ఒక మాట అవుతుంది. పలుకు బయటకు ఒలికే విధానాన్ని పాణినీయ శిక్షాశాస్త్రం ఈ విధంగ చెప్పింది- ఆత్మా బుధ్ధ్యా సమేత్యర్థాన్, మనో యుంక్తే వివక్షయా.. మనః కాయాగ్నిమాహంతి, స ప్రేరయతి మారుతం... మారుతం తూరసి

          ఎవరైనా మంత్రముగ్ధులవ్వటం మాటలు విన్నప్పుడే కదా! ‘పెద్దల మాట చద్ది మూట’ అని సామెత. మంచిమాట చిన్నపిల్లల నోటి నుండి వచ్చినా పాటించవలసిందేనని ఆర్యోక్తి. అక్కడ మాటకే విలువ కానీ వయస్సుకు కాదు. కలిసి నడవాలని అగ్నిసాక్షిగ నలుగురి సమక్షంలో అనుకున్న ఒక మాటే స్త్రీపురుషులను జన్మంతా అనుబంధంలో పెనవేస్తుంది. మానవ సంబంధాలన్నీ నిర్ణయించేది మాట. చేరువ చేసినా దూరం చేసినా మాటే. మాటకు శక్తి ఉంది. అది మనిషి జీవితంలో నుండి విడదీయరానిది. పశువు నుండి మనిషిని అది వేరు చేస్తుంది. మాట ప్రభావం అద్భుతమైంది. అది ఏంటో చూద్దాం.



మాట- మానవసంబంధాలు



          మానవ సంబంధాలన్నీ మాటలతోనే సాగుతుంటాయి. కనక మాటలు నిర్దుష్టంగ ఉండంగనే చాలదు. తగినంత మర్యాద వ్యవహారంలో కూడా ఉండాలి.

          కొందరి మాటల్లో ఓర్పు, నేర్పు, ఉత్సాహం ఉంటాయి. కొందరు ఆశావాదులు, నిరాశావాదులు అని మనకు వారి మాటలను బట్టే తెలుస్తుంది. తరుచు ’మనం, మన, మనది’ అనే మాటలు వాడే దంపతుల్లో పరస్పరావగాహన, అనురాగం ఎక్కువగా ఉంటుందని ప్రయోగాల వల్ల తెలిసింది. మనకు బీపీ పెంచగలిగే శక్తి, పెరిగిన బీపీ తగ్గించే శక్తీ కూడా ఎదుటి వారి మాటలకుంటాయి.

          కొందరు మాటలతో కట్టిపడేస్తారు. మరి కొందరు మాటలతో మంచి చేసుకొంటారు. కొందరి మాటల్లో పడిపోయి సమయం మర్చి పోవటం కూడా ఉంటుంది. మాటలు చెప్పేవాడే కానీ చేతలు ఏం లేవు అని అకర్మణ్యులను ఆడిపోసుకుంటారు. చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చేయడు అని సిద్ధాంతం కూడా ఉంది. ఒక్క పలకరింపుతో జన్మజన్మల బంధాలు పెనవేసుకుపోతాయి. మాటలు కలవటం వల్ల మనసులూ కలుస్తాయి. మరి అలనాడు ఆ హంస మాటలు విన్నందుకే కదా- నలదమయంతుల మధ్య ప్రేమ ఉదయించింది!

          పాండవుల మంచితనాన్ని, మాటకు కట్టుబడే స్వభావాన్ని అలుసుగ తీసుకుని నిండు సభలో పలికిన దుష్టపు మాటలు, చేసిన అవమానాలు  ధార్తరాష్ట్రులకు మృత్యువును కొని తెచ్చాయి. యుద్ధభూమిలో నీరసపడిన వేళ గాండీవం చేతుల్లోంచి జారిపోతున్న అర్జునుని తిరిగి కర్తవ్యోన్ముఖుని చేసినవీ కృష్ణుని మాటలే. అసలు "గీతా" అంటేనే "పలికిన పలుకు" అని అర్థం.

