Tuesday, 30 August 2016

ప్రార్థన- ఆత్మా త్వం




ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః ।
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం ॥

ఆత్మా త్వం, మతిః గిరిజా, ప్రాణాః సహచరాః, శరీరం గృహం, విషయోపభోగరచనా తే పూజా, నిద్రా సమాధిస్థితిః, పదయోః సంచారః ప్రదక్షిణవిధిః సర్వా గిరః స్తోత్రాణి. శంభో, యద్యత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం తవ ఆరాధనం

ఆత్మా త్వం = నేనే (ఆత్మవు) నీవు
మతిః గిరిజా = నా మనస్సు పార్వతి
సహచరాః ప్రాణాః = (నీ) సహచరులు నా ప్రాణాలు
శరీరం గృహం = శరీరం (నీ) ఇల్లు
విషయ-ఉపభోగరచనా = విషయభోగాలను అనుభవించటం
తే పూజా = నీ పూజ
నిద్రా సమాధిస్థితిః = నిద్ర సమాధిస్థితి (ప్రగాఢ ధ్యానస్థితి)
పదయోః = రెండు పాదాల యొక్క
సంచారః = తిరగటం
ప్రదక్షిణవిధిః = (గుడిలో చేసే) ప్రదక్షిణలు
సర్వా గిరః = అన్ని మాటలు
స్తోత్రాణి = స్తోత్రాలు
శంభో = ఓ పరమేశ్వరా
యద్యత్ కర్మ = ఏయే కర్మ(నైతే)
కరోమి = చేస్తున్నాను
తత్తద్ అఖిలం = అది అదంతా కూడా
తవ ఆరాధనం = నీ ఆరాధనం

ఆత్మవే నీవు. నా మనస్సే పార్వతి. నా ప్రాణాలే నీ సహచరులు. నా శరీరం నీ ఇల్లు. నేను అనుభవించే విషయభోగాలన్నీ నీకు పూజ చేయటం. నేను నిద్రించటమే నీ ధ్యాన సమాధిలో మునిగి ఉండటం. నేను పాదాలతో అంతటా తిరగటమే నీ గుడిలో చేసే ప్రదక్షిణలు. నేను మాట్లాడే అన్ని మాటలు నీ స్తోత్రాలు. ఓ పరమేశ్వరా, ఏయే కర్మ(నైతే) నేను చేస్తూ ఉన్నానో అది అంతయూ కూడా నీ ఆరాధనమే.

Sunday, 28 August 2016

ప్రార్థన - అసితగిరిసమం స్యాత్



శివప్రార్థన ॥
అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే,  
సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ ।
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవ గుణానామీశ పారం న యాతి ॥

సింధు-పాత్రే కజ్జలం అసిత-గిరి-సమం స్యాత్; సుర-తరువర-శాఖా లేఖనీ (స్యాత్); ఉర్వీ పత్రం (స్యాత్); శారదా గృహీత్వా సర్వ-కాలం యది లిఖతి, ఈశ, తద్ అపి తవ గుణానాం పారం న యాతి

సింధు-పాత్రే = సముద్రం (అంత) పాత్రలో
కజ్జలం = కాటుక (వ్రాసే సిరా)
అసిత-గిరి-సమం స్యాత్ = నల్లని కొండ అంత ఉంటే
సుర-తరువర-శాఖా = కల్పవృక్షం (దేవతల శ్రేష్ఠవృక్షం) యొక్క కొమ్మ
లేఖనీ = లేఖని (వ్రాసే పరికరం, కలం)
ఉర్వీ = భూమి
పత్రం = (వ్రాసేందుకు) కాగితం
శారదా = సరస్వతీ దేవి
గృహీత్వా = చేత పట్టి, తీసుకుని
సర్వ-కాలం = అన్ని వేళలా
యది లిఖతి = ఒకవేళ వ్రాస్తే
ఈశ = ఓ పరమేశా
తదపి = అయినప్పటికి
తవ గుణానామ్ = నీ గుణాలయొక్క
పారం = ఆవలి ఒడ్డును
న యాతి = చేరజాలదు.

సముద్రమంత పాత్రలో నల్లని కొండ అంత సిరా ఉంటే, కల్పవృక్షం కొమ్మ లేఖనిగా అయ్యి, భూమి (వ్రాసేందుకు) కాగితం కాగా, సరస్వతీ దేవి (రచయిత్రి అయ్యి) అన్ని వేళలా (కదలకుండా కూర్చుని) ఒకవేళ వ్రాస్తే, ఓ పరమేశా, అయినప్పటికీ నీ గుణాలయొక్క ఆవలి ఒడ్డును చేరజాలదు.

Friday, 12 August 2016

ప్రార్థన- సంక్షిప్తమహాభారతం



ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహే దాహనం,
ద్యూతం శ్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం ।
లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం
భీష్మద్రోణసుయోధనాదినిధనం ఏతన్మహాభారతం ॥

ఆదౌ పాండవ-ధార్తరాష్ట్ర-జననం, లాక్షా-గృహే దాహనం, ద్యూతం, స్త్రీహరణం, వనే విహరణం, మత్స్యాలయే వర్తనం । లీలాగోగ్రహణం, రణే విహరణం, సంధిక్రియా-జృంభణం, భీష్మ-ద్రోణ-సుయోధనాది-నిధనం ఏతత్ మహాభారతం ॥

ఆదౌ పాండవ-ధార్తరాష్ట్ర-జననం = మొదలు పాండవులు, కౌరవులు జన్మించటం
లాక్షా-గృహే దాహనం = లక్క ఇంటిని కాల్చటం
ద్యూతం = జూదం ఆడటం
శ్రీహరణం = సంపదలు పోగట్టుకోవటం
వనే = వనంలో
విహరణం = తిరగటం
మత్స్యాలయే = మత్స్యరాజైన విరాటుని కొలువులో
వర్తనం = ఉండటం
లీలాగోగ్రహణం = గోవులను తరలించటం  
రణే విహరణం = యుద్ధంలో వీరవిహారం చేయటం  
సంధిక్రియా-జృంభణం = సంధికోసం ప్రయత్నాలు చేయటం
భీష్మ-ద్రోణ-సుయోధనాది-నిధనం = భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనాదులు మరణించటం
ఏతత్ మహాభారతం = ఇది మహాభారతం

మొదలు పాండవులు, కౌరవులు జన్మించటం, లక్క ఇంటిని కాల్చటం, జూదం ఆడటం, సంపదలు పోగట్టుకోవటం, వనంలో తిరగటం, మత్స్యరాజైన విరాటుని కొలువులో ఉండటం, గోవులను తరలించటం, యుద్ధంలో వీరవిహారం చేయటం, సంధికోసం ప్రయత్నాలు చేయటం, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనాదులు మరణించటం- ఇది మహాభారతం.