Friday, 17 February 2017

భక్తి తత్త్వము -- సంపూర్ణం



నమస్సులు. 
ఇది నిర్వికల్పానంద స్వామి అనే రచయిత నుండి వెలువడిన భక్తి తత్త్వము అనే గ్రంథం. ఇది నెట్ లో లభించింది.  ఇది సాధనగ్రంథమండలి- తెనాలి వారి ముద్రణ.
https://archive.org/download/in.ernet.dli.2015.387986/2015.387986.Bhakti-Tatvamu.pdf
(దీని పీడీఎఫ్ ని చూస్తూ, వర్డ్ ఫైలు గా టంకణం చేసి ఇచ్చిన మా అన్నయ్య శ్రీప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలతో)  
దీని ప్రారంభిక పుటలు, పరిచయవాక్యాలు పీడీఎఫ్ రూపంగా చూసుకోగలరు. మిగిలినది టంకితభాగాన్ని ఇక్కడ అందించటమైనది.
శుభం భూయాత్.
ప్రథమ దళము
లీలా విలాసినే భక్తిమంజరీ లోలుపాలినే
మౌగ్ధ్యసార్వజ్ఞ్యనిధయే గోకులానంద తే నమః
(విశ్వనాథ చక్రవర్తి)
          మనకు లభించే ప్రాచీన భక్తిశాస్త్ర గ్రంథాలలో నారదభక్తిసూత్రం ఒక ఉత్కృష్టమైన గ్రంథం. నారదుడు ఈ గ్రంథంలో భక్తి ‘తత్త్వా’ న్ని గురించి ఎక్కువగా ఆలోచించకపోయినా, సాధనను విశేషంగా చెప్పటం చూస్తాము. కనుక, భక్తిపథం అనుసరించేవారు దీనిని విశేషంగా ఆదరిస్తున్నారు. సాధనా మూర్తి అయిన శ్రీరామకృష్ణ పరమహంస ఈశ్వరదర్శన పిపాస కలిగినవారికి నారదీయభక్తే ఈ కలియుగంలో శ్రేష్ఠమని చెప్పేవారు.
          పూర్వం ఈ దేశంలో విద్య గురుపరంపరా క్రమంలో ఉపదేశింపబడేది. శిష్యుడికి సులభంగ గుర్తు ఉండటానికి శాస్త్రాలన్నీ సూత్రరూపంలో రచింపచబడేవి. అల్పాక్షరాలలో అసందిగ్ధంగా సారతత్వమును తెలపటమే వీటి విశేషం. ఇలాంటిదే నారదుడి సూత్రగ్రంథం. ఇందులో పది అధ్యాయాలుగా విభజించబడి, ఎణభై నాలుగు సూత్రాలు ఉన్నాయి.

పే. 2
          తదితర సూత్రాలలాగా దీనికి భాష్యముగాని టీకగాని ఉన్నట్లు అనిపించదు. సూత్రాలు అత్యంత సరళములు, విశదములు అయి ఉండటమే దీనికి కారణంగ కనిపిస్తుంది. మద్రాసు రామకృష్ణమఠంవారు ప్రచురించిన ఆంధ్రానువాదం ఒకటి ఉంది. ఆంగ్ల అనువాదం కూడా ఉంది.
          ఈశ్వరుడి పట్ల పరమ ప్రేమే భక్తి అని నారదుడు నిర్దేశించాడు. ఈ భక్తి అమృతస్వరూపం.
          ఇంతకంటే ఎక్కువగా నారదుడు భక్తి గురించి చెప్పలేదు. బహుశః చెప్పలేకపోయి ఉండవచ్చు. తరువాత “మూగవాడు రుచి అనుభవాన్ని చెప్పలేనట్లు, ప్రేమ స్వరూపాన్నికూడా నోటితో చెప్పలేము.” అన్నాడు.
          వర్ణన ప్రత్యక్షపరంగా గాని, పరోక్షంగా గాని ఉండవచ్చు. ప్రత్యక్ష వర్ణనను అనుసరించి ఏ వస్తువును పొందితే మనిషి సిద్ధుడవుతాడో, అమృతుడవుతాడో, తృప్తుడవుతాడో అదే భక్తి. ఏ వస్తువును పొందితే మనిషి ఇక దేనిని కోరడో, మరి దేని కోసమూ శోకించడో, ఎవరినీ ద్వేషించడో, ప్రపంచంలో మరే వస్తువునైనా పొందిన ఆనందం పొందడో, లేక దేనిని పొందటానికి ఉత్సాహపడడో అదే భక్తి. దేనిని గ్రహించిన మనిషి మత్తుడు, స్తబ్దుడు, ఆత్మారాముడు అవుతాడో అదే భక్తి.
          ఈ భక్తిలో ఎలాంటి కోరిక ఉండలేదు. ఎందుకంటే ఇది నిరోధ స్వరూపం.
పే. 3
          లోకం నుండి ప్రాప్తించిన వస్తుజాలం లోనుంచి ఒకానొక ఉత్కృష్టమైన వస్తువును గ్రహించినా, ఈ భక్తి లక్షణాలన్నీ కూడా దానికి వర్తించవు. భోగవాసనా పరిచాలితులైన కొందరికి అభీప్సిత విషయం తాత్కాలికంగా అదృశ్యమని తోచినా, ఆ భ్రమ నశించేరోజు తొందరగానే వస్తుంది. కనుక, భక్తి అలౌకికమైన అపూర్వవస్తువు.
          సామాన్యంగా మనం సాంఘిక నియమాలను అనుసరించి శాస్త్రవిధులు చేస్తుంటాము. మనిషి ఈ భక్తిని పొందితే సాంఘిక శాస్త్రీయ విధులను దాటి పోతాడు. అప్పుడు ఈ నియమాలు అతని మనసును అరికట్టలేవు. అతడు లౌకిక శాస్త్రీయ విషయాలను విడిచిపెడతాడు. నారదీయ భాషలో నీ త్యాగమే నిరోధం. భక్తిలో ఉన్న మనిషి ఇతర ఆశ్రయాలన్నీ వదిలిపెట్టి, హృదయాన్ని ఈశ్వరుడొక్కడికే సమర్పిస్తాడు. ఇతర విషయాల పట్ల అతడు ఉదాసీనుడవుతాడు. భక్తికి సహాయకరములైన లౌకిక శాస్త్రీయ అనుష్టానాలను గ్రహించటానికి అతనికి అభ్యంతరం లేదు కాని, తదితర విషయాలను సంపూర్ణంగా విడిచివేస్తాడు.
          భక్తి లక్షణాన్ని వర్ణించే సందర్భంలో నారదుడు ఇతర ఆచార్యుల అభిప్రాయాలను కూడా పేర్కొన్నాడు. అందులో పూజాదులలో అనురాగమే భక్తి అని పరాశరుడు, భగవత్కథలో అనురాగమే భక్తి అని గర్గుడు, విరోధి లేని ఆత్మరతే భక్తి అని శాండిల్యుడు అభిప్రాయపడ్డారు. కాని, నారదుడు ఈశ్వరుడిలో సమస్త ప్రాపంచిక విషయాలను సమర్పించటం, ఆయనను మరిచిపోవటం వలన

పే. 4
పరమవ్యాకులత కలగటం అనే విషయాలనే భక్తి లక్షణాలుగా నిర్వచించి, తన అభిప్రాయాన్ని తెలియ చెప్పాడు.
          అయితే, నారదుడికి ప్రాచీన ఆచార్యులపై విశ్వాసం లేదా అనే ప్రశ్న పుట్టవచ్చు. గౌరవం లేక పోలేదు. ఈ లక్షణాలను అతడు భక్తిని పదకొండు విధాలుగా విభజించిన చోట వారి నిర్వచనాలను అంతర్గతం చేశాడు. కేవలం పూజాదులలో అనురాగమని ఊరుకుంటే, అది క్రియాకలాపాలు అనే యాంత్రిక నియమంలో అబద్ధమై ఉండిపోయే భయం ఉంది. ఒకవేళ జీవితంలో ఈ క్రియలను చేస్తున్నా, చిత్తశుద్ధి కలగక పోవచ్చు. అతడు ‘జయించాను’ అని భ్రమపడవచ్చు. ఇలాగే కథాదులలో అనురాగమంటే అది కేవలం వినటంతోనే పరిసమాప్తం కావచ్చు. కనుక నారదుడు ఈ దోషాలు లేని లక్షణాలను నిర్దేశించి, ఇలా అవటం సంభవమా అనే అనుమానాన్ని వ్యక్తం చేసేవారికి “వ్రజగోపికలలో ఇట్లా జరిగిన”దని ప్రత్యుత్తరమిచ్చాడు.
          ఈ భక్తి అవర్ణనీయమైనా ‘క్వాపి పాత్రే’ (ఎవరో సత్పాత్రులలో) ప్రకాశితం కావటం మనం చూడగలం. ఇది సత్వరజస్తమో గుణాలకు అతీతం. ఇందులో ఎటువంటి కోరిక ఉండదు. ఇది విరామవిహీనమైన సూక్ష్మానుభవం. ప్రతిక్షణం వృద్ధి పొందుతూనే ఉంటుంది. దీనిలో ఉన్న సాధకుడు కేవలం దానినే చూస్తాడు, వింటాడు, నడుస్తాడు, ఆలోచిస్తాడు.
పే. 5
          ఇంతవరకు చెప్పుకున్న ఈ భక్తి పరిపక్వావస్థలోనే సంభవిస్తుంది. మనిషి మొట్టమొదటే ఈ స్థితి ని పొందలేడు. ముందు అతడు తన అతి సామాన్య స్థితి నుంచి పైకి లేవవలసి ఉంటుంది; చివరికి ఈ స్థితిని పొందాలి. ఇదే భక్తుడి ఆదర్శం. ఆదర్శం సంపూర్ణంగా మనసులో చిత్రించి ఉండకపోతే దారి ఎటువంటిదో తెలియక చిక్కులో పడవలసి ఉంటుంది. సిద్ధికి అంతరాయాలు అనేక విధాలుగా వస్తాయి. కనుక, లక్ష్యాన్ని అత్యంత స్పష్టంగా నారదుడు వర్ణించాడు. ఈ పరిపక్వస్థితిని వర్ణిస్తూ, ఆయన అతిచిన్న సోపానాలను సైతం మరిచిపోలేదు. ఆయన అనిర్వచనీయమైన గుణాతీతమైన ముఖ్య భక్తినుంచి ఒకింత కిందకు దిగి గుణభేదం, అధికార భేదాలను అనుసరించే గౌణభక్తి త్రివిధాలను నిరూపించాడు. గుణాలను అనుసరించి సత్వ, రజస్తమో రూపాలుగా, అధికారి భేదమును అనుసరించి ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థిరూపాలుగా ఇది ప్రకాశిస్తుంది. వీటిలో పూర్వ పూర్వములు శ్రేష్టములు.
          అర్థార్థి ఈశ్వరుడిని భోగసుఖాల కోసం ప్రార్థిస్తాడు. జిజ్ఞాసువు జ్ఞానం కోసం. ఆర్తుడు దుఃఖితుడై హృదయపూర్వకంగా, గజేంద్రుడిలాగా ఆహ్వానిస్తాడు.
          సత్వగుణం కలిగిన భక్తుడు అత్యంత ఏకాంతమైన చోట ధ్యానం చేస్తాడు, నిద్ర పోతున్నాడని అందరు అనుకుంటారు. కాని, అతడు దోమతెర చాటున, రాత్రంతా ధ్యానంలోనే గడుపుతాడు. ఆరోగ్యం సరిగా లేనందువల్ల పక్క విడువ

పే. 6
లేదని నలుగురు అనుకుంటారు. ఈవైపు, శరీరంపట్ల ఆదరం, ఆకలి తీరేవరకు శాకాన్నం దొరికితే చాలు. తిండి బట్టలపై ఆడంబరం లేదు. ఇతరులను పొగిడి అతడెప్పుడు ధనాన్ని సంపాదించడు. పత్రపుష్పాలతో అతని పూజ ముగుస్తుంది.
          రాజసిక భక్తుడు తిలకం దిద్దుతాడు, రుద్రాక్ష మాలను ధరిస్తాడు. ఆ మాల బంగారంతో చుట్టబడి ఉంటుంది. పూజ చేసేటప్పుడు పట్టుబట్ట కట్టుకుంటాడు. చాలా రకాల నైవేద్యాలు సమర్పిస్తాడు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ‘ఈవైపు చూడాల్సి ఉంది’ అని దేవతాగృహాన్ని చూపిస్తాడు.
          “తామసిక భక్తుడి విశ్వాసం తీక్ష్ణం. ఒకసారి ఆయన నామమును ఉచ్చరించాను. ఇంకా పాపమేంటి? అంటాడు. బందిపోట్లు ధనాన్ని దోచుకున్నట్లు, అతడు ఈశ్వరుడిపై ఒత్తిడి తెస్తాడు. కొట్టు, కట్టు, నరుకు – ఈవిధంగా బందిపోటు జరిగినట్లు” అని శ్రీరామకృష్ణ పరమహంసవారు తమ సహజ సరళ భాషలో వర్ణించారు.
          గౌణభక్తి గురించి నారదుడు ఇంకేమి చెప్పలేదు. జీవితంలో అన్నిటికంటే కఠోరమైన సత్యంలాగా వచ్చి నిలిచేది మృత్యువు. దీనిని ఎవరూ తప్పించలేరు. కాని, మనిషి మొదటినుంచి మృత్యువును దాటి అమృతతత్వంలో ఉండాలని అభిలాషిస్తున్నాడు. అతడు అమృతస్వరూపుడు కావటంవల్ల, యుగ యుగాంతరాల నుంచి, మృత్యువు ఛాతి మీద నిలబడి దానిని జయించాలని ప్రయత్నిస్తున్నాడు. రూప