          "తండ్రి ఒడిలో కూర్చోరాదు" అన్న సవితి తల్లి కఠిన పలుకే సామాన్యరాజకుమారుడైన ధృవుణ్ణి ధృవ తారను చేసింది. "నిన్ను మృత్యువుకు దానమిచ్చాను పో" అన్న తండ్రి మాట నచికేతునికి అగ్ని విద్యను ప్రసాదించింది. ద్రౌపది గురించి కర్ణుడు వాగిన అనర్థకరమైన మాటలు అతడికి యుద్ధభూమిలో దారుణమైన మరణాన్ని కలిగించాయి. భీమునితో ద్రౌపది ఆవేశంగ పలికిన మాటలే అతడి చేత కీచకుని మట్టు పెట్టించాయి. భగవంతుడు సర్వవ్యాపి అని నమ్మిన చిన్నారి ప్రహ్లాదుని మాట నిలపటానికే శ్రీమహావిష్ణువు ఏమీ దొరకనట్టు స్తంభాన్ని తన జన్మస్థానంగ చేసుకుని నరసింహస్వామి అవతారం ఎత్తాల్సి వచ్చింది. ఇనవంశ కులోత్తముడైన హరిశ్చంద్రుడిని సత్యహరిశ్చంద్రుని చేసింది విశ్వామిత్రునికి ఇచ్చి నిలుపుకున్న ఒక మాటే. నందుడు పలికిన అవమానపు పలుకులే ఒక సామాన్య బ్రాహ్మణుడిని చాణక్యుని చేసి భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి.



మాట- నైపుణ్యం



          ఒకమాటకు ఎన్నో అర్థాలు ఉంటాయి. సమయాన్ని, సందర్భాన్ని, ఔచిత్యాన్ని, అవతలి వ్యక్తిని బట్టి మాటలను ప్రయోగించాలి. మాటను సరిగ్గా వ్యక్తపరిచే భావం వక్త ముఖంలో, గొంతులో, కూడా ధ్వనించాలి. లేదంటే మనసెక్కడో పెట్టి ఏదో ఆలోచిస్తూ మాట్లాడితే ఒక అర్థం బదులు మరో అర్థం వచ్చి మొత్తం వ్యవహారం చెడవచ్చు.

          నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. నలుగురితో మంచి చేసుకుంటేనే మనకు మనుగడ ఉంటుంది. ఎక్కడైనా, ఎవరితోనైనా వచ్చే తేడా మాటల వల్లనే ఉంటుంది. ఆహ్వానాలు, నిమంత్రణలు చేసేటప్పుడు ఏమాత్రం పదం ఒకటి బదులు ఒకటి వాడినా అర్థాల్లో మార్పు వచ్చి అవతలి వారు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. నా అనుభవంలోనే పెళ్ళికి పిలవటానికి వచ్చిన ఒక పెద్దమనిషి "మీరంతా కట్ట కట్టుకుని రండి.." అని పిలిచాడు. ఆయన ఉద్దేశం ‘అందరూ కలిసి రావాలి’ అనే అయినా వినేవారికి ఏదో అమర్యాదగ, నిర్లక్ష్యంగ అనిపిస్తుంది. భోజనం వడ్డించటం అనే అర్థంలోనే కుంభం కుదించటం, తిండి కుడవటం, లేదా కూడు పెట్టటం అనే వాడకాలు ఉన్నా ధ్వనిలో ఎంతో తేడా ఉంది కదా!

          ఆస్తిపాస్తుల వ్యవహారాలలో, పెళ్ళిళ్ళకోసం సంబంధాలు కలుపుకునేటప్పుడు మధ్యవర్తిత్వం చేసేవారు, చేయించుకునేవారూ కూడా మాట విషయంలో చాలా జాగ్రత్తగ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సంబంధాలు చెడే అవకాశం ముమ్మరంగ ఉంటుంది. పెళ్ళి సంబంధాలనే కాదు, చాలా రక్తసంబంధాలు, స్నేహనుబంధాలు కూడా మాటల తేడాల వల్లే విరిగిపోవటం మనం చూస్తుంటాము.

          దూతలను పంపేటప్పుడు కూడా ఇది చాలా అవసరం. ముఖ్యంగా శత్రువుల ఇళ్ళకు వెళ్ళి సందేశాలను ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రం మాటే జీవితానికి మరణానికి మధ్య వారధిగా ఉంటుంది. దూతగా పంపబడే వాడి లక్షణాలు పంచతంత్రాది గ్రంథాల్లో, రామాయణాది కావ్యాల్లో వర్ణించారు..... అందులో చదివితే మాటకు భాషకు ఎంత ప్రాముఖ్యాన్నిచ్చారో తెలుస్తుంది. హనుమంతుడు రాముడికి నచ్చింది మొట్టమొదటగా ఈ మాట వల్లే కదా!....

