యస్య షష్ఠీ ద్వితీయా చ విహస్య చ విహాయ చ ।
అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయా స్యామహం కథమ్ ॥
ఒక మంచి పండితుడి కూతురైన వ్యాకరణ జ్ఞానమున్న ఓ కన్య- ‘నేను సంస్కృత విద్వాంసిడిని మాత్రమే వివాహం చేసుకుంటాన’ని కోరుకొన్నది. అప్పుడు ఒక యువకుడు ‘నేను పండితుడిని’
అని
చెప్పి ఆమెను చూడటానికి వచ్చాడు. రహస్యం ఏమిటంటే
అతడికి సంస్కృతంలో ‘రామ’శబ్దం ఏడు విభక్తులు ఏకవచనం రూపాలను తప్పించి వేరే ఏమీ
రాదు. సరే, ఆమె పరీక్ష పెట్టదలచి, ఓ శ్లోకం చదివి, అందులో ‘విహస్య’ ‘విహాయ’ ‘అహం’ అంటే ఏమిటి అని
అడిగింది. అతడు ఆలోచించి, ‘విహస్య’ అంటే ‘రామస్య’ వలె ఉన్నది- కనుక ఇది ‘విహ’శబ్దానికి షష్ఠీవిభక్తి అని
చెప్పాడు. తరువాత ‘విహాయ’ అంటే ‘రామాయ’ వలె ఉన్నది- కనుక అది ‘విహ’శబ్దానికి చతుర్థీవిభక్తి
అన్నాడు. ‘అహం’ అంటే ‘రామం’వలె ఉన్నది కనుక అది ‘అహ’ శబ్దానికి ద్వితీయావిభక్తి అన్నాడు. అప్పుడామె నిట్టూర్చి, పై శ్లోకం చదివింది.
ఎవరికైతే ‘విహస్య, విహాయ’ అనేవి షష్ఠీ చతుర్థీ
రూపాలో, ‘అహం’ ద్వితీయావిభక్తో- అతడికి నేనెట్లా ‘ద్వితీయ’ను అంటే భార్యను కాగలను
అని దాని భావం.
విషయం ఏమిటంటే- ‘విహస్య’ అనేది ‘వి’ఉపసర్గ చేర్చిన ‘హస్’-నవ్వుట- అనే ధాతువుకు క్త్వార్థకమైన ‘ల్యప్’ ప్రత్యయం చేర్చగా
ఏర్పడిన రూపం. దాని అర్థం ‘నవ్వి’ అని. అట్లాగే ‘విహాయ’ అనేది ‘వి’ఉపసర్గ చేర్చిన ‘హా’-విడుచుట- అనే ధాతువుకు క్త్వార్థకమైన ‘ల్యప్’ ప్రత్యయం చేర్చగా
ఏర్పడిన రూపం. దాని అర్థం ‘విడిచి’ అని. ‘అహం’ అంటే అస్మద్-శబ్దం,
ప్రథమా
విభక్తి ఏకవచనం. అంటే ‘నేను’ అని అర్థం. కానీ అతడు ల్యబంతాలైన పదాలను, అహం శబ్దాన్ని కూడా కలిపేసి, విభక్తులను చేసి, తన అజ్ఞానాన్ని బయట
పెట్టేశాడు. అటువంటివాడికి నేను ద్వితీయనెట్లా అవ్వను? (పత్నీ పాణిగృహీతీ చ
ద్వితీయా సహధర్మిణీ-అమరకోశం- ౨.౫.౫౩౮) అని ఆమె ప్రశ్నించింది. అది కథ.
No comments:
Post a Comment