పే. 7
రసాదులతో కూడిన విశ్వాన్ని తనలోకి ఆకర్షించుకోవటానికి ఇతని వ్యర్థప్రయత్నం. కాని, అతడెంత భోగించినా తృప్తి అనేది లభించదు. అతడి హృదయం ఇంకా, చాలా, ఉత్కృష్టమైనదానిలో ఉండాలని ఆకాంక్షిస్తుంది. అతడు భూమాస్వరూపుడు కావటంవల్ల, అతనిని క్షుద్రవిషయాలు తృప్తిపరచలేకపోతున్నాయి. దుఃఖం అనంతంగా సలుపుతున్నా, అతడు సుఖాశను వదిలిపెట్టలేడు. ఆనంద స్వరూపుడు కావటంవల్ల సర్వావస్థలలో అతడు కోరేది ఆనందమే.
          మనం పొందాలనుకునే వస్తువును ఇష్టం అంటారు. అమృతస్వరూపము, ఆనందస్వరూపము అయిన భూమావస్తువే మనకు ఇష్టం. మన యథార్థ సత్త (అసలైన అస్తిత్వం). ప్రతి ప్రాణి కూడా ఈ వస్తువును పొందే మార్గంలోనే తమకు తెలిసినా, తెలియక పోయినా నడుస్తున్నారు. మాయ, లేక అజ్ఞానం వల్లనే మనకు ఇష్టప్రాప్తి కావటం లేదని విశేషజ్ఞుల అభిప్రాయం. ఈ ఇష్టప్రాప్తికి వారు నిర్దేశించిన మార్గాలు భక్తి, కర్మ, జ్ఞాన, యోగాలు. వీటిలో ఇది తక్కువది, ఇది గొప్పది అనే భేదం లేదు. దేశ, కాల, పాత్రలను అనుసరించి అధికారి భేదం అనుసరించి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ప్రయోజనం చేకూరుస్తుంది. గీతోపదేశకుడు శ్రీకృష్ణుడి ధర్మవాణిలో సమదృష్టితో కూడిన యోగచతుష్టయం సమ్మేళనం ధ్వనించి ఉంది. ఈ సమన్వయవాణి మొత్తం ప్రపంచంలోని ఆధ్యాత్మిక చరిత్రలో అశ్రుతపూర్వం (ముందెప్పుడూ విననిది)

పే. 8
మతప్రచారకుల మాట విడిచినా, మహాపురుషులు అనబడేవారిలో చాలామంది పక్షపాతబుద్ధిని వదలలేక పోయారు.
          నారదుడు కర్మ, జ్ఞాన, యోగాలకంటే భక్తే శ్రేష్ఠమని అంటున్నాడు. కారణం సమస్త సాధనల ఫలితం భక్తి. ఇతర సాధనాలలో అహంకారానికి తావు ఉంది. ఈశ్వరుడు అహంకారాన్ని క్షమించడు. ఆయన కోరేది దైన్యం. {?Expl. వినీతభావం.} భక్తి సాధకుడిలో దీనతను {వినీతభావమును} విప్పారచేస్తుంది. అందువల్ల భక్తే శ్రేష్ఠము. జ్ఞానసాధన వల్ల భక్తి లభిస్తుందని కొందరు, జ్ఞానభక్తులు పరస్పర సాపేక్షములని మరికొందరు అంటారు. కర్మ, యోగ, జ్ఞానముల సహాయం అపేక్షించకుండానే భక్తి ఫలప్రదమని బ్రహ్మకుమారుల అభిప్రాయం. రాజప్రాసాదమును చూసినంతమాత్రాన రాజదర్శనం కాదు. ఖాద్యవస్తువులను చూస్తే ఆకలి తీరదు. అలాగే భక్తి రహితములైన ఇతర సాధనలుకూడా. అందువల్ల ముముక్షువులకు భక్తే గ్రహణీయం.
          అయినా, ఇతరత్ర సహాయం అపేక్షించకుండానే సాధన సంభవమవుతుందా? ఆలోచన చేయకుండా భక్తిపథమును మనం గ్రహిస్తున్నామా? ఇష్ట చింత ‘మనః సంయమనం’ లేకుండా చేయగలమా? భగవద్గుణానువర్ణన, శ్రవణములు ‘కర్మ’ కాదా? అనే ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసి వస్తే, ఇవి జ్ఞాన, యోగ, కర్మాంతర్గతములు అనబడతాయి. కాని, వీటిని కూడా భక్తి యోగాంగాలు గ్రహించి ‘భక్తి’గా నారదుడు నిర్వచించి ఉన్నాడని గమనించాలి. కనుకనే ఇతర యోగాల సహాయం అవసరం లేదన్నాడు.

పే. 9
          అదీగాక, మనుషులను పరీక్షించి చూస్తే జ్ఞానయోగాలకు అధికారులైనవారు ‘నూటికి ఒకటి’ ఒక్కరైనా కనిపిస్తారో కనిపించరో చెప్పలేము. కర్మ మనిషి సహజ ప్రవృత్తి. ఏదో ఒక పని చేయనిదే అతడు ఉండలేడు. ముసలితాతను ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే “ఏం తోచక దడి కడుతున్నాను” అనో లేక “పాదుకు మడి కడుతున్నాను” అనో అంటాడు. అందువల్ల చాలామంది దీనికి అధికారులు. తరువాత, ప్రేమ అనేది కూడా మనిషి సహజ ప్రవృత్తి. దేనినో ఒక దానిని ప్రేమించకుండా అతడు ఉండలేడు. ఈ ప్రవృత్తిని భగవదభిముఖంగ (భగవత్పరంగ) చేయటమే భక్తి.
          కనుకనే, నారదుడు ఇతర ఉపాయాలకంటే భక్తే ఇష్టం పొందటానికి సహజోపాయం అంటున్నాడు. దీనిని నిరూపించటానికి ఇతర ప్రమాణాలు అవసరం లేదు. భక్తే స్వయంగా దీనికి ప్రమాణం. భక్తి సాధన వల్ల సాధకుడు శాంతిని పొందుతాడు. పరమానందం పొందుతాడు. అందువల్ల భక్తిపథం సహజం, భక్తే శ్రేష్ఠం.
          కానీ, ప్రపంచంలోని సాధకులను అందరిని ఈ భక్తిపథంలోనే ప్రవేశపెట్టమని మనం కోరితే అది వ్యర్థమే. అందరికి ఒకే కొలతగల చొక్కా సరిపోదు. జ్ఞానం, లేక కర్మను ఉపాయంగా పొందగలిగే అధికారంతో జన్మించినవారికి భక్తి ఉపకారం చేయలేదు. అయితే, నారదుడి అభిప్రాయం అందరూ భక్తినే అవలంబించాలనేనా?

పే. 10
          కాదు. నారదుడు ఈవిషయంలో ఔదార్యమే చూపాడు. తన గ్రంథం కేవలం భక్తిసాధకులకే అని అంటున్నాడు.
          భక్తులలో ఐకాంతిక (అననన్యమైన) భక్తులే శ్రేష్ఠులు. వారు పరస్పరం ఈశ్వరుడిని గురించే మాట్లాడతారు. ఆనందంతో వారికి కంఠం పూడుకుపోతుంది. ఆనందబాష్పాలు పడతాయి, శరీరం పులకితమవుతుంది. వారి వంశం పవిత్రమవుతుంది. భూమి పావనమవుతుంది. వారివల్ల తీర్థస్థలాలు తీర్థత్వాన్ని పొందుతాయి. కర్మ సత్కర్మ అవుతుంది. శాస్త్రాలు సత్శాస్త్రాలవుతాయి. వారు సర్వదా తన్మయులై ఉంటారు. వారి పితృదేవతలు ఆనందిస్తారు. దేవతలు నృత్యం చేస్తారు. భూమి సనాథ అవుతుంది. వారిలో జాతి, విద్య, రూప, కుల, ధన భేదాలు లేవు. కర్మగతం కాని, లేక మరేవిధమైన భేదం కానీ ఉండదు. ఎందుకంటే వారు భగవంతుడికి చెందినవారు అయిపోతారు. భక్తులకు భగవంతుడికి భేదం లేదు. ఇక, గౌణభక్తుల ప్రసంగం ఏమీ కనపడదు.
          భక్తి పొందాలంటే ముఖ్య ఉపాయం మహాత్ముల కృప- లేక, భగవంతుడి కృపాలేశం. మహాత్ముల సంగం దుర్లభం, అగమ్యం. కాని, అమోఘం. కేవలం మహాత్ముల కృప ఉంటే చాలు, భక్తి లభిస్తుంది. ఎందుకంటే, భక్తుడికి భగవంతుడికి భేదం లేదు.
          “భక్తుడి హృదయం భగవంతుడి కచేరీ సావిడి. బాబుగారు తమ ప్రాసాదంలో తిరుగుతున్నా, ముఖ్యంగా ఆయన దర్శనం కచేరీ సావిడిలోనే లభిస్తుంది. కనుక, భక్తు

పే. 11
డికి భగవంతుడికి భేదం లేదని శ్రీరామకృష్ణపరమహంస చెప్పేవారు. ఒకసారి ఆయన భాగవతపురాణం విన్నప్పుడు ఒక ‘అనుభూతి’ కలిగింది. అది : శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా నిలబడి ఉన్నాడు. ఆయన నుంచి కాంతికిరణం ఒకటి వెలువడి భాగవతాన్ని స్పృశించి, తరువాత పరమహంసను కూడా స్పృశించింది. అప్పటినుంచి ఆయన ఈ ఉపదేశం చేస్తుండేవారు.
          నిరంతరం, అవిరామంగా భగవద్భజన చేయమని నారదుడి ఆదేశం. సుఖదుఃఖాలు, లాభాలాభాలు మొదలైనవి లెక్కచేయకుండా, నిమిష మాత్ర కాలమైనా వ్యర్థం చేయకుండా అన్నివిధాలుగా నిశ్చింత మనసుతో ఈశ్వరుడి భజన చేయాలి. ఇతరుల దగ్గర భగవద్గుణ శ్రవణం చేసినా, కీర్తన చేసినా, భక్తి సాధ్యమవుతుంది. భగవంతుడి నామగుణాలు గానం చేస్తే, ఆయన వెంటనే వస్తాడు. భక్తులకు ఆయన తన ఉనికిని అనుభవింపచేస్తాడు. దాస్యభావమునో, లేక మధురభావమునో అవలంబించి, ఆయనపై ఐకాంతిక (అననన్యమైన) భక్తిని నిలపాలి. భక్తే సాధ్యం, దానినే సాధించండి.
          భక్తిశాస్త్రాలను మననం చేసుకోవాలి. భక్తిని పెంచే పనులు చేయాలి. వాగ్వివాదాలను చేయద్దు. దానవల్ల వ్యర్థ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. వాగ్వివాదానికి అంతంలేదు. అహింసాదులను పాటించాలి.
          అభిమానం, దంభం మొదలైనవాటిని విడిచిపెట్టాలి. ధన, శత్రు, నాస్తిక, స్త్రీప్రసంగాలు వినవద్దు. ఇతరులు

పే. 12
అపకారం చేస్తారనిగాని, లేక ఇతరులకు అపకారం చేయాలనిగాని అలోచించద్దు. ఎందుకంటే, ఈ సర్వస్వం లౌకిక శాస్త్రీయ కర్మలు ఈశ్వరుడికి అర్పించబడినవి. విషయాలను వదిలిపెట్టు. దుస్సంగమును పూర్తిగా విడిచిపెట్టు. దీనినుంచే కామ, క్రోధ, మోహ, స్మృతిభ్రంశ, బుద్ధినాశ, సర్వనాశనములు సంభవిస్తాయి. దుస్సంగంలో అలల లాగ ఉన్న దుర్గుణాలు సముద్రంగా మారగలవు.
          భక్తుడి కర్మలన్నీ భగవంతుడికే నివేదించబడతాయి. కనుక కామ, క్రోధ, అభిమానాలు పూనవలసిన, ఆయన పట్లనే వహించాలి. అంటే, ఈ వృత్తులన్నిటినీ ఆయన వైపే మళ్ళించాలి. ఆయన దర్శనాన్ని కోరాలి. దర్శనానికి ప్రతిరోధం కలిగించే వాటిపై క్రోధం చూపాలి. సాక్షాత్కరించవేమని అభిమానంతో ఉండాలి.
          సాధన సమయంలో భగవంతుడితో ఒక సంబంధం స్థాపించుకుంటే భక్తి దృఢమవుతుంది. సాధన కూడా సహజం, మధురం అవుతుంది. భగవంతుడిపై భావస్థాపననే నారదుడు ఆసక్తి అంటున్నాడు. ఈ ఆసక్తి ఒక్కటే అయినా, గుణమహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, దాస్యాసక్తి, సుఖాసక్తి, కాంతాసక్తి, వాత్సల్యాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయాసక్తి, పరమవిరహాసక్తి, అనే పదకొండు రూపాలను ధరిస్తున్నది.
          భక్తి పొందటానికి నారదుడు చెప్పిన ఉపాయాలు ఆరు. అవి – మహాత్ముల, లేక భగవంతుడి కృప, ఐకాంతిక భజన, భక్తి