          దాచాల్సినవి, బహిర్గతం చేయవలసినవి అని విషయాలు రెండు కోవలకు చెంది ఉంటాయి. చెప్పకూడని మాటను ఒక్కసారి బయటకు చెబితే ఇక అది ఊరంతా పాకిపోతుంది. అందుకే పెదవి దాటితే పృథివి దాటుతుంది అంటారు.

          వ్యవహార చాతుర్యానికి ఉదాహరణగా శ్రీనాధుడి కథ చెబుతుంటారు పెద్దలు - (సర్వజ్ఞుండన్న బిరుదు..) (కాకువు ద్వారా శివునకే గానీ ఏరాజునకు చెల్లును అన్నట్టు అర్థ సాధించటం.)....



చేరువైనా దూరమైనా -



          విరబూసిన అనుబంధాలను విరిచేయగల సామర్థ్యం, విరిగిపోయిన మనసులను అతికించగల సామర్థ్యం మాటకు ఉన్నాయి. పొరపాటున తప్పు జరిగితే క్షమాపణ కోరటం పశ్చాత్తాప పడిన వ్యక్తి అంతరంగాన్ని సూచిస్తుంది. కృతజ్ఞతలు తెలియచేయటం, ’మీ మేలు మరువలేము’ అనే లాంటి మాటలు సహాయ పడినవారి మనస్సులకు తృప్తినీ ఉత్తేజాన్నీ ఇచ్చి- ’మరోసారి వీరికి తప్పక సహాయపడాలి’ అనే భావాననూ కలిగిస్తాయి. కనీసం పొడిగా అయినా సహాయం చేసినవారికి ధన్యవాదాలు చెప్పటం అలవరచుకోవాలి.

          అందుకే అర్థవంతమైన మాటలను మాట్లాడతాము. అనర్థవంతమైన మాటలను ’వాగుతాము’. వాగుడుకాయల వల్ల ఎవరికీ ఏ ప్రయోజనమూ ఉండదు. చేతలు చూపక మాటల్లో మాత్రం ఘనత ఉన్నవారిని కోతల రాయుళ్ళంటారు. మాటలు పోచికోలు అంటారు. మాటలు మాత్రం చెప్పి ఏ చేతా చేయని వాడికి సమాజంలో ఏ విలువా ఉండదు. మన మాటను బట్టే మన విలువ ఉంటుంది. ఊరికే నోరు పారేసుకునేవారి దరిదాపులకు ఎవ్వరూ రారు. తీయగా మాట్లాడే వారికి ఇట్టే స్నేహాలు కలుస్తాయి. అవతల వారి పొడి వ్యవహారం చూసి ఒక మాటా లేదు, మంచీ లేదు అని బాధపడతారు. ఎంతో దూరమైనా కలిపేది చేరువైనా చెరిపేది మాటే. ఎవరి మధ్యనైనా వ్యవహారంలో తేడా వచ్చినప్పుడు మౌనమే చోటుచేసుకుంటుంది. అప్పుడు "ఒక్క మాట మాట్లాడితే ఏం పోయింది?" అని బాధగ అనుకుంటారు. గొప్పవారు, అందమైనవారూ మాట్లాడకపోతే "మాట్లాడితే నోట్లో ముత్యాలు రాలిపోయాయా?" అంటారు. ఎవరితోనైనా సరిగ్గా మాట్లాడకపోయినా, మౌనంగా ఉన్నా అపార్థాలు చోటు చేసుకుంటాయి. కొందరు నేరుగా అనలేక ఏదో నెపంతో తమ అభిప్రాయాన్ని సించినప్పుడు "నవ్వుతూ బాగనే అంటారు, మేమూ అట్లగే అంటే పడగలరా?" అంటారు నొచ్చుకున్నవారు. మాటపడటం, మాటరావటం కూడా ఉంటాయి. మంచి మనిషికొక మాట, మంచి గొడ్డుకొక దెబ్బ అంటారు. అంటే ఇక మాటకు వినక పోతే వాడు మనిషే కాదన్నమాట. దెబ్బకు దిగాల్సి వచ్చింది అంటే వాడు గొడ్డే అని అర్థం.

          "మొండివాడు మాటలతో వినేటట్టు లేడు" అంటారు. సామ దాన భేదాలన్నీ మాటలతో కలిపి చేసేవే. కోపం వస్తే, "నీతో మాట్లాడనుపో" అని బెదిరిస్తారు. ఆ మాట్లాడకపోవటం ఎంతో భయంకరమైన అనుభవం. దగ్గరవారి మధ్య అనుబంధం, అందులో అనుభూతి అయినా మాటల వల్లే ఉంటాయి.

