Wednesday, 27 July 2016

ప్రార్థన- అపుత్రాః పుత్రిణః సంతు



అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః ।
అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం ॥ (సర్వసంక్షేమప్రార్థన)

అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః పౌత్రిణః సంతు. అధనాః సధనాః సంతు. శరదాం శతం జీవంతు॥

అపుత్రాః = సంతానం లేనివారు, పుత్రులు లేనివారు
పుత్రిణః = పుత్రులు కలిగినవారు
సంతు = అవుదురుగాక
పౌత్రిణః = మనుమలు కలిగినవారు
అధనాః = ధనం లేనివారు, పేదవారు
సధనాః = ధనవంతులు
శరదాం = సంవత్సరాలు
శతం = వంద
జీవంతు = జీవించుదురు గాక

సంతానం లేనివారు పుత్రులను పొందుదురు గాక (పుత్రులున్నవారిగా అవుదురుగాక). కొడుకులు కలిగినవారు మనవలను పొందుదురు గాక. ధనంలేనివారు ధనం పొందుదురు గాక. (ధనహీనులు ధనవంతులగుదురుగాక.) వందఏళ్ళు జీవించెదరు గాక. (ఇక్కడ పుత్ర-పౌత్ర అనేది స్త్రీపురుషసంతతికి ఇద్దరికి వర్తిస్తుంది.)

Tuesday, 26 July 2016

ప్రార్థన- సముద్రవసనే



సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే ।
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే ॥ (భూమి నమస్కారం)

దేవి, సముద్ర-వసనే, పర్వత-స్తన-మండలే, విష్ణుపత్ని, తుభ్యం నమః । మే పాద-స్పర్శం క్షమస్వ ॥

దేవి = ఓ దేవీ
సముద్ర-వసనే = సముద్రమే వస్త్రంగాకలదానా
పర్వత-స్తన-మండలే = పర్వతాలే వక్షఃస్థలంగా కల తల్లీ
విష్ణుపత్ని = విష్ణువుకు భార్య అయిన దానా
తుభ్యం నమః = నీకు నమస్కారము
మే పాద-స్పర్శం = నా కాలితో తాకటాన్ని
క్షమస్వ = క్షమించు, సహించు

ఓ దేవీ, సముద్రమే వస్త్రంగాకల అమ్మా, పర్వతాలే వక్షఃస్థలంగా కల తల్లీ, విష్ణువుకు భార్య అయిన దానా, నీకు నమస్కారము. నా కాలితో (నిన్ను) తాకటాన్ని క్షమించు. 

(ఇవన్నీ పదాలు స్త్రీలింగ సంబోధనలు)
(నిద్ర లేవంగానే చేయవలసిన భూమాత ప్రార్థన ఇది. ఈ శ్లోకం చదివి, ఈ భావాన్ని స్మరించి, భూమిని తాకి నమస్కరించిన తరువాతే కింద అడుగు పెట్టాలి అని పెద్దలు చెప్పారు. అది మనం భూమాతకు సమర్పించే కృతజ్ఞత.)

ప్రార్థన - కాలే వర్షతు

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశ్యశాలినీ ।
దేశోఽయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః ॥

కాలే పర్జన్యః వర్షతు. పృథివీ సశ్య-శాలినీ (భవతు). అయం దేశః క్షోభ-రహితః (భవతు). బ్రాహ్మణాః నిర్భయాః సంతు ॥

కాలే = సకాలంలో, సరైన సమయంలో
పర్జన్యః = వరుణుడు, వానదేవుడు
వర్షతు = వర్షం పడుగాక, వాన కురువును గాక
పృథివీ = భూమి
సశ్య-శాలినీ = పంటలతో అలరారునది
అయం దేశః = ఈ దేశం
క్షోభ-రహితః = బాధ, ఆవేదనా లేకుండా
బ్రాహ్మణాః = బ్రాహ్మణులు
నిర్భయాః = భయం లేకుండా
సంతు = ఉండుగాక

సకాలంలో వర్షం పడుగాక. భూమి పంటలతో అలరారుగాక. ఈ దేశం క్షోభ (బాధ)లేకుండా ఉండుగాక. బ్రాహ్మణులు భయం లేకుండా ఉందురుగాక.

(బ్రాహ్మణులు సమాజశరీరానికి తలలు. ఆలోచన వంటివారు. ధర్మాచరణకు, సనాతన విజ్ఞానానికి రక్షణా సిబ్బంది. ధర్మానికి సైనికులు, ఆప్తులు. వారు నిర్భయంగా ఉంటేనే యథార్థమైన మాట పలకగలరు. నిర్దుష్టంగా ధర్మమాచరించగలరు. అప్పుడు దేశానికి ధర్మభంగమూ ఉండదు. భయపడిన బ్రాహ్మణుడు సమాజానికి ఏ మేలూ చేయలేడు.)