పే. 13
శాస్త్రాలను చదవటం, చెడుసాంగత్యం పరిత్యాగం శీలనిర్మాణం, భగవంతుడిపై ప్రవృత్తి మళ్ళించటం, భావాశ్రయణం అనేవి.
          అనురాగానికి ఉదాహరణ వ్రజగోపికలు. వారి అనురాగంలో మహాత్మ్యజ్ఞానం లేదనటం తప్పు! అది లేపొతే జారత్వమే అవుతుంది. ప్రేమాస్పదుని సుఖమే తన సుఖమనే భావం జార ప్రేమలో లేదు.
          సాధనపథంలో ప్రధానాంతరాయం మాయ, లేక అజ్ఞానం. ఈ మాయను ఎవరు తరించగలరు? సంగత్యాగి (అన్ని సాంగత్యాలు విడిచినవాడు), సాధుసేవి (సత్పురుషులను సేవించేవాడు), నిర్మముడు (మమకారాలన్నీ విడిచినవాడు), నిర్జనవాసి (ఏకాంతప్రదేశంలో ఒంటరిగా ఉండేవాడు), లోకబంధరహితుడు (లోకమనే బంధాన్ని వదిలించుకున్నవాడు), త్రిగుణాతీతుడు, యోగక్షేమరహితుడు (తన మంచి చెడులన్నింటి చింత భగవంతుడికే విడిచినవాడు), కర్మత్యాగి (అన్ని పనులూ వదిలినవాడు), కర్మఫలత్యాగి (పనులన్నింటి ఫలాన్ని విడిచినవాడు), ద్వంద్వహీనుడు (రెండు ఉన్నాయనే స్పృహను విడిచినవాడు), విధినిషేధములకు అతీతుడు (శాస్త్రం విధించినవి, చేయవలసినవి, చేయకూడననివి అయిన పనులు), నిరవచ్ఛిన్న అనురాగి (ఎడతెగని అనురాగం కలిగినవాడు) కూడా అయినవాడొక్కడే మాయను తరించగలడు. తాను తరించటమేకాదు, ఇతరులను కూడా తరింపచేయగలడు.
          విధి నిషేధాలను, అనగా వాటిని విధించే శాస్త్రాలను వదిలిపెట్టమని ఉపదేశించటం వల్ల నారదుడు శాస్త్రవిరోధి అనుకోకూడదు. భక్తి దృఢమయ్యేవరకు ఆయన వాటిని మన్నించమనే అన్నారు. లేకపోతే పతితులవుతారు. సర్వస్వము భగవంతుడికి నివేదించలేనంతవరుకు లౌకికకర్మలను విడిచిపెట్టవద్దు. ఈశ్వరుడిపై దృఢబుద్ధి కలిగితే లౌకిక కర్మలుండవు. శరీరం పడిపోయే వరకు భోజనాది కర్మలు మిగిలి ఉంటాయి.

పే. 14
          విరుద్ధవాదులను ఉపేక్షించి, కుమార, వ్యాస, శుక, శాండిల్య, గర్గ, విష్ణు, శేష, ఉద్ధవ, ఆరుణి, బాలి, హనుమంత, విభీషణాది భక్తియోగాచార్యులతో ఏకీభవించి, నారదుడు సమకూర్చిన శివోపదేశమును విశ్వసిస్తే శ్రద్ధాళులైనవారు ఇష్టవస్తువును పొందుతారు. సందేహం లేదు.
          వర్తమానకాలంలో ప్రపంచంలో ఉన్న మతాలన్నిటినీ, ముఖ్యంగా వాటి అనుష్ఠానికభాగాన్ని పరిశీలించి చూస్తే నారదుడు ఉపదేశించిన అమృతోపమమైన ఈ భక్తే విభిన్న రూపాలలో అభివ్యక్తమవుతూ, ఆయా సాధకులకు విమలమైన ప్రశాంతి ప్రసాదిస్తుందని తెలుస్తుంది.
                                    న ధర్మనిష్ఠోస్మి వచాత్మవేది, న భక్తిమాంస్త్వచ్చరణారవిందే,
                                    అకించనోనన్యగతిశ్శరణ్యం, త్వత్పాదమూలం శరణం ప్రపద్యే.
                                                (శ్రీయామునాచార్యులు)
పే. 15
ద్వితీయదళం
భక్తిభావ రస విచారం

                             అఖిల రసామృతమూర్తిః ప్రసృమరరుచి రుద్ధ తారకాపాలిః
                             కలితశ్యామో లలితో రాధాప్రేయాన్విధుర్జయతి.
                                                                   (భక్తిరసామృత సింధువు)
          సేవార్థంలో చెప్పబడిన ‘భజ్’ ధాతువు ‘క్తి’ ప్రత్యయంతో కూడగా ‘భక్తి’ శబ్దం నిష్పన్నమవుతున్నది. ఈ శబ్దాన్ని ఎక్కువగా ఈశ్వర ప్రేమాకారాన్ని దాల్చిన మానసికవృత్తిని నిర్దేశించటానికి శాస్త్రాలు వ్యవహరిస్తున్నాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళపట్ల చూపించే గౌరవమయ భావపరంగా కూడా ఈ పదం లోకంలో ప్రయోగించబడుతుంది. శాస్త్రీయమైన భక్తినే గౌడీయ గోస్వాములు సర్వోత్కృష్ఠమైన పంచమ పురుషార్థంగా గ్రహించారు. సాధ్యమైనంతవరకు వారి భాషలోనే వారి ఆశయాన్ని తెలియచేస్తాను.
          ఈ భక్తి సాధన భక్తి, ప్రేమ భక్తి అని రెండు విధాలు. వైధీ, రాగానుగ భక్తులు సాధన భక్తిలో అంతర్భాగాలు. అపరా-పరా, గౌణీ-ముఖ్యములనే ఇతర పేర్లు కూడా వీటికి ఉన్నాయి.

పే. 16
                             “శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
                             అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనమ్”
అని భాగవతకారుడు నిర్వచించిన సాధనభక్తే, నవధాభక్తే అభ్యాసఫలంగా ‘రాగానుగ’ అవుతుంది. ఇలా బాహ్య క్రియాకలాపం అపేక్షించకుండా భగవల్లీలా రసాస్వాదనం భక్తుడికి లభిస్తుంది, ఈ సాధన భక్తి మహత్ఫలమే ప్రేమభక్తి. మొదటిది ఉపాయం, రెండవది ఉపేయం.
          ఈ భక్తిని శ్రీరూపగోస్వామి పాదులు ఇలా నిర్వచించారు :
                             “అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్య నావృతమ్
                             అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా”.
          భుక్తి, ముక్తి, యోగసిద్ధి, ఐశ్వర్యవాంఛ మొదలైన ఇతర వాంఛలను అభిలషించక, సాధన భక్తిలో అంగములైన జ్ఞానకర్మాదుల సహాయం అపేక్షించక, త్రికరణాలను శ్రీకృష్ణపరంగ చేయటమే ఉత్తమ భక్తి (ప్రేమభక్తి).
          ఈప్రేమభక్తి లభించే క్రమం ఇది :
                             “ఆదౌ శ్రద్ధాతతః సాధు సంగోథ భజనక్రియా,
                             తతో నర్థనివృత్తిః స్యాత్తతో నిష్ఠా రుచిస్తతః,
                             అథాసక్తి స్తతోభావస్తతః ప్రేమోదయశ్చ సః,
                             సాధకానామయం ప్రేమః ప్రాదుర్భావే భవేత్క్రమః”.
          మొదట ‘శ్రద్ధ’ అవసరం. ఈ శ్రద్ధ సాధుసంగానికి కారణమవుతుంది. సాధుపురుషుల ఆచార వ్యవహారాలు

పే. 17
చూస్తే, వారిని అనుసరించాలని బుధ్ధి పుడుతుంది. ఫలితంగా భగవద్భజన అభ్యాసం అలవాటవుతుంది. భజనవల్ల అనర్థాలు తొలగిపోయి నిష్ఠ, రుచి, ఆసక్తులు క్రమంగా లభిస్తాయి. ఆసక్తే భావంగా, తదాశ్రయాలైన రసాలుగా పరిణితి చెందుతాయి. సర్వరసముల సమాహారమే ప్రేమ అనబడే మహాభావం. (1)
(1. కృష్ణస్య సుఖే పీడాశంకయా నిమిషస్యాపి అసహిష్ణుతాదికం యత్ర సరూఢో మహాభావః. కోటిబ్రహ్మాండగతం సమస్త సుఖ యస్య సుఖస్య లేశోపి న భవతి, సమస్త వృశ్చికసర్పాదిదంశకృతదుఃఖమపి యస్య దుఃఖస్య లేశో న భవతి. ఏవం భూతే కృష్ణసంయోగవియోగయోః సుఖదుఃఖే యతో భవతః సః అధిరూఢః మహాభావః. అధిరూఢస్యైవ మోదన మాదన ఇతి ద్వే రూపే భవతః. - శ్రీవిశ్వనాథ చక్రవర్తి)
          భక్తిశాస్త్రంలో దృఢప్రత్యయం ఉండటమే ‘శ్రద్ధ’. ఇది శాస్త్రోక్త విషయాచరణ రూపంలో బయటకు వస్తుంది. జిజ్ఞాస ఉదయిస్తుంది. ఈ శ్రద్ధే గురుచరణాలను ఆశ్రయింపచేస్తుంది, తద్వారా సాధుసంగం లభిస్తుంది.
          సాధుసంగ ఫలితంగా భజనాసక్తి కలుగుతుంది. ఈ భజన అనిష్ఠితము, నిష్ఠితము అని రెండు రకాలు. అనిష్ఠితమైన ఆసక్తి ‘ఉత్సాహమయి’, ‘ఘనతరల’, ‘వ్యూఢవికల్ప’, ‘విషయసంగర’, ‘నియమాక్షమ’, ‘తరంగరంగిణి’ అని ఆరు విధాలు.
          శాస్త్రాధ్యనం ఆరంభించిన బాలుడు ప్రాథమికదశలో లోకశ్లాఘ్యమానమైన పాండిత్యాన్ని పొందటానికి ఉత్సాహం చూపుతాడు. ఈ భావమే “నేను నలుగురితో భక్తుడనని

పే. 18
అనిపించుకోవాలి” అనే విధంగా భక్తుడికి కూడా కలుగుతుంది. దీనిని ఉత్సాహమయమైన అనిష్ఠిత భజనాసక్తి అంటారు. ఆరంభించిన శ్రవణాది భక్త్యంగములను ఒక్కొక్కప్పుడు నిర్వహించటం, మరికప్పుడు రసానుభూతి తక్కువై నిర్వహించకపోవటం అనే స్థితే ఘనతరల. సోమరితనం వచ్చి పట్టుదలను తగ్గించటమే ముఖ్యకారణం అవుతుంది. “భార్యాపుత్రాదులను కూడా భక్తులను చేసి ఇంట్లోనే ఉండి భగవత్సేవ చేస్తావా? లేక, బృందావనాది పుణ్యప్రదేశాలకు వెళ్ళి ఏకాంతసాధన చేస్తావా? భార్యా పిల్లలను వదిలిపెట్టవలసి వస్తే ఇప్పుడే వదిలిపెడతావా? లేక, భుక్తభోగివై ముసలితనంలో విడిచిపెడతావా? “అతృప్తస్తాననుధ్యాయన్ మృతోధం విశతేతమః, తావద్రాగోదయస్తేన స్తావత్ కారాగృహం గృహమ్” (ఇంద్రియాలు చరితార్థం కానంత వరకు నియమిత భోగాలను అనుభవించు. వాటిని తృప్తి పరచక, మనసా, ధ్యానం చేస్తే నరకాన్ని పొందుతావు. కామక్రోధాలున్న, గృహమే కారాగృహం) అని గార్హస్థ్య సన్యాసధర్మాల విధి. వీటిలో ఏది ఆశ్రయణీయం? కీర్తన, కథాశ్రవణం మొదలైన అంగాలలో దేనిని గ్రహిస్తాను? అంబరీషాదులలాగా అనేకాంగమైన భక్తిని గ్రహిస్తానా? అనే వివిధకల్పనలవల్ల పీడింపబడేస్థితే వ్యూఢవికల్పం. “విషయావిష్టచిత్తానాం విష్ణ్వావేశః సుదూరతః, వారుణీ దిగ్గతం వస్తు ప్రజన్నేంద్రీం కిమాప్నుయాత్” అనే వాక్యంవల్ల ప్రబోధించబడి, విషయభోగాలను (వదిలిపెట్టేతట్లుచేసే) పరిత్యజింపచేసే ప్రయత్నమే విషయసంగరం. ఇలా భక్తుడు ఒక్కొక్కప్పుడు విషయేఛ్చను (వదిలిపెడుతూ) త్యజిస్తూ, మరొకప్పుడు