          వయసు పిల్లలు గంటలు గంటలు మాట్లాడుకుంటూ భావాలు హాయిగా పంచుకుంటూ తేలిగ్గా తిరుగుతుంటారు. స్నేహితులతో దాపరికాలు వారికి ఉండవు. కానీ వయసు పెరిగినా కొద్దీ బాధ్యతల మధ్య పడి ఆ మాటలు పంచుకోవటం కొదువై గుండెల్లో బరువులు పేరుకుపోతుంటాయి. హాయిగా నవ్వుతూ మాట్లాడే వారు, అవతలివారికి సంతోషం కలిగించటంలో తామూ సంతోషపడుతూ ఆరోగ్యంగా ఉంటారు. చాలా కాలానికి కలిసిన బంధుమిత్రులు ’అబ్బ! ఎంత హాయిగా మాట్లాడుకున్నామో’ అని తేలికపడతారు. అట్ల మన బాధ తీర్చే అవతలివారు మనతో ఉండటం మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది.

          అకస్మాత్తుగ అనూహ్యమైన ఆనందం కానీ బాధ కానీ కలిగినప్పుడు ముందు కరువయ్యేది మాటే! ఆనందంతోనూ మనకు మాటలు రావు, బాధ తోనూ రావు.



మాట- ప్రభావం



          ఒక వివేకానందుడు అఖిల మతాల సమ్మేళన సభలో "మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా" అని సంబోధించంగనే అది విన్నవారంతా పులకరించిపోలేదా? ఇప్పటికీ ఆ మాటను ఆయన సౌశీల్యానికి  సౌహార్దతకూ ఉదాహరణగా చెప్పుకోవటంలేదా..? ఒక సుభాష చంద్ర బోసు పలికిన "తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా" అన్న ఒక్క నినాదం ఒంటరిగ ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసేందుకు దోహద పడలేదా? తిలక్ "స్వాతంత్ర్యం నా జన్మ హక్కు" అన్న మాటకు భారత జాతి అంతా కదలి రాలేదా? గాంధీజీ "కరో యా మరో" అన్న మాటను విన్న యువత చావుకు సైతం తెగించి స్వతంత్రపోరాటానికి ముందుకు రాలేదా? హిట్లర్‍తో అరగంట మాట్లాడిన వారెవరైనా సరే వెంటనే మనసు మార్చేసుకుని వారి జట్టులో చేరిపోయేవారట. అటువంటి హిట్లర్‍తో కూడా మూడు ఘంటలు హాయిగ మాట్లాడి భారతజాతి విమోచనానికై సహాయం గెలుచుకున్నాడు సుభాషు చంద్రుడు. ఆయన మాటలకంత శక్తి మరి.

          రాముడు రాజ్యభోగాలనూ త్యాగం చేసి అడవులకు వెళ్ళీంది తండ్రి మాట కోసమే కదా. ఆయన వంశం వారు "ప్రాణం పోయినా మాట పోరాదు" అనే సిద్ధాంతాన్ని నమ్మినవారని ప్రతీతి. సర్వసుఖాలనూ కాదని నానా కష్టాల పాలైన హరిశ్చంద్రుడు ఆయన వంశంవాడే. ఆయన వెళ్ళిందీ ఆ మాట కోసమే కదా! తులసీదాసు మాట- "రఘుకుల రీతి సదా చలీ ఆయీ, ప్రాణ జాయి పర బచన న జాయి" అన్నది ఒక నినాదంగ తీసుకుని ఆచరించే సంస్కృతి మనది.

          మాట శక్తిని గమనించాలంటే వరాలిచ్చే దేవుడు, తప్పు చేస్తే శపించే పెద్దలను గుర్తు చేసుకుందాం. వారి మనస్సులోని భావాల నుండి వెలువడిన ఆ శాపాలు, వరాలు కూడా మాటలే కదా! ఆ మాటలో ఉండే సౌకర్యం తోనే సత్యవంతుని ప్రాణాలను సతీమతల్లి సావిత్రి యముడి నుండి తిరిగి రప్పించుకోలేదా? జిజియాబాయి మాటల ప్రభావం వల్ల ఒక శివాజీ తయారవ్వలేదా? అల్లూరి సీతారామరాజు మాట విని మన్నెమంతా కదలి రాలేదా?

          సుకృతాత్ములు రససిద్ధులు.. అన్న పద్యంలో తదీయాధిక కీర్తి శరీరంబులు ప్రకట జరా మరణ జన్మ భయరహితంబుల్- అంటాడు కవి. వారి కీర్తి శరీరంబులంటే ఏంటి? వారి కావ్యాలేగా! కావ్యాలంటే మాటల కూర్పులేగా! ఈనాటికీ తెలుగువారు "జెండాపై కపిరాజు..", "బావా ఎప్పుడు వచ్చితీవు.." అంటూ ఆలపించుకుంటున్న పద్యాల రూపంలో ఆ పద్యాల కర్తలైన తిరుపతి వేంకట కవులు జీవించి ఉండలేదా? "ఇంతింతై వటుడింతై..". "అల వైకుంఠపురంబులో.." అంటూ దాదాపుగ జాతీయాలలా మనం ప్రయోగించుకుంటున్న పద్యభాగాలు పోతనను మన మధ్య సజీవంగ నిలిపి వేయలేదా? కాళిదాసు ఎక్కడివాడో ఎప్పటివాడో ఎట్ల డేవాడో ఎవ్వరికీ తెలియదు. ఆయన ఫోటో కూడా లేదు. అయినా ఆయన మన అందరికీ తెలుసు. కవి అనంగనే కాళిదాసనే అంటాం. ఆయన మన మధ్య ఇంకాసజీవంగ ఉన్నది తన కావ్యాలరూపంలో కాదా..? అందుకే మనుషులు పోతారు కానీ మాటలు పోవు అంటారు. మనం మన పెద్దల మాటలను వారి తదనంతరం కూడా ఎన్నటికీ గుర్తు చేసుకుంటాము. వాటితో పాటు ఆ మాటల ప్రభావాలు కూడా మన గుండెలలో పదిలంగ ఉంటాయి.



మాట పలికే విధానం



          రాముడు పూర్వభాషి, మితభాషిగా పేరు పొంది మనకు ఆదర్శ పురుషుడైనాడు. అంటే ఎవరైనా కనిపిస్తే తానే ముందుగా పలకరించే వాడట. ఎవరైనా ఎదురుపడితే తెలుగు వారు ’"బాగున్నారా?’" అని పలకరించుకుంటారు. ఆ ఒక్క మాట చాలా సంబంధాలను సజీవంగ ఉంచుతుంది.

          మాట్లాడినంతవరకు నాన్చకుండ, సాగదీయకుండ, విసుగును కలిగించకుండ ద్వంద్వార్థంగ, అస్పష్టం లేకుండ చెప్పాలి. నవ్వుముఖంతో మాట్లాడాలి కానీ పగలబడి నవ్వుతూ మాట్లాడితే ఎవ్వరికీ మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు. పెద్దల యందు గౌరవంగ మాట్లాడాలి. ఎప్పుడైనా అవసరమై వారి మాట కాదనవలసి వస్తే అది నమ్రతతో, మృదువుగ సూచించాలే కానీ నేరుగ ఆక్షేపించరాదు. ఎదటివారికి ఆనందం కలిగించే విధంగ మాట్లాడకపోయినా నష్టం లేదు కానీ, బాధించే విధంగ మాత్రం మాట్లాడరాదు. అవతలవారు ఏది మాట్లాడితే మనం బాధ పడతామో అది వారితో ఎన్నడూ మాట్లాడకూడదు.

          పూర్వపు రాజుల పక్కన వందిమాగధులు ఉండేవారట. వారు రాజు ఏదైనా తప్పు చేయబోతే వెంటనే ఆ రాచకులపు మహత్త్వాన్ని, పూర్వపు రాజుల వైభవాన్ని పొగుడుతూ పాటలు పాడేవారట. అప్పుడు ఆ రాజు మృదువుగ ఆ సందేశాన్ని అందుకుని, తన ప్రయత్నంలో లోపాన్ని గ్రహించి, నేను ఈ పనిని చేస్తే అంతటి గొప్ప వంశస్థుడనై పుట్టినందుకు బాధపడాల్సి వస్తుందని తెలుసుకుని తనకు తానే విరమించుకునేవాడట. అంతేకానీ ఆ పొగడ్తల వ్యవస్థ కూడా పనిలేక, అర్థం లేక చేసినదేం కాదు.