పే. 19
విషయేఛ్చవల్ల జయించబడుతుంటాడు. “ఇంత జపం చేస్తాను. ఇన్ని సార్లు ప్రణామం చేస్తాను, భగవత్సంబంధములు కాని వాక్యాలను వినను, అనను” మొదలైన నియమాలను స్వేఛ్చపూర్వకంగా విధించుకుని, వాటిని సంపూర్ణంగా ఆచరించలేకుండా ఉండటం నియమ అక్షమ. భజన ప్రభావఫలితంగా జనానురాగం, సంపదలు, సిద్ధులు అనే తరంగాలు లేచి, భజనక్రియను ఘాతపరిచేటటువంటి స్థితే తరంగరంగిణి. భక్తుడిని చూసి జనాలు సామాన్యంగా గౌరవం, అనురాగం చూపిస్తారు. ‘సర్వ భూతాంతరాత్ముడు’ అయిన హరిని అర్చించటం వల్ల స్థావర జంగమాత్మకమైన జగత్తు తృప్తిపడుతుంది. అప్పుడు విషయసుఖాలు, అణిమాది అష్టసిద్ధులు తామే వచ్చి భక్తుడిని ఆశ్రయిస్తాయి. లేక, భక్తుడి దార్ఢ్యమును పరిశీలించటానికి మహామాయే ఈ ప్రలోభాలను చూపవచ్చు. (2) [ఈ విభాగము ‘మాధుర్య కాదంబినీ’కారుడగు శ్రీవిశ్వనాథ చక్రవర్తినననుసరించి.]
          ఈభజన క్రియాఫలితంగా అనర్థములన్నీ తొలగిపోతాయి. అనర్థాలు-- దుష్కృతోత్థములు, సుకృతోత్థములు, అపరాధోత్థములు, భక్త్యుత్థములు అని నాలుగు విధాలు.
          అందులో, అవిద్యా-అస్మిత-రాగ-ద్వేష-అభినివేశములు అనే పంచాక్లేశాలు (3) [చూడండి. యోగదర్శనము, పతంజలి 23 సూత్రం, 3,5,6,7,8,9] దుష్కృతోత్థములు. వీటినన్నిటినీ అవిద్యాంతర్గతములుగానే గ్రహించవచ్చు. ప్రారబ్ధం (ఫలోన్ముఖము), అఫలోన్ముఖము, రూఢము (బీజోన్ముఖం). బీజం అనేవి

పే. 20
కూడా ఈ క్లేశాంతర్గతములే. వీటినే భక్తిరసామృతసింధుకారుడు ఫలోన్ముఖము, అప్రారబ్ధఫలం, కూటము, బీజం అని వ్యవహరిస్తున్నాడు. సుకృతోత్థములు అంటే, వివిధములైన భోగాభినివేశములు. కొందరు వీటిని కూడా క్లేశాంతః పాతములుగానే పరిగ్రహిస్తున్నారు.
          సేవలో అపరాధం, నామాపరాధాల వల్ల జనించే అనర్థములు అపరాధోత్థములు.
          దేవాలయానికి బండి మీద వెళ్ళటం, పాదుకాధారియై భగవద్దర్శనం చేయటం, ఉత్సవరోజుల్లో (వేశేష పూజలు చేసి) భగవత్సేవ చేయకపోవటం, ఈశ్వరసాన్నిధ్యంలో ప్రణామం చేయకపోవటం, అశుచియై భగవద్వందనం చేయటం, ఏకహస్త ప్రణామం చేయటం, పృష్ఠభాగ ప్రదర్శన పూర్వకంగా ప్రదక్షణం చేయటం, దేవుడిముందు పాదాలుచాపటం, వంగి నమస్కరించటం, తదగ్రములో శయన, భక్షణ, మిథ్యాభాషణ, పెద్ద గొంతుతో భాషించటం, నిష్ఠుర భాషణం, పరస్పర సంభాషణం, రోదనం, నిగ్రహ-అనుగ్రహములను చేయటం, పరనిందా పరస్తుతులను, అశ్లీలవాక్యములను ఉచ్చరించటం, కంబళమును ధరించటం, అపానవాయువును (వదిలిపెట్టటం) త్యజించటం, శక్తి ఉన్నా గౌణోపచారములను అర్పించటం (4), [తంత్రోక్తమైన పూజ సామాన్యంగా పంచోపచారపూజ, దశోపచార పూజ, షోడశోపచార పూజ అని త్రివిధము. షోడశోపచార పూజ ప్రతిరోజు చేయటం అసంభవం కనుక దశోపచారపూజ నిత్యపూజగా ఆ శాస్త్రంలో నిర్దేశింపబడినది. ఇక్కడ పంచోపచారాలను చేస్తే గౌణపూజ అవుతుంది అని భావము. ఉత్సవదినముల విశేషపూజ- అంటే షోడశోపచార పూజ చేయాలని విధి.] అనివేదితమైన అన్న భక్షణం, ఆయా

పే. 21
ఋతుప్రాప్తములైన ఫలపుష్పాలను సంగ్రహించి అర్పించకుండా ఉండటం, అగ్రభుక్తములు, వ్యవహృతములు అయిన అన్నం-వ్యంజన-వస్త్ర-పుష్పాదులను సమర్పించటం, పృష్ఠభాగమును ఈశ్వర విగ్రహానికి ప్రదర్శన చేస్తూ కూర్చోవటం, దేవతా సాన్నిధ్యంలో ఇతరులకు అభివాదన చేయటం, గురువు ప్రశ్నించినా తనను ప్రసంశించుకోవటం, దైవనింద చేయటం అనేవి భక్తసమాజంలో ద్వాత్రింశత్ (32) సేవాపరాధములుగా పరిగణించబడుతున్నాయి. (5) [భక్తరసామృత సింధుబిందు]
          ఇవిగాక, రాజాన్నభక్షణం, అంధకారగృహంలో ఉన్న దేవతా విగ్రహాలను స్పృశించటం, అవిధిపూర్వకంగా విగ్రహసమీపంలో కూర్చోవటం, వాద్యరహితంగా మందిరద్వారాలు తెరవటం, శునకాదిదూషిత భక్ష్యాలను పూజార్థం సంగ్రహించటం, అర్చనకాలంలో మౌనభంగం చేయటం, పూజా సమయంలో మల-మూత్ర విసర్జన కోసం వెళ్ళటం, గంధమాల్యములను సమర్పించకముందే ధూపం సమర్పించటం, నిషిద్ధ పుష్పాలతో పూజించటం, పళ్ళు తోమకముందే శ్రీవిగ్రహాన్ని తాకటం, తత్సంబ్నధమైన పనులను చేయటం, స్త్రీసంగంచేసి, రజస్వల, మృతదేహదీపాన్ని ముట్టుకుని, రక్త, నీల, అధౌత, అన్యత్యక్తమైన, లేదా మలిన

పే. 22
వస్త్రాలను ధరించి, మృతదేహాన్ని చూసి, అపానవాయువును విడిచి, క్రుద్ధతను దాల్చి, శ్మశానంలో తిరిగి, అజీర్ణ స్థితితో, కుసుంబ, శాక, హింగుభక్షణ చేసి, తైలమర్దన చేసుకుని శ్రీవిగ్రహాన్ని స్పర్శించటం తత్సంబంధమైన పనులను చేయటం కూడా సేవాపరాధాలే అనబడతాయి. (6) [చూడండి. వరాహపురాణం]
          భగవంతుని శాస్త్రాన్ని అనాదరణ చేయటం, ఇతర శాస్త్ర ప్రవర్తన, దేవతా సమ్ముఖంలో తాంబూలం సేవించటం, నిషిద్ధవ్రతపూజ, అసురసమయపూజ, కాష్టాసనంలో, లేక భూమిమీద కూర్చుని పూజించటం, దేవతను స్నానం చేయించే సమయంలో వామహస్తంతో తాకటం, శుష్కములు, యాచితములైన పుష్పాలతో పూజించటం, పూజాకాలంలో నిష్ఠీవనమును ( ఉమ్మును వదిలిపెట్టటం) త్యజించటం, గర్వంతో తాను చేసిన పూజగురించి చెప్పుకోవటం, వక్రంగా తిలకాన్ని ధరించటం, పాదప్రక్షాళణ లేకుండా దేవతామందిరంలోకి ప్రవేశించటం, ఇతర పక్వములైన వస్తువులను అర్పించటం, అభక్తుల సమ్ముఖంలో పూజచేయటం, కాపాలిక దర్శనంచేసి ఘర్మాక్త (చెమట పట్టిన) శరీరంతో పూజచేయటం, నఖస్పృష్ట (గోళ్ళు అంటిన) నీళ్ళతో దేవతను స్నానంచేయించటం, భగవన్నామ గ్రహణపూర్వకంగా శపథం చేయటం అనేవి కూడా సాంప్రదాయకమైన సేవాపరాధాలని చెప్పబడుతున్నాయి.

పే. 23
          సాదునింద, శివ విష్ణువుల నామరూపాల భేదబుద్ధి, గురువును అవజ్ఞ (నిర్లక్ష్యం) చేయటం, శృతి, స్మృతి, నింద, నామమహాత్మ్యమును అర్థవాదబుద్ది నామార్థాల తప్పుడు వాఖ్య, నామబలంలో పాపప్రవృత్తి, ఇతర శుభకర్మలతో నామమును సమంచేయటం, శ్రద్ధాహీనుడికి నామోపదేశం చేయటం, మహిమను విన్నా నామముపై అప్రీతిని వహించుట అనేవి దశవిధ నామాపరాధాలు. ఈ విషయమును శ్రీజీవగోస్వామి భక్తిరసామృతసింధు టీకాలో ప్రసంగించి ఉన్నాడు. (7) [చూడండి. పద్మపురాణం] శరణాగతి గద్యంలో శ్రీరామానుజుడు ‘భగవదపచార-భాగవతాపచారా-సహ్యాపచార-రూప-నానావిధానాంతాపచారాన్ ... క్షమస్వ’ అనేటప్పుడు ఈ అపరాధాలనే సూచించాడు.
          ఈ అపరాధశాఖలకు ఉపశాఖలనబడే ధనసంగ్రహము, ప్రతిష్ఠాలాభం, ఇతర సాధకుల మనసును వీటి మూలంగా ఆకర్షించటం-- అనేవి భక్త్యుత్థములైన అపరాధాలు.
          ఈ అపరాధాలన్నీ భజన వల్లే నివృత్తములవుతాయి. ఈ నివృత్తి ఏకదేశవర్తిని, బహుదేశవర్తిని, ప్రాయికి, పూర్ణం, అత్యంతికం అని ఐదు విధాలు. విస్తృతి భయంవల్ల వాటిని ఇక్కడ వివరించటం లేదు.
          అనర్థ నివృత్తి అవుతూనే భజన ‘నిష్టిత’మవుతుంది. అప్పుడు లయ-విక్షేప-అప్రతిపత్తి-కాషాయ- రసాస్వాదనలు అనే అంతరాయములు ఐదు కూడా తొలగిపోతాయి. ఇవి ఉండటంవల్లనే భక్తి అపరిపక్వదశలో ఉండి, అనిష్టితం అనబడుతుంది.

పే. 24
          కీర్తన శ్రవణ-స్మరణ-సమయాలలో నిద్ర రావటమే లయం. కీర్తనకంటే శ్రవణంలో, శ్రవణంకంటే స్మరణ సమయంలో నిద్ర అత్యంత సహజంగా వస్తుంది. కీర్తన నలుగురితో కలిసి చేస్తుండటంవల్ల నిద్రవచ్చే అవకాశం లేదు. శ్రవణ సమయంలో తానొక్కడే ఇతరుల ప్రసంగ వ్యాఖ్యానములను వింటున్నందువల్ల మనసు ఆ ఆలంబమును సరిగా గ్రహించలేకపోతే అత్యంతసహజంగా నిద్రకు లోనవుతుంది. కనుక, కీర్తన, శ్రవణ స్మరణములలో ఉత్తరోత్తరము అధికంగా నిద్రామాంద్యమునకు తావున్నదని గ్రహించాలి.
          శ్రవణ కీర్తన స్మరణ సమయాలలో వ్యావహారిక వార్తా సంపర్కము వాచికంగా గానీ, మానసికంగా కాని ఉంటే విక్షేపం అనబడుతుంది. లయవిక్షేపాలు లేకున్నా కీర్తనాదులను చేసే సామర్ధ్యం తగ్గితే, అప్రతిపత్తి అనబడుతుంది. ఈ సాధనసమయంలో క్రోధ-లోభ-గర్వాదుల సంస్కారం లేస్తే కాషాయమనబడుతుంది. విషయరసం భజనను ఆటంకపరిచే స్థితే రసాస్వాదం.
          ఈ భద్రములు అన్నీ భగవద్భజన వల్లే విధౌతములు {నిర్మలములు, శుద్ధములు} అవుతాయని అనటం పునరుక్తి. (8)
[శ్రుణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః
హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్ సతామ్
నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవతసేవయా
భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ
(శ్రీమద్భాగవతం, 1.2.17,18 ]
ఈస్థితిలో భక్తి ఆత్మసంప్రసాదిని అనబడుతుంది.

పే. 25
          ఈ నిష్ఠ భక్తివర్తిని, అనుకూలవర్తిని అని రెండువిధాలు. భక్తివర్తిని మళ్ళీ స్థూలంగా కాయికం, వాచికం, మానసికం అని మూడు విధాలు. అమానిత్వ, మానదత్వ, దయాదిగుణ శోభిత మైన నిష్ఠ అనుకూలవస్తువర్తిని అనబడుతుంది.
          శ్రవణాదులలో యత్నప్రాబల్యము ఉంటే నిష్ఠితభక్తి అని, యత్న శైథిల్యం ఉంటే అనిష్ఠితభక్తి అని గ్రహించాలి.
          పూర్వోక్తమైన భజన క్రియాభ్యాసం వల్ల ఉద్దీపితమైన భక్తుని హృదయంలో ‘రుచి’ జన్మిస్తుంది. రుచి అంటే శ్రవణ-కీర్తనాదులకంటే ఇతర విషయాలపట్ల అరుచి. కనుక భజన సంబంధమైన ప్రీతే రుచి అని గ్రహించాలి.
          ఈ రుచి వస్తువైశిష్ట్యాపేక్షిణి, అనపేక్షిణి అని రెండువిధాలు. భగవన్నామ రూపగుణలీలాదుల వైశిష్ట్యాన్ని, కీర్తన మాధుర్యాన్ని, దేశ-కాల-పాత్ర-ద్రవ్యాలను, అలంకారిక ధ్వని మొదలైనవాటితో యుక్తమైన వాక్కు మాధుర్యాన్ని, స్వరుచి అనే సారం అభిలషించటమే వస్తువైశిష్ట్యాపేక్షిణి. ఆకలిమాంద్యంతో ఉన్నవాడు ‘ఏమేమి వ్యంజనాలు ఉన్నాయ?’ని ప్రశ్నించినట్లు. ఈ విషయాలను అపేక్షించక నామరూపాది శ్రవణమాత్రముననే ఆవిర్భవించేది అనపేక్షిణి రుచి.
          భజనవిషయమైన ఈరుచి భజనీయుడైన భగవంతుడి విషయంగా చేసుకుంటే, ఆసక్తి అనబడుతుంది. ఈ ఆసక్తే అంతఃకరణ అద్దాన్ని పరిశుభ్రంచేసి భగవంతుడిలో ప్రతిబింబించటానికి వీలుగా చేస్తుంది.