          మాటకు భావం ఎంత ముఖ్యమో మంచి ఉచ్చారణ అంతే ముఖ్యం. అది మాటకు వస్త్రం లాంటిది. సరైన ఉచ్చారణ లేకపోతే పెడార్థాలు వస్తాయి. లేదా భాషలో అందం పోతుంది. హ్రస్వ దీర్ఘాలలో, అల్పప్రాణ మహాప్రాణాలలో తేడాలు చాలా అవసరంగ నేర్చుకోవాలి. ఆంగ్లేయులు భారతీయ భాషాపదాలు ఉచ్చరించటం రాక చేసిన ఉత్పాతాలకు అంతు లేదు. గొడావరి, వైజాగ్, కుడప్పా వంటివి జనబాహుళ్యంలో చేరి కర్ణకఠోరంగ నిలిచిపోయాయి.

          మరొక మాట- స్పష్టంగ, సూటిగ మాట్లాడమంటే విరుపుగా, దురుసుగా మాట్లాడమని కాదు. చాలామంది మేము చాలా "ఫ్రాంక్" గ మాట్లాడతాము అంటూ మొహం మీద అన్నీ ఫెడేలున అనేస్తూ ఉంటారు. ’"సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం"’ అన్న ఆర్యోక్తికి అప్రియమైన సత్యం మాట్లాడకూడదని కాదు అర్థం- ’"సత్యమైనంత మాత్రాన అప్రియంగ మాట్లాడనక్కర లేదు"’ లేదా- "సత్యాన్ని అప్రియంగ మాట్లాడరాదు"’ అని అర్థం. ఇక్కడ "అప్రియం" సత్యానికి విశేషణం కాదు, "బ్రూయాత్" కి క్రియావిశేషణం. శ్లోకతాత్పర్యం ఏంటంటే, అబద్ధాలు అసలు మాట్లాడవద్దు. అసత్య దోషం అన్నింటికన్నా భయంకరమైనది. ’ప్రియం చ నానృతం బ్రూయాత్’ అంటే- "ప్రియం కదా అని అబద్ధం మాట్లాడవద్దు" అని సనాతన ధర్మం. అసత్య దోషం నుండి రక్షించుకోవాలని, దురుసుగ మాట్లాడటం వల్ల అవతలివారికి బాధ కలిగించ కూడదని మహానుభావులు చాలాతక్కువ మాట్లాడటం చేసేవారు. అసలుకే మాట్లాడటం మానేసినవారున్నారు. వారిలో రమణమహర్షి, కుర్తాళ యోగి అయిన మౌనస్వామి ప్రసిద్ధులు. కనీసం అంత కాకపోయినా కొంత మౌనం వ్రతంగ అప్పుడప్పుడైనా పాటించటం వల్ల మాట సౌమ్యంగ మాట్లాడే శక్తి, అవతలివారిని నొప్పించకుండ మెలగగలిగే శక్తీ వస్తాయి.

          ఉపాసనలు చేసేవారికి లాగే అసత్యం పలకకుండా కొంత కాలం ఉండగలిగితే వారి మాటకు సత్యమయ్యే శక్తి వస్తుంది. అందుకే నిత్యం యజ్ఞయాగాలతో నీతినియమాలు పాటిస్తూ పవిత్రంగ ఉండే మహర్షులు, సత్పురుషులు క్షణిక కోపంలో ఏదైనా అనేస్తే అదే నిజమవుతుంది. కనక వారిని బాధ పెట్టే పనులను చేయకూడదు. అందుకే సుమతీదేవి "’రేపు సూర్యుడు రాడు’" అనేస్తే ఆయన ఉదయించే సాహసం చేయలేకపోయాడు. అగస్త్యుడు అతిగా పెరిగి అల్లకల్లోలం సృష్టిస్తున్న వింధ్యుడిని’, "వంగి అట్లగే నేను వచ్చే వరకూ ఉండు నాయనా’" అంటే ఆ పర్వతుడు ఇప్పటికీ అట్లగే ఉన్నాడట. అది ఆయన మాట ప్రభావం. రామాయణంలో సుగ్రీవుడి గురించి కూడా ఇట్లాంటి రీతిగనే చెబుతారు- "సుగ్రీవాజ్ఞ" అంటే ఇంక "ఎవ్వరూ సవాలు చేయలేనిది" అని అర్థంలో ఈనాడు మనం జాతీయంగ వాడుకుంటున్నాము.

          తక్కువ మాటలతో ఎక్కువ భావం పలికించటం పండిత లక్షణం. ఔచిత్యం పాటించని మాట పెళుసుగా ఉండి గాయాలను కలిగిస్తుంది. ప్రాధాన్యాన్ని బట్టి ఏ మాట ముందు వాడాలి, ఏది తరువాత అనేది హనుమంతుని వ్యవహారకౌశలంలో తెలుస్తుంది. సముద్రం దాటి లంకకు పోయి, సీతను చూచి తిరిగి వస్తూ- "చూచితి సీతను" అంటాడాయన. అంటే- వెళ్ళింది సీతమ్మ కోసమే కనక చూశాడా లేదా అనేదే అక్కడ ముఖ్యం. ఆయనకు ఎవరితో ఏం చెప్పాలి అనే జ్ఞానం కూడా బాగా ఉంది. తాను లంకలో చేసిన రాక్షస సంహారమంతా తోటి వానరుల ముందు మాత్రమే చెప్పాడు. సీతమ్మ పరిస్థితినంతా మాత్రం రామునికి వివరించాడు కానీ వారికి చెప్పలేదు, అనవసరం కనక. అట్లగే తన రాక్షసులతో యుద్ధం గొప్పలన్నీ వానరులతో చెప్పాడు కానీ రామునితో చెప్పలేదు. రావణునితో నువ్వు ఇవి ఇవి చెప్పు అని ఆయనకు ఎవ్వరూ చెప్పలేదు. అయినా వెళ్ళి అక్కడ చెప్పాల్సినవి తానే చెప్పి వచ్చాడు. రావణుడి గుండెల్లో శత్రువు పట్ల గుబులు పుట్టించి వచ్చాడు.



మాట ప్రయోగంలో-



          మాటకు కత్తికున్నంత శక్తి ఉంది. కత్తితో పీకలూ కోయవచ్చు, శల్య చికిత్సా చేయచ్చు. ఏం చేస్తామనేది మన చేతిలో ఉంది. మాట శూలంలా పొడవగలదు. వెన్నలా మెత్తగా అనిపించగలదు. తేనెలా తీయగా ఉండగలదు. నిప్పులా రగల్చగలదు, పిడుగులా పేలగలదు. మనసు విరవగలదు. పిండగలదు, నలపగలదు.

          మాటలు ప్రేమను కలిగిస్తాయి. చేదుగా ఉండి ద్వేషాన్ని రగులుస్తాయి. అవసరమైతే మృతసంజీవనిలా అవే లేచి బ్రతికిస్తాయి. దయతో కూడుకుని మంచి చేస్తూ, క్రూరంగా ఉండి అనర్థం చేస్తాయి. అవతలవాడిని సన్మానించాలన్నా అవమానించాలన్నా మాట తోనే. మాటలు పొడుస్తాయి. చంపుతాయి కూడా. ఒక్క ’"అశ్వత్థామా హతః కుంజరః’" అన్న మాట ద్రోణుడి ప్రాణాలు తీసింది.

          మాటకు సాధ్యం కానిది లేదు. రాజ్యాలు కూల్చగలదు. నిలబెట్టగలదు. అవతలివాడి జవసత్వాలు లాగేసుకోగలదు. పోతున్న ప్రాణాలు నిలబెట్టగలదు. అనునయంగా యుక్తిగా మాట్లాడి ఆత్మహత్యా ప్రయత్నాలు మాన్పించిన సందర్భాలూ ఉన్నాయి.

          మాటలతో ఆడుకోనూ వచ్చు. మాటలగారడితో అవతలివారిని బురిడీ కొట్టించనూ వచ్చు. వినోదమైనా చేదు అనుభూతైనా మాటవల్లే. మాటతోనే మంత్రం కూడా ఉంటుంది. మంత్రాలకు చింతకాయలనూ రాల్చవచ్చు. ఈనాడు మంత్రులు చేసే ప్రమాణస్వీకారం అంటే ఒక మాటే కాదా!

          ఎంత గొప్ప నటనా సామర్థ్యం ఉన్నా సరిగ్గా మాట స్పష్టతా, ప్రతిభ లేవంటే వారికి ఏ మనుగడా ఉండదు. డబ్బింగ్ పెట్టి మాట్లాడించిన చిత్రాలలో అంత పట్టులేక పోవటం మనకు తెలిసిందే. ముందసలు నటనను పరీక్షించాలంటే- "’ఏదీ ఓ డైలాగు చెప్పు!’" అంటారు.