పే. 26
          తమ భక్తిసూత్రాలలో నారదుడు పారాశర్య, గార్గ్య, శాండిల్యుల అభిప్రాయాన్ని చెప్పాడు. పూజాదులలో అనురాగం భక్తి అని పారాశర్యుడు. (9) [పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః] కథా శ్రవణంలో అనురాగం భక్తి అని గార్గి. (10) [కథాస్వితి గార్గ్యః] అవిరోధమైన ఆత్మరతి అని శాండిల్యుడు. (11) [ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః] ఇక అందులోనే నారదుడు, ఈ భక్తి-- గుణమహాత్మ్యాసక్తి, రూపాసక్తి, పూజాసక్తి, స్మరణాసక్తి, ఆత్మనివేదనాసక్తి, తన్మయతాసక్తుల-- రూపంలో ప్రకాశిస్తుందని అన్నాడు. నారదుడు మొత్తంమీద పదకొండురూపాలుగా భక్తి ప్రకాశిస్తుందని అన్నాడు. అందులో ఇవి ఆరువిధాలు. (12) [చూడండి. నారదభక్తిసూత్రాలు]
          స్థూలంగా ఇంతవరకు వైదీభక్తి రాజ్యమని గీటు గీయవచ్చు. పారాశర్య, శాండిల్య, గార్గ్యుల నిర్వచనం, ఈ షడ్విధ ప్రకాశములు కూడా దీనిలో అంతర్గతాలే అవుతాయని ఊహించగలం.
          ‘రుచి’ లో మనసును ఇతరవిషయాలనుంచి మళ్ళించి భాగవత్పాదములకు కట్టవలసి ఉంటుంది. ‘ఆసక్తి’ లో ఈశ్వరధ్యానంలో విచ్ఛేదం ఉండదు. ‘రుచి’ లో చాలాసేపు ఉంటే విచ్ఛేదమవుతుంది.

పే. 27
          ఈ ఆసక్తే పరమపరిణామముపొంది (దృఢమై) రతి, లేక భావం అనబడుతుంది. ఈ రతే భక్తి కల్పలత ఉత్పుల్ల పుష్పం, ఈ భావకుసుమ పరిమళమే ఈశ్వరుడిని ఆహ్వానిస్తుంది. ఇందులో బాహ్యదశ, అర్ధబాహ్యాదశ, అంతర్దశ (భావసమాధి) అని మూడు అంతరువులు ఉన్నాయి.
          ఈ భావావస్థలోనే సాక్షాత్ భగవత్దర్శన స్పర్శలు లభిస్తాయి. అప్పుడు భక్తుడు భగవత్సంగ వియోగం యొక్క ఫలములైన హర్ష విషాదాల వల్ల కలిగిన సంచారీ భావాలవల్ల అలంకృతుడై, లోక చక్షువులో అంతర్హితుడై ఉంటాడు. ఈ స్థితినే రాగానుభక్తి అని చెప్పగలం. నారదుడు ‘సాకస్మై పరమప్రేమస్వరూపా’ (నారదభక్తిసూత్రం-2) అని, శాండిల్యుడు ‘సాపరానురక్తిరీశ్వరే’ (శాండిల్యభక్తిసూత్రం-2) అని సూచించినది ఈభక్తి గురించే.
          ఈ భావం (రతి) రాగభక్త్యుత్థము, వైధీ భక్త్యుత్థము అని రెండువిధాలు. మొదటిది ఈశ్వర ఐశ్వర్యజ్ఞానగంధశూన్యమై ప్రగాఢమై ఉంటుంది. రెండవది ఐశ్వర్యజ్ఞానయుక్తమై కొంచం న్యూనమై ఉంటుంది. ఈ భక్తులిద్దరూ విభిన్నమైన మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు.
          ఈస్థితిని ప్రాప్తించిన భక్తిలో మళ్ళీ-- అహైతుకి, ఉజ్ఘిత, జ్ఞాన, శుద్ధము-- అని అవాంతర విభాగాలున్నాయి. ఈశ్వరుడినుంచి దేనిని అభిలాషించకుండా, మనసును అర్పించటం ఆహైతుకీ భక్తి, దీనికి ప్రహ్లాదుడు దృష్టాంతము. ఉజ్ఘితభక్తి

పే. 28
లో శరీరం సంపూర్ణంగా విస్మృతమై, సర్వత్ర ఈశ్వర స్ఫూర్తి కనిపిస్తుంది. వంశవనాన్ని చూసి బృందావనం, నదిని చూసి యమున, తమలావృక్షమును చూసి శ్రీకృష్ణుడే అని ప్రత్యయం శ్రీచైతన్యదేవుడికి కలిగేది. ఇదే ఉజ్ఘితభక్తి, ‘ఈయన శ్రీకృష్ణుడు’ అని కాని, ‘ఈస్థలంలో ఈలీలలు జరిగాయి’ అని కాని విన్న తరువాత, అంటే తత్సంబంధమైన జ్ఞానము కలిగిన తరువాత లభించిన భక్తిని జ్ఞానభక్తి అంటారు. భగవత్ప్రీతికరాలైన పనులనుగాక జీవితంలో నిర్వహించదగినది ఏదీ లేకున్నా, ఆ స్థితి శుద్ధభక్తి అనబడుతుంది. గోపబాలకులు శ్రీకృష్ణుడికి ఎలాంటి కష్టం కలగకుండా చూసేవారు. ప్రేమభక్తిలో ఈశ్వరుడే పతిగా భావించబడతాడు.
-------------------------
          ఈ భక్తులు శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య భావాలను ఆశ్రయించి పంచవిధాలుగా చెప్పబడతారు, (13) [నారదుని దాస, సఖ్య, వాత్సల్య, కాంతాసక్తులతో వీనిని పోల్చాలి.] ఈ భావపంచకం విభావ, అనుభావ, సంచారి భావంతో కూడి స్థాయిభావమును పొంది, శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, ఉజ్జ్వల రసములుగా పరిణతి పొందుతాయి. ఈరసములు అన్నీ వ్రజేంద్రనందనుడైన శ్రీకృష్ణుడిలోనే పరాకాష్ఠను పొందుతున్నాయి. అప్పుడు ఇది ప్రేమ అనబడుతుతుంది. ఇలా అష్టవిధాలైన సాత్విక వికారాలు ఉంటాయి. (14) [యే చిత్తం తనూం చ క్షోభయంతి, తే సాత్త్వికాః. తే అష్టౌ. స్తంభ-స్వేద-రోమాంచ-స్వరభేద-వేపథు-వైవర్ణ్యాశ్రుప్రలయాః ఇతి తే ధూమాయితా, జ్వలితా దీప్తా ఉద్దీప్తా సుదీప్తా ఇతి పంచవిధా యథోత్తరసుఖదా స్యుః. శ్రీరామకృష్ణలీలా ప్రసంగకారుడు ఉదాహరించినది.]

పే. 29
          ఈ ప్రేమ సమర్థ, సమంజస, సాధారణి, ఏకాంగి అని నాలుగు విధాలు. తనకు సుఖం లభించినా లభించకపోయినా, ప్రభువు సుఖంగా ఉంటే చాలు- అనుకోవటం సమర్థప్రేమ. దీనికి దృష్టాంతం శ్రీరాధిక. ప్రేమాస్పదుడిని పొంది ఇద్దరం సుఖిద్దాం- అనుకోవటం సమంజస. గోపికలు దీనికి ఉదాహరణ. ప్రభువు సుఖాన్ని అంతగా లెక్కచేయక నేను సుఖంగా ఉంటే చాలు అనుకోవటం సాధారిణి. చంద్రావళి దీనికి ఉదాహరణ. ప్రేమ ఒకవైపే ఉండటం, అంటే ప్రేమించినవాడితో మళ్ళీ ప్రేమించబడకపోవటం ఏకాంగి.
          నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, రసముల పరిణితి కృష్ణభక్తి రసములో ఎదో ఒకతీరుగా కృష్ణభక్తికి తోడ్పడనిది రసం కాదు. దానిని వైష్ణవ అలంకారికులు రసం అనరు. కృష్ణానురాగ వ్యతీతమైన అనుభూతి రసం కాదు.
          సాహిత్యదర్పణకారుడైన విశ్వనాథ కవిరాజు –
“విభావేనానుభావేన వ్యక్తః సంచారిణా తథా,
రసతామేతి రత్యాదిః స్థాయీ భావః సచేతసామ్”.
          అని అన్నాడు. ఇక్కడ సూచించబడిన ప్రేమ నాయికా నాయకుల మధ్యనే అబద్ధం. వీరు మనుష్యమాత్రులు లేక సంపూర్ణంగా నరత్వమును పొందిన దేవతలు. దీనిని

పే. 30
ప్రేమ అనటంకంటే కామం అనటమే మేలు. ఈ కామవృత్తిని నేర్చుకునే సంస్కృతకవులు కావ్యనాటకాలను నిర్మించారు. (అటనట దీనికి వ్యతిక్రమము ఉన్నా ఉండవచ్చు) ఈ కామమునే లోకంలో ప్రేమ అని హర్షిస్తుంటారు. కొందరు స్వదారేతర ప్రేమను గర్హించి, స్వదారనిష్ఠతమైన దానిని పరమపవిత్రమైన ప్రేమ అని అంటుంటారు.
          వైష్ణవ గోస్వాములు దీనిని ఒప్పుకోరు. బాహ్యజ్ఞాన విరహితం, సంపూర్ణంగా భగవంతుడిపట్ల ప్రేమయుక్తం అయిన రతి, లేక భావమే వారి లక్ష్యం. మనుషుల పట్ల మనుషులకుండే అంధమోహాన్ని వారు ఈసడిస్తారు. వారు కోరేది బ్రహ్మరసాస్వాదం. ‘రసోవై సః’ ఇదే వారి రసం.
“విభావైరనుభావైశ్చ సాత్త్వికైర్వ్యభిచారిభిః
స్వాద్యత్వం హృధి భక్తానామనీతా శ్రవణాదిభిః,
ఏషా కృష్ణరతిః స్థాయీ భావోభక్తిరసో భవేత్ః”.
          శ్రీకృష్ణరతి అనే స్థాయిభావం శ్రవణాదులవల్ల పోషితమై, విభావ, అనుభావ, సాత్విక, వ్యభిచారి భావాలుగా భక్తుని హృదయంలో తోచిన స్థాయిభావమే భక్తిరసమవుతుంది. ఈ కృష్ణభక్తిరసం ‘స్నేహం’ తో ఆరంభమై, మాన, ప్రణయ, రాగ, అనురాగ, భావ, మహాభావాలుగా పరిణితిని పొందుతుంది. మహాభావంలో రూఢము, అధిరూఢము అని రెండు భేదాలు ఉన్నాయి. అధిరూఢము మళ్ళీ మోదన మాదనాలని రెండు విధాలు. ఈ మహాభావం పరాకాష్ఠ పొందిన దివ్యోన్మాదము

పే. 31
అనబడుతుంది. (15) [భక్తి పూర్వం నుండి సాధనగా అంగీకరింపబడి ఉన్నది కానీ దానిని రసంగా గ్రహించినవారు కనపడరు. ఈ భావ, రస నిర్వచనం సంపూర్ణంగా గౌడీయ గోస్వాముల సంపత్తి. (ప్రైవేటు ప్రాపర్టీ) ఈ కింది శ్లోకాన్ని గమనించండి.
భక్తిః పూర్వైః శ్రితా తాస్తు రసం పశ్యేద్ యదాత్తధీః
తం నౌమి సతతం రూపనామప్రియజనం హరేః మా.కా. 1] ఇదే నారదుడు సూచించిన ‘పరమ విరహాసక్తి’.
          ప్రేమ ఎక్కువగా గాఢమై హృదయాన్ని ద్రవీభూతం చేస్తే స్నేహం అనబడుతుంది. స్నేహం దృఢమై నవమాధుర్యమును అనుభవింపచేస్తుంది, బయటకు ఒక్కింత కటువుగా తోచినా మానం అనబడుతుంది. మానం వృద్ధి పొంది, ప్రియుడితో అభేదబుద్ధిని కలిగిస్తే ప్రణయం అనబడుతుంది. మానము పెరిగి, కృష్ణసంగకారణం దుఃఖప్రదం, సుఖకరం కూడా అని తోచినట్లైతే రాగం అనబడుతుంది. రాగం ఉత్కర్షం పొంది, ప్రియతముడి అనుభూతి సర్వదా కలుగుతున్నా అతనిని “తదేవ రమ్యం రుచితరం నవం నవమ్” అనే రీతిలో, కొత్తగా తపింపచేసిన అనురాగం అనబడుతుంది. ఈ అనురాగం రాగముగానే ఉండి ‘మహాభావం’ గుర్తులున్న భావం అనబడుతుంది. ఈ స్తరాలను అన్నిటినీ గర్భీకృతం చేసుకుంటే ప్రేమే మహాభావం. మహాభావమే ప్రేమకు మొదలు. దీనితోనే ప్రేమ గతి ఆగిపోతుంది. (16) [ఈ క్రమం శ్రీరూపగోస్వామి స్వవిరచితమైన ‘ఉజ్జ్వల నీలమణి’ అనే గ్రంథంలో విశదీకరించి ఉన్నాడు. ఈ పుస్తకం ముంబై నిర్ణయసాగర్ ప్రెస్ వారు జీవగోస్వామి టీకాతో వెలువరించి ఉన్నారు.]