          ప్రమాణం చేయటం అంటే మాట ఇవ్వటమే. శంతనుడు గంగకు ఇచ్చినమాట నిలుపుకోలేక, పిల్లలను కనంగనే నదిలో వదిలేస్తుంటే చూడలేక గంగను నీవెవరని అడిగినందుకే గంగ అతడిని విడిచి వెళిపోయింది. కేవలం సత్యవతి తండ్రి దాశరాజు శంతనుడిని అడిగిన ఒకే ఒక్క మాట- తన కూతురి సంతతే సింహాసనం ఎక్కాలని- దానివల్ల మొత్తం మహాభారతం కథ ఆ విధంగ మారిపోయింది. తండ్రికోసం గాంగేయుడు భీష్ముడు అయింది ఒక మాట వల్లే. అందుకు గంగ ఇచ్చిన ఇచ్ఛామరణం వరమూ ఒక మాటే. భీష్ముడు ప్రాణాలు విడిచేవరకు ఆడిన మాట తప్పలేదు. అందుకే సజ్జనుడి మాట రాతి మీద రాత. చిరకాలం నిలిచిపోతుంది. కానీ దుర్జనుడి మాట నీటి మీద రాత. కనీసం వ్రాస్తున్నప్పుడు కూడా నిలవదు.

          కోర్టులో సాక్షం కూడా మాటే. ఎవరైనా వచ్చి- ’ఇతడు ఈ నేరం చేస్తుండగా ఫలానా ఫలాన పరిస్థితులలో నేను చూశాను’- అంటే దానికి మించిన సాక్షం వేరే అక్కర లేదు. పండిత సభలలో చర్చలన్నీ మాటలతోనే సాగుతాయి. చర్చలే కాదు- వాదోపవాదాలు, సంభాషణలూ, ఉపన్యాసాలు, సందేశాలూ అన్నీ మాటలే. ఎవరి గొప్పతనమైనా చెప్పాలంటే వాడి మాటంటే మాటే అంటారు. ఆ ఇంట్లో యజమాని మాటకెదురు చెప్పరు అంటారు. మాటకు మాట చెప్పటమంటే పెద్దవారిని అగౌరవపరచటం. ఊరంతా వాడి నోటికి జడుస్తుంది అంటే అంత కర్కోటకుడు అని అర్థం.

          మాట ఎంత గొప్పదంటే వేదం కూడా మాటే! అందుకే వాడి మాట వేదవాక్కు అంటారు. అవీ మునులకు వినిపించిన శ్రుతులే కదా. శబ్దరూప ప్రమాణమే వేదం. అదే ఆప్త ’వాక్యం’, జ్ఞానం ఎప్పుడూ మాటరూపంలోనే ఉంటుంది వ్యవహారం ఆచరణ తప్ప.

          ఎంత పుస్తకాలు చదివినా వంటబట్టనిది గురువు విడమరచి చెప్పగానే తెలుస్తుంది. ఆ గురువు విప్పిచెప్పే జ్ఞానమూ మాటే కదా! ఎవరైనా పై స్థాయివారు కిందిస్థాయివారితో తమ గౌరవానికి కాస్త తగ్గించి మాట్లాడితే ’అయ్యో! ఎంత మాట ప్రభూ!’ అంటుంటారు.

          సామాన్యంగ మనకు కష్టాలు వచ్చినప్పుడు ఫలానా స్తోత్రం చేయి, మంత్రం పఠించు అని సలహా చెప్తారు. కొందరు బీజాక్షరాలతో ఉపాసన చేసి దేవతల మెప్పు పొందుతుంటారు. ఆ మాటకొస్తే- ఏ జపం, తపం, మనస్సు చేత చేసే ధ్యానమైనా ప్రాథమికంగ మాటతో కూడుకున్నదే.



ఉపసంహారం



          మాట్లాడటం చతుష్షష్ఠి కళలలో ఒకటి. వాగేవ విశ్వా భువనాని జజ్ఞే! వాక్కే ఈ భువనాలను సృష్టించిందట. "భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్- వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్" అంటాడు భర్తృహరి శతకాన్ని అనువదించిన ఏనుగు లక్ష్మణకవి. అంటే వాక్కే భూషణముగా ఉంటుంది మనిషికి. అంతేకాదు, అది మనిషికి ఒక నిర్దిష్టమైన గుర్తింపునిస్తుంది. ఉనికినిస్తుంది. విలువనిస్తుంది. మాటకు సత్యమయ్యే శక్తి ఉంది. నవ్వులాటకు అనుకున్నమాటలే నిజమవుతూంటాయి. అందుకే పెద్దలు పరిహాసానికి కూడా అశుభపు మాటలు అనకూడదు అంటారు. అంత గొప్పదైన మాట విలువను తెలుసుకుని మెలుగుదాము.

No comments:

Post a Comment