పే. 32
          శ్రీ రాధికమాత్రమే ఈ మహాభావానికి అధికారిణి. శ్రీకృష్ణుడి వేరే భార్యలకు గాని, శ్రీరాధిక సఖులనబడే లలితా, విశాఖా, సుచిత్రా, ఇందులేఖా, చంపకదల్లీ, శ్రీరంగదేవి, తుంగవిద్యా, సుదేవీ, అనంగమంజరులకు గాని అధికారం లేదు. మనుష్యమాత్రుల మాట వేరుగా చెప్పనక్కర లేదు! జీవులకు అధికారం భక్తి, భావం, లభించినా ప్రేమవరకే. ఇహలోకంలో జీవుడు ఆకాంక్షింప తగిన మితి ఇంతవరకే.
          అసంఖ్యాలైన బ్రహ్మాండాలున్నాయి. వాటిలో క్రమంగా శ్రీకృష్ణుడి ‘ప్రకటలీల’ (17) [లీల ప్రకటము, అప్రకటము అని రెండు విధాలు. ప్రకటలీల అంటే సాక్షాత్తుగ శ్రీకృష్ణుడే ఆ లీలను చేయటం, భక్తునికి కళ్ళకు కట్టినట్టు కనిపించటం. అప్రకట లీల అంటే ఆయా విషయాలను భక్తుడు ధ్యాననేత్రంతో చూడటం. ఈ విషయాన్ని శ్రీకృష్ణదాస్ కవిరాజు తన ‘చైతన్యచరితామృతం’ లో చెప్పాడు.] జరుగుతుంటుంది, అక్కడ ఈజీవులు శరీరపాతానంతరం చేరి దానిని చూడగలరు. పాంచభౌతిక శరీరం మహాభావ వేగానికి, అంతవరుకు ఎందుకు? ఒక్క భావం ప్రకాశించినా ఆగలేదు. తునాతునకలై పోతుంది. కనుకనే, శ్రీరఘునాథగోస్వామి రాధికను, ‘మహాభావోజ్జ్వలచింతారత్నోద్భావితవిగ్రహమ్” (18) [ప్రేమాంభోజ మకరంద స్తవరాజః] అని వర్ణించారు.
పే. 33
          కానీ, మహాభావమూర్తియైన శ్రీచైతన్యదేవుడిలో కూడా ఇది వికసించింది. ఆధునికుడు, సర్వధర్మ సమన్వయ మూర్తియైన శ్రీరామకృష్ణ పరమహంసలో కూడా దీని వికాసాన్ని చూసి, వైష్ణవాచరణుడు అనే పండితుడు, ఆయన గురువుగా ఎన్నుకున్న భైరవీబ్రాహ్మణి కూడా, బృందావనంలో గంగామాత కూడా ఆశ్చర్యపడి, ఆయనను అవతార పురుషుడిగా ప్రకటించారు.
          స్నేహం నుంచి మహాభావంవరకుగల అంతరువులన్నీ స్థాయిభావాలు. విభావ, అనుభావ, సాత్విక సంచారిభావాలతో కలిసి ఇవి రసత్వమును పొందుతాయి.
          ఈ కృష్ణభక్తిరసం శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధురము అనే ఐదు ముఖ్య రసాలుగా, హాస్య, అద్భుత, వీర, కరుణ, రౌద్ర, భీభత్స, భయానకం అనే ఏడు గౌణరసాలుగా విభజించబడి ఉంది. ముఖ్యమైన పంచరసాలు భక్తుల హృదయంలో నెలకొని ఉంటాయి. గౌణరసాలు అగంతుకములు {బయటనుండి వచ్చినవి}.
          ఐశ్వర్యజ్ఞాన-మిశ్రరతి, కేవలరతి అని మరొక విభాగం. శ్రీకృష్ణుడిని వైకుంఠాధిపతిగా, సృష్టిస్థిత్యాది అలౌకిక కార్యనిర్వాహకుడిగా భావించటం మిశ్రరతి. ఈ ఐశ్వర్యజ్ఞానం వల్ల మనసు సంకుచితమవుతుంది. భయాశ్చర్యాలకు తావుంది. శాంతభక్తులు ఇటువంటివారు. వీరి ఉనికి వైకుంఠంలోనే. గోకులాధిపతిగా భావించటం కేవలం రతి. ఇక అంతరంగం సంపూర్ణంగా కృష్ణోన్ముఖం అవుతుంది.

పే. 34
          దాస్యరతిలో స్నేహ, మాన, ప్రణయ, రాగాలు ఉండవు. సఖ్యరతి అనురాగం వరకు నడుస్తుంది. వాత్సల్యరతిలో అనురాగం పరిపక్వత పొందుతుంది. మధురరతిలో ఇవన్నీ చేరి, మహాభావం అవుతుంది. శాంతరతిలో ఇదేదీ ఉండదు.
          ఇక ఈ రసములను గురించి వేర్వేరుగా ఒకింత ఆలోచిద్దాము. శాంతరసం అంటే ఏంటి?
“విహాయ విషయౌన్ముఖ్యం నిజానందస్థితిర్యతః
ఆత్మనః కథ్యతే సోఽత్ర స్వభావశమ ఇత్యసౌ,
ప్రాయః శ్రమప్రభావానాం మమతా గంధవర్జితా,
పరమాత్మతయా కృష్ణే జాతా శాంతీరతిర్మతా”.
          మనసు విషయస్పృహను (వదిలిపెట్టి) పరిత్యజించి, నిజానందంలో వెలయటం శమం. ఇది ప్రాయికంగా శమప్రధానులైనవారిలో, శ్రీకృష్ణుడిని పరమాత్మగా భావించటంవల్ల ఉత్పన్నమవుతుంది. ప్రేమలో ఉండే మమత్వబుధ్ధి దీనిలో తక్కువ పడుతుంది.
          ఈ భక్తిరసానికి పరబ్రహ్మంగా తోచే చతుర్భుజధారియైన శ్రీకృష్ణుడు విషయాలంబనం. మహోపనిషత్ శ్రవణం, నిర్జన స్థాననిషేవణం మొదలైనవి ఉద్దీపన. శాంతరసానికి ఉదాహరణ.

పే. 35
“కదా శైలద్రోణ్యాం పృథులవిటపీ క్రోడవసతి
ర్వసానః కౌపీనం రచితపలకందాశనరుచిః,
హృది ధ్యాయన్ ధ్యాయన్ ముహురిహ ముకుందాభిదమాహం
చిరానందం జ్యోతిః క్షణమివ వినేష్యామి రజనీః”.
          బ్రహ్మర్షులు, అద్వైత సన్యాసులు శాంతభక్తులు.
          ఈ శాంతరసాన్ని శాంతశాంతం, శాంతదాస్యం, శాంతసఖ్యం, శాంతవాత్సల్యం, శాంతమధురం అని ఇంకో ఐదు విభాగాలుగా చేయవచ్చు. వాటి తీరును సంగ్రహంగా చెప్తున్నాను.
          శాంతశాంతంలో భయంతో కూడిన శ్రద్ధ, శాంతదాస్యంలో పాలనకర్త అనే భావంతో నిర్వివాదంగా సేవించటం, శాంతసఖ్యంలో పరస్పర వాక్యాలాపం, శాంతవాత్సల్యంలో ప్రతిపాలనాభావం, శాంతమధురంలో కృతజ్ఞత నుండి జనితమైన అనిర్వచనీయభావం క్రమంగా వెలువడుతుంటాయి.
          శాంతరసం శాంతశాంతంతో ఆరంభమై శాంతమధురంలో పర్యాప్తమవుతున్నది. ఇలాగే, తదితరరసముల పట్ల కూడా గ్రహించాలి.
          దాస్యరసాన్ని ‘ప్రీతి’ అని కూడా అంటారు. దీని లక్షణం:
“స్వస్మాద్ భవంతి యే న్యూనాస్తేఽనుగ్రాహ్యా హరేర్మతాః,
ఆరాధ్యత్వాత్మికా తేషాం రతిః ప్రీతిరితీరితా,
తత్రాసక్తికృదన్యత్ర ప్రీతిసంహారిణీ హ్యసౌ”.

పే. 36
          తమను తాము హరికంటే తక్కువగా తలచుకునేవారు హరి అనుగ్రహానికి పాత్రులు. వీరి రతి కృష్ణుడు ఆరాధ్యుడనే జ్ఞానంతో కూడుకున్నది. ఇదే ప్రీతిదాస్యం. కృష్ణుడి పట్ల ప్రీతి, తదితర విషయాల వైముఖం దీని లక్షణం.
          దాస్యభక్తిరసంలో సర్వగుణాధారుడైన శ్రీకృష్ణుడు విషయాలంబనం; హరిదాసులు ఆశ్రయాలంబనం; భగవంతుడి చరణధూళి, భుక్తావశిష్టమైన ప్రసాదాన్ని గ్రహించటం, భక్తసంగం మొదలైనవి ఉద్దీపనలు. ఈ దాస్యరసంలో శాంత రసంలోని గుణాలన్నీ ఉంటాయి. అధికంగా ప్రభుజ్ఞానంలో ‘సేవ’ చేయటం కూడా ఉంటుంది.
ఉదాహరణ:
“ధిగశుచిమవినీతం నిర్దయం మామలజ్జం
పరమపురుషయోఽహం యోగివర్యాగ్రగణ్యైః,
విధిశివసనకాద్యైర్ధ్యాతుమత్యంతదూరం
తవ పరిజనభావం కామయే కామవృత్తః”.
-      స్త్రోత్ర రత్నం
దానిలోనే –
“తవ దాస్యసుఖైకసంగినాం భవనేష్యస్త్వపి కీటజన్మ మే,
ఇతరావసథే మమాస్మభూదపి మే జన్మ చతుర్ముఖాత్మనా”.
          హనుమంతుడు మొదలైనవారు దాస్యభక్తులు.
          దాస్యశాంతం, దాస్యదాస్యం, దాస్యసఖ్యము, దాస్యవాత్సల్యం, దాస్యమధురం అనేవి దాస్యరస అంతర్గత

పే. 37
ములు. దాస్యశాంతంలో భయంతో కూడిన ప్రభువాజ్ఞ నిర్వహించటం, దాస్యదాస్యంలో ప్రభుని మనసులో మెప్పించే వ్యగ్రతతో కార్యం చేయటం, దాస్యసఖ్యంలో ప్రభుభక్తుల పరస్పరాభిప్రాయ వ్యక్తీకరణము, దాస్యవాత్సల్యంలో శుశ్రూష, దాస్యమధురంలో ప్రభుని స్నేహస్మరణంలో ప్రేమోదయము అనే గుణాలు ఉంటాయి.
          సఖ్యరసమును గోస్వామిపాదులు ఇలా నిర్వచించారు:
“స్థాయీ భావో విభావాద్యైః సఖ్యమాత్మోచితైరిహ,
నీతశ్చిత్తే సతాం పుష్టిం రసః ప్రేయోనుదీర్యతే”. (భక్తిరసామృతసింధువు)
          స్థాయిభావమైన సఖ్యరతి స్వానుకూలములైన విభావాదులవల్ల భక్తుల మనసులో పుష్టినొందితే సఖ్యభక్తిరసం అనబడుతుంది. సఖ్యభక్తిరసంలో సర్వగుణాధారుడైన శ్రీకృష్ణుడు విషయాలంబనం. శృంగము, వేణువు, శంఖము, పరాక్రమం మొదలైనవి ఉద్దీపనలు. కేళి, పరిహాసం మొదలైనవి అనుభావాలు.
          శాంతరసంలో స్వరూపజ్ఞానాన్ని, దాస్యరసంలో సేవ అనే గుణాలు రెండూ సఖ్యరసంలో ఉంటాయి. అధికంగా విశ్వాసమయమైన ఆత్మసమజ్ఞానం అంటే కృష్ణుడిని సేవించటం, కృష్ణుడివల్ల సేవను గ్రహించటంకూడా ఉంటుంది.

పే. 38
ఉదాహరణ:
“శ్యాముని గూడి కేళి జయ మందుత యున్నది లేదు, వీరుడౌ
రాముని మోయుటే ఫలము రమ్మని పిలచిన వానిగూడ నా
రాముని గూడి వెన్నుని పరాభవ మందగజేసి వానిపై
సామొనరించి నేడువని సర్వము దిర్గుదు, చూడుమో సఖా!” (స్వకీయము)
[ఈ విషయాలను సంగ్రహించేటప్పుడు వేళకు సరైన శ్లోకం లభించలేదు. అందువల్ల స్వయంగా ఈ పద్యాన్ని చెప్పాను. సాహసం క్షంతవ్యము.]
          శ్రీదామ, సుబల, భీమార్జునాదులు సఖ్యభక్తులు. సఖ్యదాస్య, సఖ్యశాంత, సఖ్యసఖ్య, సఖ్యవాత్సల్య, సఖ్యమధురాలు అవాంతర విభజన. స్నేహ ప్రథమావస్థలో అయ్యే భావోదయం సఖ్యశాంతము, సఖుడు స్నేహితునికి చేసే ఉపచారాదులు సఖ్యదాస్యం. వారి మధ్య జరిగే హృదయపూర్వక సంభాషణ సఖ్యసఖ్యము. భోజనవేళ తోచే భావం సఖ్యవాత్సల్యం. సఖ్యమధురం అంటే ప్రాణస్నేహం.
          వాత్సల్యరస నిరుక్తి:
“విభావాద్యైస్తు వాత్సల్యం స్థాయీ పుష్టిముపాగతః
ఏష వత్సలనామాత్ర ప్రోక్తో భక్తిరాసాంబుధైః”.
          స్థాయిభావమైన వాత్సల్యరతి భక్తచిత్తంలో విభావాదులవల్ల పరివుష్టిని పొంది వాత్సల్యభక్తిరసమనబడుతుంది. వాత్సల్యభక్తిరసానికి శ్రీకృష్ణుడు విషయాలంబనము. మాతా

పే. 39
పిత్రాదులు ఆశ్రయాలంబనం. శైశనసులభమైన బాల్యం, మందహాసం మొదలైనవి ఉద్దీపనలు. కైశోర, శైశవ, బాల్య, పౌగండావస్థలను ఆశ్రయించి ఈరసము అద్భుతమవుతుంది.
          ఇందులో శాంత, దాస్య, సఖ్యములోని గుణములు అన్నీ అధికంగా తనను పాలకునిగా, కృష్ణుడిని పాలించబడేవాడిగా అనుకోవటం అనే గుణం కూడా ఉంటుంది. నందయశోదాదులు వాత్సల్య భక్తులు.
ఉదాహరణ:
“బాలాయ నీలవపుషే నవకింకిణీక
జాలాభిరామ జఘనాయ దిగంబరాయ
శార్దూలదివ్య-నఖభూషణ-భూషితాయ
నందాత్మజాయ నవనీతముషే నమస్తే”.
          పూర్వరీతిని అనుసరించి, ఇక్కడ కూడా పంచవిధవిభేదాలు ఉన్నాయి. కేవలం నా పుత్రుడు అనే భావం వాత్సల్యశాంతం. సంతానభావంతో సేవించటం వాత్సల్యదాస్యం. ప్రసంగించటం వాత్సల్యసఖ్యం. భోజనద్రవ్యాదులను ఇవ్వటం వాత్సల్య వాత్సల్యం. సర్వవిధ శ్రేష్ఠత్వభావంతో కూడిన ఆవేశం వాత్సల్యమధురం.
          ఇక సర్వశ్రేష్ఠమైన మధురరసమును గురించి ఆలోచిద్దాం. మధురరస నిర్వచనం:
“ఆత్మోచితవిభావాద్యైః పుష్టిం నీతా సతాం హృది,
మధురాఖ్యో భవేద్భక్తి రసోఽసౌ మధురా రతిః”.
------------------
పే. 42
శిశువులు మొదలైనవారు ఆశ్రయాలంబనం. హాసారతి స్థాయిభావం.
          యథాయోగ్యములైన విభావాదులవల్ల మనసులో విస్మయరతి పరిపుష్టమైన, అద్భుత భక్తిరసమవుతుంది. అలౌకిక కార్య సంపాదనపరుడైన శ్రీకృష్ణుడు విషయాలంబనం; భక్తులు ఆశ్రయాలంబనం; విస్మయరతి స్థాయిభావం.
          ఉపయుక్తములైన విభావాదులవల్ల ఉత్సాహరతి హృదయంలో పుష్టినొందితే వీరభక్తిరసం అనబడుతుంది. ఇక యుద్ధరతుడైన కృష్ణుడు విషయాలంబనం. తదనురూపులైన స్నేహితులు ఆశ్రయాలంబనం. ఉత్సాహరతి స్థాయిభావం.
          సాధువుల మనసులో ఉపయుక్తములైన ఘటనల సమావేశంలో పెంపెక్కిన కరుణ తన్నామకమైన భక్తిరసమవుతున్నది. ఇక కీడును పొందపోవు కృష్ణుడు, తద్భక్తులు విషయాలంబనం. దానిని అనుభవించే కృష్ణుడు, భక్తులు ఆశ్రయాలంబనం. శోకరతి స్థాయిభావం.
          భక్తహృదయంలో ఉపయుక్తకారణాలు పెంపెక్కిన క్రోధరతి రౌద్రభక్తిరసం అనబడుతుంది. శ్రీకృష్ణుడు, ఆయన హితులు, అహితులు, విషయాలంబనం, సర్వవిధభక్తులు ఆశ్రయాలంబనం. క్రోధరతి స్థాయిభావం.
          ఉపయుక్త కారణాల వృద్ధిలో జుగుప్సారతే భీభత్సభక్తిరసంగా మారుతుంది. సేవానిష్ఠ ఆశ్రయాలంబనం; భక్తులు విషయాలంబనం; జుగుప్సారతి స్థాయిభావం.

పే. 43
          చిట్టచివరిదైన భయానకరసమునకు శ్రీకృష్ణుడు, ఆయన స్నేహితులు విషయాలంబనం; భక్తులు ఆశ్రయాలంబనం; భయరతి స్థాయిభావం.
          ఈ గౌణరససప్తకం ముఖ్యమైన పంచరసాలలో అంతర్గతమై, విశేషకారణం ఉంటే రూపం ధరిస్తాయి.
          పరస్పర వైరభావయుక్తమైన రసాల సంయోగమే ‘రసాభాస’. ముఖ్యరసాలలో విషయ ఆశ్రయాలు విరుద్ధాలైన వాటితో కూడిన రసాభాస అవుతుంది.
          కాని, శ్రీరాధికలో ఉన్న మహాభావంలో విరుద్ధభావ సమ్మేళనం ఉన్నా రసాభాస అవ్వదు. మరి, శ్రీకృష్ణుడే ఒకేసారి విషయం, ఆశ్రయం కూడా అయితే రాసాభాసం కాదు.
          ఆధ్యాత్మిక ఇతివృత్తమును చూసినట్లయితే, వైదికబౌద్ధయుగాల శాంతభావము, రామాయణ మహాభారతకాలంలో దాస్యభావం, భాగవతయుగంలో వాత్సల్యమధురభావాలు ఉదయమై, శ్రీచైతన్యయుగంలో ఇవి అన్నీ పరిపుష్టి పొందినవని తెలుసుకోగలము.
          ఆచార్యులలో శ్రీశంకరుడు శాంతభక్తిని, శ్రీరామానుజ మధ్వ నింబార్కులు దాస్యభక్తి, శ్రీవల్లభుడు వాత్సల్యభక్తి ముఖ్యమవుతాయి, మధురభక్తిని గౌణముగా, బలదేవుడు వీటన్నిటినీ ప్రచారం చేశారు, వర్తమానకాలంలో నింబార్క మతస్తులు కూడా ఈ రాధాభావాన్ని గ్రహిస్తున్నారు.

పే. 44
          సాధకదృష్ట్యా, బాలికాబాలకులకు శాంతసఖ్యభావాలను, యువతీయువకులకు మధురభావమును, ప్రౌఢులకు దాస్యవాత్సల్య భావాలు ఉపయుక్తములు. వృద్ధులకు ఇక భావసాధన చేసే సమయం లేదు. కనుకనే విజ్ఞులు –
“అద్యైవ కురు యఛ్ఛ్రేయో వృద్ధస్సన్ కిం కరిష్యసి,
స్వగాత్రాణ్యపి భారాయ భవంతి హి విపర్యయే”.
          అని ఆదేశించారు.
          తంత్రశాస్త్రం ప్రవచించే పశు, వీర, దివ్యభావాలు కూడా ఈ సందర్భంలో ఆలోచనార్హములు. తంత్రాలు సఖ్య, వాత్సల్య, మధురభావాలకు ప్రతిభావాలైన సఖీ, మాతృ, వీరభావాలను ఉపదేశిస్తూ మరికొన్ని సాధనమార్గాలను అనుగ్రహిస్తున్నాయి. వైధీభక్తిని పశుభావంతో, మహాభావాన్ని దివ్యభావంతో పోల్చవచ్చు. తంత్రాల ‘భాగవతీ తనువు’, వైష్ణవశాస్త్ర ‘అప్రాకృత’ (సిద్ధ) దేహము ఒకేరీతికి చెందినవి. వైష్ణవుల ‘హరేర్నామైవ కేవలం’, తాన్త్రికుల ‘జపాత్సిధ్ధిః’ అనేవి ధ్వని ప్రతిధ్వని మాత్రమే. ప్రపంచంలో మానవుల మధ్య ఉండే లోకిక సంబంధాలను భగవత్పరం చేసి తద్దర్శనలాభం అర్పించటమే భావసాధన హృదయమైన సంఘంలో పరస్పర విరుద్ధములను తేలికగా అనుకోబడే ఈ శాస్త్రములు రెండూ పరస్పర పూరకములు అవుతూ జగత్ శ్రేయమును అభిలషిస్తున్నాయని చెప్పగలం.

పే. 45
          అభారతీయ మతాలు ముఖ్యంగా క్రిష్టియన్ మహామ్మదీయ మతాలలో కనపడే భక్తిని పరిశీలిస్తే, ప్రాయికముగా అది శాంతభావముననే అంతర్గతమవుతుంది. సాంగ్ ఆఫ్ సాలోమన్, మధ్యయుగ క్రిష్టియన్ సాధకుల ప్రపంచములు {వివరణలు}, సుఫీసాధకుల గీతాలను చూసిన మధురభక్తి అభివ్యక్తి కనబడుతుంది. ప్రాచీనుడైన ‘ప్లాటినన్’ చెప్పిన ‘A harmonious choral dance round The one’ శ్రీమద్భాగవతాకారుడి, రాసలీలను స్ఫురింపచేస్తున్నది. ఇలాగే, అర్వాచీనుడైన స్విస్ బరన్ మాటల నుంచి కూడా ఏకార్థబోధకములైన వాటిని కొన్ని చూడగలము. ఇలాగే టెరెసా క్రీస్తుప్రభువుతో తనను అభేదంగా అనుకోవటం, క్రీస్తుప్రభువు ‘I and my father are one’ అనటం, శ్రీ చైతన్యుడు ‘ముఞసేయి’ అనటంచూసి ‘ముహురవలోకితమండనలీలా, మధురిపురహమితి భావనశీలా’ అని శ్రీ జయదేవుడు పలికిన వాక్యాలను, ‘అనుఖాన్ మాధవ్ మాధవ్ సోబరితే సుందరీ భేలా మాధాఇ’ అని విద్యావతి అన్న వాక్యాలు సహజంగానే స్మరణ పథంలో పడగలవు. న్యూమాస్ పండితుడి వాక్యాలు ఇంకా స్పష్టతరములు, (21) [“If thy soul is to go into higher spiritual blessedness, it must become a woman; yes, however manly though you may be among men. ఫిలో. క్లేమెంట్, బెర్నార్డు. రమీ, హఫీజ్, బ్లేక్ మొదలైన భావసాధకులను గురించి విశేషంగ తెలుసుకోవాలి అనుకునేవారు Mrs. UnderHill గ్రంథాన్ని చూడండి.] ఈ సందర్భంలో దక్షిణదేశంలో ఆళ్వారులు, నాయనారుల జీవితాలు, ప్రవచనాలు కూడా అనుసంధాన యోగ్యములు.

పే. 46
          పూర్వవర్ణితమైన భావసాధన చరమ పరిణితే ప్రేమ. ఈ ప్రేమ అనే సూర్యోదయమవుతూనే తదితర పురుషార్థ నక్షత్రాలు విలీనమైపోతాయి. ఇక అనుఛ్ఛిత్తి ధర్మియైన భగవద్దర్శనం లభిస్తుంది. ఈస్థితిలో భక్తుడు పొందే ఆనందాన్ని వర్ణించటం అసాధ్యం. అతడుండే స్థితిని కూడా వర్ణించలేము. కాని, ‘స్వదేహోఽప్యస్తి నాస్తి వా నానుసంధతే’ అని చెప్పగలం. ఈశ్వరుడు ఇలాంటి భక్తుడితో ‘అజితోఽపి జిత ఏవ వవర్తే’ అంటాడని చెప్పగలం. ఇంత ఎక్కువగా ‘ప్రేమ’ ను గురించి చెప్పే అర్హతగాని, అధికారముగాని నాకు లేదు.
          సారతత్త్వమిది: అహంకారానికి రెండు వృత్తులు ఉన్నాయి. అవి అహంతా, మమతలు. జ్ఞానం వల్ల ఇది లయమైతే మోక్షం. దేహగేహాది విషయాల వ్యాపృతమైతే బంధం. “నేను ప్రభువు దాసుడను, రూపగుణ మహోదధియైన భగవంతుడే నాకు సేవనీయుడు” – ఈవిధమైన ప్రేమ లభిస్తే అది బంధమోక్షాలకు అతీతమైన పురుషార్థ చూడామణి అనబడుతుంది. (22) [వర్తమాన వాఙ్మయంలో పరమపవిత్రమైన ఈ ప్రేమ శబ్దం ఎంత తుచ్ఛంగా వాడబడుతున్నదో గమనించాలి.]
          ప్రేమోదయ క్రమం – అత్యంత గాఢంగా వ్యవహార రూపాన్ని ధరించిన ‘అహం మమ’ వృత్తులలో ఎలాగో అదృష్టవశాత్తు “భగవంతుడే నాకు సేవనీయుడు, సంసారములో ఉండే భగవంతుడిని సేవిస్తాను” అని శ్రద్ధ పుడితే భక్తి అధికారం లభిస్తుంది, సాధుసంగ ఫలముగా ఈ పారమార్థికవృత్తి

పే. 47
బలీయ మవుతుంది. తత్ఫలం భజనక్రియ. భజనక్రియలో నిరతుడి వృత్తి పరమార్థ వస్తువులో ఏకదేశమవుతుంది, వ్యవహారము ‘ప్రాయికం’గా ఉంటుంది. నిష్ఠాఫలంగా ఈ వృత్తి విపర్యయమును పొంది పరమార్థ విషయంలో ఆత్యంతికంగా, వ్యావహారిక విషయాల ఏకదేశంగా పర్యవసిస్తుంది. ఆసక్తి కలిగిన, పారమార్థిక విషయంలో గంధమాత్రంగా ఉన్న వృత్తి పూర్ణమై, వ్యావహారిక విషయాల గంధం మాత్రమవుతుంది. భావోదయమైన ఈవృత్తి అత్యంతికమై వ్యవహారవిషయాల ఆభాసమాత్రంగా ఉంటుంది. ప్రేమ లభించినట్లైతే, ఈ అహంకార మమతావృత్తులు పరమార్థ విషయంలో పరమాత్యంతికమై, వ్యవహారసంబంధము సంపూర్ణంగా తొలగిపోతుంది. ఈ స్థితే పంచమపురుషార్థమైన ప్రేమ. (23) [ఈ వైష్ణవ గోస్వాములు 1. సాలోక్య 2. సార్ష్టి 3. సామీప్య 4. సారూప్య 5. సాయుజ్య అనే ముక్తులను అంగీకరిస్తున్నా ‘ముక్తి’ వీరి ఆదర్శం కాదు. ప్రేమపూర్వక లీలాస్వాదనమే ఆదర్శం. అందులో సాయుజ్యాన్ని చాలా నికృష్టమైనదిగా తలుస్తారు. వీరి సాయుజ్య నిర్వచనం చూస్తే సాంఖ్యుల ‘ప్రకృతి లయం’ గుర్తుకు వస్తుంది.]
          భజనలో ఈశ్వరధ్యానం వ్యవహారిక విషయగంధయుక్తమై క్షణికంగా ఉంటుంది. నిష్ఠలో వ్యావహారిక గంధం ఆభాస మాత్రంగా ఉంటుంది. రుచి జన్మించిన వ్యావహారికగంధం సంపూర్ణంగా తొలగిపోయి, ధ్యానం బహుకాలవ్యాపి అవుతుంది. ఆసక్తిలో ధ్యానం అత్యంత గాఢమవుతుంది. భావ స్థితిలో ధ్యానమాత్రంతోనే భగవత్ స్ఫూర్తి. ప్రేమలో స్ఫూర్తివైలక్షణ్యం ఉంటుంది. ఇక ఈశ్వరదర్శనం లభిస్తుంది.

పే. 48
          ఈ విషయాలను దృఢపరిచే శాస్త్రీయ ప్రమాణాలకు కొరత లేదు. ప్రమాణాలను అపేక్షించిన, అనుభావ పథం కర్కశమే అవుతుంది. (24) [“ప్రమాణాపేక్షయా హ్యనుభవవర్త్మపారుష్యాపాదకత్వాత్”-- మాధుర్యకాదంబిని (అష్టమ్యమృతసృష్టిః)]5 కావలసింది సాధన. అయినా ప్రమాణాలను అపేక్షిస్తే –
          “తస్మింస్తదా లబ్ధరుచే మహామతే” అనే శ్రీమద్భాగవత శ్లోకంలో రుచిని, “గుణేషు సక్తబంధాయ రతం వా పుంసి ముక్తయే” అనే శ్లోకంలో ఆసక్తిని, “ప్రియశ్రవస్యంగమమాభావద్రతి” అనే శ్లోకంలో రతిని, “ప్రేమాతిభరనిర్భిన్నపులకాంగోఽతి నిర్వృతా” అనే శ్లోకంలో ప్రేమను, “తా యే పిబంత్యవితృషా నృపగాఢకర్ణైస్తాన్ నశ్పృశంత్యశనతృడ్ భయశోకమోహా” అనే శ్లోకంలో రుచ్యనుభవమును, “గాయాన్ విలజ్జోవిచారేదసంగ” అనే శ్లోకంలో ఆసక్త్యనుభవమును, “యథా భ్రామ్యత్యయో బ్రాహ్మన్” అనే శ్లోకంలో రత్యనుభవమును, “ఏవం వ్రతః స్వప్రియనామ కీర్త్యా” ఆమే శ్లోకంలో ప్రేమానుభవమును, “ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసా” అనే శ్లోకంలో స్ఫూర్తి, “పశ్యంతి తేమే రుచిరాణ్యస్వసంత అనే శ్లోకంలో సాక్షాద్దర్శనమును, “తైర్దర్శనీయావయవైరుదారవిలాసహాసేక్షితవామసూక్తిః” అనే శ్లోకంలో దర్శనావస్థను, “స్వభావే వాసో యథా పరివృతం మదిరామదాంధః” అనే శ్లోకంలో దర్శనమును పొందిన

పే. 49
వాడి ఆచార వ్యవహారాలను వర్ణించబడ్డాయని ప్రమాణసంగ్రహం.
          ఏ మహాపురుషుల ప్రభావం వల్ల ఈ నవభక్తిమార్గం ప్రవర్తితమయిందో, వారి నామాలను పేర్కొనకపోయినా, ఈ చర్చ అసమాప్తముగానే ఉండిపోతుంది.
          ఈ భక్తిసూర్యోదయమును ప్రపంచానికి సూచించిన శుక తార శ్రీమాధవేంద్రపురి. ఈయన పేరు మధ్వ గౌడీయ సంప్రదాయంలో పదునాలుగవదిగా పఠించబడుతున్నది. ఈయన నీలమేఘాన్ని చూసి భావావేశం పొందేవాడు. ఈయన శిష్యులైన శ్రీ ఈశ్వరపురి, కేశవ భారతులే శ్రీచైతన్యదేవుడి మంత్రం సన్యాస గురువులు.
          శ్రీచైతన్యదేవుడు క్రీ.శ. 1485న జన్మించారు. ఇరవై నాల్గవ యేట సన్యాసం గ్రహించారు. ఉద్దేశ్యం కేవలం భగవన్నామ ప్రేమలను ప్రచారం చేయటం. ప్రయాగలో శ్రీరూపగోస్వామిని, కాశీలో సనాతనగోస్వామిని, ఖర్దాలో నిత్యానందులను, శాంతిపూర్ లో అద్వైతుని, నవద్వీపంలో శ్రీవాసుని, శ్రీఖండంలో నరహరిని ప్రచారం చేయటానికి వినియోగించి, చైతన్యదేవుడు తానూ దక్షిణ, పశ్చిమ భారతాలలో నామమాహాత్మ్యాన్ని ప్రచారం చేశారు. కేవలం తన జీవిత మాధుర్యం వల్లే వందలకొద్దీ జనులను ఆకర్షించి, వారికి విమలమైన ప్రశాంతతను ఇచ్చారు. ఈయన శేషజీవితమంతా పురీ (జగన్నాధం) లో గడిచింది. శ్రీప్రతాపరుద్ర గజపతి సంపూర్ణంగా చైతన్యదేవుడి పాదపద్మాలను ఆశ్రయించుకుని ఉండేవాడు.

పే. 50
          చైతన్యదేవుడు సా.శ.1534న అంతర్ధానమయ్యారు. ఈయన చరిత్రకు సంబంధించిన మహాపురుషుల, సాధు పురుషుల పేర్లను తెలుపటానికి ఇక్కడ చోటు లేదు.
          చైతన్యదేవుడి తరువాత షడ్గోస్వాములు అనబడే శ్రీరూప, సనాతన, రఘునాథ, రఘునాథ భట్ట, గోపాల భట్ట, జీవగోస్వాములపై ఈ ధర్మప్రచార భారం పడింది. వీరు గ్రంథాలను సంస్కృతంలో వివరించారు. అప్పటికే శ్రీకృష్ణదేవుడి లీలాభూమి అయిన బృందాభూమి విస్మరింపబడింది. వీరు దానిని పునరుద్ధరించి, మందిరాలను ప్రతిష్టించారు. నేడు బృందావనంలో గోకుల గోస్వాములు అనబడే వల్లభమతస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, బృందావనాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చిన గౌరవం షడ్గోస్వాములకే చెందుతుంది.
          సా.శ.1591లో రూపసనాతనులు లోకనాథ, గోపాల, కృష్ణదాస, రఘునాథ, జీవగోస్వాములపై ఈ ధర్మ ప్రచారభారాన్ని ఉంచి లోకాన్ని విడిచారు. తరువాత శ్రీనివాస, సర్వోత్తమ, శ్యామానందులు అనేవారు బృందావననం చేరి, క్రమంగా గోపాలభట్ట, లోకనాథ, జీవగోస్వాముల శిష్యత్వమును గ్రహించి, వంగ ఓఢ్రదేశముల ఏతన్మత ప్రచారం చేశారు.
          సర్వోత్తమదాస, గోవిందదాస, జ్ఞానదాస, రాయిశేఖరులు అనేవారు వంగభాషలో పదాలను సమకూర్చి శ్రీచైతన్యదేవుడి జీవితాన్ని శ్రీకృష్ణుడి జీవితంతో అభేదంగా నిరూపించారు. ఈ జాతీయములైన పదాలు వేలకు వేలు ఉన్నాయి. శ్రీకృష్ణుడే రాధ మహాభావాన్ని ఆస్వాదించటానికి చైతన్యదేవు

పే. 51
డయ్యాడు. శ్రీరాధాకృష్ణుల సమ్మేళన అవతారమే చైతన్యచంద్రుడని తరువాతివారు విశ్వసించారు.
          శ్రీచైతన్యదేవుడి జీవితకాలంలో శ్రీమద్భాగవతం, శ్రీకృష్ణామృతం, బ్రహ్మసంహిత (25) అనే గ్రంథాలు ప్రమాణంగా చెప్పబడుతుండేవి. కాని, తరువాత సంస్కృతంలో, వంగభాషలో కొన్ని వందల గ్రంథాలు చైతన్యదేవుడి జీవితాన్ని, సంప్రదాయతత్వాన్ని వివరిస్తూ వ్రాయబడ్డాయి.
          శ్రీజయదేవ, చండీదాస, విద్యాపతుల పదాలలో సూచించబడిన మహాభావం చైతన్యుడిలో సంపూర్ణంగా అభివ్యక్తమైంది. నేటికి కూడా, వంగ, ఓఢ్రదేశవాసులకు భగవంతుడంటే శ్రీచైతన్యదేవుడే స్ఫురిస్తాడు.
          “సంప్రదాయ రక్షణార్థం వీరు శ్రీమధ్వాచార్యులను పరమగురువుగా గ్రహించినా మధ్వుని ప్రబోధాలతో దీనికేమీ సంబంధం లేదు. ఇదంతా శ్రీచైతన్యదేవుడి, తదనుచరుల సృష్టిదానము” అని వంగదేశీయ పండితుల అభిప్రాయం.
“అనర్పితచరీం చిరాత్ కరుణయావతీర్ణః కలౌ
సమర్పయితుమున్నతోజ్వలరసాం స్వభక్తిశ్రియం,
హరిః పురట సుందరద్యుతికదంబసందీపితః
సదా హృదయకందరే స్ఫురతువః శచీనందనః”.
                                                          (విదగ్ధమాధవం 1-18)

పే. 52
శ్రీ చైతన్యమహాప్రభువు
సంస్మరణ
రూపము రూపుదాల్చెనను రూఢినిదోపగా జేయుమూర్తి
ఈపాపకళంకితంబగు ధరాతలమందు పదమ్మునుంచ
లజ్జాపరితప్తమానసుడు చంద్రుడు మోమునుదాచె, జాహ్నవీ
ఆపగ వేగసంచాలితమయ్యె మహాహరిశబ్దఘోషలన్
అలసటలేక ధూర్తుడగు ఆసుకుమార కుమారమూర్తి
వాడలనొనరించు అల్లరి తటాలున గుర్తుకుదేచ్చు మున్ను
గోకులులకు ధన్యతాపదము గూర్చిన చిన్నని సంగతిన్
సుధాపులకిత హాస్యవిధుల దసోఫలభోగ మొనర్తు రందరున్

మా జయకీర్తి దీధితుల మాయక జేతురొ తళ్కువెట్టువారో?
జయలేఖలం గని పిరోధము మానుడటంచు పల్కు
వారే జయమందు కోర్కెలు విలీనమవన్ నతశీర్షులౌచు’
విద్యాజలరాశి’. ‘వాదిహరి’ యంచును మెచ్చిరి వాని పోడిమిన్
ఇతలొ మాధవేంద్రపురి ఏమి రహస్యము జెప్పెనో కటా!
వింతగ సర్వసంగాముల వీడెను నామజపంబె ఈ కలిన్
శాంతినిగూర్చు ఔషధ మటంచు జగమ్మున సాటె శిష్యులా
శాంత మనిహరాకృతికి జంచల చేతము గాన్కనియ్యగా.
ఆ కడగంటిచూపుల కహంకృతి కల్పనా విచ్చిపోయె
పాపాకులితాంతరంగ పశుపాశ విమోచన ధర్మమేఘముల్
పాకెను శాంతివర్షమున భారత భూమిని జల్లపర్చుచున్
నాక నిగూఢ నిర్వృతి వినాశ్రమ హస్తగతం బొనర్చుచున్.
**************

No comments:

Post a Comment